2050 నాటికి మూడు రెట్లు పెరగ‌నున్న అంధ‌త్వం

  • 12 అక్టోబర్ 2017
అంధత్వం కంటి చూపు సమస్య పరీక్ష వృద్ధులు Blindness Eye problems Elders Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రస్తుతం దాదాపు 20 కోట్ల మంది పలురకాల కంటి సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.6 కోట్ల మంది అంధత్వంతో బాధ‌ప‌డుతుండ‌గా.. 2050కి ఆ సంఖ్య 11.5 కోట్లకు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచనా. దీనికి ప్రధాన కార‌ణం వృద్ధుల సంఖ్య పెర‌గ‌డమేన‌ని ప‌రిశోధ‌కులు తేల్చిచెప్పారు.

సాధార‌ణం నుంచి తీవ్రమైన దృష్టిలోపంతో బాధ‌ప‌డుతున్న వారు ఇప్పుడు మొత్తం 20 కోట్ల మంది ఉండగా.. 2050 నాటికి ఈ సంఖ్య 55 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఆంగ్లియా ర‌స్కిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెస‌ర్లు చెబుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న వైద్య స‌దుపాయాల‌తో మ‌ర‌ణాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో చాలామంది వృద్ధాప్యం వ‌ర‌కూ జీవిస్తున్నారు. అయితే వ‌య‌సు మీద‌ప‌డుతున్న కొద్దీ చాలామందిలో చూపు మంద‌గిస్తుంటుంది.

కాబట్టే వృద్ధుల్లో ఎక్కువ మంది అంధ‌త్వంతో బాధ ప‌డుతున్నార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

నిజానికి.. గ‌తంతో పోలిస్తే కంటి సమస్యలకు వైద్య సదుపాయాలు పెరిగాయి. కానీ.. అంత‌కంటే ఎక్కువగా జ‌నాభా పెరుగుతుండ‌టం.. ఆయుష్షు మెరుగవటం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జనాభా పెరుగుతోంది, వృద్ధులు పెరుగుతున్నారు. కానీ అవగాహన లేకపోవటం, ఆదాయం లేకపోవటం సమస్య

దక్షిణాసియా దేశాల్లోనే అధికం

ప్రపంచవ్యాప్తంగా.. ద‌క్షిణ, తూర్పు ఆసియా దేశాలు, ద‌క్షిణ స‌హారా ఆఫ్రికా ప్రాంతాల్లో అంధ‌త్వం పెరుగుద‌ల‌ తీవ్రంగా ఉంది. దీనికి అవగాహన లేకపోవటం, ఆదాయం లేకపోవటం వంటివి కారణాలు.

వైద్య స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు.. కొత్త వైద్యులను, న‌ర్సుల‌ను త‌యారు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ దిశ‌గా మరింత దృష్టి పెట్టాలి.

’’స‌మస్య తీవ్రత త‌క్కువ‌గా ఉంద‌ని నిర్లక్ష్యం చేయొద్దు. మొద‌ట్లో త‌క్కువ అనిపించినా, అది తీవ్ర ప్రభావం చూపుతుంది‘‘ అని ఆంగ్లియా రుస్కిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రుపెర్ట్ బౌర్నె చెప్పారు.

చూపు కోల్పోయినవాళ్లు:

  • ద‌క్షిణ ఆసియాలో 1.17 కోట్ల మంది
  • తూర్పు ఆసియాలో 62 లక్షల మంది
  • ఆగ్నేయాసియాలో 35 లక్షల మంది

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)