ఆంధ్రప్రదేశ్: వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?

  • 4 నవంబర్ 2019
వేముగోడు

''మన ఊరి చాకలోళ్లు, మన బట్టలు ఉతకము అని జెప్పినారంట. అందుకని, వాళ్లతో గ్రామస్తులెవ్వురూ మాట్లాడరాదు. చాకలోళ్లలో ఎవురైనా సచ్చిపోతే, మాదిగలు గుంతలు తీయరాదు. వారికి మంగలోళ్లు క్షవరం చేయరాదు. రైతులు రజకులను కూలిపనులకు పిలవకూడదు. వీళ్లకు అంగళ్లలో సరుకులు అమ్మకూడదు. అని పంచాయితీ తీర్మానం చేసిందహో...'' అని దండోరా యేసినారు. మమ్మల్ని వెలి ఏసినారు'' అని వెంకటేశులు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వేముగోడు గ్రామంలో వెంకటేశులు కుటుంబం నివసిస్తోంది. ఈయన రజక కులస్తుడు. వెంకటేశులుకు ఒక కొడుకు, ఒక కూతురు.

వేముగోడులో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ దాదాపు అన్ని వర్గాల వారు జీవిస్తున్నారు. అందులో రజక కుటుంబాలు 13. వారి జనాభా దాదాపు 50 వరకు ఉంటుంది.

వేముగోడులో రజక కుటుంబాలను వెలి వేశారన్న కథనాలు రావడంతో బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది.

ఆరేళ్ల క్రితం వరకు, గ్రామస్తుల బట్టలను రజక కుటుంబాలు ఉతికేవి. కానీ, ఈ ప్రాంతాన్ని వరస కరువులు ముంచెత్తడంతో, బట్టలు ఉతకడానికి బిందెడు నీరు కూడా కరువయ్యింది. దీంతో వీరు బట్టలు ఉతకడం ఆరేళ్లపాటు ఆపేశారు. ఈ మధ్యలో, అరకొర పడే కరువు వానలతోటే రజకులు, తమ సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ వచ్చారు.

ఇప్పుడిప్పుడే వర్షాలు పడి గ్రామంలోని హంద్రీ నదికి నీరు వస్తుండటంతో, కులవృత్తిని మళ్లీ కొనసాగించాలని గ్రామస్తులు రజకులను కోరారు. కానీ, అప్పటికే సేద్యం చేస్తూ, రైతులుగా మారిన రజకులు, గ్రామస్తుల ప్రతిపాదనతో అయోమయంలో పడ్డారు.

మళ్లీ, ఊళ్లో మాసిన గుడ్డల మూటలు తమపై, తమ పిల్లల భుజాలపై భారం కానున్నాయని ఆందోళన చెందారు. ఈసారి పడిన వర్షాలతో, వారిలో ఆశలు చిగురించాయి. తమ పొలంలో వ్యవసాయం చేయాలన్నది వారి మనోగతం.

అందుకే, రజకులు వ్యవసాయం వైపే మొగ్గు చూపారు. ఇకపై తాము బట్టలు ఉతకమని, సేద్యం చేసుకుంటామని గ్రామ పంచాయితీలో తేల్చి చెప్పారు.

దీంతో ఆగ్రహించిన కొందరు గ్రామపెద్దలు అక్టోబర్ 19న, ఊరిలోని ఆంజనేయ స్వామి దేవాలయం మైకులో 'రజకులతో ఎవరూ మాట్లాడొద్దు. వాళ్లు ఊరోళ్ల బట్టలు ఉతకరంట. వాళ్ల అవసరం మనకు లేదు, మన అవసరం వాళ్లకు లేదు. ఇది పంచాయితీ తీర్మానం' అని ప్రకటించినట్లు గ్రామస్తులు బీబీసీకి చెప్పారు.

దీంతో గ్రామంలోని రజకులు దిగాలు పడ్డారు. 'మా పని మేం చేసుకుంటామంటే ఈళ్లకెందుకు కోపం? జీవితాంతం ఈ పని చేస్తామని రాసిచ్చినామా?' అని రజక యువకులు ప్రశ్నిస్తున్నారు.

చిత్రం శీర్షిక మా పిల్లలు మాలాగే బట్టలను గాడిదలా మోసుకుంటూ బతకాలా అని వెంకటేశులు ప్రశ్నిస్తున్నారు.

