నిద్ర గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు

  • 3 జనవరి 2018
నిద్ర Image copyright iStock

వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. రాత్రిపూట తక్కువ నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా?

శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.

1) ఎనిమిది గంటల నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి.

కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయాన్ని కాస్త వివరంగా తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.

Image copyright Getty Images

ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర అంటే ఏమిటి ?

ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు.

అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలని, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు.

నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా తెలిపారు.

Image copyright Thinkstock

2) నిద్రలేమి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.

ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని అన్నారు.

యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Image copyright Getty Images

ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

నిద్రలేమితో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి ఊబకాయానికి దారితీస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు.

ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని ప్రొఫెసర్ షేన్ ఓమారా పేర్కొన్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

Image copyright Getty Images

3) నిద్ర వివిధ రకాల్లో

నిద్ర కూడా ఒకేలా ఉండదు.. వివిధ దశల్లో ఉంటుంది. ఈ "నిద్ర దశ"ల్లో.. ప్రతి దశ 60 నుంచి 100 నిమిషాల వరకూ ఉంటుంది.

మొదటి దశలో నిద్ర మెల్లగా వచ్చి శరీరానికి ప్రశాంతత కలిగిస్తుంది. ఆందోళన, ఒత్తిడీ తగ్గుముఖం పట్టి, కండరాలు విశ్రాంతి చెందుతాయి, హృదయ స్పందన రేటు కూడా క్రమంగా తగ్గుతుంది.

రెండో దశలో నిద్ర కాస్త గాఢమౌతుంది. కానీ ఎక్కడోచోట మేలుకొని ఉన్నామనే భావన మాత్రం ఉంటుంది.

మూడో దశలో నిద్ర మరింత గాఢంగా ఉంటుంది. శరీరంలోని జరిగే ప్రక్రియలు మరింత తగ్గుముఖం పడతాయి అందుకే ఈ దశలో నిద్ర నుంచి మేల్కొనడం కష్టం.

Image copyright Getty Images

రెండో, మూడో దశలను 'స్లో వేవ్ స్లీప్' అంటారు. ఈ రెండు దశల్లో కలలు రావు.

గాఢమైన నిద్ర తరువాత మళ్ళీ రెండో దశ వస్తుంది, అప్పుడే కలలొస్తాయి. దాన్నే (ఆర్ఈఎం) ర్యాపిడ్ఐ మూమెంట్ అంటారు.

ఓ మనిషి పూర్తి నిద్ర దశలో ఒకటి నుంచి మూడు వరకూ అన్ని దశలను పూర్తి చేస్తాడు. ఆ తరువాత ర్యాపిడ్ ఐ మూమెంట్‌లోకి వెళ్ళాక రెండో దశకు వెళతాడు.

Image copyright Getty Images

4) షిఫ్టుల్లో పనిచేసేవారికి సమస్యలు తప్పవు

షిఫ్టుల్లో పనిచేసేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షిఫ్టుల్లో తక్కువ నిద్రపోయే వారికి మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదాలున్నాయని పరిశోధకులంటున్నారు. బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో షిఫ్టుల్లో పనిచేసేవారు దీర్ఘకాల అనారోగ్యం పాలవుతున్నారని తేలింది.

నిద్రలేమి ప్రభావం శారీరక శ్రమతో కూడిన ఉద్యోగంలో, ఒకేచోట కూర్చొని చేసే ఉద్యోగల విషయంలో భిన్నంగా ఉంటుందని కూడా తేలింది. ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులపై నిద్ర లేమి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Image copyright Alamy

5) నిద్రలేమి సమస్య ఎవరికి ఎక్కువ?

నిద్రలేమి సమస్య వయసు ఆధారంగా, స్త్రీ, పురుషుల్లో భిన్నంగా ఉంటుంది. బ్రిటన్‌లో చేసిన ఓ పరిశోధనలో రెండు వేల మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనలో మహిళలు ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది.

పిల్లల పెంపకం, ఉద్యోగం మహిళల నిద్రలేమికి ముఖ్యకారణాలని అంటున్నారు. కెఫిన్, మద్యం కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు.

రాత్రివేళల్లో పార్టీల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయినా ఆ నిద్ర రాత్రి నిద్రకు సరితూగదని సర్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డెర్క్ జాన్ తెలిపారు.

