సంపూర్ణ అయోధ్య కాండ

మసీదు మీద శాసనాలు, ప్రభుత్వ పత్రాల ప్రకారం.. నాడు దండెత్తివచ్చిన మొఘల్ చక్రవర్తి బాబరు ఆదేశం మేరకు ఆయన గవర్నర్ మీర్ బక్కీ 1528-1530 మధ్య అయోధ్యలోని రామ్ కోట్ మొహల్లా ప్రాంతంలో ఒక గుట్ట మీద ఈ మసీదును నిర్మించారు.

అయితే.. బాబరు కానీ మీర్ బక్కీ కానీ ఈ భూమిని ఎలా సంపాదించారనే దాని గురించి, మసీదును నిర్మించటానికి ముందు ఈ ప్రదేశంలో ఏముంది అనేది నిర్ధారించటానికి ఎలాంటి రికార్డులూ లేవు.

మొఘల్ పాలకులు, నవాబులు, అనంతరం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఈ మసీదు నిర్వహణ కోసం వక్ఫ్ ద్వారా నిర్దిష్ట మొత్తం కేటాయింపులు జరిగేవి.

మసీదు విషయంలో స్థానిక హిందువులు, ముస్లింల మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయని వినిపిస్తుంది.

1855లో నవాబ్ పాలనా కాలంలో చాలా మంది ముస్లింలు ఈ మసీదు వద్ద గుమిగూడి.. దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో గల అయోధ్య హనుమాన్ గఢీ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవటానికి గుంపుగా బయలుదేరారని చాలా మంది బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. ఆ ఆలయం ఉన్న స్థలంలో ఉన్న ఒక మసీదును కూల్చివేసి ఆ ఆలయాన్ని నిర్మించారన్నది వారి వాదన.

ఆ రక్తసిక్త సంఘర్షణలో హిందూ సాధువులు ముస్లింలను తిప్పికొట్టారు. ముస్లింలు తప్పించుకుపోయి బాబ్రీ మసీదు సముదాయంలో తలదాచుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఈ దాడి చేసిన ముస్లింలలో చాలా మందిని చంపి, అక్కడే ఉన్న స్మశానంలో సమాధిచేశారు.

ఈ మసీదు చుట్టూ ఉన్న ప్రదేశం రాముడి జన్మస్థలమని హిందూ సమాజం విశ్వాసమని, అక్కడ పూజలు నిర్వహించేవారని చాలా స్థలపురాణాల్లో ఉంది. ఇదే విషయాన్ని చాలా మంది విదేశీ పర్యటకులు తమ యాత్రాచరిత్రల్లోనూ ప్రస్తావించారు.

1857 తిరుగుబాటు తర్వాత నవాబు పాలన ముగిసి బ్రిటిష్ పాలన, బ్రిటిష్ న్యాయవ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ కాలంలోనే హిందువులు ఇక్కడ ఒక వేదిక నిర్మించి పూజలు, ప్రార్థనలు చేయటం ప్రారంభించారని.. దీని ఫలితంగా ఈ రెండు సమూహాల మధ్య అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు.

మసీదుకు సంబంధించిన ఒక అధికారి మొహమ్మద్ అస్ఘర్.. 1858 నవంబర్ 30వ తేదీన ఒక ఫిర్యాదు నమోదు చేశారు. మసీదును ఆనుకుని హిందువులు ఒక వేదిక నిర్మించారని, మసీదు గోడ మీద ‘రామ్ రామ్’ అని రాశారని ఆ ఫిర్యాదు సారాంశం.

పాలనాయంత్రాంగం శాంతిభద్రతలను కాపాడటానికి ఈ వేదికకు, మసీదుకు మధ్య ఒక గోడ నిర్మించింది. కానీ.. అక్కడ అప్పటికీ ఒకే ఒక్క ప్రధాన ద్వారం ఉంది. గోడ నిర్మించిన తర్వాత కూడా హిందువులు తమ నమాజుకు ఆటంకం కల్పిస్తున్నారంటూ ముస్లింలు తరచుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.

అక్కడ ఆలయం నిర్మించటానికి అనుమతి కోరుతూ 1883లో నిర్మోహి అఖాడా నాటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్‌కు ఒక దరఖాస్తు సమర్పించింది. కానీ ముస్లింలు అభ్యంతరం తెలపడంతో.. ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

1883 మే నెలలో.. మున్షీ రాం లాల్, రామ్ మురారీ రాయ్ బహదూర్‌ల ఉద్యోగి, లాహోర్ నివాసి అయిన గురుముఖ్ సింగ్ పంజాబీ.. కొన్ని రాళ్లు, ఇతర భవన నిర్మాణ వస్తువులతో అక్కడికి వచ్చి.. అక్కడ ఆలయం కట్టటానికి అనుమతి కావాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. కానీ.. ఆయన తెచ్చిన రాళ్లు, ఇతర భవన నిర్మాణ వస్తువులను నాటి డిప్యూటీ కమిషనర్ ఆ ప్రదేశం నుంచి తొలగింపజేశారు.

