బాబా రాంరహీం 'దత్త పుత్రిక' హనీప్రీత్‌ అరెస్ట్

  • 3 అక్టోబర్ 2017
హనీప్రీత్ సింగ్ Image copyright Twitter

వివాదాస్పద బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన దత్త పుత్రికగా చెప్పుకొనే హనీప్రీత్ ఇన్సాన్‌ను చండీగఢ్ సమీపంలోని ఝిరక్‌పూర్ పట్టణంలో హరియాణా పోలీసులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అరెస్టు చేశారు.

డేరా సచ్చా సౌదాకు ప్రముఖుడిగా వ్యవహరించిన బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి హనీప్రీత్ పరారీలో ఉన్నారు.

పంచకులా పోలీస్ కమిషనర్ ఎస్.ఎస్. చావ్లా ఆమె అరెస్టును ధ్రువీకరిస్తూ బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. ఆమెను రిమాండ్‌లోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరుతామని అన్నారు.

హనీప్రీత్‌తో పాటు మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు స్థానిక విలేకరి రవీందర్ సింహ్ రాబిన్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి వివరమైన సమాచారం లేదు.

పోలీసులు గత కొద్ది వారాలుగా ఆమె కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. నేపాల్‌లో కూడా ఆమె కోసం గాలింపు జరిపారు.

రాజద్రోహం కేసు

హనీప్రీత్‌పై పోలీసులు రాజద్రోహం కేసు మోపిన విషయం తెలిసిందే. కోర్టు అగస్ట్ 25న బాబాను రేప్ కేసులో దోషిగా నిర్ధరిస్తూ శిక్ష విధించిన తర్వాత ఆ తీర్పుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేసినట్టు హనీప్రీత్‌పై ఆరోపణలున్నాయి.

పంచకులా కోర్టు గుర్మీత్ రాం రహీంకు శిక్ష విధించిన తర్వాత హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో హింస జరిగింది. కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

అంతకు ముందు, ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ సరెండర్ కావాలని ఆదేశించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)