దేశ ఆర్థిక వృద్ధిపై పాస్‌పోర్ట్‌ల ప్రభావం ఉంటుందంటే నమ్మగలరా?

  • 31 అక్టోబర్ 2017
ప్ర‌పంచ ప‌టంపై వేరువేరు దేశాల స్టాంపు గుర్తులు వేసి ఉన్నాయి Image copyright Getty Images

పాస్‌పోర్ట్ అంటే ఒక దేశ పౌర‌స‌త్వానికి గుర్తింపు ప‌త్రంగా మనం భావిస్తాం. ఎవ‌రు దేశ స‌రిహ‌ద్దులు దాటాల‌న్నా పాస్‌పోర్ట్ తప్పనిసరి. అయితే పాస్‌పోర్టులు దేశాల ఆర్థిక వృద్ధిని నియంత్రణలో ఉంచేందుకూ ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అదెలాగంటే..

తీరు మారింది..

ప్రస్తుతం ధనిక దేశాలు త‌మ దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులు రాకుండా స‌రిహ‌ద్దుల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆ కోణంలోనూ పాస్‌పోర్టులను ప‌రిశీలిస్తున్నాయి. కానీ.. ఒక‌ప్పుడు నిపుణులు బ‌య‌ట‌కు వెళ్లకుండా ఆపేందుకు దేశాలు స‌రిహ‌ద్దుల‌ను ఏర్పాటు చేసుకునేవి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాస్‌పోర్ట్ లేకుండా రావొచ్చంటూ ఆహ్వానించిన అమెరికాకు స్నేహపూర్వక బ‌హుమ‌తిగా స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీని ఫ్రాన్స్ ప్రజలు ఏర్పాటు చేశారు

19వ శతాబ్దంలో అమెరికా వెళ్లాలంటే పాస్‌పోర్ట్ అవ‌స‌రం ఉండేది కాదు. త‌మ దేశానికి ఎవ‌రైనా రావొచ్చంటూ అప్పటి పాల‌కులు ఆహ్వానించేవారు. విదేశీయుల‌కు స్వాగ‌తం పలుకుతున్నట్లుగా ఏర్పాటు చేసిందే న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ.

ఫ్రాన్స్‌లోనూ అలాంటి విధాన‌మే ఉండేది. చైనా, జ‌పాన్‌ల‌లో వ్యాపారాలు చేయాల‌నుకునే విదేశీయుల‌కు మాత్రమే పాస్‌పోర్ట్ అవ‌స‌ర‌మ‌య్యేది.

కానీ.. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు క్రమంగా మారుతూ వ‌చ్చాయి. 20వ శతాబ్దం చివ‌రి నాటికి కొన్ని దేశాలు త‌మ స‌రిహ‌ద్దు దాటేందుకు పాస్‌పోర్టులు తప్పనిసరి చేశాయి. ఇత‌ర దేశాలూ అదే బాట‌లో న‌డిచాయి. ప్రస్తుతం అతికొద్ది మిత్ర దేశాల మ‌ధ్య మాత్రమే పాస్‌పోర్ట్ లేకుండా ప్ర‌యాణాలు చేసే వీలుంది. భవిష్యత్తులో ఆ ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చు.

Image copyright Getty Images

వ‌ల‌స‌ల నియంత్రణ

దాదాపు అన్ని దేశాలూ ఆర్థిక ప్రగతిని ఎలా నియంత్రించుకోవాలా? అన్న దిశ‌గా ఆలోచిస్తున్నాయి. పాస్‌పోర్ట్‌ల ద్వారా వ‌ల‌స‌దారుల వ్యక్తిగత వివ‌రాల‌తో పాటు వారి నైపుణ్యాల‌నూ బేరీజు వేస్తున్నాయి. నైపుణ్యం లేని కార్మికులను అడ్డుకుంటూ సంప‌ద‌ను సృష్టించ‌గ‌లిగే ప్రత్యేక నిపుణులకు మాత్రం ఆహ్వానం ప‌ల‌కుతున్నాయి.

కొన్ని దేశాల్లో వ‌ల‌స‌ల నియంత్రణ వెన‌క రాజ‌కీయ ప్రయోజనాలూ ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. శ‌రణార్థుల‌ను కాకుండా.. మెరుగైన కొలువులు, జీతాల కోసం వ‌చ్చే వారిని అడ్డుకోవాల‌న్న విష‌యంపై యూర‌ప్‌లో రాజ‌కీయ‌ చర్చలు న‌డుస్తున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ధనిక దేశాల్లో ఎక్కువ శాతం వ‌ల‌స‌దారుల వ‌ల్ల వృద్ధి చెందినవే

వ‌ల‌స‌ల‌తో లాభ‌మా? నష్టమా?

వ‌ల‌స‌లు పెరిగితే.. ఎక్కడైనా లాభ‌న‌ష్టాలు రెండూ ఉంటాయి. ప్రస్తుతం ఆరు ధనిక దేశాల్లో ఐదు వ‌ల‌స‌ల వ‌ల్ల లాభపడ్డవేనని అధ్యయనాల్లో తేలింది.

త‌క్కువ వేత‌నాల‌కు ప‌నిచేసేవారు వ‌ల‌స వ‌స్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఆయా ఉత్పత్తుల ధ‌ర‌లు త‌గ్గి అంద‌రూ కొనే స్థాయికి రావ‌చ్చు. కానీ స్థానికులు ఉపాధి కోల్పోయే అవ‌కాశం ఉంటుంది. అది నిరుద్యోగ సమస్యలకు దారి తీస్తుంది.

అలాగే పెరిగే జ‌నాభాకు తగ్గట్లుగా ప్రభుత్వ వ్యవస్థలు మెరుగుప‌డాలి. మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి. ఈ భార‌మెందుకులే అన్న ఆలోచ‌న‌తోనూ కొన్ని దేశాలు వ‌ల‌స‌ల‌దారుల‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు