రైతు దినోత్సవం: కౌలు రైతుల కడగండ్లు తీరేదెన్నడు
- శంకర్
- బీబీసీ కోసం

ఆరుగాలం కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే ధీమా లేదు. అయినా రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి సాగుతున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతున్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి.
వ్యవసాయం పెను భారంగా మారుతోందని ఇప్పటికే ఏపీలో అనేకమంది సొంత కమతాలను, కౌలుదారుల చేతుల్లో పెట్టారు. వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని వ్యవసాయ పరిశోధకుడు, రైతుల కోసం పనిచేస్తున్న సంస్థ 'సేవ' వ్యవస్థాపకుడు కిరణ్ రావు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో భూ యజమానుల స్థానంలో ఇప్పుడు దాదాపుగా కౌలుదారులే కమతాల నిర్వహణ చేస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కౌలు రైతులకు కష్టాలు రెట్టింపవుతున్నాయని చెప్పారు.
ఓవైపు బ్యాంకుల నుంచి రుణసహయం కౌలుదారులకు దక్కడం కనా కష్టంగా ఉందని కిరణ్ రావు వివరించారు. ప్రైవేటు అప్పులపై ఆధారపడిన కౌలుదారుల సంఖ్య 87 శాతానికి పైగా ఉందని తమ పరిశీలనలో స్పష్టం అయ్యిందని వెల్లడించారు. అయినా కౌలుదారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయం అరకొరగానే ఉందన్నారు.
కౌలుదారుల గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన కనిపిస్తోందని రైతు సంఘం నాయకుడు వై కేశవరావు పేర్కొన్నారు. ఇటీవల వరుసగా వరదలు, తుపాన్లు వెంటాడిన సమయంలో అత్యధికంగా నష్టాలు పాలయ్యింది కౌలు రైతులేనని ఆయన తెలిపారు. అయినా నష్టపరిహారం మాత్రం రికార్డుల ప్రకారం భూ యజమానులకు చేరుతుందన్నారు. కౌలుదారుల పేర్లు నమోదు చేయడానికి, నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు.
భూ యజమాని అంగీకరిస్తేనే కౌలుదారుల గుర్తింపు కార్డు జారీ చేస్తున్నారు.
పంట నష్టం పరిశీలిస్తున్న అధికారులు
క్షేత్రస్థాయిలో కౌలుదారులకు గుర్తింపు కార్డు అందని ద్రాక్ష పండుగా మారిందన్నది రైతునేతల మాట.
ఇటీవల అక్టోబరులో అకాల వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. వాగులు,నదులు పొంగి పంట నీట మునిగింది. ఖరీఫ్ ఆరంభంలోనే భారీ నష్టాలు సంభవించాయి. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు 20 వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పరిహారం చెల్లింపు ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు.
ఖరీఫ్ కష్టాలు మరచిపోయి రబీ సాగుకు సిద్ధమైనప్పటికీ తమకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం నేటికీ అందలేదని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన రైతు కూచిపూడి వెంకటేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
అధికారుల చుట్టూ తిరిగినా అదిగో ఇదిగో అంటున్నారని ఆయన వాపోయారు.
తాజాగా పెథాయ్ తుఫాన్ ప్రభావం కూడా రైతులపై పడింది. ముఖ్యంగా డిసెంబర్ మధ్యలో వచ్చిన తుపాను కావడంతో వరి రైతులకు కొంత ఊరటగా కనిపిస్తోంది. అయినా మెట్ట మండలాల్లో పెను నష్టం తప్పలేదని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి.
కోనసీమ రైతులకు నారుమళ్లు నష్టం తప్పలేదని అంటున్నారు. ఇక ఉద్యాన పంటలకు మాత్రం పెను నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల తాకిడితో అరటి వాలిపోయింది. ఇతర పంటలకు కూడా నష్టం సంభవించింది.
ఈసారి నష్టపరిహారం లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ సహాయంతో చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సైక్లోన్ యాప్ పేరుతో రైతు పొలాల్లో నష్టానికి సంబంధించిన ఫొటోలు, రైతు వివరాలు అన్నీ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.
వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీఈవో చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండడంతో ఈ ఆన్ లైన్ ప్రక్రియ సులభంగా పూర్తయిందని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్వీ ప్రసాద్ బీబీసీకి తెలిపారు. ఇంకా నష్టపోయిన రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కానిపక్షంలో స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. వరి, మొక్కజొన్న, మినుముతోపాటుగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బాధిత రైతులందరికీ ప్రభుత్వ సహాయం అందిస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ అనే గ్రామానికి చెందిన రైతు ముమ్మిడి రాజబాబు తన కష్టానికి తగిన సహాయం అవసరం అంటున్నారు. తాను ఐదెకరాల్లో అరటి పంట వేస్తే, అందులో మూడు ఎకరాలు నష్టపోయినట్టు వెల్లడించారు. నష్టపరిహారం పంపిణీలో జాప్యం మూలంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి వస్తోందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అదనంగా అధిక వడ్డీ భారం అవుతోందని వాపోయారు.
‘వృద్ధాప్య పింఛనుతో తన అంత్యక్రియలకు అవసరమైనవన్నీ కొన్నాడు’
ఇవి కూడా చదవండి:
- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: గ్రామాలను ముంచేసిన బురద.. ప్రజల్ని ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా, ఉండదా
- ఇండోనేసియాలో భారీ నష్టానికి కారణం ‘మట్టి ప్రవాహం’... అసలేంటిది?
- BBC Ground Report - ఇండోనేసియా సునామీ: 'మా అమ్మ ఏది? ఎక్కడికి వెళ్ళింది?'
- ఇండోనేసియా: సునామీ హెచ్చరిక వ్యవస్థ నమ్మదగినదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)