ఆ ప్రాంతం రాముడి జన్మస్థలం అని వాదిస్తూ నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రఘుబర్ దాస్.. 1885 జనవరి 29న భారత ప్రభుత్వానికి, మొహమ్మద్ అస్ఘర్‌కు వ్యతిరేకంగా మొదటిసారిగా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు.

అక్కడున్న ఓ 17 x 21 అడుగుల వేదిక రాముడి జన్మస్థలమని వాదిస్తూ.. తమ దేవుడికి, పూజారులకు ఎండావానల నుంచి రక్షణ కల్పించటానికి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించటానికి అనుమతినివ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ స్థలం యజమానులం తామేనని.. ఆ స్థలం తమ స్వాధీనంలోనే ఉందని పిటిషన్‌దారులు చెప్పారు. ఆ వేదిక నుంచి పిటిషనర్‌ను తొలగించలేదని.. కాబట్టి ఇందులో వ్యాజ్యానికి తావులేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

మొహమ్మద్ అస్ఘర్ తన తరఫు వాదనలు వినిపిస్తూ.. అక్కడ ఆలయం నిర్మించటానికి అనుమతుల కోసం పలుమార్లు విజ్ఞప్తులు వచ్చినా అధికార యంత్రాంగం తిరస్కరించిందని చెప్పారు.

జస్టిస్ పండిట్ హరికిషన్ ఈ స్థలాన్ని సందర్శించి.. వేదిక మీద రాముడి పాదముద్రలు ఉన్నాయని, అక్కడ ఒక విగ్రహం ఉందని, దానిని పూజించేవారని పేర్కొన్నారు.

దీనికి ముందు హిందువులు, ముస్లింలు ఇరువురూ అక్కడ ప్రార్థనలు చేయటం, మత కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుండేది. ఘర్షణలు, కొట్లాటలు నిలువరించటానికి గోడ నిర్మించారు. ఆ వేదిక, మసీదు గోడల వెలుపలి భూమి.. చట్టబద్ధంగా హిందువుల స్వాధీనంలో ఉందని న్యాయమూర్తి తీర్మానించారు.

జస్టిస్ పండిట్ హరికిషన్ ఈ వివరాలన్నీ నమోదుచేసిన తర్వాత.. ఆ వేదిక, మసీదు పక్కపక్కన ఉన్నాయని, వాటికి ఉమ్మడి ప్రవేశద్వారం ఉందని కూడా రాశారు.

అక్కడ ఆలయాన్ని నిర్మించినట్లయితే గంటలు మోగుతాయని, శంఖువులు పూరిస్తారని.. అది రెండు మతాల వారి మధ్య ఘర్షణలను రాజేస్తుందని, మనుషుల ప్రాణాలు పోతాయని.. అందుకే అక్కడ ఆలయ నిర్మాణానికి అధికార యంత్రాంగం అనుమతులు నిరాకరించిందని కూడా ఆయన రాశారు.

నిర్మోహి అఖాడా మహంత్ కోరినట్లు అనుమతి ఇస్తే.. అది భవిష్యత్తులో హిందువులు, ముస్లింల మధ్య అల్లర్లకు పునాది వేస్తుందని చెప్తూ ఆ దరఖాస్తును జడ్జి తిరస్కరించారు.

మసీదు సముదాయం వెలుపల ఆలయం నిర్మించటానికి సంబంధించిన కేసును నిర్మోహి అఖాడా అలా ఏడాది వ్యవధిలోనే ఓడిపోయింది.

అప్పుడు జిల్లా కోర్టులో కేసు వేశారు. జస్టిస్ చామీర్ ఆ స్థలాన్ని సందర్శించి మూడు నెలల్లోనే తీర్పు చెప్పారు. ‘‘హిందువులు తమకు పవిత్రమని భావించే స్థలంలో మసీదును నిర్మించటం దురదృష్టకరం. కానీ.. ఆ సంఘటన 256 సంవత్సరాల కిందట జరిగింది కనుక.. ఇప్పుడు ఈ ఫిర్యాదును పరిష్కరించటం సాధ్యంకాదు” అని తన తీర్పులో రాశారు.

