ఈ బిల్లు మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
"నన్నూ, పుష్పను మహారాష్ట్రలోని భివాండీలో 80 వేల రూపాయలకు అమ్మేశారు. మమ్మల్ని ఇలా అన్యాయం చేయొద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాం. ఎవరికీ మాపై దయ కలగలేదు. పుష్ప వికరాంగురాలు. అయినా ఆమెను వదిలిపెట్టలేదు. రోజూ మమ్మల్ని పురుషులతో పడుకోవాలని ఒత్తిడి చేసేవారు. వద్దని అనేందుకు అవకాశం లేదు. వద్దంటే కళ్లళ్లో పచ్చికారం నూరి పెట్టేవారు!’’
ఈ దీన గాథ రమాదేవి అనే మహిళది. పన్నెండేళ్ల వయసులోనే ఆమె పెళ్లి జరిగింది. అత్తారింట్లో వేధింపులు ఎక్కువవ్వడంతో విసిగిపోయి తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమెకు పరిచయస్తురాలైన ఓ మహిళ మోసం చేయడంతో ఆమె అక్రమ రవాణా బ్రోకర్ల (హ్యూమన్ ట్రాఫికర్ల) చేతికి చిక్కింది.
చాలా కష్టంగా ఆమె ఆ చెర నుంచి తప్పుకోగలిగింది. కానీ ఆమెను ఆ నరకకూపంలోకి నెట్టిన వాళ్లకు నేటికీ శిక్ష పడలేదు.
ఇది రాయలసీమలోని ఓ మహిళ యదార్థ గాథ. దేశవ్యాప్తంగా ఇలాంటి మహిళలు, పిల్లలు, పురుషులు పెద్ద సంఖ్యలో మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు.
మనుషులను అక్రమ రవాణా చేస్తున్నవారికి నామ మాత్రం జైలు శిక్ష పడుతోంది. జైలు నుంచి విడుదలైన వారిలో చాలా మంది తిరిగి తమ పాత వృత్తినే కొనసాగిస్తున్నారు.
బాధితులు కోర్టుల చుట్టూ తిరిగినా, వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఓ నిర్దిష్ట చట్టం అంటూ ఏదీ లేదు. కానీ ఇలాంటి చట్టాన్ని రూపొందించేందుకు తాజాగా.. మానవ అక్రమ రవాణా (నియంత్రణ, పరిరక్షణ, పునరావాసం) బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
మానవ అక్రమ రవాణా అంటే?
ఏ వ్యక్తినైనా అనుమతి లేకుండా గానీ, అనుమతితో గానీ, పని చేసేందుకు గానీ, వెట్టి చాకిరికి కానీ, శారీరక ప్రయోజనాల కోసం కానీ , హింస ద్వారా , బలవంతంగా, మోసం చేసి కానీ, డబ్బు చెల్లించి కానీ, అధికార దుర్వినియోగం చేసి గానీ, నిర్బంధించి గానీ, అధికారం చెలాయించేందుకు పనిలో నియమించుకున్నా, రవాణా చేసినా మానవ అక్రమ రవాణాగా పరిగణించవచ్చని ఐక్య రాజ్య సమితి నిర్వచించింది.
అయితే ఈ నేరాన్ని నియంత్రించేందుకు ఇప్పటి వరకు భారతదేశంలో ఎటువంటి ప్రత్యేక చట్టమూ లేదు.
కొత్త బిల్లు ఏం చెబుతోంది?
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ఈ బిల్లు సహాయ పడుతుంది.
ఈ బిల్లు అమలులోకి వస్తే, మానవ అక్రమ రవాణాను అరికట్టే విషయంలో భారతదేశం దక్షిణ ఆసియా దేశాలకు మార్గదర్శిగా నిలుస్తుందని చెబుతున్నారు.
ఈ బిల్లును అనేక మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో చర్చించి రూపొందించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించిన సూచనలు, సలహాలను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు.
ఈ బిల్లులో మానవ అక్రమ రవాణా నియంత్రణ, రక్షణ , పునరావాసం అంశాలను పొందుపరిచారు.
ఫొటో సోర్స్, Getty Images
బిల్లులోని అంశాలు ఏమిటి?
నియంత్రణ
ఈ బిల్లు మానవ రవాణాను కేవలం శారీరక దోపిడీగా మాత్రమే చూడదు.
