అండర్ 19 క్రికెట్: ఫైనల్స్‌లో గెలుపు దిశగా దూసుకెళుతున్న భారత జట్టు

  • 3 ఫిబ్రవరి 2018
మన్జోత్ కాల్రా అర్థ శతకం తర్వాత అభివాదం Image copyright MARTY MELVILLE/AFP/Getty Images
చిత్రం శీర్షిక భారత ఓపెనర్ మన్జోత్ కల్రా 97 పరుగులతో సెంచరీ దిశగా పయనిస్తున్నాడు

ఐసీసీ అండర్‌-19 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత యువ జట్టు గెలుపు దిశగా స్థిరంగా పయనిస్తోంది. ప్రపంచ చాంపియన్‌గా నిలవటానికి మరో 21 పరుగుల దూరంలో ఉంది. ఇంకా 8 వికెట్లు, 15 ఓవర్లు ఉన్నాయి.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును 216 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు.. ప్రస్తుతం 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌లోని మౌంట్‌ మాంగనీలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడిన భారత్ ఫీల్డింగ్‌ చేసింది. అయితే భారత యువ బౌలర్లు విజృంభించటంతో ఆసీస్ జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్ప కూలింది.

ఆసీస్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నప్పటికీ.. ఓపెనర్లు బ్రయంత్‌ (14), ఎడ్వర్ట్స్‌(28), ఆ తర్వాత వచ్చిన సారథి సంఘా (13) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు.

Image copyright MARTY MELVILLE/AFP/Getty Images
చిత్రం శీర్షిక ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది

అనంతరం మెర్లో (76) ఒంటరి పోరాటంతో ఆసీస్ స్కోరు 200 పరుగులు దాటింది.

చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయటంతో ఆసీస్ జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు పరిమితమైంది.

భారత బౌలర్లలో ఇషాన్‌ పోరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీశారు. శివమ్‌ మావికి ఒక వికెట్‌ లభించింది.

అనంతరం 50 ఓవర్లలో 217 పరుగుల లక్ష్యంతో భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, మన్‌జోత్‌ కల్రాలు బ్యాటింగ్‌కు వచ్చారు. నాలుగు ఓవర్లలో స్కోరు 23 పరుగుల వద్ద ఉన్నపుడు వర్షం పడటంతో ఆటను 20 నిమిషాల పాటు నిలిపివేశారు.

Image copyright MARTY MELVILLE/AFP/Getty Images
చిత్రం శీర్షిక భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షా 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు

వర్షం తగ్గి ఆట మళ్లీ మొదలయ్యాక ఓపెనర్లిద్దరూ స్థిరంగా ఆటకొనసాగించారు. 12వ ఓవర్‌లో నాలుగో బంతికి భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షా 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విల్ సదర్‌లాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత జట్టు 71 పరుగులు చేసింది.

అనంతరం శుభం గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోరు వికెట్ నష్టానికి 125 పరుగులకు చేరింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో జట్టు స్కోరు 131 పరుగుల వద్ద ఉండగా పరం ఉప్పల్ బౌలింగ్‌లో శుభం గిల్ ఔటయ్యాడు. గిల్ 30 బంతులు ఆడి 31 పరుగులు జోడించాడు.

ఆ తర్వాత వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్లు పూర్తయయే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మన్జోత్ కాల్రా 97 పరుగులతో, హార్విక్ దేశాయ్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్కోర్ కోసం క్లిక్ చేయండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)