“ఈ వేదికను రామచంద్రుడి జన్మస్థలం అని పిలుస్తున్నారు” అని ఆ జడ్జి పేర్కొన్నారు.

“ప్రస్తుత పరిస్థితులను మార్చటం వల్ల ప్రయోజనం ఉండదు సరికదా నష్టం కలిగిస్తుంది” అని కూడా వ్యాఖ్యానించారు.

అయితే ఉప న్యాయమూర్తి హరి కిషన్ తీర్పులో.. ఆ వేదిక చాలా కాలంగా హిందువుల స్వాధీనంలో ఉందని, వారి యాజమాన్యాన్ని ప్రశ్నించజాలమని చెప్తున్న కొంత భాగం ‘‘అనవసరం” అంటూ జస్టిస్ చామీర్ తొలగించారు.

ఆ తర్వాత నిర్మోహి అఖాడా అవధ్ జ్యుడీషియల్ కమిషనర్ డబ్ల్యు.యంగ్ కోర్టులో రెండో పిటిషన్ దాఖలు చేసింది.

జ్యుడీషియల్ కమిషనర్ డబ్ల్యు.యంగ్ 1886 నవంబర్ 1న తీర్పు చెప్తూ.. ‘‘350 ఏళ్ల కిందట మతవిద్వేషకుడైన బాబర్ హిందువులు రామచంద్రుడి జన్మస్థలమని విశ్వసించే పవిత్ర స్థలంలో ఉద్దేశపూర్వకంగా మసీదు నిర్మించాడు. ప్రస్తుతం ఆ స్థలంలోకి హిందువులకు పరిమితమైన ప్రవేశమే ఉంది. వారు తమ ప్రవేశ పరిధిని పెంచుకోవటానికి సీతా రసోయి - సీత వంటగది, రామచంద్రుడి జన్మస్థలంలో ఆలయం నిర్మించాలని కోరుతున్నారు” అని రాశారు.

అయితే.. ‘‘ఆ స్థలం మీద హిందూ బృందం యాజమాన్యాన్ని నిర్ధారించటానికి ఏ విధమైన రికార్డులూ లేవు” అని ఆయన కూడా తన తీర్పులో నమోదుచేశారు.

మూడు కోర్టులూ తమ తీర్పుల్లో.. ఆ వివాదాస్పద స్థలం పట్ల హిందువుల నమ్మకాలు, విశ్వాసాలనే ప్రస్తావించారు. కానీ తమ తీర్పులకు మాత్రం రికార్డుల్లో మాత్రమే ఉన్న ఆధారాలు, శాంతిని కాపాడటానికి తక్షణ అవసరాలనే ప్రాతిపదికగా చేసుకున్నారు.

1934లో ముస్లింల పండుగ అయిన బక్రీద్ రోజున ఒక గోవధ సంఘటన.. మత ఘర్షణలను రాజేసింది. ఆ అల్లర్లలో బాబ్రీ మసీదు ధ్వంసమైంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దానికి మరమ్మతు చేయించింది.

షియా - సున్నీ వివాదం

1936లో ఈ మసీదు యాజమాన్యం విషయంలో ముస్లింలలో రెండు వర్గాలైన షియాలు, సున్నీల మధ్య వివాదం తలెత్తింది.

వక్ఫ్ కమిషనర్ విచారణ నిర్వహించారు. ఈ మసీదును నిర్మించిన మీర్ బక్కీ షియా వర్గానికి చెందినవాడని.. కాబట్టి ఇది షియాలకే చెందుతుందని మసీదు మేనేజర్ మొహమ్మద్ జాకీ వాదించారు.

కానీ జిల్లా వక్ఫ్ కమిషనర్ మాజిద్ 1941 ఫిబ్రవరి 8న ఇచ్చిన తన నివేదికలో.. ఈ మసీదును నిర్మింపజేసిన చక్రవర్తి సున్నీ వర్గానికి చెందినవాడని, మసీదులో ప్రార్థనలు చేసే, నిర్వహించే ఇమామ్‌లు సున్నీలని.. కాబట్టి ఈ మసీదు సున్నీ వర్గం వారికి చెందుతుందని రాశారు.

ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు.. ఫైజాబాద్‌లోని సివిల్ జడ్జి కోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేసు వేసింది.

సివిల్ జడ్జి ఎస్.ఎ.అహసాన్.. 1946 మార్చి 30న తీర్పు చెప్తూ షియా వర్గం వాదనను తిరస్కరించారు.

ఈ కేసుకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఈ మసీదు తమకు చెందుతుందని వాదించే కొందరు షియా వర్గ నాయకులు.. ఆ భవనం స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగిస్తామని చెప్తున్నారు.

భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసేముందు.. హిందువులు మళ్లీ ఆ వేదిక స్థలంలో ఆలయం నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే.. అప్పటి నగర మెజిస్ట్రేట్ షఫీ ఇరు వర్గాల వారితో చర్చించి ఒక లిఖిత ఉత్తర్వు జారీ చేశారు. ఆ వేదికను శాశ్వత నిర్మాణంగా మార్చరాదని, అక్కడ విగ్రహాలను స్థాపించరాదని.. ఇరు మతాల వారూ యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్దేశించారు.

అయినా కూడా ఆ స్థలంలో నమాజు చేసుకుంటున్న ముస్లింలను హిందూ సాధువులు వేధిస్తున్నారంటూ ముస్లింలు రాతపూర్వక ఫిర్యాదులు చేయటం కొనసాగించారు.

భారత విభజన తర్వాత.. ముస్లింలు – ముఖ్యంగా పలుకుబడిగలవాళ్లు - భారీ సంఖ్యలో పాకిస్తాన్‌కు వలసపోయారు. విభజన అనంతరం మత హింసను నిలువరించటానికి, మత సామరస్యాన్ని ప్రోత్సహించటానికి ప్రయత్నించిన మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు.

ఎన్నికల అంశంగా రామ మందిరం

అనంతరం.. సోషలిస్టులు కాంగ్రెస్ పార్టీని వీడి తమ సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఆచార్య నరేంద్ర దేవ్ సహా ఆ పార్టీ నాయకులందరూ శాసనసభకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్.. అయోధ్య ఉప ఎన్నికలో ఆచార్య నరేంద్ర దేవ్ మీద పలుకుబడిగల హిందూ మత నాయకుడు బాబా రాఘవ్ దాస్‌ను పోటీకి పెట్టారు.

అయోధ్యలో ఆలయ నిర్మాణం ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది. బాబా రాఘవ్ దాస్‌కు భారీ మద్దతు లభిస్తోంది. జీబీ పంత్ చాలా ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తూ.. రాముడి మీద ఆచార్య నరేంద్ర దేవ్‌కు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. భారతదేశంలో సామ్యవాద అగ్రగామి అయిన ఆచార్య నరేంద్ర దేవ్ ఆ ఎన్నికలో ఓడిపోయారు.

వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం 1948 డిసెంబర్ 10వ తేదీన ఇచ్చిన నివేదికలో.. మసీదుకు ప్రమాదం పొంచి ఉందని అధికారయంత్రాగాన్ని అప్రమత్తం చేశారు.

మసీదు ఎదుట గల చాలా సమాధులు, గోరీలను హిందూ సాధువులు తొలగిస్తున్నారని.. అక్కడ రామాయణం పఠిస్తున్నారని, మసీదును బలవంతంగా ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని ఆ నివేదికలో వివరించారు.

కర్రలు, గొడ్డళ్ల వంటి ఆయుధాలు ధరించిన హిందువుల గుంపు అక్కడ గుమిగూడుతుండటంతో.. కేవలం శుక్రవారాల్లో మాత్రమే నమాజు చేయగలిగే పరిస్థితి నెలకొందని కూడా ఆ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.

ఉప ఎన్నికలో బాబా రాఘవ్ దాస్ గెలుపుతో ఆలయ మద్దతుదారుల్లో ధీమా పెరిగింది. వాళ్లు మళ్లీ.. ఆలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ 1949 జులైలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

ఆ స్థలం యాజమాన్యానికి సంబంధించి తక్షణం ఒక సానుకూల నివేదిక పంపించాలని నాటి ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సెక్రటరీ చార్ సింగ్ అప్పటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కె.కె.నాయర్‌కు రాతపూర్వకంగా సూచించారు. వివాదంలో ఉన్న ఆ స్థలం ప్రభుత్వానికి చెందుతుందా లేక నగర మున్సిపాలిటీకి చెందుతుందా అనేది తెలియజేయాలని ఆయన కోరారు.

నగర మెజిస్ట్రేట్ గురుదత్ సింగ్ 1949 అక్టోబర్ 10వ తేదీన కలెక్టర్‌కు ఒక నివేదిక పంపించారు. మసీదు పక్కన ఒక చిన్న ఆలయం ఉందని.. అది రాముడి జన్మస్థలమని హిందూ సమాజం విశ్వాసమని.. అక్కడ భారీ ఆలయం నిర్మించాలని వారు కోరుకుంటున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

అది ప్రభుత్వ స్థలమని.. అక్కడ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వటానికి ఎలాంటి అవరోధం లేదని నగర మెజిస్ట్రేట్ సిఫారసు చేశారు.