ఏ వ్యక్తినైనా వెట్టి చాకిరీకి కానీ, భిక్షమెత్తుకోవటానికి కానీ, మత్తు మందులు ఉపయోగించి ఎవరినైనా రవాణా చేసినా, హార్మోన్ల పెరుగుదలకు మందులు ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు గానీ, లేదా పెళ్లి పేరుతో లేదా పెళ్లి తరువాత కానీ ఏ వ్యక్తినైనా అక్రమంగా తరలించే ప్రయత్నం చేయడం కూడా ఈ బిల్లు కింద నేరాలుగా పరిగణిస్తారు.
అక్రమ రవాణా నిమిత్తం ప్రభుత్వ నిబంధనలు సడలించేందుకు, ఆమోదం పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించడం, ముద్రించడం, అసలు పత్రాలను తారుమారు చేయడం వంటి చర్యలు కూడా ఈ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు.
పరిరక్షణ
బాధితులు, సాక్షుల వివరాలను గోప్యంగా ఉంచడం ఈ చట్టంలో ఒక ముఖ్యమైన అంశం. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసి రికార్డు చేసే సౌలభ్యం ఈ చట్టం కల్పిస్తుంది.
చట్టాన్ని అనుసరించి ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి ఒక్క సంవత్సరం లోపు విచారణ పూర్తి చేసి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయాలి.
పునరావాసం
బాధితులకు శారీరకంగా, మానసికంగా తోడ్పడేలా ఛార్జ్ షీట్ నమోదు చేసిన 30 రోజుల్లోగా తక్షణ సహాయం, 60 రోజుల్లోగా పూర్తి పునరావాసం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి.
బాధితుల సహాయార్థం పునరావాస నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధిని బాధితుల పునరావాసానికి , శారీరక, మానసిక , సామాజిక వికాసానికి ఉపయోగించాలి. బాధితులకు విద్య, ఉపాధి, వైద్యం, న్యాయ సహాయం, సురక్షిత ఆవాసం కల్పించేందుకు నిధులను వాడాలి.
అక్రమ రవాణా కేసులు సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రత్యేక సంస్థల ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ సంస్థలు, అక్రమ రవాణాకు సంబంధించిన నిరోధన, రక్షణ, పరిశోధన, పునరావాస కార్యక్రమాల దిశగా చర్యలు చేపట్టాలి. హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) జాతీయ స్థాయిలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడేందుకు చర్యలు చేపడుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
శిక్ష ఏమిటి?
అక్రమ రవాణా కేసులో నేరస్థులకు 10 సంవత్సరాల నుంచి జీవిత కాలం జైలు శిక్ష, కనీసం లక్ష రూపాయిల జరిమానా విధిస్తారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే వ్యవస్థీకృత నేరాలను నిరోధించేందుకు, ఈ బిల్లు ఆస్తుల జప్తు, నేరం ద్వారా ఆర్జించిన సొమ్మును కూడా స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటుంది.
బాధితులకు సహాయం అందుతుందా?
ఈ బిల్లు బాధితులకు రక్షణ, సహాయం, పునరావాసం అందించడంలో తొలి అడుగు అని స్వచ్ఛంద సంస్థ 'ప్రజ్వల' వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ అన్నారు.
బీబీసీ తో మాట్లాడుతూ, "2004లో తమ సంస్థ తరపున సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా, మానవ అక్రమ రవాణాపై బిల్లు తేవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆదేశాలు జారీ చేసింది" అని తెలిపారు.
ఈ బిల్లును బాధితులకు పూర్తీ సహాయం అందించే విధంగా రూపొందించారని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో సునీతా కృష్ణన్ సభ్యురాలిగా ఉన్నారు.
"మానవ అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ, దానిని అరికట్టే లక్ష్యంతో ఈ బిల్లు రావడం హర్షించదగ్గ పరిణామం" అని ఆమె అన్నారు.
అయితే ఇది చట్టంగా మారి మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఏ మేరకు తోడ్పడుతుందో వేచి చూడాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.
- మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగే మానవ అక్రమ రవాణా ప్రపంచంలో అతి పెద్ద వ్యవస్థీకృత నేరాల జాబితాలో మూడవది.
- జాతీయ నేర గణాంకాల రిపోర్టుల ప్రకారం భారతదేశంలో 2015లో 6877 కేసులు నమోదు కాగా, 2016 లో 8132 కేసులు నమోదయ్యాయి.
- వీటిలో అత్యధిక కేసులు పశ్చిమ బెంగాల్ నుంచి నమోదు అయ్యాయి. రెండవ స్థానంలో రాజస్థాన్, మూడవ స్థానంలో గుజరాత్ రాష్ట్రాలున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)