'ఎగ్జిబిషన్ గ్రౌండ్ అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం' -ఈటల రాజేందర్

  • 31 జనవరి 2019
BBC

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులు గురువారం ఉదయం సొసైటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తరువాత పోలీసులు వారిని చెదరగొట్టారు.

ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతోంది. నష్టపోయిన స్టాల్స్ నిర్వాహకులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారికి ఆర్థిక పరిహారం అందజేస్తామని సొసైటీ అధికారులు చెప్పారు.

బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి ఉంటే నష్టం ఈ స్థాయిలో ఉండేది కాదని, ప్రమాదం రెండు స్టాళ్ళకే పరిమితమై ఉండేదని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు.

ఫైరింజన్ వాల్ విప్పడంలో ఆలస్యమైందని, ట్యాంకుల్లో నీళ్ళు రెండు నిమిషాల్లోనే అయిపోయాయని, నిండుగా ఉంటే కనీసం 20 నిమిషాల వరకు సరిపోయేవని మరికొందరు చెప్పారు.

ఎగ్జిబిషన్ మీడియా కమిటీ కన్వీనర్ రవి యాదవ్, "మేం అన్ని కోణాలనూ విచారిస్తున్నాం. ఫైరింజన్ కోసం డబ్బులు చెల్లించాం" అని అని చెప్పారు.

"ప్రమాద కారణాలపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతున్నారు. సిలెండర్, షార్ట్ సర్క్యూట్... ఇలా చాలా చెబుతున్నారు. క్లూస్ టీం విచారణ జరిపాకే అసలు కారణం తెలుస్తుంది" అని ఆయన అన్నారు.

సిగరెట్టు వల్లే ప్రమాదం జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానంగా, ప్రమాదం ఏ కారణంగా అయినా జరిగి ఉండొచ్చు. కాల్చిపారేసిన సిగరెట్ పీక కూడా కావచ్చని మంత్రిగారు అన్నారని అని వివరణ ఇచ్చారు రవి.

అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్. 79 ఏళ్ల ఎగ్జిబిషన్ చరిత్రలో ఇలాంటి ప్రమాదం జరగలేదని ఆయన అన్నారు.

ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామన్నారాయన. వ్యాపారులు ఎంత ఆశతో వచ్చారో అలాగే వెళ్లేలా చేస్తామని ఆయన అన్నారు. స్టాళ్లన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయన్న ఈటల, ఈరోజు రేపు ఎగ్జిబిషన్ కి సెలవు ప్రకటించారు. ఎగ్జిబిషన్ గడువు పొడిగిస్తామని ప్రకటించారు.

అసలేం జరిగింది...

ఎటు చూసినా బూడిదైన వస్తువులు.. కూలిన దుకాణాలు.. కన్నీటి పర్యంతమవుతున్న వ్యాపారులు.. ఇదీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో పరిస్థితి.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందల దుకాణాలు కాలిపోయాయి.

భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది.

ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

మొత్తం కాలిపోయిన దుకాణాల సంఖ్య, ఆస్తి నష్టం విలువ తేలాల్సి ఉంది.

రాత్రి పూట ప్రమాదం జరగడంతో నష్టంపై సమగ్ర సమాచారం అందలేదు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదు. ఏడుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి కారణాలు ఏవై ఉండవచ్చు...

బుధవారం సాయంత్రం 7.30 నుంచి 8 మధ్య ప్రాంతంలో ఆంధ్రాబ్యాంకు, మహేశ్ కోపరేటివ్ బ్యాంకు, రిజర్వు బ్యాంకుల స్టాళ్లు ఉన్న దగ్గర మంటలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. క్షణాల్లో మంటలు మిగిలిన దుకాణాలకు వ్యాపించాయి. వందలాది దుకాణాలు, వాటిల్లోని విలువైన వస్తువులూ కాలిపోయాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అగ్నిప్రమాదం

ఫైర్ ఇంజిన్లు మూడు గంటలు శ్రమించి రాత్రి 10.30 తరువాత పూర్తి స్థాయిలో మంటలు ఆర్పాయి. అయితే ఎగ్జిబిషన్ సొసైటీ ముందు జాగ్రత్తగా ఉంచిన ఫైర్ ఇంజిన్‌లో నీళ్లు లేవనీ, అదే ప్రాంగణంలో ఉండి కూడా 20 నిమిషాల వరకూ రాలేదని స్థానికులు బీబీసీతో చెప్పారు.

"ఫైరింజన్లో నీళ్లు లేవు. దాన్ని సరిగా ఆపరేట్ చేయలేదు." అని హైదరాబాద్ కి చెందిన సందర్శకుడు సలీం ఖాన్ తెలిపారు.

"షార్ట్ సర్క్యూట్ జరిగింది. మా బట్టల షాపు పూర్తిగా కాలిపోయింది. ఇక్కడ రెండు గేట్ల దగ్గర రెండు ఫైరింజన్లు ఉంటాయి. అవి రావడానికి 20 నిమిషాలు పట్టింది" అని సురేశ్ అనే వ్యాపారి వివరించారు.

వ్యాపారుల కన్నీళ్లు

79వ పారిశ్రామిక ప్రదర్శనలో వందల స్టాల్స్ ఉన్నాయి. స్థానికులతో పాటూ కశ్మీర్, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. చాలా మంది చిన్న మధ్య తరహా వ్యాపారులే ఇక్కడ. కానీ వారి వ్యాపారం బూడిద అయిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. కష్టపడి సంపాయించింది, అరువు తెచ్చింది, అప్పు తెచ్చింది.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోలేదనీ, ఫైర్ ఇంజిన్లు సరిగా పనిచేయలేదనీ ఎక్కువ మంది వ్యాపారులు ఆరోపించారు.

చిత్రం శీర్షిక అగ్ని ప్రమాదంలో బుగ్గి అయిన స్టాల్స్

"మాది గుజరాత్ 50 లక్షల రూపాయలు 5 రూపాయల వడ్డీకి తెచ్చి రెండ షాపులు పెట్టాం. 30 లక్షల రూపాయలు పెట్టిన ఒక షాపు పూర్తిగా తగలబడి పోయింది. ఎలా జరిగిందో కూడా తెలీదు. కడుపు కట్టుకుని డబ్బు పొదుపు చేయడం కోసం ఒక్కపూటే తిన్నాం. ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలాం'' అని చెప్పారు ఒకే కుటుంబానికి చెందిన ఉష, కంచన్.

"నేను కశ్మీర్ నుంచి వచ్చాను. పదేళ్ల నుంచి వస్తున్నాను. ఇక్కడ కనీస జాగ్రత్త చర్యలు లేవు. మొన్న వాన వస్తే షాపుల్లోకి నీరు వచ్చింది. ఇప్పుడు మొత్త కాలిపోయింది. ఇక్కడ 400 నుంచి 500 మంది కశ్మీరీ వ్యాపారులు ఉన్నారు. డ్రై ఫ్రూట్స్, బట్టల స్టాల్స్ పెట్టాం. నష్టం కోట్లలో ఉంటుంది. ఇంకా ఏం చెప్పలేం. ప్రాణాలు మాత్రం దక్కించుకుని బయట పడ్డాం" అన్నారు గులాం నబీ.

సంఘటన జరిగిన స్థలాన్ని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి సహకారం అందిస్తామని అన్నారు మహమూద్ అలీ.

మొత్తం కాలిన దుకాణాలు 120 నుంచి 150 మధ్యలో ఉంటాయని హోంమంత్రి మీడియాతో చెప్పగా, 400 నుంచి 600 మధ్యలో ఉంటాయని యజమానులు చెబుతున్నారు.

కాలిన దుకాణాల సంఖ్య, ఆస్తి నష్టం గురించి ఎగ్జిబిషన్ సొసైటీ స్పందించాల్సి ఉంది. వ్యాపారులు ఆరోపించినట్టు ఫైర్ వాహనం సన్నద్ధంగా లేదా అన్నది కూడా అధికారిక సమాచారం లేదు. అటు ఫైర్ సర్వీస్ సేవలపై వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే, మంత్రి మహమూద్ అలీ మాత్రం వెంటనే స్పందించారంటూ పోలీసులూ, ఫైర్ సిబ్బందిని అభినందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)