ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డే గిఫ్ట్‌: 68 పైసల చెక్కులు

  • 18 సెప్టెంబర్ 2017
ఏపీ రాయలసీమ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం చెక్కులు Andhra Pradesh Farmers Paisa Cheque Prime Minister Narendra Modi Image copyright RSSS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ పంపించిన 68 పైసల చెక్కులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రధాని దీన్ని అవమానంగా భావించకుండా.. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఆదుకోవాలని అడుగుతోంది.

"మేం ఆర్థికంగా వెనుకబడ్డాం. అందుకే మీ జన్మదిన కానుకగా ప్రస్తుతానికి 68 పైసలు మాత్రమే పంపగలుగుతున్నాం. వినమ్రతతో మేం పంపించిన ఈ చెక్కును స్వీకరించండి. మా గురించి కూడా ఆలోచించండి" అని రాయలసీమ సాగునీటి సాధన సమితి (ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌) విజ్ఞప్తి చేస్తోంది.

వెనుకబడ్డ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ ఆందోళన చేస్తోంది.

రాష్ట్ర విభజన చట్టంలో చేసిన హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీని కోరుతోంది.

తమ సమస్యలను ప్రధానికి వినూత్నంగా తెలపాలనే ఉద్దేశంతో మోదీ పుట్టిన రోజు సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితికి చెందిన వందలాది మంది రైతులు 68 పైసల చెక్కుల్ని పంపారు.

"ఇంకా ఎక్కువ మొత్తాన్ని బహుమతిగా ఇవ్వాలని ఉన్నా, మా ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా కుదర్లేదు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి రాయలసీమను కూడా ఇతర ప్రాంతాల్లాగే అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మేం ఆర్థికంగా బలపడి, మీకు పుట్టినరోజు కానుకగా ఎక్కువ మొత్తాన్ని పంపించేలా చేస్తారని ఆశిస్తున్నాం'' అని మోదీకి రాసిన లేఖలో ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి వివరించారు.

Image copyright Getty Images

తమిళనాడు రైతులకు భిన్నంగా చేయాలని..

కడపలో స్టీల్‌ప్లాంట్ సహా రాయలసీమకు ఎన్నో హామీలు ఇచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

కృష్ణా, తుంగభద్ర, పెన్నా, చిత్రావతి లాంటి అనేక నదులున్నా రాయలసీమలో క‌రువు స‌మ‌స్య ప‌రిష్కారం కాలేద‌ని తెలిపింది.

రాయలసీమ జిల్లాలకు విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వకుండా.. జిల్లాకు రూ. 50 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధానికి రాసిన లేఖలో వివరించింది.

ఆందోళనకు దిగితే అరెస్టులు చేసే పరిస్థితి ఉందని, అందువల్లే గాంధీగిరి తరహాలో ఈ వినూత్న నిరసన తెలుపుతున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి డాక్టర్ శీలం సురేంద్ర బీబీసీతో చెప్పారు.

తమిళనాడు రైతులు ఢిల్లీలో నిరసనలు చేసినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేనందునే తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు.

రాయ‌ల‌సీమ‌లో సాగునీటితో పాటు తాగునీరు కూడా స‌మ‌స్య‌గా మారుతోంది.

ఒక ప్ర‌త్యేక‌ కమిటీతో రాయలసీమ పరిస్థితులపై అధ్యయనం చేయించి, త‌మ ప్రాంత‌ అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ప్రధానికి ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)