భారత పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్న టాటా ప్రాజెక్ట్స్... విమర్శకులు ఏమంటున్నారు?

భారత పార్లమెంటు భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత పార్లమెంటు భవనం

భారతదేశ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే కాంట్రాక్టును దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ గెల్చుకుంది.

దాదాపు 860 కోట్ల రూపాయల వ్యయంతో టాటా ప్రాజెక్ట్ దేశ రాజధాని నడిబొడ్డున సరికొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనుంది.

బ్రిటిష్ వలస పాలన నాటి ప్రస్తుత పార్లమెంటు భవనం స్థానంలోనే ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తారు. ఈ నిర్మాణం 2022 నాటికి, అంటే భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సిద్ధమవుతుంది.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రభుత్వం ఆ మహమ్మారిని కట్టడి చేయడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తే బాగుంటుందని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా బారిన పడి 80,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.

ప్రభుత్వం మాత్రం 1920ల నాటి ఈ భవనానికి కాలం చెల్లిందని చెబుతోంది. అందుకే, కొత్త పార్లమెంటు భవన నిర్మాణం తప్పనిసరి అని అంటోంది. ఎంపీల సంఖ్యతో పాటు పార్లమెంటు సిబ్బంది సంఖ్య కూడా ఇటీవలి కాలంలో పెరిగిందని గుర్తు చేస్తోంది.

కొత్తగా నిర్మించబోయే భవనం ఇప్పుడున్న దాని కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అందలో 1,400 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంటుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

దిల్లీలో వలస పాలన కాలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాల ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూపొందించిన దాదాపు 20,000 కోట్ల రూపాయల ప్రణాళికలో భాగంగా పార్లమెంటు భవనాన్ని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు.

అయితే, ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఆర్థిక భారంతో పాటు భవన నిర్మాణ శైలికి సంబంధించిన విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన దాదాపు దశాబ్ద కాలంగా వినిపిస్తూనే ఉంది. పార్లమెంటు స్పీకర్లు కొందరు పార్లమెంటు భవనాన్ని కొత్తగా నిర్మించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పుడున్న వృత్తాకార పార్లమెంటు భవనానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెర్బర్ట్ బేకర్ రూపకల్పన చేశారు. భారీ గుమ్మటాలతో డిజైన్ చేసిన ఈ భవన నిర్మాణాన్ని 1927లో పూర్తి చేశారు.

అయితే, ఈ భవన నిర్మాణం పూర్తయిన తరువాత కొందరు చరిత్ర కారులు దాని ఆకారం చూసి ఎగతాళి చేశారని చరిత్రకారుడు దీన్యార్ పటేల్ తన పుస్తకంలో రాశారు. బ్రిటన్ రాజకీయ ప్రముఖుడు ఫిలిప్ సాసూన్, 'ఈ భవనం గ్యాసోమీటర్‌లా ఉంద'ని వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.

వాస్తు శిల్పి బేకర్ కూడా ఈ నిర్మాణంలోని లోపాలను అంగీకరించారు. "సెంట్రల్ హాలు మీద నిర్మించిన గుమ్మటం సరిగా అమర్చడంలో విఫలమయ్యాం" అని బేకర్ చెప్పినట్లు పటేల్ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)