'మా పిల్లలు కూడా మీ బట్టలు మోసే గాడిదలు కావల్లనా?'

''ఆరేళ్ల నుంచి మేం బట్టలు ఉతకలేదు. ఈపొద్దు వచ్చి, మీరు నెలకు నాలుగు సార్లు బట్టలు ఉతకల్ల, ఐరన్ చేయల్ల, అట్ల చేస్తామని రిజిస్ట్రేషన్ చేయల్ల... అంటే? మాకు పుట్టబోయే పిల్లలకు కూడా మేం రిజిస్ట్రేషన్ చేసిచ్చిపోల్లనా? మేం పిల్లొల్లను సదివిచ్చుకోగూడదా? సరే, మేమంటే గాడిదలైపోయినం. మా పిల్లలు కూడా మీ బట్టలు మోసే గాడిదలు కావల్లనా?'' అంటూ, వెంకటేశులు ఆవేదన చెందారు.

''ప్రతి గ్రామంలోన మంగలివాళ్లు, చాకలివాళ్లు, మాలమాదిగ కులాలు ఉంటాయి. వారంతా వారివారి కులవృత్తులు చేస్తారు. ఇదంతా ఏ చట్టంలోనూ ఉండదు. కానీ ఇదంతా, గ్రామంలో ఉండే ఒక ఆచారం. కానీ, బట్టలు ఉతకాల్సిందిగా రజకులను బలవంతం చేయలేదు. మీ అవసరం మాకు లేదు, మా అవసరం మీకు లేదు అని చెప్పినాం అంతే'' అని గ్రామ పెద్ద, రిటైర్డ్ గవర్నమెంటు టీచర్ హంపన్న బీబీసీతో అన్నారు.

వేముగోడులోని 13 రజక కుటుంబాల్లో మూడు కుటుంబాలు ఒక వర్గం, 10 కుటుంబాలు మరో వర్గంగా చీలిపోయాయని గ్రామపెద్దలు చెబుతున్నారు. వారిలో మూడు కుటుంబాల రజకులు మావద్దకు వచ్చి, మేం బట్టలు ఉతకడానికి సిద్ధం అంటే, తక్కిన పది కుటుంబాలను కూడా బట్టలు ఉతకమని అడిగామని వారు చెబుతున్నారు.

చిత్రం శీర్షిక తమ పిల్లలను అందరి పిల్లల్లాగే చదివించుకోవాలని ఉందని గోరంట్లమ్మ అన్నారు.

''మొదట్లో, బట్టలు ఉతికే రజకులకు ఒక కుటుంబం, ఏడాదికి రూ.1,200 ఈయల్లని అన్నాం. గిట్టుబాటు కాదు అంటే, 2 వేల రూపాయలు ఇస్తామన్నాం. అయితే నెలకు నాలుగు ఉతుకులు అని చెప్పినాం. కానీ ఈ బేరం తమకు గిట్టదని, బట్టలు ఉతకలేమని అన్నారు. పంచాయితీ తీర్మానాన్ని రజకులు మీరినారు. అందుకే, వాళ్ల అవసరం మాకు లేదని, మా సహకారం కూడా వాల్లకు ఉండకూడదని నిర్ణయించుకున్నాం'' అని హంపన్న అన్నారు.

''ఒకరోజు పనికిపోతే, 200 రూపాయల కూలి వస్తుంది. గ్రామపెద్దలేమో సంవత్సరానికి ఒక ఇంటికి 2 వేలు అంటున్నారు. పైగా నెలకు నాలుగు ఉతుకులు, ఐరన్! ఇవి మాకు గిట్టుబాటు కాదు. అందుకే, మొదట్లో బట్టలు ఉతుకుతామని ముందుకువచ్చినవారు కూడా ఇప్పుడు వెనకడుగు వేసినారు'' అని వరలక్ష్మి అనే మహిళ అన్నారు.

