స్టాక్‌హోం: అద్దె ఇళ్ల వెయిటింగ్ లిస్ట్‌లో గిన్నిస్ రికార్డు

ఫొటో సోర్స్, Getty Images
జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో స్టాక్‌హోంలో ఇళ్ల కొరత తీవ్రమైంది
యూరప్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్టాక్‌హోం ముందుంటుంది. ఇక్కడికి వలస వచ్చేవాళ్లూ ఎక్కువే. అలాగే స్టార్టప్‌లూ శరవేగంగా విస్తరిస్తున్నాయి . వీటిన్నిటికి మించి.. ఈ నగరంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. దీంతో ఇళ్ల కొరత పెరిగింది. సొంతిల్లు కాదు కదా.. అద్దె ఇల్లు దొరకాలన్నా అదృష్టం ఉండాలి.
స్వీడన్లో సొంతిళ్లు లేని వారందరూ స్థానిక కౌన్సిల్ లేదా అనుమతి ఉన్న ప్రైవేటు సంస్థల వద్ద ముందుకు ముందే దరఖాస్తు చేసుకోవాలి.
అయితే ఎప్పుడు చూసినా క్యూలో 5 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొత్తగా నగరంలోకి అడుగుపెట్టే వాళ్లు ఆ క్యూ చూసి బెంబేలెత్తిపోతున్నారు.
ఆ క్యూలో ఉన్నవారందరికీ ఇళ్ల కేటాయింపు పూర్తవ్వాలంటే సరాసరి 9 సంవత్సరాలు పడుతుందట. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు 20 ఏళ్ల దాకా పడుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు ఎలాగొలా వసతి సమకూరుస్తున్నాయి.
కి‘రాయి’ దెబ్బ తప్పదు
అందుకే చాలామంది ఎక్కడో ఓ చోట తెలిసిన వాళ్ల ఇళ్లల్లో చేరిపోతున్నారు. కొందరైతే బ్లాక్ మార్కెట్లో అధిక ధర ఇచ్చైనా ఇల్లు పొందాలని చూస్తున్నారు.
ఈ నగరంలో ఎక్కడైనా సింగిల్ రూం దొరికినా చాలు చేరిపోదాం అనుకునేవారే ఎక్కువ. ఆ ఇరుకిరుకు గదులకూ కిరాయి చూస్తే వామ్మో అనాల్సిందే.
చిన్నపాటి ఫ్లాట్‌కు నెలకు దాదాపు 50 వేల రూపాయలు పెట్టాల్సిందే. బ్రోకర్ల ద్వారా బ్లాక్ మార్కెట్లో అయితే లక్ష రూపాయల దాకా పలుకుతుంది.
భవన నిర్మాణాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం.. కొన్ని దశాబ్దాలుగా నగర నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం వంటివి గృహాల కొరత పెరగడానికి ప్రధాన కారణాలని స్థానికులు అంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
కొత్తగా ఇళ్లు నిర్మించటానికి పెట్టుబడులు పెట్టకపోవటం కూడా ఒక సమస్య.
కార్పొరేట్ సంస్థలకు తప్పని ఇక్కట్లు
స్టాక్‌హోంలో గృహాల కొరత ప్రభావం కార్పొరేట్ సంస్థలపైనా పడుతోంది. పలు రంగాల్లో ఉద్యోగ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
స్వీడన్ పరిశ్రమల సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం గతేడాది దాదాపు 61శాతం సంస్థలు నియామకాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇళ్ల కొరత కారణంగా స్టాక్‌హోంకు వెళ్లాలంటే ఉద్యోగులు జంకుతున్నారు.
‘‘మా సంస్థలో భిన్నత్వం చాలా అవసరం. వేరువేరు దేశాల నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాం. స్వీడన్లో నూతన ఆవిష్కరణలు, కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకురావాలంటే ముందుగా ఇళ్ల సమస్యను పరిష్కరించాలి’’ అని వన్ ఏజెన్సీ ఐటీ సంస్థ నియామక విభాగం అధిపతి ఎలైస్ లిల్లీహుక్ తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు కొన్ని దిగ్గజ సంస్థలు రీలొకేషన్ ఏజెన్సీల ద్వారా తమ ఉద్యోగులకు తాత్కాలిక వసతి కల్పిస్తున్నాయి. చిన్న కంపెనీలకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు.
ఫొటో సోర్స్, Getty Images
విశాలమైన ఇళ్లు దొరక్క చాలామంది ఇరుకిరుకు గదుల్లోనే సర్దుకుపోవాల్సి వస్తోంది.
‘‘భారీగా ఇళ్లు నిర్మిస్తాం’’
స్టాక్‌హోంలో గృహాల సంక్షోభం తాత్కాలిక సమస్యేనని స్థానిక కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు.
సమస్యను అధిగమించేందుకు 2020లోగా నలభై వేల కొత్త ఇళ్లు నిర్మిస్తామని.. 2030 కల్లా ఆ సంఖ్యను 140,000కు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్టాక్‌హోం నగరాభివద్ధి సంస్థ ప్రతినిధి జోసెఫ్ మిషెల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)