గ్రౌండ్ రిపోర్ట్: మియన్మార్‌లో హిందువులను హతమార్చిందెవరు?

  • 23 నవంబర్ 2017
రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులు
చిత్రం శీర్షిక రఖైన్ ప్రాంతంలో నివసిస్తున్న హిందువులు

మియన్మార్‌లోని రఖైన్‌లో 2017 ఆగస్టు 25న జరిగిన హింసాత్మక సంఘటనల్లో మైనారిటీ హిందువులు చిక్కుకుపోయారు. అసలు ఈ దాడి చేసిందెవరు? బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ మయన్మార్ నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం.

తమ దేశంలో నెలకొని ఉన్న బాధని ప్రపంచానికి చూపించాలని మియన్మార్ అధికారులు అనుకుంటున్నారు.

రఖైన్ రాష్ట్రంలో ఉన్న సీత్వే ప్రాంతానికి వెళ్లి చెదిరిపోయిన రోహింజ్యా హిందువులను కలిసేందుకు నాకు అనుమతి లభించింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం వాళ్లు 10,000 మంది ఉన్న మైనారిటీ వర్గీయులు. వీళ్లు 2017 ఆగష్టు 25న జరిగిన హింసలో చిక్కుకుపోయారు.

రోహింజ్యా హిందువులను ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని ఇక్కడ పాత్రికేయులు, సహాయకులు అంటారు. కానీ అధికారికంగా ఈ విషయం ఎవరూ నోరెత్తి చెప్పరు.

ఉత్తర రఖైన్ ప్రాంతంలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన సుమారు 700 మంది ప్రజలు ఇక్కడ ప్రభుత్వ శిబిరంలో తలదాచుకున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రఖైన్‌లో హిందువులను హతమార్చిందెవరు?

సీత్వేలో ఉన్న ఒక హిందూ ఆలయం మెట్లపై నేను కుకుబాల అనే 40 ఏళ్ల యువతిని కలిశాను.

హిందూ సంప్రదాయాల ప్రకారం బాలింతరాలు గుడిలోకి వెళ్లడం నిషిద్ధం. ఆమె బిడ్డకు కేవలం 11 రోజులు. ఆ బిడ్డని నిద్ర పుచ్చుతోంది కానీ, ఆమె ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

"పని కోసం వెళ్లిన నా భర్త, కూతురు ఇంటికి తిరిగి రాలేదు. తరవాత కొందరు తీవ్రవాదులు మా సోదరికి ఫోన్ చేసి వారిని హతమార్చామని చెప్పారు. మాకు కూడా అదే గతి పడుతుందేమోనని భయంగా ఉంది" అంటూ ఆగని దుఃఖంతో చెప్పింది.

"నాకు ఏం చేయాలో తెలియటం లేదు. కొన్ని రోజుల తరవాత సైన్యం మమ్మల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించింది."

ఆమె సీత్వే ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మ ఇచ్చింది. ఆమెకి మరో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

"నా బిడ్డకు పేరు పెట్టడానికి భర్త బతికి ఉంటే బాగుండుననిపిస్తోంది. నా భర్త, నా కూతురు మృతదేహాలను వెతికేందుకు నాకు సహాయం చేస్తారా" అని ఏడుస్తూ అడిగింది.

ఈ శిబిరంలో ఎవర్ని కదిలించినా ఇలాంటి కన్నీటి కథలే వినిపించాయి. కానీ ఇక్కడ ఎవరూ 'రోహింజ్యా' అనే పదాన్ని వాడరు. తీవ్రవాదులు తమ కుటుంబ సభ్యులను చంపేశారని అంటారు.

నా కదలికలను, చర్యలను కనిపెడుతూ, అక్కడి అధికారులు నా చుట్టూనే ఉన్నారు.

కానీ, నేను బంగ్లాదేశ్‌లో కలిసిన హిందూ రోహింజ్యాలు మాత్రం వీరిపై దాడి ఎవరు చేశారో తెలియదని అన్నారు.

చిత్రం శీర్షిక అనిక ధర్

సెప్టెంబర్‌లో ఎవరో ముసుగులు వేసుకున్న వ్యక్తులు ఉత్తర రఖైన్‌లో ఫకిరా బజార్‌ ప్రాంతంలో తన కుటుంబంపై దాడి చేసి తన భర్తను చంపేశారని 15 ఏళ్ల అనిక ధర్ చెప్పింది.

