‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?

  • 5 మార్చి 2018
మోదీ, కేసీఆర్ Image copyright NArendraModi/KCR/FACEBOOK

'దిల్లీ పెత్తనమేంది?' అని ప్రశ్నిస్తూ.. 'ఫెడరల్ ఫ్రంట్'తో దేశానికి దిశానిర్దేశం చేయటానికి సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అప్రతిహతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రకటన ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ, అటు జాతీయ స్థాయిలోనూ ’మూడో కూటమి’ చర్చకు మరోసారి తెరలేపింది.

తాజాగా వెలువడిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం.. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 19 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా కానీ, మిత్రపక్షాల మద్దతు కానీ అధికారంలో ఉంది. ముఖ్యంగా త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పలికి బీజేపీ విజయ పతాకం ఎగురవేయటం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

ప్రస్తుతం.. దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు తీరంలోని ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు మాత్రమే బీజేపీ హవాను అడ్డుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నా కూడా టీడీపీ - బీజేపీల మధ్య దూరం బాగా పెరుగుతోంది.

తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా, దిల్లీల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంటే.. కర్ణాటక, పంజాబ్, మిజోరం రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో మిగిలాయి. ఇక రానున్న ఎన్నికల్లో కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశాలను సొంతం చేసుకోవటం మీద బీజేపీ దృష్టి కేంద్రీకరించింది.

'బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందని చాటుతోంది'

ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను విమర్శిస్తూ 'ఫెడరల్ ఫ్రంట్' ఏర్పాటుపై ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

''ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన ఆసక్తికరమైనది. ఇది భారతదేశపు వైవిధ్యాన్ని బహుళత్వాన్ని చూపుతోంది. దేశంలో ఎదురు లేకుండా దూసుకెళుతోందనుకుంటున్న బీజేపీకి ప్రత్యర్థులు, ప్రత్యామ్నాయ శక్తులు ఉన్నాయని చాటుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రాల హక్కులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు మోదీకి లోబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం తమ రాష్ట్ర హక్కుల గురించి బలంగా గళం విప్పుతుండటం.. అదే సమయంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనలు చేయటం కీలక పరిణామాలు. దక్షిణాదిలో బీజేపీకి ఎదురు గాలి ఉంటుందని ఇవి చెప్తున్నాయి'' అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి బీబీసీతో పేర్కొన్నారు.

''వామపక్షాలకు చెందని ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం ఇదే ప్రథమం. దేశంలో అలాంటి శూన్యత ఉంది. కానీ నాడు ఎన్‌టీఆర్ చేసినట్లు అన్ని పార్టీలను ఆహ్వానించి మాట్లాడటం, ఐక్యత సాధించటంలో కేసీఆర్ ఎంతవరకూ సఫలమవుతారనేది చూడాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే.. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఒక మీడియా సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం మీద తనకు ఆసక్తి లేదని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఈ రెండు నెలల్లో ఆయన వైఖరి మారటం వెనుక ఉన్న అంశాలేమిటనేది ఆలోచించాల్సి ఉందన్నారు. ''మోదీ తనకు ప్రాణమిత్రుడు అని, ఆయనను తాను విమర్శించలేదని ముందు రోజు ఆయనే అన్నారు. ఇప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు'' అని రవి పేర్కొన్నారు.

Image copyright Telangana CMO/Facebook

వ్యతిరేకతను దారి మళ్లించే వ్యూహమా?

మరోవైపు.. రాష్ట్రంలో అధికార పార్టీ మీద వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దారిమళ్లింటానికి కేసీఆర్ 'జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర' అంశాన్ని ముందుకు తెచ్చారని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెర లేపారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మోదీ సర్కారు నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలకు మద్దతిచ్చిన సీఎం.. ఇప్పుడు కేంద్రం చేసిందేమీ లేదని చెప్పడమేంటని ప్రశ్నించారు. డిసెంబరులోనే పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు అందడంతోనే కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విమర్ళలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇంకోవైపు.. ''దేశంలో లౌకిక శక్తులు కాంగ్రె‌స్ వైపు రాకుండా చూసేందుకే ఈ మూడో ఫ్రంట్‌ నాటకం. లౌకిక పార్టీలన్నీ ఒక చోట చేరకుండా చేసి మూడో ప్రత్యామ్నాయం పేరుతో అంతిమంగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చే కుట్రే ఇది'' అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ విజయాలను చూసి తట్టుకోలేక కూటమి ఏర్పాటు చేస్తానని, అవకాశం వస్తే నాయకత్వం వహిస్తానని కేసీఆర్‌ బీరాలు పలుకుతున్నారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

Image copyright Telangana CMO/Facebook

కేటీఆర్‌కు పగ్గాలు అప్పగించే వ్యూహమా?