నిద్రలేమి సమస్య యువతలో కూడా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

Image copyright Getty Images

6) నిద్ర అప్పుడిలా కాదు!

ఇప్పుడు దాదాపు అందరూ రాత్రి మాత్రమే పడుకుంటారు. రాత్రి పడుకొని, పొద్దున్న నిద్రలేస్తారు. కానీ అమెరికాలో వర్జీనియా టెక్‌లో చరిత్ర విభాగం ప్రొఫెసర్ రోజర్ ఎక్రిచ్ తన పుస్తకం 'ఎట్ డేస్ క్లోజ్' లో కొన్ని వందల ఏళ్ల క్రితం రెండు సార్లు నిద్రపోయేవారని పేర్కొన్నారు.

అప్పట్లో సాయంత్రం అందరూ పడుకునేవారని, మళ్ళీ కొన్ని పనులు ముగించుకొని మరోసారి పడుకునేవారని ఆయన తెలిపారు. కానీ ఈ వాదనను ఇతర చరిత్రకారులు తోసిపుచ్చారు.

Image copyright Alamy

7) టీనేజర్ల నిద్రను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్‌లు!

టీనేజర్లు రాత్రిపూట 10 గంటలపాటు నిద్రపోవాలని నిపుణులంటున్నారు. కానీ సగం మంది కూడా అలా చేయడం లేదని ఓ అధ్యయనంలో తేలింది.

ఒకప్పుడు బెడ్‌రూమ్ అంటే విశ్రాంతికి చిహ్నంగా ఉండేవి. కానీ ఇప్పుడక్కడ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా కనిపిస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ల నుంచి వెలువడే నీలం రంగు వెలుతురు కళ్లపై పడి నిద్ర రాకుండా చేస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Image copyright Getty Images

8) పెరుగుతున్న నిద్రలేమి ఫిర్యాదులు

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఎక్కువ మంది నిద్రలేమి సమస్యపై డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

ఊబకాయం సమస్య నానాటికి పెరుగుతుండటంతో నిద్రలేమి సమస్య తీవ్రమౌతుందని ప్రముఖ బ్రిటన్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గై లెస్జినర్ తెలిపారు.

నిద్రలేమికి 'కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ' అంటే.. ఆలోచనా, ప్రవర్తనా విధానాన్ని మార్చే చికిత్సే పరిష్కారమని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనా విధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యమని అంటున్నారు.

Image copyright Getty Images

9) నిద్రపోయే సమయం దేశాల వారీగా..

ప్రతిదేశంలో నిద్రపోయే సమయం భిన్నంగా ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన 20 దేశాల్లో ప్రజలు ఎప్పుడు నిద్రపోతారనే అంశంపై ఓ అధ్యయనం జరిగింది.

ఈ అధ్యయనంలో ఆ దేశాల సామాజిక అంశాలను, పనిచేసే గంటలను, స్కూళ్ల సమయాన్ని, అక్కడి ప్రజల అలవాట్లను పరిగణలోకి తీసుకున్నారు.

ఈ దేశాల్లో ప్రజలు 7-8 గంటల వరకూ నిద్రపోతారని, నిద్ర పోయే సమయం రాత్రి 10-11-12 నుంచి పొద్దున్న 6- 7 గంటల మధ్య ఉందని తేలింది.

టాంజానియా, నమీబియా, బొలివియా లాంటి తక్కువ విద్యుత్తు సరఫరా ఉన్న దేశాల్లో కూడా ప్రజలు సగటున 7.7 గంటలు నిద్రపోతున్నారని తేలింది.

Image copyright ADRIAN STOREY UCHUJIN

10) ఎవరెంతసేపు?

రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి, ఆలస్యంగా నిద్రపోవడానికి కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో 30 శాతం మంది రాత్రి త్వరగా నిద్రపోతారని, 30 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతారని, మరో 40 శాతం మంది ఈ రెండిటికి మధ్యలో కాస్త అటుఇటుగా నిద్రపోతారని తేలింది. కానీ ఇందులో కూడా కొందరు త్వరగా నిద్రలేవడానికి ప్రాధాన్యత ఇస్తారని తేలింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం