డార్క్‌ వెబ్‌‌: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!

  • 3 మార్చి 2018
డార్క్ వెబ్

‘‘జీవితం చాలా నిస్సారంగా గడుస్తుందనిపించే సమయంలో నా పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజున ఏదైనా థ్రిల్లింగ్ పని చేస్తే బావుంటుందున్న ఆలోచన కలిగింది. కొన్నేళ్ల క్రితం నేను విన్న డార్క్ వెబ్ గుర్తొచ్చింది.’’

‘‘ఎల్‌ఎస్‌డీ, మెథాఫెటమైన్, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, డీఎంటీ లాంటి ఎన్నో పదార్థాలు ఆ డార్క్ వెబ్ ద్వారా హోం డెలివరీకి అందుబాటులో ఉన్నాయి. వెంటనే ల్యాప్‌టాప్ తెరిచి ‘దానికి’ ఆర్డర్ ఇచ్చేశా.’’

తరంగ్ అనే ఓ కుర్రాడు చాలా ఉత్సాహంగా ఓ చీకటి రాజ్యం గురించి చెబుతున్న విషయాలివి. పండ్లూ, కూరగాయల్లా ఇప్పుడు కొకైన్, హెరాయిన్ లాంటి పదార్థాలు చాలా సులభంగా ఇంటికే వచ్చేస్తున్నాయి.

‘‘డెలివరీ ఫుడ్ బాక్స్‌లో కావాలా లేక బొమ్మల బాక్స్‌లో కావాలా?’ అని వెబ్‌సైట్ వాళ్లు అడిగారు. నేను బొమ్మల బాక్స్ అని చెప్పాను. బాక్స్‌లో గ్యారంటీ కార్డ్, రిసీప్ట్ కూడా ఉన్నాయి. కేవలం డెలివరీ ఎప్పుడు చేయాలో అడుగుతూ ఒక మెయిల్ వచ్చింది. అంతకు మించి ఎవరూ నాకు ఫోన్ చేయలేదు’’ అని అతడు చెప్పాడు.

‘‘చెప్పిన సమయానికి డోర్ కొట్టి డెలివరీ ఇచ్చేశారు. అది వచ్చేవరకూ, నా డబ్బులు పోయాయనే అనుకున్నా. లేదా పోలీసుల నుంచి ఫోన్ వస్తుందేమోనని భయపడ్డా. కానీ ఎప్పుడైతే నా ఆర్డర్ డెలివరీ అయిందో, అప్పట్నుంచీ మళ్లీ మళ్లీ ఆర్డర్ చేయడం మొదలుపెట్టాం’‘ అంటాడు తరంగ్.

ఏంటీ డార్క్ వెబ్?

అక్రమ వ్యాపారాలూ కార్యకలాపాలకు వేదికగా నిలిచే ఇంటర్‌నెట్ సేవల్ని ‘డార్క్ వెబ్’ అంటారు.

మనం రోజువారీ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఇంటర్నెట్‌ని ‘సర్ఫేస్ వెబ్’ అంటారు. మొత్తం ఇంటర్నెట్‌లో అదో చిన్న భాగం. కానీ పైకి కనిపించని మరో ఇంటర్నెట్ వ్యవస్థని ‘డీప్ వెబ్’ అంటారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 90 శాతం ఇంటర్నెట్ ఈ రహస్య వ్యవస్థ (డీప్ వెబ్) రూపంలోనే పనిచేస్తోంది.

డీప్ వెబ్‌లో ఉండే ప్రతి పేజీని సాధారణ సెర్చ్ ఇంజన్‌లు శోధించలేవు. డార్క్ వెబ్ కూడా ఈ డీప్ వెబ్‌లో భాగమే. పేరు తెలీకుండా అనేక రహస్య కార్యకలాపాలకు పాల్పడే ‘డార్క్ వెబ్’ వెబ్‌సైట్లు ఈ డీప్ వెబ్‌లో భాగమే.

ఈ డార్క్ వెబ్‌లో ఎన్ని వెబ్‌సైట్లు ఉన్నాయో, ఎంత మంది డీలర్లు, కొనుగోలుదారులు ఉన్నారో అంచనా వేయడం కష్టం. ‘‘డార్క్ వెబ్ పరిధి ఎంతో, అది ఏ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎఫ్‌బీఐ తొలిసారి ‘సిల్క్ రోడ్‌’ని మూసేసినప్పుడు, డార్క్ వెబ్ టర్నోవర్ 1,200 మిలియన్ డాలర్లు దాటిందన్న రిపోర్టు మాత్రం వచ్చింది’’ అని పుణె సైబర్ సెల్, డీసీపీ సుధీర్ హిరయ్‌మత్ అన్నారు.

డార్క్ వెబ్‌ ద్వారా పనిచేసే భారీ డ్రగ్ ‌మార్కెట్లలో ఒకదాని పేరు ‘సిల్క్ రోడ్’. దాన్ని 2013లో ఎఫ్‌బీఐ అధికారులు మూసేశారు.

డార్క్ వెబ్ ఎప్పుడు మొదలైంది?

డార్క్ వెబ్ నిజానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1990ల్లో మొదలైంది. అప్పట్లో అమెరికా ఆర్మీ అధికారులు తమ నిఘా సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా పంచుకునేందుకు ఈ డార్క్ వెబ్‌ను మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు డార్క్ వెబ్ ద్వారా సైనైడ్, నార్కొటిక్స్ కూడా ఇంటి దగ్గరకే వస్తున్నాయి.

‘‘డార్క్ వెబ్‌లో అన్ని తరహా ఆయుధాలు దొరుకుతాయి. కిరాయి హంతకులు కూడా దొరుకుతారు. దేశంలో ఎక్కువగా డ్రగ్స్, చైల్డ్ పోర్న్, పైరసీ లాంటి వాటికోసం దీన్ని వాడుతున్నారు’’ అని డీసీపీ సుధీర్ పేర్కొన్నారు.

స్థానిక చట్టాలు, పోలీసుల్లో అవగాహన ఏమేరకు ఉంది వంటి అంశాల ఆధారంగా ఈ డార్క్ వెబ్ ఒక్కో దేశంలో ఒక్కో స్థాయిలో విస్తరించింది. ఫేక్ పాస్‌పోర్టులు, లైసెన్సులు, ఇతర ఐడీ ప్రూఫుల కోసం కూడా దీన్ని వాడుతున్నారు.

ఎలాంటి డేటానైనా హ్యాక్ చేయగలిగే హ్యాకర్లు కూడా డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉంటారు. కొన్ని టెర్రరిస్టు సంస్థలు కూడా డార్క్ వెబ్ సాయంతో నిధులు సేకరిస్తాయని చెబుతారు.

Image copyright Getty Images

నియంత్రణ కష్టమే

‘‘డార్క్ వెబ్‌ను ఉపయోగించడానికి ప్రత్యేక బ్రౌజర్లుంటాయి. అవి చాలా కట్టుదిట్టంగా పనిచేస్తాయి. సాధారణ ఇంటర్నెట్‌లో చేసే అన్ని పనులనూ ట్రాక్ చేయొచ్చు. కానీ డార్క్ వెబ్‌పై నిఘా పెట్టడం చాలా కష్టం.’’

‘‘డార్క్ వెబ్ కూడా ఇంటర్నెట్‌తోనే పనిచేసినా, కొన్ని సాఫ్ట్‌వేర్ల సాయంతో వినియోగదార్లు తమ ఐపీ అడ్రెస్‌లను దాచిపెడతారు. దాంతో వినియోగదారుడిని గుర్తించడం కుదరదు.’’

‘‘అందుకే పోలీసులకు కూడా ఈ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఫలితంగా డార్క్ వెబ్ నేరస్థుల అడ్డాగా తయారవుతోంది’’ అని డీసీపీ సుధీర్ వివరించారు.

బిట్ కాయిన్లతో పేమెంట్

డార్క్ వెబ్ కార్యకలాపాలు చట్ట విరుద్ధమైనవే అయినా, అందులోని అన్ని లావాదేవీలు సాధారణ డిజిటల్ మార్కెట్‌లానే జరుగుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థల్లా అక్కడ కూడా వ్యాపారులు కస్టమర్లను ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.

బిట్ కాయిన్ల లాంటి క్రిప్టో కరెన్సీ సాయంతో పేమెంట్ జరుగుతుంది. క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడం కూడా కష్టం కావడంతో ఎక్కువగా వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకే ఉపయోగిస్తున్నారు.

Image copyright Christopher Furlong/Getty Images

యువతకు ఎందుకంత ఆసక్తి?

అధికారికంగా ఎలాంటి డేటా అందుబాటులో లేకపోయినా.. దేశ వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది డ్రగ్స్ వాడుతున్నారని అంచనా. డార్క్ వెబ్ ద్వారా రిస్క్ తక్కువ, సౌకర్యం ఎక్కువగా ఉండటంతో సమాచారం గోప్యంగా ఉంటుందనే ఉద్దేశంతో యువత ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు.

‘‘స్కూళ్లు, కాలేజీలు కేంద్రంగా కూడా డార్క్ వెబ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. స్లమ్స్‌లో కూడా అవి దొరుకుతాయి. రిక్షావాళ్లు కూడా వాటిని నేరుగా ఇంటికి చేరుస్తారు. పాన్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే డార్క్ వెబ్‌ని వాడటం సులువు’’ అంటాడు తరంగ్.

డ్రగ్స్ వ్యాపారానికి వేదిక

గతంలో డ్రగ్స్ అమ్మకాలకు ‘సిల్క్ రోడ్’ ప్రధాన కేంద్రంగా ఉండేది. 2013లో దాన్ని మూసేశాక, తిరిగి వెలుగులోకొచ్చే ప్రయత్నం జరిగినా, ఎఫ్‌బీఐ దాన్ని మళ్లీ అడ్డుకుంది.

గత జూలైలో డార్క్ వెబ్‌లోని ‘హన్స’, ‘ఎల్ఫబే’ అనే మరో రెండు పెద్ద మార్కెట్లను మూసేసినట్లు డచ్ నేషనల్ పోలిస్, ఎఫ్‌బీఐ, డీఈఏ సంస్థలు ప్రకటించాయి.

కానీ ఇలాంటి చర్యలవల్ల పెద్దగా ఫలితాలు రావట్లేదు. ఇది పైరసీ, పోర్న్‌ వెబ్‌సైట్లను బ్యాన్ చేయటం లాంటిదే. పది వెబ్‌సైట్లను తొలగిస్తే 20 కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొస్తాయి.

ఉదాహరణకు ప్రస్తుతం ‘సిల్క్ రోడ్ థర్డ్ ఎడిషన్’ రాబోతున్నట్లు సమాచారం అందుతోందని డీసీపీ సుధీర్ అంటున్నారు.

కొందరు ఏజెంట్ల సాయంతో విదేశీ సంస్థలు డార్క్ వెబ్ సమాచారాన్ని సేకరిస్తాయి.

డార్క్ వెబ్‌లో ఎన్నో ఏళ్ల పాటు చిన్న పిల్లలకు ఎరవేసి లైంగిక దోపిడీ, అత్యాచారాలకు పాల్పడినందుకు మాథ్యూ ఫోల్డర్ అనే వ్యక్తి 32 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు.

ఎఫ్‌బీఐ, యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ, యూరోపోల్ లాంటి కొన్ని సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ దేశాల సాయంతో మాథ్యూను బ్రిటన్ పట్టుకుంది.

భారతీయ పోలీసులు ఏం చేస్తున్నారు?

దేశంలో డార్క్ వెబ్‌ను నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టం లేదు.

‘‘చట్టంలో సరైన వెసులుబాట్లు లేకపోవడంతో డార్క్ వెబ్ నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు కాస్త కష్టమవుతుంది. సీఆర్‌పీసీ, ఐటీ చట్టాలే ఆ నేరాలకూ వర్తిస్తాయి’’ అని ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ నిపుణుడు సుబ్తి చతుర్వేది పేర్కొన్నారు.

‘‘డార్క్ వెబ్ సంస్థలు చాలా వేగంగా తమ కోడ్స్‌ను మార్చుకుంటాయి. సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకుంటాయి. అందుకే కేవలం పోలీసులే వాళ్లను వేటాడటం కష్టం. తల్లిదండ్రులూ, సమాజం కూడా ఆ ప్రయత్నంలో భాగం కావాలి.’’

నిజానికి చాలా క్రైమ్ ఇళ్లలోనే జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల వ్యవహారశైలిలో తేడాలను గమనిస్తుండాలి’’ అంటారు చతుర్వేది.

‘‘టెక్నాలజీలో మేం కాస్త వెనకబడిన మాట వాస్తవమే. అందుకే కొన్ని ఏజెన్సీల సాయం తీసుకుంటాం. మానవ మేధస్సునూ నమ్ముకుంటాం’’ అని డీసీపీ సుధీర్ అన్నారు.

ఇంకెవరు వాడుతున్నారు?

అమెరికాలోని నిఘా సంస్థలు కొందరు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని డార్క్ వెబ్ ద్వారా సేకరిస్తున్నాయి.

వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే కూడా సమాచార సేకరణ కోసం డార్క్ వెబ్ సాయం పొందినట్లు గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లోని కొందరు వ్యక్తులు తమ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి డార్క్ వెబ్‌ను ఉపయోగిస్తున్నారు.

(డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసే దిల్లీకి చెందిన ఓ కుర్రాడి నుంచి సమాచారాన్ని సేకరించి ఈ రిపోర్టును బీబీసీ రూపొందించింది. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు అతడి పేరుని మార్చాం. ఇలా డార్క్ వెబ్ సేవలు పొందే యువత చాలామంది ఉన్నారు. డార్క్ వెబ్‌ని, డ్రగ్స్‌ని ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం ఈ కథనం ఉద్దేశం కాదు. డార్క్ వెబ్ ద్వారా తలెత్తే ప్రమాదాల గురించి తెలిస్తే ప్రజలు తమను తాము దాన్నుంచి కాపాడుకునే వీలు దొరకుతుందన్న ఉద్దేశంతోనే ఈ కథనాన్ని అందిస్తున్నాం.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)