అది కొత్త రాజ్యాంగం అమలులోకి రావటానికి ముందున్న సంధి కాలం.

మసీదులో విగ్రహాలు

హిందూ సాధువులు నవంబర్ 24న మసీదు ముందు స్మశానాన్ని శుభ్రం చేయటం ప్రారంభించారు. అక్కడ యజ్ఞం, పూజలు చేస్తూ రామాయణం పఠించటం మొదలుపెట్టారు. దీంతో భారీ ఎత్తున జనం గుమిగూడటం మొదలైంది. పరిస్థితులు భారీ ఘర్షణకు దారితీసే అవకాశముందని గ్రహించిన అధికార యంత్రాంగం అక్కడ ఒక పోలీస్ శిబిరాన్ని ఏర్పాటుచేసి పీఏసీ పారామిలటరీ బలగాలను మోహరించింది.

పీఏసీ పహారా ఉన్నా కూడా.. 1949 డిసెంబర్ 22వ తేదీ రాత్రి.. అభయ్ రామ్‌దాస్, ఆయన సహచరులు గోడ దూకి వెళ్లి మసీదులో రాముడు, జానకి, లక్ష్మణుడి విగ్రహాలు పెట్టి.. రాముడు అక్కడ ఆవిర్భవించాడని, తన జన్మస్థలాన్ని సొంతం చేసుకున్నాడని ప్రచారం చేయటం మొదలుపెట్టారు.

ముస్లిం ప్రజలు శుక్రవారం నాడు మసీదులో ప్రార్థనలు చేయటానికి వచ్చారు. కానీ అధికార యంత్రాంగం.. కొంత సమయం కోరుతూ వారిని తిప్పి పంపించింది.

అభయ్ రామ్ ప్రణాళికకు కలెక్టర్ నాయర్ రహస్యంగా మద్దతిచ్చారని చెప్తారు. ఆయన మరుసటి రోజు ఉదయం ఆ స్థలాన్ని తనిఖీ చేయటానికి వచ్చినపుడు కూడా.. రాత్రిపూట జరిగిన అతిక్రమణను తిప్పికొట్టి యథాపూర్వస్థితికి తీసుకెళ్లే ప్రయత్నమేదీ చేయలేదు. పైగా.. ఆక్రమణ వాదనను బలపరచటం కోసం దానిని రికార్డుల్లో నమోదు చేశారు.

అయోధ్య పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రామ్‌దేవ్ దూబే.. పోలీస్ కానిస్టేబుల్ మాతా ప్రసాద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక కేసు నమోదు చేశారు.

ఆ రాత్రి 50 నుంచి 60 మంది గోడ దూకి వెళ్లి, మసీదు తాళాలు పగులగొట్టి, గోడల మీద పలు చోట్ల దేవుళ్లు, దేవతల విగ్రహాలు పెట్టారని ఆ కేసు నివేదికలో పేర్కొన్నారు. ఈ దురాక్రమణ ద్వారా మసీదును కూడా అపవిత్రం చేశారని ఆ రిపోర్టు ప్రస్తావించింది.

ఈ పోలీస్ రిపోర్ట్ ఆధారంగా.. ఐపీసీ సెక్షన్ 145 కింద ఆ స్థలాన్ని అటాచ్ చేయాలంటూ సిటీ అదనపు మెజిస్ట్రేట్ అదే రోజు ఒక నోటీస్ జారీచేశారు.

మరోవైపు దిల్లీలో అసహనానికి గురైన నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ.. ముఖ్యమంత్రి జీబీ పంత్‌కు ఒక టెలిగ్రామ్ పంపించారు.

‘‘అయోధ్యలోని సంఘటనలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ పెడతారని నేను విశ్వసిస్తున్నా. ఒక ప్రమాదకర దృష్టాంతాన్ని నెలకొల్పుతున్నారు. దానివల్ల వినాశకర పర్యవసానాలు ఉంటాయి” అని ఆ టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య కార్యదర్శి.. ఫైజాబాద్ కమిషనర్‌ను లక్నోకు పిలిపించి చీవాట్లు పెట్టారు. ఆ సంఘటనను పాలనాయంత్రాంగం ఎందుకు నివారించలేదని.. ఉదయాన్నే ఆ విగ్రహాలను ఎందుకు తొలగించలేదని ఆయనను ప్రశ్నించారు.

