ఆస్ట్రేలియా వెళ్లినా అవే హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు!

  • వినీత్ ఖరే
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

నేహ - గృహహింస బాధితురాలు

ఆస్ట్రేలియాలో భారతీయ మహిళలు ఇళ్లలో కంటే వీధుల్లోనే సురక్షితంగా ఉంటారని కొందరు అంటుంటారు.

కట్నం కోసం భార్యలకు నిప్పుపెట్టడం, కొట్టడం, హత్య చేయడం.. ఇలాంటి పనులన్నీ భారతీయులు ఆస్ట్రేలియాలోనూ చేస్తున్నారు.

అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు బీబీసీ అక్కడ ఉంటోన్న కొందరు భారతీయులతో మాట్లాడింది. వాళ్లలో లీనా ఒకరు.

లీనా తన రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి మెల్‌బోర్న్‌లో ఉంటున్నారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెను కడుపుపై తన్నాడు.

'అతడు నన్ను ఇష్టానుసారంగా కొట్టాడు. అప్పుడు నేను ఏడు వారాల గర్భవతిని. నేను ప్రతిఘటించడానికి ప్రయత్నించాను. కానీ ఆయన దాడి చేయడం ఆపకపోవడంతో అతడి స్నేహితుడు కల్పించుకోవాల్సి వచ్చింది.

వెంటనే నేను ఓ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాను. అయినా నా భర్త దాన్ని పగలగొట్టి లోపలికొచ్చి, నన్ను చంపేస్తానని బెదిరించాడు.

ఎక్కడ నా భర్త నా కొడుకును భారత్‌కు పంపిస్తాడేమోనని భయమేసి వాడి పాస్‌పోర్టు చింపేశాను.

కడుపులో ఉన్న మరో బిడ్డకు ఏమైందోనని భయపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లమని నా భర్తను ప్రాధేయపడ్డాను. కానీ అతడు తీసుకెళ్లలేదు' అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు లీనా.

ఫొటో క్యాప్షన్,

భర్త చేసిన దాడి కారణంగా లీనా తన గర్భాన్ని కోల్పోయారు.

భర్త చేసిన దాడివల్ల లీనా కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయారు.

ఆస్ట్రేలియాలో గృహ హింస కారణంగా ప్రతి మూడు గంటలకు ఒక మహిళ ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రతి వారం ఒక మహిళ హత్యకు గురవుతున్నారు.

ఆస్ట్రేలియాలో ఐదు లక్షలకుపైగా భారతీయులు నివశిస్తున్నారు. అక్కడ ఉంటోన్న విదేశీయుల్లో ఎక్కువగా గృహహింస బారిన పడుతోంది భారతీయులేనని రికార్డులు చెబుతున్నాయి.

ఆస్ట్రేలియాలో ఉండే భారతీయ సముదాయాలకు చెందిన 12మంది మహిళలు 2009-17మధ్య గృహ హింస కారణంగా ప్రాణాలు కోల్పోయారని బ్రిస్బేన్‌లో ఉంటోన్న సామాజిక కార్యకర్త జతిందర్ కౌర్ చెబుతారు.

మన్‌ప్రీత్ కౌర్, ప్రీతికా శర్మ, అనితా ఫిలిప్, నిధి శర్మ లాంటి కొందరు మహిళల మరణం అక్కడి భారతీయ కుటుంబాలను షాక్‌కు గురిచేసింది.

ఆస్ట్రేలియాలోని భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసపై 'ది ఎనిమీ వితిన్‌' పేరుతో మన్‌ప్రీత్ సింగ్ అనే పాత్రికేయురాలు ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

ఫొటో క్యాప్షన్,

'ది ఎనిమీ వితిన్‌' పేరుతో మన్‌ప్రీత్ సింగ్ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

మంటల్లో కాలిపోయినవాళ్లు, 30-40కత్తిపోట్లకు గురైన వాళ్లు.. ఇలా కిరాతకంగా హత్యకు గురైనవాళ్ల కేస్ స్టడీలను అందులో పొందుపరిచారు.

అందులో ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన సర్గున్ రాగి ఉదంతం కూడా ఉంది. సర్గున్ భర్తను ఆమెకు దూరంగా ఉండాలంటూ కోర్టు ఆదేశించినా, వాటిని బేఖాతరు చేసి మరీ అతడు ఆమె దగ్గరకు వచ్చాడు. తరవాత ఆమె మంటల్లో కాలి బూడిదైంది.