''వాళ్ల పిల్లల లెక్క మా పిల్లలు కూడా ఇంత సదువుకునేది లేదా నాయనా! నాకు ముగ్గురు మనమరాళ్లు. ఇంకా చిన్నపిల్లలు. వాళ్లను సదివిచ్చుకోవల్ల నాయనా. నా కొడుకు సేద్యం చేస్తాడు. నా కోడలు ఒక్కతే అన్ని ఇండ్ల బట్టలు ఉతకలేదు. నేనేమో, ఇంటిముందున్న మెట్లు కూడా ఎక్కలేను. ఇంక బట్టలేం ఉతుకుతాను? బట్టలు ఉతికే చోట అంతా చెట్లూ చేమలు, ముళ్లపొదలున్నాయి. ఆడవాళ్లు ఒక్కరే ఆటికి పలేరు. మేం ఉతకం సామీ అన్నాకూడా మమ్మల్ని ఇడసకుండా, యేపుకుని తింటున్నారు'' అని గోరంట్లమ్మ అనే వృద్ధురాలు బీబీసీతో అన్నారు.

చిత్రం శీర్షిక తాము రజకులను వెలివేయలేదని గ్రామ పెద్ద హంపన్న అంటున్నారు.

'నన్నేమన్నా కొన్నావా?'

వెంకటేశులు వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు. ఆస్తి పంపకాలు చేసినపుడు 6 ఎకరాల పొలం, 40 ఇళ్ల బట్టల చాకిరీ వెంకటేశులు భాగానికి వచ్చింది. ఒకవైపు సేద్యం చేసుకుంటూ, తన భాగానికి వచ్చిన 40 ఇళ్ల బట్టలను ఉతకడం తన పని. రోజుకు 4 ఇళ్ల బట్టలు ఉతికినా, 40 ఇళ్లను పూర్తిచేయడానికి 10 రోజులు పడుతుందని ఆయన చెబుతున్నారు. గ్రామపెద్దలేమో నెలకు నాలుగు ఉతుకులు కావాలని, వాటిని ఐరన్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల మొత్తం ఊరోళ్ల బట్టలు ఉతికినా, 40 ఇళ్లను పూర్తి చేయలేనని, ఇక తన పొలంలో వ్యవసాయం మాటేమిటని ఆయన ఆవేదన చెందుతున్నారు.

''మూడు కుటుంబాల రజకులు, బట్టలు ఉతుకుతామని ముందుకొచ్చినారు. వాళ్లతోనే ఉతికిచ్చుకోండి. మాకు గిట్టుబాటు కాదు. మమ్మల్ని వదిలిపెట్టండి స్వామీ, మేం సేద్యం చేసుకుంటాం. నెలంతా మీ ఇండ్లకాడ బట్టలు ఉతుక్కుంట కూర్చుంటే, నా పొలం పనులెక్కడ? నా పిల్లల జీవితమేమి? అంటే, మా పొలాలను అమ్ముకోల్లా? నా పిల్లల చదువు మాన్పించి, వాళ్లను కూడా మీ బానిసను చేయల్లా? మీరు మమ్మల్నేమన్నా కొన్నారా?'' అని వెంకటేశులు ప్రశ్నిస్తున్నారు.

ఆంజనేయస్వామి గుడి మైకులో పంచాయితీ తీర్మానాన్ని ప్రకటించిన తర్వాత రెండు రోజులకు ఊరిపెద్దలు మళ్లీ ఊళ్లో 'వెలి' చాటింపు వేయించారని రజక సంఘం నాయకుడు చంద్రశేఖర్ రావు అన్నారు.

చిత్రం శీర్షిక వేముగోడు గ్రామంలో మొత్తం 13 రజక కుటుంబాలు ఉన్నాయి.

''అక్టోబర్ 19న గుళ్లోని మైకులో చెప్పినారు. మళ్లీ 22వ తారీఖున చాకలోళ్లతో ఎవురూ మాట్లాడకూడదు, వాళ్లను పొలం పనులకు పిలవకూడదు, వాళ్ల పనులకు ఎవరూ పోకూడదు అని ఊళ్లో తప్పెట కొట్టి చాటింపు వేసినారు సార్. రజక కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే, వాళ్లను పూడ్చేకి గుంత తీయొద్దని, వీళ్ల పశువులు చనిపోతే వాటి కళేబరాలను ఎత్తేయకూడదని ఊళ్లోని మాలమాదిగ కులస్థులను ఆదేశించినారు. అందరూ కలిసి, వీళ్లను దూరం చేసినారు. ఇట్లా వెలి వేస్తే, వీరిలో ఆత్మన్యూనత కలగదా? ఇంక సామాజికంగా వీళ్లు ఎట్ల అభివృద్ధి చెందుతారు?'' అని చంద్రశేఖర్ రావు అన్నారు.

