ఇరాక్ ప్రధాని: ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ముగిసింది, దేశానికి విముక్తి కల్పించాం

  • 9 డిసెంబర్ 2017
గత నెలలో రవాలో ఇరాక్ ప్రభుత్వ అనుకూల దళాలు Image copyright AFP
చిత్రం శీర్షిక గత నెలలో రవాలో ఇరాక్ ప్రభుత్వ అనుకూల దళాలు

ఇస్లామిక్ స్టేట్‌పై తమ యుద్ధం ముగిసిందని ఇరాక్ ప్రకటించింది.

ప్రస్తుతం ఇరాక్-సిరియా సరిహద్దుల్లో తమ దళాలు పూర్తి పట్టును సాధించాయని ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ దేశ రాజధాని బాగ్దాద్‌లో తెలిపారు.

గత నెల్లో రవా పట్టణంపై పట్టు కోల్పోయిన ఐఎస్ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ బలహీనపడిందని తెలిపారు.

సిరియాలో ఐఎస్‌ను ఓడించామని రష్యా సైన్యం ప్రకటించిన రెండు రోజులకే ఇరాక్ తాజా ప్రకటన చేసింది.

ఈ జిహాదీ గ్రూపు 2014లో సిరియా, ఇరాక్‌లోని పలు ప్రాంతాలపై పట్టు బిగించింది. ఈ ప్రాంతాల్లో ఉన్న కోటి మందికిపైగా ప్రజలు ఈ గ్రూపు పాలనలోకి వచ్చారు.

ఐఎస్ గత రెండేళ్లుగా వరుసగా ఓడిపోయింది. ఇటీవల ఇరాక్‌లోని మోసుల్, సిరియాలోని రఖాలో పట్టు కోల్పోయింది.

పూర్తికాని యుద్ధం

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ: ఐకమత్యంతో, పట్టుదలతో విజయం సాధించాం

సెబాస్టియన్ ఉషర్, బీబీసీ అరబ్ వ్యవహారాల ఎడిటర్

ఇది అబాదీకి చాలా గర్వించదగిన సందర్భం. ఈ విజయం సాకారమవ్వదని, కేవలం మాటలకే పరిమితమవ్వొచ్చనే భావన గతంలో ఉండేది.

అబాదీ చెప్పినట్లు ఐఎస్‌తో యుద్ధం నిజంగా పూర్తయై ఉంటే ఇరాక్ ఉన్నత శ్రేణి సాయుధ బలగాలు ఇక వెనక్కు మళ్లొచ్చు.

ఈ విజయంతో ఇస్లామిక్ స్టేట్ భావజాలంపై యుద్ధం ముగిసినట్లు కాదు. అలాగే ఇరాక్, సిరియా లేదా ప్రపంచంలోని మరేదైనా ప్రాంతంలో తన కార్యకలాపాలను చేపట్టగల, తిరుగుబాటు చేయగల సామర్థ్యాన్ని ఐఎస్ కోల్పోయినట్లు కూడా కాదు.

ఒకప్పటితో పోలిస్తే దాడులు తగ్గొచ్చు. అయినప్పటికీ ఇరాక్ పట్టణాలు, నగరాల్లో ఇకపైనా ఆత్మాహుతి దాడులు జరుగుతుంటాయి.

జిహాదిజం వ్యాప్తికి కారణమైన పరిస్థితులు నేటికీ కొనసాగుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వం తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్న భూభాగాల్లోనూ ఈ పరిస్థితులు ఉన్నాయి.

శనివారం అబాదీ మాట్లాడుతూ- ''ఇరాక్-సిరియా సరిహద్దులపై మా బలగాలకు ఇప్పుడు పూర్తి నియంత్రణ ఉంది. అందువల్ల ఐఎస్‌పై యుద్ధం ముగిసిందని ప్రకటిస్తున్నా. మా శత్రువు మా నాగరికతను అంతమొందించాలనుకున్నాడు. మా ఐకమత్యం, పట్టుదలతో శత్రువుపై విజయం సాధించాం. అదీ తక్కువ కాలంలోనే'' అని వ్యాఖ్యానించారు.

ఐఎస్ నుంచి ఇరాక్‌కు పూర్తిగా విముక్తి కల్పించినట్లు ఇరాక్ సాయుధ బలగాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

సిరియా తూర్పు సరిహద్దుల్లోని పట్టణం అల్బు కమాల్ నుంచి ఐఎస్‌ను తరిమేసినట్లు సిరియా సైన్యం గత నెల్లో ప్రకటించింది. అప్పటికి సిరియాలో ఐఎస్ అధీనంలో ఉన్న చివరి పట్టణం అదే.

Image copyright AFP
చిత్రం శీర్షిక మోసూల్

సిరియాలో ఐఎస్‌ను తుద ముట్టించే కార్యక్రమాన్ని రష్యా బలగాలు దిగ్విజయంగా పూర్తిచేశాయని రష్యా సైనిక ఉన్నతాధికారి సెర్గీ రడ్‌స్కోయ్ గురువారం పేర్కొన్నారు. సిరియాలో తమ సైన్యం ఇక శాంతి పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు.

ఐఎస్ పతనం నేపథ్యంలో సిరియాలో ఉన్న ఐఎస్‌ విదేశీ ఫైటర్లు ఇతర దేశాల్లో మరిన్ని దాడులు జరిపేందుకు సిరియా సరిహద్దులు దాటుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాక్‌లో ఐఎస్ విస్తరణ-పతనం-తీరు

  • 2014 జనవరి: ఇరాక్‌లోని ఫలూజా, రమడీ పట్టణాలను స్వాధీనం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ఐఎస్ఐఎల్)
  • 2014 జూన్: ఐఎస్ పరమైన మోసుల్ నగరం
  • 2014 జూన్ 29: ఐఎస్ఐఎల్ పేరు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా మార్పు
  • 2014 ఆగస్టు: ఐఎస్ నియంత్రణలోకి సింజర్ పట్టణం. ప్రాణభయంతో సింజర్ పర్వత ప్రాంతంలోకి పారిపోయిన సుమారు రెండు లక్షల మంది ప్రజలు. వీరిలో అత్యధికులు యాజిదీలు.
  • 2015 మార్చి: సంయుక్త పోరాటంతో టిక్రిత్ నగరాన్ని ఐఎస్ నుంచి స్వాధీనం చేసుకున్నఇరాక్ బలగాలు, షియా మిలీషియాలు
  • 2015 డిసెంబరు: రమడీ పట్టణం తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి
  • 2016 జూన్: ఫలూజా పట్టణాన్నిస్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
  • 2017 జులై: ప్రభుత్వ నియంత్రణలోకి మోసుల్‌
  • 2017 డిసెంబరు 9: ఐఎస్‌పై యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఇరాక్ ప్రధాని

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు