ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి

  • వి. శంకర్
  • బీబీసీ కోసం
ముస్లిం, క్రైస్తవ వివాహం

పెళ్లికూతురు ముస్లిం అమ్మాయి. పెళ్లికొడుకు క్రైస్తవుడు. వీరిద్దరి పెళ్లి హిందూ మత సంప్రదాయంలో జరిగింది. భిన్న సంస్కృతుల నిలయమైన దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంటను సన్నిహితులు ఆశీర్వదించారు.

తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన తల్లాడ మండలం అన్నారుగూడెంలో అనిల్ కుమార్ అనే యువకుడు కొంతకాలంగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అంతకుముందు అతను క్యాటరింగ్ సూపర్ వైజర్ గా ఉండేవాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఖమ్మం కాలేజీలో పరిచయం అయిన షేక్ సోనీ అనే యువతిని ఆయన ప్రేమించాడు. ఇద్దరూ ఇష్టపడడంతో అప్పటి నుంచి తమ ప్రేమను కొనసాగిస్తున్నారు .ఇంటర్మీడియట్ తర్వాత అనిల్ వివిధ వృత్తులు చేసుకుంటూ గడుపుతుండగా, సోనీ మాత్రం డిగ్రీ పూర్తి చేసింది.

ముస్లిం, క్రైస్తవ వివాహం

పెళ్లికి అంగీకరించని వధువు తల్లిదండ్రులు

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ జంటకు ఆటంకాలు ఎదురయ్యాయి. సమీప గ్రామం గొల్లగూడానికి చెందిన షేక్ సోనీ తల్లిదండ్రులు మతాంతర వివాహానికి నిరాకరించారు.

అది వారికి సమస్య కావడంతో అనిల్ స్నేహితులు, బంధువులు కొందరు సహకరించారు. దాంతో వారు ఇరు మతాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు అనిల్ చెబుతున్నారు.

ముస్లిం, క్రైస్తవ వివాహం

అనిల్ బీబీసీతో మాట్లాడుతూ, "ఐదేళ్లుగా మాకు పరిచయం. ఇంటర్ చదువుతున్నప్పుడు మా స్నేహం ప్రేమగా మారింది. అప్పుడే ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అయినా వెనకడుగు వేయలేదు. అందరికీ సమ్మతంగా ఉండాలని మా మతాచారాలను పక్కన పెట్టేశాం. వాళ్ల మత సంప్రదాయాలను కాదనుకున్నాం. సోనీ వాళ్ల కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు అంగీకరించలేదు. చివరకు పెళ్లికి కూడా రాలేదు. మా బంధువులు, మిత్రుల సమక్షంలోనే పెళ్లి పూర్తి చేసుకున్నాం" అని చెప్పారు.

తమ సొంత మతాల ఆచారాలను పక్కన పెట్టిన తీరు మీద పలువురు అభినందనలు చెబుతున్నారని, ప్రేమ కన్నా మతాలు, సంప్రదాయాలు గొప్పకాదని చెప్పారంటూ ఫోన్లు కూడా చేస్తున్నారని కూడా అనిల్ చెప్పారు.

ముస్లిం, క్రైస్తవ వివాహం

హిందూ సంప్రదాయం ప్రకారమే

పెళ్లితంతు మొత్తం హిందూ సంప్రదాయాన్ని అనుసరించే చేశారు. సహజంగా హిందువుల పెళ్లిళ్లలో జరిగినట్లుగానే ముహూర్తం నుంచి అన్ని ఆచారాలూ పాటించారు. పెళ్లిలో పెళ్లికుమార్తె తరుపు వారి బాధ్యతలను పెళ్లి కొడుకు మేనమామ జి. విజయ్ భాస్కర్ నిర్వహించారు.

"నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. ఇలాంటి పెళ్లి మా ఇంట జరగడం ఆనందంగా ఉంది. పెళ్లికి అమ్మాయి ఇంటి వారు అంగీకరించి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లం. కానీ వారు సిద్ధం కాలేదు. అయినప్పటికీ ఇలాంటి ఓ కొత్త పద్ధతిలో పెళ్లి చేసుకున్న తీరు చాలామందిని ఆకట్టుకుంది. బీజేపీ నాయకులు కూడా ఇంటికి వచ్చి అభినందించారు. ఇకపై కూడా వారి జీవితం సంతోషంగా సాగాలని అందరం ఆశిస్తున్నాం" అని విజయభాస్కర్ బీబీసీతో అన్నారు.

పెళ్లిలో కీలక పాత్ర పోషించిన అనిల్ స్నేహితులు కూడా వివాహ పద్ధతి మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివాహంపై స్పందించేందుకు వధువు షేక్ సోనీ సిద్ధంకాలేదు. ఆమె కుటుంబీకులు కూడా నిరాకరించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)