బ్రిస్బేన్‌లో ఉండే నేహ(పేరు మార్చాం) అనే మరో మహిళ కూడా బీబీసీతో తన అనుభవాల్ని పంచుకున్నారు.

'గుజరాత్ నుంచి ఎన్నో ఆశలతో నేను బ్రిస్బేన్‌లో అడుగుపెట్టాను. నాకది రెండో పెళ్లి. గృహ హింస కారణంగానే మొదటి పెళ్లిని రద్దు చేసుకున్నాను.

నాకు ఐటీ రంగంలో ఏడేళ్ల అనుభవం ఉంది. పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. పెళ్లితో ఆ కోరిక తీరనట్లే అనిపించింది.

నేను నా భర్తను పూర్తిగా నమ్మా. నాకు స్టూడెంట్ వీసా, శాశ్వత వీసా లాంటి అంశాలపై పెద్దగా అవగాహన లేదు.

మరోపక్క నా భర్త వ్యాపారం దెబ్బతినడంతో ఆ ప్రభావం మా బంధంపైనపడింది.

తొలిసారి ఆయన నాపైన చేయి చేసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. నేనేమీ అనాగరికురాలిని కాదు, నన్నాయన అలా కొట్టడానికి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయా.

ఆ పైన తరచూ ఒంటిమీద వాతలు తెలేలా కొట్టడం ఆయనకు అలవాటైపోయింది.

నేను ఎక్కడికీ వెళ్లే అవకాశం లేదని ఆయనకు బాగా తెలిసు. కానీ కొన్నాళ్లకు నాకు నేనే ధైర్యం చెప్పుకోవడం మొదలుపెట్టా. 'నేను ఇక్కడే చచ్చిపోవాలా లేక ఎలాగోలా బయటపడాలా' అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా.

కానీ నా బాధ వినడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఒక రోజు మా ఇంట్లో గొడవ విని పొరుగింటావిడ పోలీసులను పిలిచింది. అలా నేను అక్కడినుంచి బయటపడగలిగా’ అంటూ తన కథను పంచుకున్నారు నేహ.

ఆస్ట్రేలియాలో గృహహింస చట్టాలు కఠినంగానే ఉన్నాయి. పోలీసులు కూడా ఫిర్యాదులకు వేగంగానే స్పందిస్తారు. కానీ ఇంగ్లిష్ తెలియకపోవడం, అక్కడ పరిచయస్థులు లేకపోవడం, చట్టాలపైన అవగాహన లోపించడం లాంటి కారణాల వల్ల భారతీయ మహిళలు తరచూ గృహహింస బాధితులుగా మారుతున్నారు.

గత దశాబ్ద కాలంలో భారత్ నుంచి ఆస్ట్రేలియా వలసవెళ్లే కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల తోడు లేకపోవడం లాంటి అంశాలు ఈ నేరాల సంఖ్యను మరింత పెంచుతున్నాయి.

కచ్చితంగా ఎంతమంది గృహహింసకు గురవుతున్నారనే లెక్కలు లేకపోయినా, ఆ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని స్థానిక భారతీయులు చెబుతారు.

‘ఓసారి కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయిని తన భర్త 18నెలలపాటు గృహ నిర్బంధంలో పెట్టాడు. అసలు ఇంట్లో నుంచి బయటకు రానిచ్చేవాడు కాదు. బయటకు వెళ్లేప్పుడు ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడు.

ఇక్కడ చాలామంది మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. కొందరు భర్తలు తమ మాట వినకపోతే భారత్‌కు పంపిస్తామని భార్యలను బెదిరిస్తారు. అలా వెళ్లడాన్ని మహిళలు అవమానకరంగా భావిస్తారు. అందుకే భర్తలు ఏం చెప్పిన కిమ్మనకుండా వింటారు’ అంటారు జతిందర్. ఆస్ట్రేలియాలో గృహహింసకు వ్యతిరేకంగా జతిందర్ పోరాడుతున్నారు.

‘భాష ఇక్కడ ప్రధాన సమస్య. అందుకే మహిళలు పోలీసులకు తమ సమస్యను సరిగ్గా చెప్పలేరు. పోనీ రెండు భాషలు తెలిసిన వాళ్ల సాయం తీసుకోవడానికీ వాళ్లు ఒప్పుకోరు’ అంటారామె.

ఆస్ట్రేలియాలో భారతీయ మహిళల సమస్యలకు తెరపడేది ఎన్నడనేది ఆమె ప్రశ్న.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)