రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం... హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి

  • 11 డిసెంబర్ 2018
రాహుల్ గాంధీ Image copyright Getty Images

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తుండగా, రాజస్థాన్‌లో బొటాబొటీ మెజారిటీ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అది బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.

ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కాంగ్రెస్ స్పష్టమైన ఓటమి దిశగా కదులుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి పాలైంది.

'కాంగ్రెస్ ముక్త్ భారత్' అన్న నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.

ఫలితాలు ఇంకా పూర్తిగా స్పష్టం కానప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఇవి కాస్త భిన్నంగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఢంకా

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీగా ఉండొచ్చనీ లేదా బీజేపీకి స్వల్ప ఆధిక్యమే రావొచ్చనీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఎన్నికల విశ్లేషకులు, ప్రముఖ పాత్రికేయులు కూడా దాదాపు ఇలాంటి అంచనాలే వేశారు.

దీనికి ముఖ్య కారణం ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ బలమైన పోటీదారుగా ఎవరికీ కనిపించకపోవడమే.

2000 నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఛత్తీస్‌గఢ్‌లో తొలి ఎన్నికలు 2003లో జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రమన్ సింగ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.

అప్పటికీ పదేళ్లు (మధ్యప్రదేశ్‌లో భాగంగా ఉన్న కాలంతో కలిపి లెక్కిస్తే) కాంగ్రెస్ పాలించి ఉండటం వల్ల ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే బీజేపీ విజయం సాధించినట్టు చాలా మంది భావించారు.

ఆ తర్వాత 2008, 2013 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా వరుసగా గెలుపు సాధించిన రమన్ సింగ్ 2018 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు.

కాంగ్రెస్ నాయకత్వంలో లుకలుకలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి గ్రూపు స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రతి ఎన్నికల్లోనూ పోటీ కార్యకలాపాలు నిర్వహించింది. అది కాంగ్రెస్‌కు చాలా నష్టమే చేసింది. చివరకు, 2016లో తనను రాజ్యసభకు నామినేట్ చేయకపోవడంతో అలిగిన జోగీ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

దీన్ని కాంగ్రెస్ ఓ సానుకూల పరిణామంగానే చూసింది. "ఆయనను పార్టీ లోంచి బహిష్కరించే శ్రమ తప్పింది మాకు. ఆయనే వెళ్లిపోయి కాంగ్రెస్‌కు మేలు చేశారు" అని పార్టీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అమిత్ జోగీని కాంగ్రెస్‌లోంచి బహిష్కరించారు.

దాంతో ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్ (జోగీ) పేరుతో అజిత్ జోగీ ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో ఆయన బీఎస్‌పీతో పొత్తు పెట్టుకొని పోటీకి దిగగా, ఆయన బీజేపీ బీ టీంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.

మరోవైపు రమన్ సింగ్ ప్రభుత్వంపై పౌరసరఫరాల కుంభకోణం వంటి కొన్ని అవినీతి ఆరోపణలు, ఆదివాసీ ప్రాంతాల్లో మానవహక్కుల ఉల్లంఘనలు వంటివి వచ్చినప్పటికీ, వ్యక్తిగతంగా పార్టీలో ఆయన నాయకత్వానికి మాత్రం దాదాపు ఎదురు లేకుండానే ఈ పదిహేనేళ్లు గడిచాయని చెప్పొచ్చు.

ఇక, 2013లో నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ తన కీలక నాయకత్వాన్ని కోల్పోవడం, జోగి వ్యవహారం వంటి వాటితో కాంగ్రెస్ నాయకత్వం బాగా బలహీనపడింది.

అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ నాయకత్వ లోపం దాన్ని ఏదో రూపంలో వేధించకతప్పదు. మొదట్లో వెనుకంజలో ఉన్నట్టు కనిపించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ తాజా ట్రెండ్స్ ప్రకారం పోటీలో ముందంజలోనే ఉన్నారు.

అయితే అసలు పరీక్ష ఆయన ఇంకా ఎదుర్కోవాల్సే ఉంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి పదవి కోసం తామ్రధ్వజ్ సాహూ, టీఎస్ సింగ్‌దేవ్‌లతో ఆయన పోటీ పడాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

మొత్తానికి ఛత్తీస్‌గఢ్‌లో సాధించిన విజయం కాంగ్రెస్‌లో స్ఫూర్తి నింపినప్పటికీ, బలమైన నాయకుడెవరూ లేకపోవడమనే అంశం రానున్న రోజుల్లో దాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది.

Image copyright Getty Images

రాజస్థాన్‌లో బొటాబొటి మెజారిటీ దిశగా కాంగ్రెస్

ప్రభుత్వ వ్యతిరేకత, వసుంధర రాజే ఒంటెత్తు పోకడలు, రాహుల్ రైతులకు ఇచ్చిన హామీలు... అన్నింటికీ మించి గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్లకొకసారి అధికార పార్టీని గద్దె దించే ఆనవాయితీ ఉన్న ఓటర్లు... రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇవే ప్రధాన కారణాలని చెప్పొచ్చు.

రాజస్థాన్‌లో మొదటి నుంచీ బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజే అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అనుకున్నంతగా సాధ్యం కాలేదు.

ముఖ్యంగా రైతులు వసుంధర రాజే పాలనలో తీవ్రంగా విసిగిపోయారు. ఓ వైపు కరవు, మరోవైపు పండిన పంటకు సరైనగిట్టుబాటు ధరలు లభించక ఎన్నో సార్లు రోడ్డెక్కారు. ఆందోళనలు నిర్వహించారు. వారి డిమాండ్లను నెరవేర్చడం మాట అంటుంచి రైతు నాయకుల్ని జైల్లో పెట్టడటం వారికి మరింత ఆగ్రహం కల్గించింది.

