దిల్లీ అల్లర్లపై పరస్పర విరుద్ధ నివేదికలు... ఏది నిజం, ఏది అబద్ధం?

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
దిల్లీ ఘర్షణలు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ హింసలో ఏ వర్గం ఎక్కువగా నష్టపోయింది ? ఏ పక్షం హింసను ప్రేరేపించింది ? ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏంటి? పోలీసుల వైఖరి ఎలా ఉంది ? ఈ అంశాలపై దర్యాప్తు చేసి వాస్తవాలను కనుక్కోడానికి రెండు ప్రభుత్వేతర సంస్థలు ప్రయత్నించాయి.

అయితే, ఈ అంశంపై సొంతంగా విచారణ జరిపిన ఈ కమిటీలు పరస్పర భిన్నమైన నివేదికలను ఇచ్చాయి. సెంటర్‌ ఫర్ జస్టిస్ (సీఎఫ్‌జే) అనే సంస్థ డాలీ రైట్స్: కాన్‌స్పిరసీ అన్‌వీల్డ్‌' పేరుతో మే నెలలో హోంమంత్రి అమిత్ షాకు తన నివేదికను సమర్పించింది. ఢిల్లీ మైనారిటీ కమిషన్ (డీఎంసీ) కూడా జులైలో తన నివేదికను అందించింది.

ప్రభుత్వానికి అందిన ఈ నివేదికల్లో ఒకటి వీటిని హిందూ వ్యతిరేక అల్లర్లుగా పేర్కొనగా, మరొకటి ముస్లిం వ్యతిరేక గొడవలుగా అభివర్ణించింది. ఒక నివేదిక పోలీసుల తీరును ప్రశ్నించకపోగా, మరో నివేదిక ఖాకీలు కూడా అల్లర్లలో పాల్గొన్నారని ఆరోపించింది. అల్లర్ల 'కుట్ర'లో రాజకీయ నాయకుల పాత్ర లేదని ఒక రిపోర్టు చెప్పగా అందుకు విరుద్ధంగా నేతల పాత్ర ఉందని మరో రిపోర్ట్‌ వెల్లడించింది.

ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లలో 53మంది మరణించగా, వందలమంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, దుకాణాలు, ప్రార్ధనా స్థలాలను ధ్వంసమయ్యాయి.

రెండు నివేదికలను రూపొందించిన ఆయా సంస్థల ప్రతినిధులు హింసాత్మక ప్రాంతాలలో ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఫోటోలను సేకరించి గ్రౌండ్‌ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి రెండు నివేదికలు ఎందుకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images

ఏ బాధితులను ఇంటర్వ్యూ చేశారు ?

సీఎఫ్‌జే బృందం నాలుగు ప్రాంతాల్లో 30 మంది బాధితుల నుంచి వాంగ్మూలాలను తీసుకుంది. అందులో ఒకరు మాత్రమే ముస్లిం.

అదే సమయంలో ఢిల్లీ మైనారిటీ కమీషన్‌ 20 ప్రాంతాలలో 400మంది స్థానికుల నుంచి వివరాలు తీసుకుంది. వారిలో 50మంది బాధితులు ఇచ్చిన వివరాలను ప్రచురించింది. వీరిలో ఒకరు మాత్రమే హిందువు.

సీఎఫ్‌జే బృందం యమునా విహార్, చాంద్‌బాగ్‌, బ్రిజ్‌పురి, శివవిహార్ ప్రజలతో మాట్లాడింది. వారిలో చాలామంది తమపై రాళ్ళు రువ్వారని, కాల్పులు జరిపారని ఫిర్యాదు చేశారు. 19-25 సంవత్సరాల వయసున్న వ్యక్తులు బయటి నుంచి వచ్చారని, పెట్రోల్‌ బాంబులు, యాసిడ్, రాళ్లు, కర్రలతో దాడులు చేశారని చెప్పారు.

