లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఉద్యోగాల్లోంచి ఉద్వాసనలు!

ఆన్‌లైన్ మాధ్యమాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలు కావడంతో ఈ సమస్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ మొదలయ్యింది.

ఆ చర్చ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డ పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి.

ఎందరో బాధిత మహిళలు ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తామెలా లైంగిక వేధింపులకు గురయ్యారో చెప్పడం మొదలుపెట్టారు.

లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్‌కు చెందిన కొందరు ఉద్యోగులు, పరిశోధకులు ఓ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 40 ఎంపీలు, మంత్రుల పేర్లున్నాయి.

వీరిపై రుజువు కాని ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితా కూడా బీబీసీకి చేరింది.

సామాజిక మాధ్యమాలదే కీలక పాత్ర

ఇప్పుడు ఇలాంటి వారు పేర్లు బయట పెట్టేందుకు మహిళల వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటయ్యాయి. లైంగిక వేధింపులకు పాల్పడే వారి పేర్లు ఈ గ్రూపుల్లో బయట పెట్టడంతో పాటు వేధింపులకు సంబంధించిన సమాచారం కూడా చేరవేస్తూ మహిళలను అప్రమత్తం చేస్తున్నారు.

ఇప్పుడు గూగుల్ డాక్స్ షీట్ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇందులో 70 పాత్రికేయుల పేర్లున్నాయి. వీరిలో అత్యధికులు అమెరికాకు చెందినవారే. ఈ పాత్రికేయులు మహిళలపై లైంగికంగా దాడి చేశారని, అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని బజ్‌ఫీడ్ తెలిపింది.

లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారి పేర్లు ఇలా ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా బహిర్గతం అవుతుండడంతో సంబంధిత వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.

#MeToo సోష లో క్యాంపెయిన్ నేపథ్యంలో మహిళలు లైంగిక వేధింపులపై చర్చించేందుకు కొత్త కొత్త గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫిలిం, ఫ్యాషన్, మీడియా, రాజకీయాలు వంటి రంగాల్లోని మహిళలు వివిధ వాట్సాప్ గ్రూపుల్లో గళం విప్పుతున్నారని బీబీసీ ట్రెండింగ్ తెలిపింది.

అమెరికాకు చెందిన మోడల్ కామెరాన్ రస్సెల్ ఫ్యాషన్ పరిశ్రమలో లైంగిక వేధింపులకు పాల్పడే వారి పేర్లను బహిర్గతం చేసేందుకు #MyJobShouldNotIncludeAbuse హ్యాష్‌ట్యాగ్ తో ఓ ఆన్‌లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ ప్రచారంలో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇతరులు పంపించే మెసేజ్‌లను ఆమె షేర్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

ఫొటో క్యాప్షన్,

కాలేజీ రోజుల్లో తాను కూడా చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని సినీనటి అనుపమ పరమేశ్వరన్ బీబీసీకి తెలిపారు

నేను సైతం అంటున్న భారత మహిళలు

ఈ పరిస్థితి ఇప్పుడు కేవలం అమెరికా, బ్రిటన్ వరకే పరిమితం కాలేదు. భారత్‌లో కూడా మహిళలు లైంగిక వేధింపులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు.

ఇటీవలే మహిళా న్యాయ విద్యార్థిని రాయ సర్కార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ విద్యావేత్తల పేర్లు ఫేస్‌బుక్‌లో బయటపెట్టారు.

ఇతర మహిళలకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి కూడా చెప్పాలని ఆమె కోరారు. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ-మెయిల్స్, స్క్రీన్ షాట్లు, వాట్సాప్ మెసేజీలు, ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులను ఆమెతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Raya Sarkar/Facebook

ఈ జాబితాను విడుదల చేయడంతో తనకు రేప్ చేస్తామనే, చంపేస్తామనే బెదిరింపులు వస్తున్నాయని రాయ సర్కార్ తెలిపారు.

'ఈ జాబితాతో విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉంటారు' అని ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)