ఎప్పుడూ బీజేపీకి అండగా ఉండే హిందూ ఓటు బ్యాంకు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లినట్టు తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇక బీజేపీకి మద్దతు పలికే రాజపుత్రులు కూడా వేర్వేరు కారణాలతో ఈసారి బీజేపీకి దూరంగానే ఉన్నారు.

ఇక 2013 ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం బీజేపీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది. అయితే గడచిన ఐదేళ్ల పాలనలో ఆ విషయంలో వసుంధర ప్రభుత్వం పెద్దగా సాధించిందేం లేదంటూ కాంగ్రెస్ ప్రజల్లో ప్రచారం చేసింది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, ముఖ్యమంత్రి పదవి విషయంలో సీనియర్ నేత అశోక్ గెహ్లోట్, యువనేత సచిన్ పైలట్‌ల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఇద్దరి కృషి ఫలించినట్టే అని చెప్పొచ్చు.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన గెహ్లోట్ తన అనుభవాన్నంతా రంగరించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారని ఆ పార్టీ వర్గాల అంచనా.

ఇక యువతను ఆకర్షించడంలో సచిన్ పైలట్ విజయం సాధించారన్న సంగతి ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.

తాము అధికారంలోకి వస్తే రైతుల రుణ మాఫీ చేస్తామన్న రాహుల్ హామీ ఆ పార్టీకి ఓట్లను కురిపించడంలో సాయపడిందనే చెప్పాలి.

అయితే, ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీని మాత్రమే సాధించబోతోందని తెలుస్తోంది.

బీజేపీకి దారుణ పరాభవమేమీ ఎదురు కావడం లేదు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చిన 21 స్థానాలతో పోల్చితే బీజేపీ ఇప్పుడు సాధిస్తున్న సీట్లు ఆ పార్టీకి ఊరటనిచ్చేవే.

Image copyright AFP

మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా?

మధ్యప్రదేశ్‌లో గత పదిహేనేళ్లుగా శివరాజ్ సింగ్ నాయకత్వంలో సాగిన బీజేపీ పాలనకు తెరపడుతుందా, లేదా అన్న అంశంపై ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది.

ఈ ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పోటీ నువ్వా, నేనా అన్న రీతిలో జరుగుతున్నది ఒక్క మధ్యప్రదేశ్‌లోనే.

ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలు దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని చెప్పొచ్చు.

ఊహించినట్టుగానే కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని మాత్రం సాధించలేకపోతోందని ట్రెండ్స్ చెబుతున్నాయి.

పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అయినా బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ ఎందుకింత కష్టపడాల్సి వచ్చిందని ప్రశ్నించుకుంటే, మళ్లీ నాయకత్వ బలహీనతే కారణమని చెప్పక తప్పదు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గుర్తింపు పొందిన నాయకత్వం లేకపోవడం బలహీనత కాగా, మధ్యప్రదేశ్‌లో గుర్తింపు పొందిన నాయకులు చాలా మంది ఉండటం సమస్య.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్ నాథ్, ప్రచార కమిటీ చీఫ్ జ్యోతిరాదిత్య సింధియా... ఇద్దరూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టుగా భావిస్తున్నారు. తగిన సమయం వచ్చాక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ప్రకటించింది.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారడానికి ఈ ఫలితాలు ఓ సంకేతం అని జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో అన్నారు.

ప్రముఖ విశ్లేషకుడు డా. పెంటపాటి పుల్లారావు దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ అగ్ర నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, వారికి క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు లేకపోవడం కూడా ఆ పార్టీ బలమైన శక్తిగా ముందుకు రాకపోవడానికి కారణం" అని అన్నారు.

ఇక శివరాజ్ సింగ్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత అంత బలంగా వ్యక్తం కాలేదని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఈ అంశంపై మాట్లాడుతూ, "శివరాజ్ సింగ్ సుపరిపాలన పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉంది. అట్లాగే ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడని పేరు. ఎవరితో ఘర్షణలకు దిగని స్వభావం వంటివి కూడా ఆయనకు కలిసొచ్చిన అంశాలు" అని పుల్లారావు తెలిపారు.

శివరాజ్ సింగ్ ప్రభుత్వ ఓటమికి మోదీ ప్రభుత్వ విధానాలు కూడా కారణమని ఆయన అన్నారు. డీమానిటైజేషన్, జీఎస్‌టీ వంటి అంశాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా మారిందన్నది ఆయన అభిప్రాయం.

ఈశాన్యంలో కాంగ్రెస్ పట్టుజారిన చివరి కోట

ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క మిజోరంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇప్పుడు ఇక అది కూడా లేనట్టే.

మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) స్పష్టమైన మెజారిటీ సాధించింది. జోరమ్ థంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

నిజానికి 1987లో ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది.

గడచిన పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 74 ఏళ్ల ముఖ్యమంత్రి లల్ థన్వాలకి కూడా ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పలేదు.

ఆయన సెర్చిప్, దక్షిణ ఛాంఫై.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పొచ్చు. అక్షరాస్యత విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానంలో ఉన్న మిజోరంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.

ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి కూడా అంతంత మాత్రమే. మౌలిక సౌకర్యాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. హోంమంత్రి, స్పీకర్ సహా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చెయ్యడంతో ఒకానొక సమయంలో ఆ పార్టీ బలం 34 నుంచి 29 స్థానాలకు పడిపోయింది.

మొత్తంగా నిరుద్యోగం, అంతంత మాత్రంగా వ్యవసాయాభివృద్ధి, పేదరికం సహా అనేక కారణాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయని చెప్పొచ్చు.

ఈ ప్రాంతంలో బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఫలితంగా ప్రధాన పోటీ కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్‌ల మధ్యే సాగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)