నేరస్థులకు అపాయింట్‌మెంట్ ఇచ్చి నాకు ఇవ్వరా-కేఏ పాల్: ప్రెస్ రివ్యూ

  • 16 ఏప్రిల్ 2019
కేఏ పాల్ Image copyright Facebook/DrKAPaul
చిత్రం శీర్షిక ఏపీ ఎన్నికల్లో కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి నిలిపారు.

ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక కథనం ప్రచురించింది. ఎన్నికల కమిషనర్లకు కలవడానికి వచ్చిన కేఏ పాల్‌కు అపాయింట్‌మెంట్‌ నిరాకరించారని తెలిపింది.

''సోమవారం ఉదయం ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు సాయంత్రం రావాలని కమిషన్‌ కార్యాలయ రిసెప్షన్‌ సిబ్బంది సూచించారు.

సాయంత్రం 5 గంటలకు పాల్‌ మళ్లీ వచ్చారు. కానీ లోనికి అనుమతించలేదు. మంగళవారం ఉదయం రావాలని సిబ్బంది చెప్పారు. 'ఇక్కడ మీ ఫోన్‌ నంబరు రాసి వెళ్లండి. కమిషనర్లు అందుబాటులోకి వచ్చాక మీకు ఫోన్‌ చేస్తాం' అని తెలిపారు.

ఇదే సమయంలో వైసీపీ నేతలకు కమిషనర్లు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేరస్థులకు సమయం ఇస్తున్నప్పుడు తనకు ఎందుకు ఇవ్వడం లేదో అర్థంకావడంలేదని విలేకరుల వద్ద వాపోయారు.

కమిషనర్లకు స్వైన్‌ఫ్లూ వ్యాధి వచ్చిందని, అందుకే సమయం ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారని, ముగ్గురు కమిషనర్లకు ఒకేసారి ఎలా స్వైన్‌ఫ్లూ వస్తుందని ఆయన ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలని.. ఈసీ వైఖరి సరిగా లేదని అన్నారు.

ఆర్‌ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్‌, బజరంగ్‌దళ్‌ దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఇప్పటికే చెప్పానన్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Telangana cmo

మంత్రులకే సర్వాధికారాలు

కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల ఆమోదం కోసం త్వరలో శాసనసభా సమావేశాలు నిర్వహిస్తామని, జిల్లాల్లో మంత్రులకు సర్వాధికారాలు ఇస్తామని, కలెక్టర్ల వద్దనున్న నిధులను మంత్రులకు బదలాయిస్తామని కేసీఆర్ చెప్పినట్లు 'ఈనాడు' పత్రిక తన కథనంలో వెల్లడించింది.

''ప్రభుత్వం బాగా పనిచేస్తోందని.. ఉద్యోగులు నీతినిజాయతీతో పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు నిస్వార్థ సేవలందిస్తున్నారని ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే పాలనకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ముందున్న తెలంగాణ అవినీతి లేని రాష్ట్రంగా మారాలని ఆకాంక్షించారు.

లంచాలతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలను పూర్తిగా తొలగించేందుకే రెవెన్యూ, పురపాలక శాఖలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్త చట్టాలు తెస్తున్నామని చెప్పారు.

చట్టాల్లో మార్పుల గురించి ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను తెరాస కచ్చితంగా గెలుస్తుందన్నారు. ఎన్నికలపై నిర్వహించిన 10 సర్వే నివేదికలన్నీ ఇదే విషయాన్ని వెల్లడించాయని తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత దిల్లీలో చక్రం తిప్పేది తామేనని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 32 జిల్లా పరిషత్‌లను, 530 మండల పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని వెల్లడించారు. 535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలు తెరాస ఖాతాలోనే పడాలన్నారు.

అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చేది ఎమ్మెల్యేలేనని, మంత్రుల ఆమోదంతో ఇద్దరూ కలిసి జాబితాలను ఖరారు చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఉద్యమకారులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.

మీకు పోటీ అవుతారని, కిందిస్థాయి నేతలను అణగదొక్కవద్దు. అన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. మనకు నచ్చకపోయినా మరో అభ్యర్థి గెలుస్తారు. దీన్ని పరిగణనలోనికి తీసుకొని సమర్థులకు అవకాశం ఇవ్వాలి అన్నారు.

రాష్ట్రంలో భారీ సంఖ్యలో పదవులు ఉన్నాయని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, త్వరలోనే పార్లమెంటు కార్యదర్శుల నియామకాలు జరుగుతాయని, అందరికీ అవకాశాలు వస్తాయన్నారు.

తెరాస తరఫున వచ్చే ఎన్నికల్లో తొలి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఆసిఫాబాద్‌ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. ఆమె అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారని, అందుకే న్యాయం చేయాలనుకుంటున్నామన్నారు.