ముస్లిం దుకాణాలను వదిలి, హిందువులు నడుపుకునే వ్యాపారాలు, నర్సింగ్‌ హోమ్‌లకు నిప్పంటించారని పేర్కొన్నారు. బ్రిజ్‌పురిలో ముస్లింలు రోడ్డు మీదికి రావాల్సిందిగా ఒక మసీదు నుంచి ప్రకటనలు చేశారని ఓ వ్యక్తి వెల్లడించారు.

ముస్తఫాబాద్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజీ యూనస్‌ అల్లర్లు జరపడానికి స్థానిక ప్రజలను ప్రోత్సహించారని కొందరు ఆరోపించారు.

శివవిహార్‌లోని డీఆర్‌పీ పబ్లిక్‌ స్కూల్‌కు నిప్పంటించి ఫర్నిచర్‌ను బైటపడేసి నిప్పంటించారని కొందరు వెల్లడించారు. రాజధాని పబ్లిక్‌ స్కూల్‌కు ఎత్తైన భవనం ఉండటంతో దాడులకు కొందరు దాన్ని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ డీఆర్‌పీ స్కూలు యాజమాన్యం హిందువులు కాగా, రాజధాని స్కూలు యాజమాన్యం ముస్లిం వర్గానికి చెందినది.

బ్రిజ్‌పురిలోని అరుణ్‌ మోడల్‌ స్కూల్‌పై కూడా దాడి చేసి నిప్పంటించారని కొందరు వివరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ స్కూలు యజమానులు హిందువులు.

ఫొటో సోర్స్, Getty Images

రెండో నివేదికలో ఏముంది?

ఢిల్లీ మైనారిటీ కమీషన్‌ రూపొందించిన నివేదిక చాలా పెద్దది. ఇందులో శివవిహార్, భగీరథి విహార్, భజన్‌పురా, కరవాల్‌నగర్, ఖాజురిఖాస్, పురానా ముస్తఫాబాద్, గంగావిహార్, బ్రిజ్‌పురి, గోకుల్‌పురి, జ్యోతి కాలనీ, ఘోండా చౌక్, అశోక్‌ నగర్, చంద్రనగర్, రామ్‌రహీమ్‌ చౌక్‌, ముంగానగర్‌తోపాటు చాంద్‌బాగ్‌, కర్దాంపురి ప్రాంతాలలో జరిగిన హింస గురించి ప్రస్తావించారు.

అల్లర్ల సందర్భంగా గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్ బాంబులు, రసాయన బాంబులు వాడారని, హెల్మెట్లు, ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు, దోపిడీలకు పాల్పడినట్లు ఇందులో పేర్కొన్నారు. ముస్లిం వర్గాలకు చెందిన ఇళ్లు, షాపుల నుంచి వస్తువులను కొల్లగొట్టారని, కమిటీకి సాక్ష్యమిచ్చిన వారు చెప్పారు. హిందువుల ఇళ్లకు, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చాలామంది చెప్పారు.

తయాబా, ఫరూకియా, చాంద్‌ మసీదుతో సహా ముస్లింలకు చెందిన 17మత ప్రదేశాలకు నిప్పంటించారని మైనారిటీ కమీషన్‌ నివేదికలో ఆరోపించారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలోని ఆలయాలను ఎవరూ ముట్టుకోలేదని, ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలో కూడా దేవాలయాలపై దాడులు జరిగినట్లు ఎక్కడా కనబడలేదని ఈ కమిటీ నివేదిక పేర్కొంది. బ్రిజ్‌పురిలో మహిళలను కూడా పోలీసులు లాఠీలతో కొట్టారని కొందరు ఆరోపించారు.

గోకుల్‌పురిలోని ఓ టైర్‌ మార్కెట్‌కు ఫిబ్రవరి 23వ తేదీన నిప్పంటించారని, 24వ తేదీన అక్కడ రాళ్లు రువ్వారని, టైర్‌ మార్కెట్ మూడు రోజులపాటు కాలిపోయిందని కొందరు వెల్లడించారు. ఈ మార్కెట్‌లో ఎక్కువ షాపులు ముస్లింలవే.

ఫొటో సోర్స్, Getty Images

దాడులు ప్లాన్‌ ప్రకారం జరిగాయా?

సీఎఫ్‌జే నివేదికలో హిందువులపై దాడులు ఫిబ్రవరి 24న జరిగాయని పేర్కొంది. అయితే అరుణ్‌ స్కూల్ మీద దాడి మాత్రం ఫిబ్రవరి 25న జరిగినట్లు వెల్లడించింది.

ఢిల్లీ మైనారిటీ కమిషన్ నివేదిక అల్లర్లు ఎన్నిరోజులు జరిగాయో పేర్కొంది. ఫిబ్రవరి 24 నుండి 26 మధ్య మూడు రోజులపాటు హింస జరిగిందని, ఇందులో ఎక్కువగా ముస్లింలపైనే దాడులు జరిగాయని వెల్లడించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం ఈశాన్య ఢిల్లీ జనాభాలో 30శాతం ముస్లింలు, మిగిలిన 70 శాతం హిందువులు. రాజధానిలోని 11 జిల్లాల్లో ఇది అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం.

2019 డిసెంబర్‌లో పౌరసత్వ చట్టాన్ని ఆమోదించిన తర్వాత శీలాంపూర్‌లో వ్యతిరేక నిరసనలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 23న నిరసన తెలిపేవారికి, మద్దతిచ్చే వారికి మధ్య ఈశాన్య ఢిల్లీలో ఘర్షణ జరిగింది.

తర్వాత 24 గంటల్లో అది తీవ్ర హింసాత్మక రూపం తీసుకుంది. ఢిల్లీ అల్లర్లు ప్రధానంగా ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీలలో మూడు రోజులపాటు సాగాయి. ఫిబ్రవరి 24న ప్రధానంగా హిందువులపై దాడులు జరిగాయని సీఎఫ్‌జే నివేదిక తేల్చింది.

యమునా విహార్‌లోని ఫహాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌వంటి ముస్లిం పాఠశాలలను ఫిబ్రవరి 24న మూసివేశారు. మిగిలిన పాఠశాలల్లోని ముస్లిం విద్యార్ధులను వారి కుటుంబాలు బడికి పంపలేదు. పంపినా ఉదయం 11 గంటలకల్లా తిరిగి తీసుకెళ్లారని నివేదిక పేర్కొంది.

అలాగే ముస్లింలు బ్యాంకు అధికారులుగా ఉన్న ప్రాంతాలలో వాటిని ముందుగానే మూసేశారు. ఇళ్లలో పని చేసే ముస్లిం మహిళలు ఫిబ్రవరి 24న పనికి రాలేదు. అయితే అల్లర్లు వ్యాపిస్తాయనే భయంతోనే వారు రాకపోయి ఉండొచ్చని నివేదిక పేర్కొనలేదు.

ఇక ఢిల్లీ మైనారిటీ కమీషన్‌ నివేదిక ప్రకారం ఈ అల్లర్లన్నీ పథకం ప్రకారం జరిగాయి. వందలాది ముస్లింల ఇళ్లను, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.

అల్లర్లలో కర్రలు, పెట్రోల్ బాంబులు, సిలిండర్లు, పిస్టల్స్‌ కూడా వాడారు. అయితే ఈ హింసను ఎదుర్కోవడానికే ముస్లింలు రాళ్లు రువ్వారని ఈ నివేదిక పేర్కొంది.

ముస్లింలపై సామూహిక దాడులు చేసేందుకే సీఏఏ మద్దతుదారులు ప్రదర్శనలు ప్రారంభించారని ఈ నివేదికలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు వివక్ష చూపారా?