జిల్లా మెజిస్ట్రేట్ నాయర్.. ఈ అంశం గురించి ముఖ్య కార్యదర్శి భవన్ సహాయ్‌కి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆ అంశానికి సాధారణ ప్రజల్లో విస్తృత మద్దతు ఉందని.. పాలనా యంత్రాంగంలోని కొద్ది మంది మనుషులు వారిని నిలువరించలేకపోయారని అందులో పేర్కొన్నారు. తాము హిందూ నాయకులను అరెస్ట్ చేసివున్నట్లయితే.. పరిస్థితి మరింత దిగజారి ఉండేదని ఆయన చెప్పారు.

నాయర్ ఎదిరించే తరహాలో రాసిన ఆ లేఖలో.. జిల్లా పోలీస్ కెప్టెన్ మూర్తిని తొలగించాలన్న నిర్ణయంతో తాను ఏకీభవించటం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఆయనను ఎట్టిపరిస్థితిల్లోనూ తొలగించాలని ప్రభుత్వం కోరుకున్నట్లయితే.. ముందు తనను తొలగించి వేరే జిల్లా కలెక్టర్‌ను ఇక్కడ నియమించాలని రాశారు.

ఆర్‌ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌లతో సంబంధం ఉన్న వ్యక్తులు.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే కార్యకలాపాలకు క్రియాశీలంగా మద్దతు ఇస్తున్నారు.

జిల్లా కలెక్టర్ నాయర్‌, నగర మెజిస్ట్రేట్ గురుదత్ సింగ్‌.. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ సభ్యులన్న విషయం ఆ తర్వాత స్పష్టమైంది. అనంతర కాలంలో నాయర్ జన్‌సంఘ్ టికెట్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.

అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకునే ముందుగానే అదనపు సిటీ మెజిస్ట్రేట్ మార్కండేయ సింగ్.. బాబ్రీ మసీదు – రామ జన్మభూమి భవనాన్ని భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 145 కింద అటాచ్ చేశారు.

ఆ స్థలం యాజమాన్యం విషయంలో హిందువులు, ముస్లింల మధ్య వివాదం, ఘర్షణ.. శాంతికి భంగం కలిగించగలదని ఆయన వాదించారు.

మార్కండేయ సింగ్.. మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రియదత్ రామ్‌ను గ్రహీతగా నియమించి.. ఆ విగ్రహాలకు పూజలు తదితర మతపరమైన క్రతువులు నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు.

ఈ సంఘటనలతో కలత చెందిన ప్రధానమంత్రి నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ పటేల్‌ను లక్నోకు పంపించారు. ముఖ్యమంత్రి జీబీ పంత్‌కు అనేక లేఖలు కూడా రాశారు. అవసరమైతే తాను స్వయంగా అయోధ్యకు వస్తాననీ చెప్పారు.

ఆ సమయంలో.. దేశ విభజనతో చెలరేగిన మత కలహాలు, మారణహోమాల నుంచి దేశం ఇంకా కోలుకుంటోంది. అప్పటికి ఇంకా చాలామంది పాకిస్తాన్‌కు వలస వెళ్లటం, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వలస రావటం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ దాడి తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి సున్నితంగా తయారైంది.

అయోధ్య సంఘటనలు దేశం మొత్తం మీద.. ప్రత్యేకించి భారతదేశంలో ఉండాలని ఎంచుకున్న, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ మీద ప్రభావం చూపగలవని జీబీ పంత్‌కు రాసిన ఒక లేఖలో నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు నిస్సహాయస్థితిలో ఉన్న నెహ్రూ.. ఉత్తర్ ప్రదేశ్ తన సొంత రాష్ట్రమైనా కూడా అక్కడి జనం తన మాట వినటం లేదని.. స్థానిక కాంగ్రెస్ నాయకులు మతతత్వవాదులుగా మారుతున్నారని పేర్కొన్నారు.

ఫైజాబాద్ విభాగంలో సీనియర్ నాయకుడైన అక్షయ్ బ్రహ్మాచారి.. ఆ సంఘటనకు నిరసనగా చాలా కాలం పాటు నిరాహార దీక్ష కొనసాగించారు.

ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ హోంమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రికి కూడా ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చారు.

ఉత్తర్ ప్రదేశ్ శాసన సభలో సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ.. ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం సరికాదంటూ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క వాక్యంలో బదులిచ్చింది.

సివిల్ దావాలు

రాముడి జన్మస్థలంలో స్థాపించిన శ్రీరాముడు తదితర విగ్రహాలను తొలగించరాదని, జనం అక్కడ పూజలు జరపకుండా నిలువరించరాదని కోరుతూ.. గోపాల్ సింగ్ విశారద్ 1950 జనవరి 16న ప్రభుత్వం, జహూర్ అహ్మద్ తదితర ముస్లింలకు వ్యతిరేకంగా సివిల్ కోర్టులో దావా వేశారు.

