రైల్వే ట్రాక్ పక్కన.. బురద గుంటలో.. చావుబతుకుల మధ్య యువతి.. కాపాడిన రైల్వే సిబ్బంది
నడుస్తున్న రైలు నుంచి ట్రాక్ పక్కన బురదగుంటలో పడిపోయి స్పృహతప్పిన యువతిని 12 గంటల తర్వాత రైల్వే సిబ్బంది గుర్తించి రక్షించారు.
గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ రాంపురానికి చెందిన జయంతి రాజేశ్వరి (21) బీఈడీ చదువుతోంది.
గురువారం ఉదయం భీమవరం నుండి విజయవాడకు వచ్చింది. విజయవాడ నుండి గురువారం సాయంత్రం భీమవరం వెళ్ళాటానికి పూరి - తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కింది.
అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆకివీడు - గుమ్మలూరు మద్యలో ఉన్న రైల్వే గేటు సమీపంలో ట్రాక్ పక్కనే ఉన్న బురద గుంటలోపడిపోయింది.
అలా పడటం వల్ల జయంతి రాజేశ్వరి తలకి దెబ్బతగలటంతో సృహతప్పిపోయింది.
రాత్రి సమయం కావడంతో అటువైపు జనసంచారం లేదు. దీంతో ఎవరూ గమనించలేదు.
శుక్రవారం ఉదయం బురద గుంటలో పూర్తి కూరుకుపోయి అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్వరిని రైల్వే గేట్ మెన్ గుర్తించారు. వెంటనే రైల్వే అధికారులకి స్దానిక పోలీసులకి సమాచారం ఇచ్చారు. కార్మికుల సహాయంతో రాజేశ్వరిని బురదలో నుండి బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు.
రాజేశ్వరి అపస్మారక స్థితిలో ఉండటంతో.. ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక మరేదైనా జరిగి ఉండవచ్చా అనే వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
రిపోర్టింగ్: శివరాజ్, బీబీసీ కోసం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)