అల్లర్లు ఎక్కువగా విస్తరించడం వల్ల పోలీసులు సిబ్బంది అందుబాటులో లేరని సీఎఫ్‌జే నివేదిక పేర్కొనగా, చాలా ప్రాంతాలలో పోలీసులు ముస్లింలపై వివక్ష చూపారని, వారు కూడా హింసకు పాల్పడ్డారని మైనారిటీ కమీషన్‌ రిపోర్ట్ పేర్కొంది.

సీఎఫ్‌జే నివేదికలో పీసీఆర్‌ కాల్స్‌ ప్రస్తావన లేకపోయినప్పటికీ, పోలీసులు చాలా కొద్దిమందే ఉన్నారని, వారు కూడా సహాయం కోసం అర్ధించారని పేర్కొన్నారు.

అయితే మైనారిటీ కమీషన్‌ పోలీసులు పాత్రపై అనేక అనుమానాలు లేవనెత్తింది. అల్లర్లకు పోలీసులు సహకరించారని పేర్కొంది.

ముస్లిం వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని, పైగా ముస్లింలపైనే మొదట ఛార్జిషీటు దాఖలు చేశారని, రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టి ముస్లింలను టార్గెట్‌ చేసుకున్నట్లు వ్యవహరించాని మైనారిటీ కమీషన్‌ నివేదికలో ఆరోపణలున్నాయి.

సీఏఏ వ్యతిరేకులను పోలీసులు కించపరిచేలా వ్యవహరించాని కూడా మైనారిటీ కమీషన్ రిపోర్టులో ఆరోపణలున్నాయి. గర్భిణీ స్త్రీలతో సహా చాలామంది బాధితులకు పోలీసులు ఏమాత్రం సాయం చేయలేదని ఫిర్యాదులున్నాయి. కొందరు పోలీసులు జననేంద్రియాలను చూపుతూ ఇదిగో మీ స్వేచ్ఛ అంటూ ఎగతాళిగా మాట్లాడారని ఒక మహిళ ఆరోపించారు.

ఐదుగురు ముస్లింలను పోలీసులు కొడుతున్న వీడియో కూడా ఈ నివేదికలో ఉంది. వీరిని "భారత్‌ మాతా కి జై" అనాలంటూ, "జన గణ మన" పాడాలంటూ పోలీసులు బెదిరించారని, ఇలా కొట్టడం వల్ల వీరికి తీవ్ర గాయాలయ్యాయనీ మైనారిటీ కమీషన్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం, రాజీపడాలని, లేదంటే ఇతర కేసుల్లో నిందితులుగా చేరుస్తామని బెదిరించినట్లు ఇందులో ఆరోపణలున్నాయి.

అల్లర్లను ఎవరు ప్రేరేపించారు?

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం బలహీనపడిందని, అయితే ట్రంప్‌ పర్యటన సందర్బంగా అల్లర్లు నిర్వహించి ప్రపంచం దృష్టిలో పడేందుకు సీఏఏ వ్యతిరేకులు ప్రయత్నించారని, ప్రత్యర్ధులను రెచ్చగొట్టారని సీఎఫ్‌జే నివేదిక చెబుతోంది.

అయితే సీఏఏ, ఎన్సార్సీలను వ్యతిరేకిస్తున్న ముస్లింలకు ఒక పాఠం నేర్పడానికి ఈ అల్లర్లు పథకం ప్రకారం సృష్టించారని మైనారిటీ కమీషన్‌ రిపోర్ట్‌ ఆరోపించింది. దీనికి బీజేపీ నాయకులు కుట్రపన్నారని, కపిల్‌ మిశ్రా ప్రసంగం తర్వాత హింస తీవ్ర రూపం దాల్చిందని పేర్కొంది.

పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించడం తప్పని, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకోవడం అర్ధరహితమని, సాధారణ ప్రజలు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఒక భ్రమను సృష్టించారని సీఎఫ్‌జే నివేదిక పేర్కొంది.

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న జామియా కోఆర్డినేషన్‌ వంటి రాడికల్ సంస్థలన్నీ చేతులు కలిపాయని సీఎఫ్‌జే నివేదిక పేర్కొంది. వివాదాస్పద పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)ను కూడా ఇది ప్రస్తావించింది.

