జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామా

  • 13 ఏప్రిల్ 2018
చంద్రప్రకాశ్ గంగా Image copyright MOHIT KANDHARI/BBC

జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇద్దరు మంత్రులు శుక్రవారం సాయంత్రం రాజీనామా చేయడంతో కఠువా అత్యాచారం/హత్య తర్వాత తలెత్తిన పరిణామాలు మరో మలుపు తీసుకున్నాయి.

చౌధరి లాల్ సింగ్, చందర్ ప్రకాశ్ గంగా - ఈ ఇద్దరు మంత్రులూ తమ రాజీనామాల్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ శర్మాకు అందజేశారని రాష్ట్ర బీజేపీ నేత ఒకరు బీబీసీకి తెలిపారు.

ఈ విషయాన్ని సీనియర్ పార్టీ ప్రతినిధి బ్రిగేడియర్ అనిల్ గుప్తా ధ్రువీకరిస్తూ, "ఇద్దరు కేబినెట్ మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు" అని తెలిపారు.

పార్టీకి విశ్వసనీయమైన సైనికులుగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారనీ, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ పార్టీ ఇమేజ్‌కు నష్టం చేస్తున్నారని గుప్తా చెప్పారు.

రేపు పార్టీ సమావేశం జరుగుతుందనీ, అందులో తదుపరి కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కౌల్ బీబీసీతో చెప్పారు.

కాగా, శనివారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జమ్మూకు రావొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని ఆయన అంచనా వేస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.

శనివారం జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలూ, మంత్రులు అందరూ హాజరవుతారని అనిల్ గుప్తా చెప్పారు.

మరోవైపు కఠువాలో మైనర్ బాలిక రేప్, హత్య కేసు కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు పీడీపీ కూడా సమావేశం నిర్వహించనుంది. పీడీపీ మంత్రులూ, ఎమ్మెల్యేలు అందరూ శ్రీనగర్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్దేశించారు.

Image copyright MOHIT KANDHARI/BBC
చిత్రం శీర్షిక రేప్ నిందితులకు మద్దతుగా జాతీయ జెండాలతో ప్రదర్శన

మూడు నెలల క్రితం జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల పాపను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసిన ఘటనతో కశ్మీర్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో కొందరు పోలీసు ఉద్యోగులు కూడా ఉన్నారు.

అయితే నిందితులకు మద్దతుగా బీజేపీ, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. వారికి ఇద్దరు బీజేపీ మంత్రులు నాయకత్వం వహించారు.

పరిశ్రమల మంత్రి చంద్రప్రకాశ్ గంగా, అటవీశాఖ మంత్రి లాల్‌సింగ్ - వీరిద్దరూ 'హిందూ ఏక్తా మంచ్' అనే బ్యానర్ కింద నిందితులను విడుదల చేయాలంటూ ఊరేగింపు తీశారు.

ఈ ర్యాలీలో వారు జాతీయ జెండాలను కూడా చేతిలో పట్టుకున్నారు. రేప్ కేసులో నిందితులకు మద్దతుగా వారిలా వీధుల్లోకి రావడం బాగా వివాదాస్పదమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)