అప్పటికి ఆమె గర్భవతి. ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయి కాక్స్ బజార్‌లో హిందువులతో కలిసి తలదాచుకుంది.

అక్కడ వారు 6 లక్షల మంది రోహింజ్యా ముస్లింల మధ్య ఉండాల్సి వచ్చింది.

మియన్మార్ సైన్యమే మూకుమ్మడి అత్యాచారాలు, హత్యలకు పాల్పడిందని వారు అంటారు.

ఆగష్టు 25 న ఉత్తర రఖైన్ ప్రాంతంలో 30 పోలీస్ స్టేషన్లపై ముస్లిం తీవ్రవాదులు దాడి చేశారని ఇరు వర్గాల వారూ చెబుతున్నారు.

కానీ, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో ఉన్న రఖైన్ బుద్ధిస్టులను, రోహింజ్యా హిందువులు, ముస్లింలను కూడా రక్షించామని మియన్మార్ సైన్యం పేర్కొంది.

కానీ అంతర్జాతీయ సమాజం ఈ వాదనని తోసిపుచ్చింది.

అధికారులు 'ప్రణాళికా బద్ధంగా జాతి అంతానికి' పాల్పడ్డారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

చిత్రం శీర్షిక ఆశిష్ కుమార్ ధర్

సీత్వే ప్రభుత్వ శిబిరంలో నేను అనిక ధర్ బావ ఆశిష్‌ ధర్‌ను కలిశాను. ఈయనా తనవారిని కోల్పోయారు.

"నా కూతురుకి అస్వస్థత కారణంగా తనని మా అత్తగారింటి దగ్గర వదిలేశాను. అనిక భర్తతో పాటు, నా కూతురిని, మా అత్తింటివారిని కూడా అడవిలోకి తీసుకెళ్లి హతమార్చారు" అని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో ఉన్న అనికకి కాల్ చేసినపుడు, వీరిని ఎక్కడ చంపారో మాకు తెలిసింది.

ఆయన కూతురికి 8 సంవత్సరాలు. రఖైన్‌లో హిందువులపై జరుగుతున్న హింస, మారణకాండకు సంబంధించి ఆయన తన ఫోన్‌లో కొన్ని వీడియోలు చూపించారు.

చిత్రం శీర్షిక ఆశిష్ కుమార్ ధర్

హిందూ సంప్రదాయం ప్రకారం తమ కుటుంబ సభ్యులకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆశిష్ కుమార్ ధర్‌ని సైన్యం సెప్టెంబర్‌లో తీసుకువెళ్ళింది. అక్కడ 28 మృతదేహాలు లభించాయని అధికారులు చెప్పారు.

"ఈ స్థలం అంతా దుర్గంధం వ్యాపించింది. మృతదేహాల కోసం గంటల కొద్దీ తవ్వాల్సి వచ్చింది. చేతికి ఉన్న గాజులు, కట్టుకున్న తాడు ద్వారా నా కూతుర్ని, మా అత్తింటివారిని మాత్రం గుర్తించగలిగాను" అని చెప్పారు. వీరిని ఎవరు చంపారు అంటే చెప్పడం కష్టమే.

ఈ సామూహిక సమాధి దగ్గర కొన్ని ఏడుపులు, పెడబొబ్బలు వినిపించాయని, కానీ ఇదంతా ఎవరో ఏర్పాటుచేసినట్లుగా అసహజంగా ఉందని ఒక పేరు చెప్పడానికి ఇష్టపడని పాత్రికేయుడు చెప్పాడు.

చిత్రం శీర్షిక సీత్వేలో 6000 మంది హిందువులను ప్రభుత్వం శరణార్థి శిబిరాల్లో ఉంచింది

ఉత్తర రఖైన్‌లో ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు మాత్రం మియన్మార్ ప్రభుత్వం నాకు అనుమతి ఇవ్వలేదు.

కానీ, మియన్మార్ చట్టబద్ధ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీకి మాత్రం ఆ గ్రామాలకి వెళ్లే అవకాశం లభించింది. ఆమె నిశ్శబ్దంగా ఉండటంపై తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సూచీ రోహింజ్యా ముస్లింలను కలిశారు. వారు ఒకరితో ఒకరు గొడవలు పడకూడదని సూచించారు.