సీఏఏ వ్యతిరేక ఉద్యమాలకు పీఎఫ్‌ఐ నుంచి డబ్బు అందిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులను ఉటంకించింది. అలాగే పీఎఫ్‌ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని కూడ సీఎఫ్‌జే నివేదిక పేర్కొంది. ఈ రెండు ఆరోపణలు మీడియాలో రాగా, పీఎఫ్‌ఐ వాటిని ఖండించింది.

దళిత సంస్థ భీమ్‌ ఆర్మీకి చెందిన చంద్రశేఖర్‌ అజాద్‌ ఫిబ్రవరి 23న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడం, విద్యార్థి నాయకుడు ఒమర్ ఖలీద్ సీఏఏ వ్యతిరేక ప్రసంగాలు కుట్రలో భాగమేనని ఆరోపించింది.

జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్ధులు జీహాద్‌ గురించి మాట్లాడారంటూ సోషల్‌ మీడియా పోస్టులను ఉదహరించింది సీఎఫ్‌జే నివేదిక. జామియా నగర్‌ హింసాకాండలో 'హిందువుల నుండి స్వేచ్ఛ' అంటూ నినాదాలు వినిపించారని, ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ అమానతుల్లా ఖాన్‌ హింసకు ప్రేరేపించారని ఆరోపించింది.

రోడ్లు దిగ్బంధించడం, బస్సులకు నిప్పంటించడంవంటి సంఘటనలను ఉటంకిస్తూ, నిరసన తెలిపే మార్గం ఇది కాదని సీఎఫ్‌జే నివేదిక పేర్కొంది.

నిరసనలను సమర్ధించిన మైనారిటీ కమీషన్‌ నివేదిక

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ఉందని, దీనిపై కోర్టులో 200 పిటిషన్లు కూడా దాఖలయ్యాయని మైనారిటీ కమీషన్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ 2019 డిసెంబర్‌లో చేసిన మీడియా సమావేశాన్ని ఉదహరించింది. పౌరసత్వ చట్టం వివక్షాపూరితమని ఇందులో మానవహక్కుల హైకమీషనర్‌ వ్యాఖ్యానించారు.

పౌరసత్వ సవరణ చట్ట ఆమోదం, ఎన్నార్సీ అమలు నిర్ణయాలు ముస్లింలలో భయాన్ని కలిగించాయని మైనారిటీ కమీషన్‌ నివేదిక వెల్లడించింది. ప్రతిచోటా శాంతియుతంగానే నిరసనలు జరిగాయని, రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కుల గురించే నినదించారని పేర్కొంది. బీజేపీ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో లాభం పొందడానికి మతపరమైన ప్రకటనలు చేశారని మైనారిటీ కమీషన్‌ నివేదిక ఆరోపించింది.

బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్ పోలీసుల ముందే దేశద్రోహులను కాల్చండి అంటూ ఫిబ్రవరి 23న ప్రకటనలు చేశారని, ఇది బెదిరించడమేనని మైనారిటీ కమీషన్‌ పేర్కొంది. ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు బీజేపీ నేతలు పర్వేశ్‌ వర్మ, అనురాగ్‌ ఠాకూర్లను ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి ఈసీ నిషేధించిందని కూడా నివేదిక గుర్తు చేసింది.

కపిల్‌మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైనట్లు, రాజకీయ నాయకుల వాంగ్మూలాలతోపాటు, సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలలో కాల్పుల గురించి కూడా నివేదిక ప్రస్తావించింది.

జామియా మిల్లియాతోపాటు వివిధ ప్రాంతాలలో జరిగిన కాల్పుల గురించి చెప్పిన మైనారిటీ కమీషన్‌ నివేదిక, కపిల్ మిశ్రా రెచ్చగొట్టే ప్రకటన తరువాతే ఢిల్లీలో హింస పెరిగిందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)