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థిగా మరో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేరును ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

సోమవారం తెలంగాణభవన్‌లో తెరాస రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు మంత్రులు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర పాలనావసరాలు, అవినీతి నిర్మూలనకు ప్రక్షాళన జరగాల్సి ఉంది. ఇందుకోసం కఠిన నిర్ణయాలుంటాయి. జిల్లాల్లో మంత్రులకు అధికారాలను పెంచుతున్నాం. కలెక్టర్లను నిధుల కోసం అడిగే పరిస్థితి మంత్రులు, ఎమ్మెల్యేలకు రావొద్దు. అందుకే వారి నిధులను మంత్రులకు ఇస్తాం. జిల్లా అవసరాలు, అభివృద్ధి, అత్యవసర పనులకు వాటిని వినియోగించాల''ని సూచించినట్లుగా ఆ కథనంలో వివరించారు.

Image copyright Google playstore

డేటా దొంగ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్‌ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చిందని 'సాక్షి' పత్రిక తన కథనంలో తెలిపింది.

''ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్‌ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్‌... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్‌ 'సేవామిత్ర'ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే.

ఈ కేసులో సిట్‌ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌సంస్థ అధినేత దాకవరం అశోక్‌ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు.

పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్‌ అజ్ఞాతం వీడటం లేదు.

ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.

అప్పట్లో అశోక్‌ను అరెస్టు చేసేందుకు సిట్‌ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్‌ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్‌ చీఫ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్‌ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్‌ ఫిర్యాదుతో మళ్లీ సిట్‌ దర్యాప్తు వేగం పుంజుకుంద''ని ఆ కథనంలో రాశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మామిడి పండ్లు కొంటున్న యువతి

తియ్యటి విషం

వ్యాపారులు రసాయనాలు వినియోగించి పండ్లను పక్వానికి తెస్తుండటంతో వాటిని తిన్న వారు అనారోగ్యం బారినపడుతున్నారని.. మామిడి, అరటి, బొప్పాయి, సపోటా, ద్రాక్ష, దానిమ్మ ఇలా దేన్నైనా రసాయనాలతో పండిస్తున్నారని.. అవి త్వరగా పక్వానికి వచ్చేందుకు కాల్షియం కార్బైడ్ లేదా పొగబెట్టే పద్ధతిని వినియోగిస్తున్నారని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం ప్రచురించింది.

''సహజసిద్ధంగా పండిన వాటిలో ప్రక్టోజ్, గ్లూకోజ్, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం నీరసించినప్పుడు ఉత్తేజం కలిగించటంతోపాటు, ఆహారం జీర్ణం కావటానికి, మలబద్ధకాన్ని రూపుమాపేందుకు తోడ్పడుతాయి.

కృత్రిమంగా మాగబెట్టిన పండ్లలో వీటి శాతం చాలా తక్కువ. అనారోగ్యం బారిన పడే అవకాశమే ఎక్కువని వైద్యనిపుణులు చెప్తున్నారు.

ఇటీవల గాలిదుమారానికి కిందపడిన మామిడి పండ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచిన కాయలను పొట్లాల్లో నింపిన కాల్షియం కార్బైడ్‌తో మాగపెడుతున్నారు.

కాల్షియం కార్బైట్‌తో వేడి పుట్టించటం వల్ల ఉష్ణోగ్రత పెరిగి నాలుగు రోజుల్లో కాయలు పండ్లుగా మారుతున్నాయి.

ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే పండ్ల బాక్సుల్లో కాల్షియం కార్బైడ్ ప్యాకెట్లు అమర్చి ఉంచుతున్నారు. అవి నిర్దేశిత ప్రాంతానికి చేరుకునేలోగా పండ్లుగా మారుతున్నాయి.

ఈ రసాయనాల కారణంగా మామిడి పండ్లు సహజ గుణం కోల్పోయి విషతుల్యం అవుతున్నాయి.

నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షలు జరిమానా

మామిడి కాయలను కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ రూల్స్-1995 రూల్ నెంబర్ 44 (ఏఏ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టడంపై నిషేధం విధించాయి. దీనిని అతిక్రమించిన వారికి మూడేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంద''ని ఆ కథనంలో పేర్కొంది.

Image copyright facebook/chiranjeevikonidela

కేరళ అడవుల్లో 'సైరా'

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం 'సైరా'లోని పోరాట సన్నివేశాలను ప్రస్తుతం కేరళ అడవుల్లో తెరకెక్కిస్తున్నారని 'ఈనాడు' పత్రిక వార్తాకథనం అందించింది.

''ఈ షెడ్యూల్‌ పది రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మరికొన్ని కీలక సన్నివేశాలు, ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేస్తారు. దాంతో చిత్రీకరణ పూర్తవుతుంది. మే నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలవుతాయి.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఇది. బ్రిటిష్‌వారితో నరసింహారెడ్డి ఎలా పోరాటం చేశాడు? తెల్లదొరల వెన్నులో ఎలా వణుకు పుట్టించాడన్న నేపథ్యంలో కథ సాగుతుంది. పోరాట సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. దాని కోసం చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

పోరాట సన్నివేశాలకే బడ్జెట్‌లో 25 శాతం కేటాయించారని తెలుస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నార''ని ఈ కథనంలో వివరాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)