చిత్రం శీర్షిక రఖైన్‌లో నివసిస్తున్న హిందువులతో బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ

నేను సీత్వేలో ఉన్నపుడు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం నా కదలికలను, చర్యలను చాలా దగ్గర నుంచి కనిపెడుతూనే ఉంది. కానీ ఒక రోజు వారి కనుసన్నల నుంచి తప్పించుకున్నాను, అపుడు హిందూ రోహింజ్యాలు నాతో మాట్లాడారు.

"రోహింజ్యా హిందువులు ప్రభుత్వానికి భయపడుతున్నారా?" అని అడిగాను.

"మాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇవాళ ముస్లింలకి ఏం జరిగిందో మాకూ అదే గతి పట్టొచ్చు. ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులను ఇచ్చింది కానీ పౌరసత్వం ఇవ్వలేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు. మేం ఎక్కడికి పడితే అక్కడికి ప్రయాణం చేయలేం" అని ఓ వ్యక్తి చెప్పారు.

"మేం డిమాండ్లు చేస్తే, తరవాత మాకూ ముస్లింల పరిస్థితే ఎదురుకావచ్చని మౌనంగా ఉన్నాం" అని అన్నారు.

చిత్రం శీర్షిక సీత్వేలోని శరణార్థి శిబిరం

సీత్వే నుంచి యాంగూన్ వరకు మైనార్టీలు అందరూ భయంగానే ఉన్నారు.

రోహింజ్యా ముస్లిం నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు క్యా మిన్ మాత్రం తనవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముస్లిం తీవ్రవాదులు హిందూ రోహింజ్యాలను చంపారన్న ప్రభుత్వ వాదన పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

"ముస్లిం తీవ్రవాదులు లేదా ఏఆర్‌ఎస్ఏ ఈ హత్యలు చేశారనుకున్నా వారికి ఇలా పూడ్చిపెట్టేంత సమయం ఉండదు, వాళ్లు ఎప్పుడూ ముందుకు వెళ్లిపోతూనే ఉంటారు" అని ఆయనన్నారు.

ప్రభుత్వం మాత్రం రోహింజ్యా ముస్లింల ఏరివేతను పూర్తిగా ఖండించింది. తాము మైనారిటీ హిందువులను రక్షిస్తున్నట్లు పేర్కొంది.

చిత్రం శీర్షిక సామూహిక సమాధి

మియన్మార్ సాంఘిక సంక్షేమ మంత్రి విన్ మ్యాత్ ఆయ్‌ని కలిసేందుకు నేను రాజధాని నేపిడోకి వెళ్లాను.

"తీవ్రవాదులు రఖైన్ ప్రాంతాన్ని కబళించేందుకు అక్కడ హింసను సృష్టిస్తున్నారు" అని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం తరపున అందరూ సాధారణంగా చెప్పే సమాధానమే.

"ఆగస్టులో జరిగిన హింస తర్వాత అనేక మంది నిరాశ్రయులయ్యారని, ఎంతో మంది హిందువులను కూడా తీవ్రవాదులు హతమార్చారు" అని ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక విన్ మ్యాత్ ఆయ్, మియన్మార్ మంత్రి

"వాళ్ళు బంగ్లాదేశ్‌కి ఎందుకు పారిపోయారో నాకు తెలియదు. బహుశా భయపడి ఉంటారు, కానీ వాళ్లంతా ఇపుడు వెనక్కి వచ్చారు" అని చెప్పారు.

తన వదిన అనిక తిరిగి మియన్మార్ వచ్చినట్లు ఆశిష్ కుమార్ ధర్ నాకు చెప్పారు. గర్భవతిగా ఉన్న ఆమె, తన దేశంలో బిడ్డకు జన్మనివ్వడం సురక్షితంగా భావిస్తోందని తెలిపారు.

కానీ, కుకు బాల జీవితం మాత్రం సమస్యల్లోనే ఉంది.

కొన్ని రోజుల తరవాత ఆమె తన పిల్లలతో కలిసి తన గ్రామానికి తిరిగి వెళ్లిందని తెలిసింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హైదరాబాద్‌లో రోహింజ్యాలు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం