'వ్యాపార నిర్వహణ'లో ప్రపంచ బ్యాంకు ర్యాంకులెలా ఇస్తుంది?

ప్రపంచ బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ (సులభతర వ్యాపార నిర్వహణ)కు సంబంధించి ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 15వ వార్షిక నివేదికలో భారత్ స్థానం మెరుగుపడింది. గత సంవత్సరంతో పోల్చితే ఒకేసారి 30 స్థానాలు ఎకబాకి 100వ ర్యాంకుకు చేరింది.

190 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించి, ఆ దేశాలలో ఉన్న వ్యాపార నిబంధనలను పోల్చి వరల్డ్ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది.

'2018- రిఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్' ‌పేరుతో వరల్డ్ బ్యాంకు ఈ రిపోర్టును తీసుకొచ్చింది.

ఇతర కథనాలు

అయితే, దేశాల వారీగా ఇలా ర్యాంకులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు 10 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పది అంశాల్లో 190 దేశాలు ఎలాంటి పనితీరును కనబరిచాయి అనే విషయాన్ని పరిశీలించి ర్యాంకులను ప్రకటించింది. డూయింగ్ బిజినెస్‌ ర్యాంకుల కోసం వరల్డ్ బ్యాంకు తీసుకున్న పది అంశాలు ఇవీ...

ఫొటో సోర్స్, Worldbank

ఫొటో క్యాప్షన్,

వరల్డ్ బ్యాంకు రిపోర్టు

1) వ్యాపారాన్ని ప్రారంభించడం: కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారి కోసం వివిధ దేశాలు ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాయి? గత నియమాలను ఎంత వరకు సరళీకరించాయి? తదితర అంశాలు.

2) నిర్మాణ అనుమతుల్లో వ్యవహరించే తీరు: వివిధ నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల తీరు, నిర్మాణాల నాణ్యత, సమయం, నిధుల కేటాయింపు మొదలైనవి.

3) విద్యుత్ సరఫరా పొందే తీరు: కంపెనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు పట్టే సమయం, కరెంట్ సరఫరా తీరు, నాణ్యత అంశాలు.

4) ఆస్తుల రిజిస్టేషన్: భూ పరిపాలన వ్యవస్థ విధానం, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాలు అందించే తీరు.

5) రుణ లభ్యత: 129 దేశాల్లో రుణాలను అందిస్తోన్న తీరును గమనించారు. సురక్షిత లావాదేవీలకు సంబంధించిన రుణగ్రహీతలు, రుణదాతల చట్టపరమైన హక్కులు ఎలా ఉన్నాయో పరిశీలించారు.

ఫొటో సోర్స్, Worldbank

ఫొటో క్యాప్షన్,

వరల్డ్ బ్యాంకు రిపోర్టులో భారత్ స్థానం

6) మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాల రక్షణ: పరస్పర ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు మైనారిటీ వాటాదార్ల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వాలు వ్యవహరించే తీరును పరిశీలించారు.

7) పన్నుల చెల్లింపు: పన్ను రేట్లు ఎలా ఉన్నాయి? సూక్ష్మ, మధ్యస్థాయి కంపెనీలు నిర్ణీత సంవత్సరంలో ఎంత పన్నులు కడుతున్నాయి? ఇలా పన్నుల విధానలన్నింటినీ ఇందులో మదింపు చేశారు.

8) అంతర్జాతీయ వాణిజ్యం: ఎగుమతులు, దిగుమతుల తీరును ఇందులో పరిశీలించారు. ముఖ్యంగా వివిధ దేశాలకు సరుకు రవాణాకు ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందనేది దీనిలో పరిగణించారు.

9) వాణిజ్య వివాదాల పరిష్కారం: వాణిజ్య వివాదాలను ఎలా పరిష్కారిస్తున్నారో ఇందులో పరిశీలించారు. దీని కోసం ఎంత సమయాన్ని, ఖర్చును భరిస్తున్నారో గమనించారు. న్యాయచట్టాల అమలు తీరు ఎలా ఉందో పరిశీలించారు.

10) దివాలా ప్రక్రియ: దేశీయ కంపెనీలు దివాలా తీసినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఓ కంపెనీ దివాలా తీసినప్పుడు రుణ వసూళ్ల విధానం, ఆర్థిక న్యాయ ప్రక్రియ తదితర అంశాలను ఇందులో గమనించారు.

వీటితో పాటు అదనంగా కార్మిక చట్టాల క్రమబద్ధీకరణను కూడా పరిశీలించారు. అయితే డూయింగ్ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో దీన్ని చేర్చలేదు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)