అయితే.. ''కేసీఆర్ స్థానిక రాజకీయాల నుంచి గట్టెక్కటానికి, ప్రజల దృష్టి మళ్లించటానికి ఇలా మాట్లాడుతున్నారనటం సరికాదు. రాష్ట్ర రాజకీయాలు వేరు.. జాతీయ రాజకీయాలు వేరు'' అని తెలకపల్లి రవి పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. జాతీయ స్థాయిలో ఇప్పుడు మోదీకి దీటైన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని.. ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న ఆలోచన సరైనదేనని టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం బలంగా సమర్థిస్తోంటే.. మరో వర్గం వాదన మాత్రం ఇంకోలా ఉంది. కేసీఆర్ తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించటానికి మార్గం సుగమం చేసుకోవటంలో భాగంగానే ఈ వ్యూహం తెరపైకి తెచ్చారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని టీఆర్ఎస్ నాయకుడొకరు పేర్కొన్నారు.

కేసీఆర్‌ 'ఫ్రంట్'తో కలిసి వచ్చేది ఎవరు?

కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్' ఆలోచనకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. ఆమె ఆదివారం తనకు ఫోన్‌ చేసి.. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందన్న వాదనకు సంఘీభావం ప్రకటించారని.. 'మేమే మీతో ఏకీభవిస్తున్నాం. మీతో కలిసి ఉంటాం’ అని ఆమె చెప్పినట్లు కేసీఆర్ స్వయంగా తెలిపారు.

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ కూడా ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. మరికొందరు ఎంపీలు, ఇతర పార్టీల నాయకులు కూడా తనను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలు కూడా కేసీఆర్ ప్రయత్నాలను ఆహ్వానిస్తూ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్‌తో కలిసి రాగల రాజకీయ శక్తుల గురించి అంచనా వేస్తూ.. ''ప్రాంతీయ పార్టీలు రాజకీయ విధానాల కన్నా సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాయి. రాంవిలాస్‌పాశ్వాన్ యూపీఏలో ఉంటారు. ఎన్‌డీఏలో ఉంటారు. 2009లో మహాకూటమితో కలిసి పోటీ చేసిన కేసీఆర్ ఎన్నికల తర్వాత ఎన్‌డీఏలో ప్రత్యక్షమయ్యారు. కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది'' అని తెలకపల్లి రవి వ్యాఖ్యానించారు.

Image copyright Telangana CMO/Facebook

‘‘దేశ్ కీ నేత’ అంత సులభం కాదు’’

ఇప్పుడు కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గతంలో చంద్రబాబు మూడో ఫ్రంట్ అన్నప్పుడు కూడా ముందుకొచ్చి తర్వాత వెనుకకు వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు.

''డీఎంకే నాయకుడు స్టాలిన్‌తో కేసీఆర్ మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు. ఒకరిద్దరు ఇతర పార్టీల నాయకులు కేసీఆర్‌కు మద్దతు తెలుపవచ్చు. కానీ కేసీఆర్ 'దేశ్ కీ నేత' అనే పరిస్థితి ఇప్పుడే లేదు. అది అంత సులభం కాదు'' అని రవి తెలిపారు.

''కాంగ్రెస్, బీజేపీలను కేసీఆర్ విమర్శించటం మంచిదే. కాంగ్రెస్‌కు నిలకడ లేదు. బీజేపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. అవి రెండూ విఫలమయ్యాయన్నది సరైన అంచనానే. కానీ కుహనా ప్రాంతీయ లౌకిక పార్టీలు గట్టిగా నిలబడవు. సూత్రబద్ధమైన నిబద్ధత లేని పార్టీలివి. నూతన సరళీకరణ విధానాలను కానీ, మతతత్వ విధానాలను కానీ బలంగా వ్యతిరేకించవు. లౌకికత్వం మీద గట్టిగా నిలబడతారన్న గ్యారెంటీ లేదు'' అని సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.మధు స్పందించారు.

