అభిప్రాయం: అంగీకారానికి, అనంగీకారానికి మధ్య విభజన రేఖ ఎక్కడ?
- దివ్య ఆర్య
- బీబీసీ కరస్పాండెంట్
ఫొటో సోర్స్, Getty Images
మహమూద్ ఫారూకీ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు - ఒక మహిళ సెక్స్‌కు చాలా బలహీనంగా 'నో' అని చెప్పిందంటే, అది 'ఎస్' అని చెప్పినట్లే అన్న భావన రేకెత్తిస్తోంది.
పురుషులు తాము భౌతికంగా దగ్గర కావాలని భావిస్తున్న మహిళను, ''నీకు నాతో సెక్స్ ఇష్టమేనా?'' అని ప్రశ్నిస్తారా?
మహిళలు ఒక స్పష్టమైన.. ''ఎస్.. నాకిష్టమే'' లేదా ''నో.. నాకిష్టం లేదు'' లాంటి సమాధానం ఇస్తారా?
నా అభిప్రాయం ప్రకారం చాలా సందర్భాలలో పై రెండు ప్రశ్నలకూ సమాధానం 'లేదు' అనే.
పురుషులు అంత నిర్లజ్జగా అడగరు, మహిళలు దానికి అంత స్పష్టంగా సమాధానం ఇవ్వరు.
మాటలను బట్టే మనం వాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటాం.. అవునా?
అంగీకారం లేని సెక్స్ రేప్ కాదా?
కానీ ఇకపై స్పష్టంగా మన అభిప్రాయాన్ని చెబుదాం. ఎందుకంటే అంగీకారం లేని సెక్సే రేప్ అని చట్టం నిర్వచించింది.
భారత దర్శకుడు మహమూద్ ఫారూకీకి వ్యతిరేకంగా ఒక అమెరికన్ రీసెర్చ్ స్కాలర్ చేసిన అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టుకు ఒక ''స్పష్టమైన నిరాకరణ'' అంటే ''నో'' అనే అభ్యంతరం కనిపించలేదు.
ఫారూకీ ఆమెతో దగ్గర కావడానికి ప్రయత్నించినపుడు.. ఆమె స్పష్టంగా ''నో'' చెప్పినట్లు కానీ, అది అతనికి అర్థమైనట్లు కానీ తమ దృష్టికి రాలేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
దాని వల్ల ఫారూకీకి 'సంశయలాభం' (బెనిఫిట్ ఆఫ్ డౌట్) లభించింది. దిగువ కోర్టు ఇచ్చిన ఏడేళ్ల జైలు శిక్ష తీర్పు రద్దైంది.
ఈ తీర్పుతో మన ముందు మరోసారి శృంగారంలో 'ఎస్' ను ఎలా నిర్వచిస్తామన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
ఫొటో సోర్స్, PTI
ఈ పరీక్ష చేద్దామా?
మనందరికీ సెక్స్ అంటే ఇష్టమే. కానీ దాని గురించి మాట్లాడ్డానికే ఇబ్బంది.
ఒక వీడియోలో 'సెక్స్' స్థానంలో 'టీ'ని ఉంచి, 'మీకు టీ కావాలా?' అన్న ప్రశ్నతో ఈ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం జరిగింది.
మీరు ఎవరికైనా టీ ఆఫర్ చేసి వాళ్లు దానికి 'నో' చెబితే, వాళ్లను మీరు బలవంతం చేయరని ఈ వీడియో చెబుతుంది.
వాళ్లు మొదట 'ఎస్' చెప్పి, కొంతసేపటికి మనసు మార్చుకుంటే, వాళ్లను తాగమని బలవంతం చేయకూడదు.
టీ తాగడానికి అంగీకరించి, ఆ తర్వాత వాళ్లు అపస్మారక స్థితిలో ఉంటే లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే, వాళ్లను టీ తాగమని బలవంత పెట్టకూడదు.
ఒకవేళ వాళ్లు గతవారమో లేదా నిన్న రాత్రో టీ కావాలని చెప్పి, ఇవాళ వద్దంటే, అప్పుడూ వాళ్లను బలవంత పెట్టకూడదు.
నీతి : అన్ని సందర్భాలలో 'అంగీకారం' ముఖ్యం.
టీ, శృంగారం వేర్వేరని మీరు వాదించవచ్చు.
కానీ టీ అయినా, సెక్స్ అయినా.. వాంఛ, వివరణ, సమాధానాన్ని అంగీకరించడం అన్న ప్రాథమిక నియమం అన్నిటిలో ఒకటే.
ఆ స్త్రీ కళ్లతో అభ్యర్థిస్తోందా, మీ చేతిని తోసేయడానికి ప్రయత్నిస్తోందా లేదా కేవలం మాటలతో వద్దంటోందా?
ఆమె ఇచ్చే సంకేతాలను మీరు వింటున్నారా? చూస్తున్నారా?
మరీ ముఖ్యంగా, ఆమె ప్రతిస్పందన మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఫొటో సోర్స్, Getty Images
రేప్ - పాపులర్ మీడియా భావన
పాపులర్ మీడియా ప్రభావం వల్ల.. మన దృష్టిలో రేప్ అంటే ఒక మగవాడు ఒక మహిళను అదిమి పెట్టి ఉంటాడు. ఆమె గట్టిగా ''వద్దు'' అని ఏడుస్తూ ఉంటుంది.
ఆమె అంగీకారం లేదు కనుక అది రేప్.
కానీ ఆ పురుషుడు ఆమెకు తెలిసిన వ్యక్తో, స్నేహితుడో, ప్రేమికుడో, భర్తో అయితే?
జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో 97 శాతం రేప్ కేసులలో, ఆ మహిళలకు తెలిసిన వారే వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మహమూద్ ఫారూకీ కేసు తీర్పు ప్రకారం.. ఒక మహిళ బలహీనంగా 'నో' చెప్పిందంటే దానర్థం 'ఎస్' చెప్పినట్లే - ముఖ్యంగా ఆ స్త్రీపురుషులిద్దరూ ఒకరికొకరు తెలిసిన వారైతే, మేధావులు/విద్యానిపుణులైతే, గతంలో వారిద్దరి మధ్య భౌతిక సంబంధం ఉంటే.
ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా? మీకు తెలిసిన వాళ్లలో ఎవరో గుర్తుకు వస్తున్నారా? లేదా అది మీరేనా?
ఫొటో సోర్స్, Getty Images
ఆ అమెరికన్ స్కాలర్ తన స్నేహితురాలితో '' నేనెప్పుడూ నా శరీరం, నా లైంగికత నా సొంతమని భావించే దాన్ని. కానీ ఈ సంఘటన జరిగాక ఆ సొంతమనే భావన కోల్పోయాను'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక మహిళ ఇచ్చే సంకేతాలను వినడం, గమనించడం, అంగీకరించడం ఎంత కష్టం?
ఒక బలహీనమైన 'నో', 'ఎస్' అయిపోతుందా? అంతకు మించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదా?
ఆ మాత్రం బాధ్యత మనకు లేదా?
ఇవి కూడా చదవండి:
- పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసుల షాక్ థెరపీ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- నన్నురేప్ చేశారంటే ఎవరూ నమ్మలేదు
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- ఫ్రీగా వచ్చిందని పోర్న్ వీక్షణ!
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)