సివిల్ జడ్జి అదే రోజు స్టే ఉత్తర్వులు జారీచేశారు. వాటిని స్వల్ప మార్పులతో జిల్లా జడ్జి, హైకోర్టులు కూడా సమర్థించాయి.

ఆ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు ఐదేళ్ల పాటు అలాగే ఉండిపోయింది.

జిల్లా కొత్త మెజిస్ట్రేట్ జేఎన్ ఉగ్రా తన అఫిడవిట్‌లో.. ‘‘వివాదాస్పద స్థలం బాబ్రీ మసీదు పేరుతో అందరికీ తెలుసు.. ముస్లింలు సుదీర్ఘ కాలంగా అక్కడ నమాజు చేస్తున్నారు. దానిని శ్రీరాముడి ఆలయంగా ఉపయోగించలేదు. శ్రీరామచంద్రుడి విగ్రహాలను డిసెంబర్ 22వ తేదీ రాత్రి అక్రమంగా, రహస్యంగా అక్కడ పెట్టారు” అని పేర్కొన్నారు.

కొన్ని రోజుల తర్వాత దిగంబర్ అఖాడాకు చెందిన మహంత్ రామచంద్ర పరమహంస్ కూడా విశారద్ దావా తరహాలోనే ఒక కేసు వేశారు.

ఆ విగ్రహాలను పెట్టిన వారిలో పరమహంస్ ఒకరు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ఆందోళనలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ కేసులో సైతం.. ఆ విగ్రహాలను తొలగించరాదని కోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో పూజలు కొనసాగించటానికి అనుమతి ఇచ్చింది.

చాలా ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన జడ్జి దేవకీ నాదన్ అగర్వాల్.. ఆ రాముడి విగ్రహం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ / వ్యక్తి (ఎంటిటీ) అని అభివర్ణిస్తూ కేసు వేశారు. పరమహంస్ తన కేసును ఉపసంహరించుకున్నారు.

ఆ విగ్రహాలను అక్కడ పెట్టిన పదేళ్ల తర్వాత 1959లో నిర్మోహి అఖాడా మూడో కేసు వేసింది. రామ మందిరంలో పూజలు చేయటానికి, దాని నిర్వహణకు నిర్మోహి అఖాడాకు హక్కు ఉందని వాదించింది.

ఆ తర్వాత రెండేళ్లకు 1961లో సున్నీ వక్ఫ్ బోర్డు, మరో తొమ్మిది మంది స్థానిక ముస్లింలు నాలుగో కేసు వేశారు. మసీదు యాజమాన్యంతో పాటు, మసీదుకు ఆనుకుని ఉన్న స్మశానం కూడా తమకే చెందుతుందని వారు వాదించారు.

జిల్లా కోర్టు ఈ నాలుగు కేసులనూ కలిపి వాటి మీద విచారణ ప్రారంభించింది. ఇతర సాధారణ దావాల తరహాలోనే ఈ కేసు విచారణ కూడా రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. దానివల్ల స్థానిక హిందువులు, ముస్లింలు మంచి ఇరుగుపొరుగు వారిగా కలిసి జీవించటం కొనసాగింది.

అంతేకాదు.. ఈ దావాలో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులైన పరమహంస్, హసీమ్ అన్సారీలు.. కోర్టు విచారణలకు హాజరవటానికి తామిద్దరం తరచుగా ఒకే కారులో ప్రయాణించేవాళ్లమని నాతో చెప్పారు. తాము కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్లమని, కలిసి నవ్వుకునేవాళ్లమని కూడా తెలిపారు. వాళ్లిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు ఎలాంటి సంశయం లేకుండా వెళ్లివస్తుండేవాళ్లు.

నేను ఒకసారి వీరిద్దరినీ కలిపి దిగంబర్ అఖాడాలో ఇంటర్వ్యూ చేశాను. వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు.

మందిరం – మసీదు మీద రాజకీయాలు

దేశంలో ఎమర్జెన్సీ తర్వాత 1977లో జన్‌సంఘ్, ఇతర ప్రతిపక్షాలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఆ పార్టీ ఇందిరాగాంధీని అధికారం నుంచి దించింది. కానీ.. అంతర్గత విభేదాల కారణంగా వారి ప్రభుత్వం మూడేళ్లలోనే కూలిపోయింది. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు.