కేసీఆర్ ప్రకటనపై టీడీపీ, వైసీపీల వైఖరి ఏమిటి?

కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్' ప్రకటన విషయంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక పార్టీలైన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల నుంచి అధికారికంగా ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు దశాబ్దాల కిందటే థర్డ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఆయనకు ముందు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు కూడా నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో మూలస్తంభంగా నిలిచారు.

అదే టీడీపీ ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ భాగస్వామిగా కొనసాగుతోంది. రాష్ట్రానికి హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటంలో నిమగ్నమైంది. ఈ విషయంలో బీజేపీ - టీడీపీల మధ్య దూరం కూడా పెరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని రాజకీయ వ్యూహం రచించాలన్న చర్చ టీడీపీలో అంతర్గతంగా కొంత కాలంగా కొనసాగుతోంది. జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మరోసారి ఆ పాత్ర పోషించాలన్న వాదన కూడా పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.

అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. విభజన హామీల అమలు విషయంలో టీడీపీ ఒత్తిడికి మోదీ సర్కారు ప్రతిస్పందన ఆధారంగా చంద్రబాబు వ్యూహం రచిస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జాతీయ రాజకీయాలు, కేసీఆర్ మూడో ఫ్రంట్ సాధ్యాసాధ్యాలపై వెంటనే స్పందించలేమని చెప్తోంది.

Image copyright Telangana CMO/Facebook

మూడో కూటమి సాధ్యాసాధ్యాలేమిటి?

''విధానాల పరంగా కేసీఆర్ విమర్శలు చేయటం లేదు. మతతత్వం, అసహనం గురించి ప్రస్తావించలేదు. ప్రత్యామ్నాయ విధానాలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం?'' అని తెలకపల్లి రవి వ్యాఖ్యానించారు.

''దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలు మూడు సార్లు ఏర్పడ్డాయి. ఆ మూడు సార్లూ వామపక్షాల చొరవ, మద్దతు కీలకంగా ఉన్నాయి. వామపక్షాల్లో ముఖ్యమైన సీపీఎం.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడలేం అనే అభిప్రాయానికి వచ్చింది'' అని ఆయన పేర్కొన్నారు.

''థర్డ్ ఫ్రంట్ ప్రయోగాలు ఇంతకుముందు కూడా జరిగాయి. బిహార్‌లో 'మహాఘట్‌బంధన్' జరిగింది. ఏమయింది?'' అని సీపీఎం నాయకుడు మధు వ్యాఖ్యానించారు.

‘‘ప్రాంతీయ పార్టీలు కలిసి ఎదుర్కోవాలనటం పాజిటివ్ పాయింట్’’

''సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలన్న ఆకాంక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవటమన్నది కేసీఆర్ ప్రకటనలో సానుకూల అంశం. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ ప్రయత్నాలు విజయం సాధించవు. ఒకవేళ గెలిచినా లక్ష్యం నెరవేరదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘గతంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి మేం (వామపక్షాలు) మద్దతిచ్చాం. యూపీఏకి వెలుపలి నుంచి మద్దతిచ్చాం. కానీ లక్ష్యం నెరవేరలేదు. ఎందుకంటే.. నాడు మేం నూతన సరళీకరణ విధానాలను, మతతత్వాన్ని సమానంగా వ్యతిరేకించలేదు. అందువల్ల భారత రాజకీయాల్లో మేం ఎక్కువగా దెబ్బతిన్నాం'' అని పేర్కొన్నారు.

''ఈ రెండు అంశాలపై సూత్రబద్ధమైన వైఖరి లేని మూడో ఫ్రంట్ నిలబడదు. వామపక్ష ప్రజాస్వామ్య కూటమి మాత్రమే నూతన సరళీకరణ విధానాలను, మతతత్వాన్ని గట్టిగా వ్యతిరేకించగలదు'' అని మధు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)