గౌతమ బుద్ధుడు భారతీయుడు ఎలా అయ్యారు? - భారత్‌ను ప్రశ్నించిన నేపాల్

ఫొటో సోర్స్, Getty Images
రాముడి జన్మస్థలం గురించి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన ప్రకటనతో ఇటీవల వివాదం తలెత్తింది. ఇప్పుడు గౌతమ బుద్దుడి వంతు వచ్చింది.
"భారతీయులంతా గుర్తుంచుకోవాల్సిన మహాపురుషులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు గౌతమ బుద్ధుడు, మరొకరు మహాత్మాగాంధీ" అని భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్. జైశంకర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం తర్వాత వివాదం మొదలైంది. గౌతమ బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారని, ఇది తిరుగులేని వాస్తవమని, దీనికి చారిత్రక, పురావస్తు ఆధారాలు ఉన్నాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుద్ధుని జన్మస్థలం లుంబిని బౌద్ధమతానికి కేంద్రమని, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటని పేర్కొంది.
గౌతమ బుద్ధుడి గురించి భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన అభ్యంతరకరమని నేపాల్ మాజీ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ కూడా అన్నారు.
"గౌతమబుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారు. ఆయన గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన అవాస్తవం, అభ్యంతరకరం'' అని మాధవ్ కుమార్ తన ఫేస్బుక్ పేజ్‌లో రాశారు. "భారత నాయకులు వ్యక్తం చేసిన ప్రకటనలు చాలా సున్నితమైనవి. అవి ఇరు దేశాల మధ్య అపోహలు పెంచుతాయి. ఈ వ్యవహారంపై భారత్‌తో అధికారికంగా మాట్లాడాలని నేను నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అని మాధవ్ కుమార్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
అయితే వివాదాన్ని చల్లబరచడానికి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తరువాత ఒక ప్రకటన విడుదల చేసింది. " విదేశాంగ మంత్రి తన ప్రసంగంలో గౌతమ బుద్ధుడి వారసత్వం గురించి ప్రస్తావించారు. బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించారనడంలో మాకు ఎలాంటి సందేహం లేదు'' అని ఆ ప్రకటన పేర్కొంది.
అయితే జైశంకర్ గౌతమ బుద్ధుడిని భారతీయుడిగాఎందుకు అభివర్ణించారో మాత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేయలేదు.
నేపాల్, భారత్‌ల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తత ఉంది. ఈ ఏడాది మే నెలలో నేపాల్ తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ దేశంలోని భాగాలుగా ప్రకటించుకుంది. అయితే ఈ మూడు ప్రాంతాలు ఇప్పటికీ భారతదేశంలోనే ఉండగా, నేపాల్ మాత్రం అవి తమ ప్రాంతాలని అంటోంది.
2004లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనను నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ప్రస్తావించింది. గౌతమ బుద్ధుడు నేపాల్‌లో జన్మించారని, ఆయన ప్రపంచానికి శాంతిదూత అని నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది.
బౌద్ధమతం నేపాల్ నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందిందన్నది నిజం. ఇది వివాదాస్పద విషయం కాదు. దీనిపై ఎటువంటి సందేహాలు లేవు. ఇది చర్చనీయాంశం కానే కాదు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ నేపాల్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఇదే విషయంపై నేపాల్ మాజీ విదేశాంగ కార్యదర్శి మధు రామన్ ఆచార్య కూడా ట్వీట్ చేశారు "సుమారు 2270 సంవత్సరాల క్రితం భారత చక్రవర్తి అశోకుడు బుద్ధుడి జన్మస్థలాన్ని గుర్తించి ఒక స్తంభం నిర్మించాడు. ఈ స్మారక చిహ్నం బుద్ధుడు భారతీయుడు అనే వాదనకంటే పెద్దది'' అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను నేపాలీ కాంగ్రెస్ ప్రతినిధి బిశ్వ ప్రకాశ్ శర్మ కూడా ప్రశ్నించారు. బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించారని, భారత విదేశాంగ మంత్రి ప్రకటనపై తనకు తీవ్ర అభ్యంతరాలున్నాయని, ఇది చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని ఆయన అన్నారు.
రాముడి జన్మస్థలం గురించి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇటీవల జరిగిన కవి భానుభక్త 207వ జన్మదినోత్సవం సందర్భంగా వివాదాస్పద ప్రకటన చేశారు. నిజమైన అయోధ్య నేపాల్‌లోని బీర్‌గంజ్‌కు సమీపంలోని ఓ గ్రామమని, ఇక్కడే రాముడు పుట్టాడని శర్మ వ్యాఖ్యానించారు. వాస్తవాలను చాలామంది వక్రీకరించారని, తాము సీతను భారత యువరాజైన రాముడికి ఇచ్చి వివాహం చేశాం తప్ప అయోధ్య రాముడితో కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన అయోధ్య బీర్‌గంజ్‌కు పశ్చిమాన ఉన్న ఓ గ్రామమని, ఇప్పుడు గుడి నిర్మిస్తున్నది కాదని ఆయన అన్నారు.
అయితే నేపాల్ ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే భారత్ నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది. ఆయన ప్రకటనను సాధు సంతులు ఖండించారు.
వెంటనే నేపాల్ విదేశాంగా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
రాముడు, ఆయన జన్మస్థలం, ఇతర ప్రదేశాల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయని, రామాయణంపై విస్తారమైన సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపవలసిన అవసరం ఉందని మాత్రమే ప్రధాని చెప్పారని నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటన చెప్పింది. ఈ వ్యాఖ్యలు అయోధ్య సాంస్కతిక విలువలను, ప్రాముఖ్యతను తగ్గించడానికి ఉద్దేశించినవి కాదని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామాబాద్ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)