''ఊరిలో చాటింపు వేసిన మరుసటి రోజు, ఒక రైతు పొలంలో పనికి పోయిన జయలక్ష్మి, వరలక్ష్మి అనే ఇద్దరు రజక స్త్రీలను, పని చేయకుండా కొందరు ఆపినారు. వాళ్లను బలవంతంగా ఇండ్లకు పంపినారు. ఆ మరుసటి రోజు కూడా, అక్బర్ అనే రైతు పొలంలోకి పనికి పోతున్న మందకల్లు అనే రజకుడిని ఊర్లోనే అడ్డుకున్నారు'' అని చంద్రశేఖర్ రావు బీబీసీతో అన్నారు.

24వ తారీఖున రజక సంఘం నేతల సహాయంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాము పనులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. చంద్రశేఖర్ రెడ్డి ఇరువర్గాలతో మాట్లాడారు. కులవృత్తి చేయాలంటూ బలవంతపెట్టకూడదని గ్రామపెద్దలకు వివరించినట్లు ఎస్.ఐ. బీబీసీతో అన్నారు.

సుమోటో కింద కేసు నమోదు చేసి, సెక్షన్ 341 రెడ్ విత్ 34 కింద 11 మందిపై కేసు పెట్టామని కోడుమూరు ఎస్సై పార్థసారథి రెడ్డి బీబీసీతో అన్నారు.

''ఊరంతా తిరిగారు కదా, రజకులతో మాట్లాడారు కదా, మీకు ఏమనిపించింది?'' అని అడిగారు గ్రామపెద్దల్లో ముఖ్యుడు, రాజకీయనేపథ్యం కలిగిన కృష్ణారెడ్డి.

''కులవృత్తి చేయబోమని, సొంత భూమిలో వ్యవసాయం చేసుకోవాలని రజకుల అభిప్రాయం...'' అని చెబుతుండగా, ఆయన ముఖంలో చిన్న నవ్వు!

''గ్రామంలో చిన్నచిన్న సమస్యలు జరుగుతుంటాయి. గ్రామంలోనే అవి పరిష్కారం అవుతాయి. దీన్ని ఇంకా ఇష్యూ చేయడం కూడా తప్పే. ఈరోజుల్లో ప్రతి కులానికి ఒక సంఘం ఉంటాది. అట్లని, అందరూ ఎంటర్ అయ్యి, దీన్ని ఇష్యూ చేసేది పద్దతి కాదు. రజకులను కూడా మాలో కలుపుకుంటామని పంచాయితీలో తీర్పు చెప్పినా'' అని కృష్ణారెడ్డి బీబీసీకి వివరించారు.

చిత్రం శీర్షిక రజకులు తమను వెలివేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'ఈరోజు వాళ్లకు జరిగింది, రేపు మాకు జరుగుతుంది'

వేముగోడు గ్రామానికి బీబీసీ వెళ్లిన రోజు ఊళ్లో ఒక పంచాయితీ జరిగిందని గ్రామపెద్ద హంపన్న అన్నారు. ఆ పంచాయితీ సమావేశంలో రజకులు లేరు.

''చాకలోళ్లకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాళ్లలో ఎవరైనా సచ్చిపోతే, దళితులు గుంత తవ్వల్ల. అట్లే, చావు కార్యాల్లో మాలదాసరులు, జంగమోల్లు కూడా కొన్ని ఆచారాలు చేస్తూవచ్చినారు. కానీ, ఇప్పటినుంచి ఆ కార్యక్రమాలను ఎట్ల చేద్దాం అన్న విషయమై ఈ రోజు పొద్దున కూడా పంచాయితీ జరిగింది. దళితులు కూడా, చాకలోళ్లతో అవసరం లేదు అని, పంచాయితీ తీర్మానంతో సమ్మతించినారు. మేమేమీ రజకులను బహిష్కరించలేదు'' అని గ్రామపెద్ద హంపన్న బీబీసీకి వివరించినారు.

అయితే, ఇది బహిష్కరణ లేదా వెలి వేయడం కాదని, సహాయ నిరాకరణ అని హంపన్న బీబీసీతో అన్నారు.

''చాకలోళ్లతో మాట్లాడకూడదు, పనులకు పిలసకూడదు, వాళ్లు సచ్చిపోతే గుంతలు తవ్వరాదు అనేది సహాయనిరాకరణ ఎట్లయితాది సార్? పనులకు పోయిన ఆడోల్లను అడ్డుకోవడం, పనులకు పోతున్న ఒక రజకుడి బండి నుంచి ఎద్దులను విడిపించి పక్కకు తోలడం, ఇవన్నీ ఏంది సార్, సహాయనిరాకరణా?'' అని ప్రశ్నించారు చంద్రశేఖర్ రావు.

రజకులకు, గ్రామం తరపున ఎలాంటి సహకారం అందరాదన్న పంచాయితీ తీర్మానం గురించి, వేముగోడు లోని దళితవాడకు వెళ్లాం.

ఎస్సీ కాలనీలోని ఓ మూల కూర్చుని, పిచ్చాపాటి మాట్లాడుతున్న యువకులతో ఈ విషయం గురించి మాట్లాడినపుడు,

''వాళ్లకు గిట్టుబాటు అయితే బట్టలు ఉతుకుతారు, లేకపోతే లేదు. అంతేకానీ, నువ్వు ఈ రేటుకే పని చెయ్యి అంటే, వాళ్లకు మాత్రం భూమి లేదా, వాళ్లు రైతులు కాదా?''అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ యువకుడు బీబీసీతో అన్నారు.

చిత్రం శీర్షిక రజకులు చెబుతున్నదాంట్లో న్యాయం ఉందని దళితులు అభిప్రాయపడుతున్నారు.

''చాకలోళ్ల పక్క న్యాయం ఉంది సార్. కానీ, ఇదే మాట బయటకు అంటే, రేపు మాక్కూడా ఇట్లే జరుగుతుందని భయం. అందుకే మా పెద్దోళ్లు కూడా పంచాయితీలో సరేనని తల ఆడించి వచ్చినారు. వాళ్ల పశువులు సచ్చిపోతే ఎత్తేయద్దండి, వాళ్ల మనుషులు సచ్చిపోతే గుంతలు తవ్వద్దండి అంటే, మేం ఏంజేస్తాం సార్!'' అని, తమ నిస్సహాయతను వివరించారు.

అతను బీబీసీతో మట్లాడుతున్నపుడు చుట్టు కూర్చున్న యువకులు కూడా అతనితో గొంతు కలిపారు. దళితవాడ దాటని స్వరంతో!

వేముగోడు గ్రామానికి బీబీసీ చేరుకునే సమయానికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

''గుళ్లోని మైకులో రజకులతో ఎవ్వరూ మాట్లాడరాదని ప్రకటన చేయడం, రెండు రోజుల తర్వాత, అదే తీర్మానాన్ని తప్పెట కొట్టి ఊరంతా చాటింపు వేయడం జరిగింది. ఆ తర్వాత, రజకులు ఇతర రైతుల పొలాల్లోకి పనులకు పోతే, కొందరు వారిని అడ్డుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో, అంతవరకూ ప్రత్యక్షంగా కనిపించిన 'వెలి', పరోక్షంగా మారింది'' అని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పోలీసులు అప్పుడపుడూ వేముగోడు గ్రామానికి వెళ్లివస్తున్నారు. కానీ, తమను కులవృత్తిలోకి వెనక్కు లాగే శక్తి నుంచి ఎంతకాలం తప్పించుకోగలం? అన్న అనుమానం మాత్రం రజకుల కళ్లల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది.

కులవృత్తి నుంచి బయటపడటానికి రజకులు చేసిన ప్రయత్నానికి నిరసనగా, గ్రామపెద్దల నుంచి వారికి 'సాయం లేదా సహకారం' అందకుండా, తీర్మానం చేశారు. రజకులకు అందకుండా చేసిన ఆ సాయం కూడా, మరికొందరి వ్యక్తుల కులవృత్తి మాత్రమే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

రేప్ కేసుల విచారణలో భారత న్యాయవ్యవస్థ ప్రభావవంతంగా పని చేస్తోందా...

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి