అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- తేజల్ కనిత్కర్
- టీఐఎస్ఎస్ ప్రొఫెసర్

ఫొటో సోర్స్, Getty Images
భారత రిజర్వు బ్యాంక్ సెంట్రల్ బోర్డులో పార్ట్ టైమ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఎస్. గురుమూర్తి 2018 ఆగస్టు 17న చేసిన ఓ ట్వీటు వివాదాస్పదమైంది.
‘శబరిమలలో జరుగుతున్నదానికి, ఆ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అని సుప్రీం కోర్టు జడ్జిలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారేమో. ఆ రెంటి మధ్య సంబంధం ఉండటానికి లక్షలో ఒక వంతు అవకాశం ఉన్నా, ఆ కేసులో తీర్పు అయ్యప్ప స్వామికి వ్యతిరేకంగా రావాలని ఒక్కరు కూడా కోరుకోరు.’ ఇదీ గురుమూర్తి చేసిన ట్వీట్ సారాంశం. సోషల్ మీడియాలో దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన దీనిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో సైన్సు, రాజ్యాంగం ప్రసాదించే హక్కుల కంటే మతాలు, మతపరమైన రాతలే బలమైనవని చెప్పేందుకు కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలకు ఈ ట్వీట్ ఒక ఉదాహరణ.
భారత రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయ దృక్పథం, మానవత్వాన్ని పెంపొందించుకోవడం, విచారించే తత్వాన్ని అలవర్చుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. కానీ దేశంలోని ప్రముఖ వ్యక్తులు తమ మాటలు, చర్యల ద్వారా ఈ సూత్రానికి తూట్లు పొడవడం దురదృష్టకరం. ఈ పంథా దేశ అభివృద్ధికి కూడా చాలా నష్టం చేకూరుస్తుంది.
శాస్త్రీయ దృక్పథం అంటే అదేదో సైన్స్ లేబొరేటరీలో చేసే ప్రయోగం కాదు. శాస్త్రీయ దృక్పథం ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉంటుంది. సమాజంలో అన్ని రంగాల అభివృద్ధిలో సైన్సు ప్రాధాన్యాన్ని గుర్తించడం ఒకటి. ఆధునిక సామాజిక విలువల అభివృద్ధి కోసం ప్రజా జీవితంలో సైన్సును భాగం చేయడం రెండోది.
ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో సైన్స్, టెక్నాలజీది తిరుగులేని పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయుర్దాయాన్ని పెంచడంతో పాటు వెట్టి చాకిరీ, హీనమైన వృత్తులను నిర్మూలించడం, విశ్వానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వరకు సైన్స్ సమాజాన్ని ఎన్నో అడుగులు ముందుకు తీసుకెళ్లింది.
సమాజాభివృద్ధిలో సైన్సు పాత్రను కొందరు తక్కువ చేసేందుకు ప్రయత్నించినా, మానవజాతిని ముందుకు నడపడంలో అది పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. మరోపక్క సైన్సు, టెక్నాలజీల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి అనువైన ఆధునిక చట్టాలు, విలువలను కూడా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రాచీన చట్టాలతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజం మనుగడ సాగించలేదు. అలాంటి చట్టాలు ఎప్పటికీ అభివృద్ధికి బంధనాల్లానే ఉంటాయి. ఉదాహరణకు సమాజంలో విచారించే తత్వం పెరిగే కొద్దీ లింగ వివక్ష, కుల వివక్ష లాంటి వాటిని ధర్మ శాస్త్రాలకు ముడిపెట్టి సమర్థించడం తగ్గిపోతుంది. అందుకే శాస్త్రీయ దృక్పథం అనేది సమానత్వం, హక్కులు, న్యాయం, మానవతావాదం లాంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది.
శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడం ప్రభుత్వ ప్రధాన్య బాధ్యతల్లో ఒకటిగా ఉండాలి. దానికి చాలా మార్గాలున్నాయి. మొదట ప్రాథమిక, ఉన్నత విద్యావ్యవస్థలను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండేలా చూడాలి. సృష్టిలోని అన్ని అం ను శాస్త్రీయ దృక్పథంతో చూసేందుకు ఆ విద్య ప్రేరేపించాలి.
ఫొటో సోర్స్, Getty Images
ప్రజల్లో విచారించే తత్వం, తర్కంతో ఆలోచించే గుణాలను పెంపొందించేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. ఉదాహరణకు లైంగిక ఆరోగ్యంపై అవగాహన, కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం, ఆధునిక సమానత్వ, సౌభ్రాతృత్వ విలువలను ప్రచారం చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ మనం వాటికి పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తున్నామనే విషయాన్ని ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం లాంటి కొన్ని అంశాలు ఇప్పటికీ పెద్ద సమస్యలుగానే కొనసాగుతున్నాయి. మరోపక్క సైన్స్, శాస్త్రీయ దృక్పథంపైన దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్యకు కేటాయించిన నిధులను వెనక్కుతీసుకోవడం, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవాళ్లు చేస్తున్న తిరోగమన వ్యాఖ్యలు అందులో భాగమే. ఇలాంటివి కొన్ని వర్గాలకు తాత్కాలిక ప్రయోజనాలు చేకూర్చొచ్చు. కానీ దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి ఇవి భారీ విఘాతాన్ని కలిగిస్తాయి.
(రచయిత్రి టాటా ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)