అభిప్రాయం: జోన్ల కసరత్తు వేగంగా, అర్థవంతంగా పూర్తికావాలి

  • 9 అక్టోబర్ 2017
చార్మినార్ ప్రాంతం, హైదరాబాద్ Image copyright Getty Images

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు అవుతూ ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలుత ఉండే వేడి తగ్గి పాలనా వ్యవహారం వైపు దృష్టి పెడుతున్నది సర్కారు ఇప్పుడిప్పుడే. దాదాపు ఏడాది క్రితం రాష్టంలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు అయినాయి. ఇది కొత్త ఉద్యోగుల అవసరాన్ని ఒక మేరకు పెంచింది.

అయితే ఉద్యోగాల నియామకం జరగాలంటే రాష్ట్రంలో పాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన జోనల్ వ్యవస్థ ఉండాలా, వద్దా? ఉద్యోగుల క్యాడర్ ఎట్లా ఉండాలే? అనే అంశంలో అస్పష్టత నెలకొని ఉన్నది. అది తొలిగిపోతేనే ఉద్యోగాల నియామకం సజావుగా సాగే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వం అంటే శాసన నిర్మాణ విభాగం, కార్య నిర్వాహక విభాగం, న్యాయ విభాగం అనే మూడు విభాగాల కలయిక. కార్యనిర్వాహక విభాగంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే పన్నుల వసూలు వంటి వనరుల సేకరణ శాఖలు, శాంతి భద్రతలు, నిఘా వంటి పనులను నిర్వహించే శాఖలు ఉంటాయి.

ఇక అనేక సేవలు సంక్షేమం చూసే శాఖలు ఉంటాయి. కార్య నిర్వాహకవర్గమే వాస్తవానికి ప్రతి నిత్యం ప్రజలకు కనిపించే ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే కనీస భరోసా, ఆర్థిక భద్రత, దీర్ఘకాలికత, సామాజిక గుర్తింపులు ఇచ్చే వ్యాపకం. అధికారానికి దగ్గర ఉండే ఏర్పాటు. అందువల్లే కేంద్రంలో అయినా, రాష్ట్రాలలో అయినా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది .

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో అనేక సామాజిక వర్గాల ప్రాంతాల వారి ప్రాతినిధ్యం ఉండాలే అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం. అంతే కాక దీని వల్ల ప్రభుత్వ నిర్వహణలో అన్ని శ్రేణులకు చెందిన వారు పాల్గొనేందుకు కూడా వీలు కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం ఉండాలనేది చాలా పాత రాజ్యనిర్వహణ సూత్రం. సామాజిక వైవిధ్యం , ప్రాంతీయ బాహుళ్యత ఉన్న చోట ఇది మరీ ముఖ్యమైన సూత్రం.

ఈ సూత్రం పాటించడంలో వైఫల్యం అనేక వివాదాలకు దారితీస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం బాగా తెలుసు కనుకనే అది ఈ దిశగా మల్లగుల్లాలు పడుతున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలు దొరకలేదనేది ఒక ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సీఎం కె.చంద్రశేఖర్‌రావు

1948లో పోలీసు చర్య ద్వారా భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా మారింది. ఆనాటికే ఆ రాష్ట్రంలో 1919 నాటి స్థానికులకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం ఇచ్చే ముల్కీ నిబంధనలు అమలులో ఉండేవి. ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం.

పదిహేను సంవత్సరాలు హైదరాబాద్ రాజ్యంలో నివాసం ఉంటేనే వారు స్థానికులు అవుతారు అని ఫర్మానా. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలే అని ఆనాటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను బలంగా కోరిన వారు ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని తమ వాదన వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రూపొందేందుకు జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో ఈ రక్షణలు పాటించబడతాయి అని ఒప్పుకున్నారు.

తెలంగాణలో 1950ల నాటి ముల్కీ ఉద్యమానికీ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికీ స్థానికులకు ఉద్యోగావకాశాలలో వివక్ష అనే అంశమే ప్రేరణగా నిలిచింది. 1969-72 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో, 1972లో ముల్కీ నియమాల అమలు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది జై ఆంధ్రా ఉద్యమానికి దారి తీసింది.

Image copyright NOAH SEELAM/AFP/Getty Images

నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి, 1973లో ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా 371(D) ఆర్టికల్‌ను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ను మొత్తంగా ఆరు జోన్లుగా విభజించింది. తెలంగాణ మొత్తాన్ని ఐదు, ఆరు జోన్ల కింద చేర్చారు. హైదరాబాద్, సికిందరాబాద్ ఆరో జోన్లో భాగం. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు జోన్ల వారీగా ఉద్యోగాల క్యాడర్ విభజన చేయాలే అని పేర్కొన్నాయి.

అయితే అమలులో అది పకడ్బందీగా సాగలేదు. ఐదు సంవత్సరాలు తెలంగాణలో చదువుకుంటే చాలు స్థానికులుగా అయ్యే విధంగా నిబంధనలను మార్చారు. దీనితో తెలంగాణ ఉద్యోగార్థులకు స్థానికత ప్రయోజనం దక్కకుండా పోయింది. జోనల్ నియమాలు సరిగా అమలు కావడం లేదంటూ తెలంగాణ ఉద్యోగులు 1985లో నిరసన తెలిపారు.

నాటి ప్రభుత్వం జోనల్-స్థానికత ఉల్లంఘనలను సరిచేయాలని జీవో నంబర్ 610ను జారీ చేసింది. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1990 మధ్య రగులుకొన్నప్పుడు ''ఉద్యోగ నియామకాలు'' అనేది ప్రధాన అంశంగా ముందుకొచ్చింది.

ఈ మొత్తం పూర్వ రంగంలో ప్రస్తుత నూతన తెలంగాణ రాష్ట్రంలో ''స్థానికత'' అనేది ఎట్లా నిర్వచించాలి? ఉద్యోగుల క్యాడర్‌ను ఎలా విభజించాలి ? రాష్ట్రంలో జోన్‌లు ఉండాలా, వద్దా? అనే అంశాల మీద చర్చ జరుగుతున్నది. తొలుత రాష్ట్రంలో జోనల్ విధానం రద్దు, జిల్లా-రాష్ట్ర కాడర్ ఉద్యోగాలు మాత్రమే తెస్తాం అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అయితే పునరాలోచన తరువాత రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో మరిన్ని జోన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన యువతను అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు

తెలంగాణలో జిల్లాలు 10 నుండి 31కి పెరిగినాయి. జిల్లాలకు ఉద్యోగ పుష్టి కావాలి. అంతే కాక వికేంద్రీకరణ ద్వారా పాలన మెరుగు పరచాలి అని ముఖ్యమంత్రి గారు పలు మార్లు అని ఉన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉద్యోగాలను, జిల్లా, జోను, మల్టీ జోను, రాష్ట్ర స్థాయి, నాలుగు క్యాడర్లు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానికత అనే అంశం చాలా ముఖ్యం అన్న విషయం కొంత ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

రాష్ట్రంలో కొత్తగా జోన్ల రూపకల్పనకు, క్యాడర్ విభజనకు కేంద్ర హోంశాఖ ప్రమేయంతో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేయవలసి ఉంటుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అధికారులు, మంత్రులు ఉన్న కమిటీ నియామకం జరిగింది.

రాష్ట్రంలోని ఉద్యోగాలు ఏవి క్యాడర్‌లోకి రావాలే అనే అంశం కీలకం కానున్నది. సింగరేణి, తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ వంటి ఉద్యోగాలను ఎట్లా క్యాడర్‌లోకి తేవాలి అనేవి కూడా పరిశీలిస్తారు. ఒక విధంగా రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో చాలా పట్టింపుతో ఉన్నది అనే సందేశాన్ని జనంలోకి పంపించడం, అదే సమయంలో భారీ ఉద్యోగ నియామకాలకు ఇంకా సమయం తీసుకునే సాంకేతికమైన అవకాశాన్ని పొందడం ప్రస్తుత ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది.

అది అలా ఉండగా స్థానికతకు ఎక్కడ చదువుకున్నారు అనే ఒకే ఒక ప్రాతిపదికన కాక మరిన్ని ప్రమాణాలతో శాస్త్రీయంగా నిర్ణయించాలి అని పూనుకోవడం మంచి విషయం. క్యాడర్ విభజన కూడా స్పష్టంగా తేలితే అది పదోన్నతులు, నియామకాలకు మార్గం సుగమం చేసి పాలనా వ్యవస్థకు కొత్త ఊపిరులు ఊదే వీలు ఉంటుంది. తెలంగాణలో ఏవో కొన్ని జిల్లాల ఆధిపత్యం మిగతా జిల్లాల మీద పడకుండా ఉండేదుకు ఇది మంచి ఏర్పాటు కావాలి.

భర్తీ చేయబోయే ఉద్యోగాలలో ఎక్కువగా జిల్లా, జోను స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. దానికి కసరత్తు చేయడంలో భాగంగా ఎప్పటి నుంచో నానుతున్న ప్రభుత్వ టీచర్లను నియమించే విషయంలో కొత్త జిల్లాలను యూనిట్లుగా తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వం ప్రకటించడం గమనించవలసిన విషయం.

చారిత్రకంగా ఈ ఉద్యోగాలను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా జిల్లా పరిషత్ నియమించేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ వైపు అడుగు వేస్తూ జిల్లా పరిషత్ చైర్మన్‌కు కూడా తిరిగి ఈ నియామకాలలో పాత్ర ఉండేటట్టు చేస్తే అది ఒక సానుకూల మార్పుకు దారి తీస్తుంది.

ఏది ఏమైనా ఈ కసరత్తు వీలైనంత వేగంగా, సమర్థవంతంగా, అర్థవంతంగా పూర్తి కావాల్సి ఉన్నది. ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పని తీరులో తొందరపాటు, అసమర్థతలు ఉన్నాయన్న విమర్శలున్నాయి. నిరుద్యోగ యువత, తెలంగాణ జేఏసీ ఈ లోపాన్ని ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కసరత్తు ఉద్యోగ నియామకాలను వాయిదా వేసే ఎత్తుగడగా ప్రజలు భావించే స్థితిని ప్రభుత్వం కల్పించకూడదు.

కొత్త రాష్ట్రంలో రాబోయే కాలంలో చిక్కులు లేకుండా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా స్థానికతకు నిర్వచనం ఇస్తూ, సరైన క్యాడర్ విభజనతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)