ఆర్ఎస్ఎస్.. హిందువులను రాజకీయంగా ఐక్యం చేసే మార్గాల కోసం ఆలోచించటం ప్రారంభించింది. హిందువులకు అత్యంత పూజ్యనీయమైన దేవుళ్లు రాముడు, కృష్ణుడు, శివుడులకు సంబంధించిన పవిత్ర ప్రాంతాల చుట్టూ గల మసీదులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభించాలనే ఒక వ్యూహాన్ని రచించారు.

కాశీ, మధుర, అయోధ్యల పరిసరాల్లోని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు.

ఏప్రిల్ 7-8 తేదీల్లో దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఒక మత సదస్సును నిర్వహించారు. ఈ మూడు హిందూ మత క్షేత్రాలను ‘విముక్తం’ చేయాలని అందులో నిర్ణయించారు. మసీదులకు ఆనుకుని ఉన్న ఆలయాలను స్థానిక ఒప్పందాలతో నిర్మించినందున.. అయోధ్య మీద దృష్టి కేంద్రీకరించాలని వారు తీర్మానించారు.

1984 జులై 27న రామ జన్మభూమి ముక్తి యజ్ఞ కమిటీ ఏర్పాటైంది. ఒక మోటారు రథాన్ని తయారు చేశారు. అందులో ఒక బోనులో రాముడు, జానకి విగ్రహాలను పెట్టారు. ఆ రథం సెప్టెంబర్ 25న బిహార్‌లోని సీతామఢీ నుంచి బయలుదేరింది. ఆ రథం అక్టోబర్ 8వ తేదీన అయోధ్యను చేరుకునే సమయానికి.. తమ ఆరాధ్య దేవుళ్లైన రాముడు, సీతలను బోనులో చూసిన హిందువుల్లో తీవ్ర ఆగ్రహం రగిలించింది, సానుభూతిని కలిగించింది.

మసీదు తలుపులకు వేసిన తాళాలను తెరవటంతో పాటు.. అక్కడ ఆలయం నిర్మించటానికి ఆ స్థలాన్ని హిందువులకు ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్.

హిందూ సాధువులు, రుషులతో కలిపి ఒక సంస్థను నెలకొల్పారు. దానికి రామ జన్మభూమి న్యాస్ అని పేరు పెట్టారు.

ఆ రథ యాత్ర.. లక్నో మీదుగా అక్టోబర్ 31వ తేదీన దిల్లీ చేరుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రజా మద్దతు కూడగట్టింది. అదే రోజు ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆమె హత్య వల్ల జరిగిన అల్లర్ల కారణంగా.. ఈ రథ యాత్రను నవంబర్ 2వ తేదీన అర్థంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దిల్లీలో నిర్వహించతలపెట్టిన భారీ హిందూ బహిరంగ సభ రద్దయింది.

సాధారణ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. కానీ.. ఆయనకు రాజకీయ, పాలనా అనుభవం లేదు.

ఆ తర్వాత.. మసీదు తలుపులను తెరవాలంటూ విశ్వ హిందూ పరిషత్ మళ్లీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. 1986 మార్చి 6వ తేదీ శివరాత్రి నాటికి మసీదు తలుపులు తెరవకపోతే తాము బలవంతంగా ఆ తాళాలు తీస్తామని వారు హెచ్చరించారు.

ఈ ఉద్యమాన్ని మరింత సమర్థవంతంగా మలచటానికి.. ఇంకా దూకుడుగా ఉండే బజరంగ్ దళ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజల మనోభావాలను సంతుష్టపరచటానికి.. రామ్ కథ పార్కును నిర్మించటం కోసం వివాదాస్పద స్థలం సమీపంలో 42 ఎకరాల భూమిని సేకరిస్తామని ఉత్తర్ ప్రదేశ్‌లోని వీర్ బహదూర్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రభుత్వం సరయు నది ఒడ్డున రాముడి పాద ముద్రలను నిర్మించటం కూడా మొదలుపెట్టింది. కానీ.. హిందుత్వ సంస్థలను ఇది సంతృప్తిపరచలేదు.

తాళాలు తెరవటం

सांकेतिक तस्वीर

सांकेतिक तस्वीर

రాజీవ్ గాంధీ, ఆయన సహచరుల మీద ఒత్తిడి పెరగడంతో ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేయాలని ఉమేష్ చంద్ర పాండే అనే న్యాయవాదిని వాళ్లు కోరారని భావిస్తుంటారు. ఈ అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుతో ఉమేష్ చంద్ర పాండేకు ఎలాంటి సంబంధం లేదు.

జిల్లా మెజిస్ట్రేట్, పోలీస్ కెప్టెన్‌లు జిల్లా కోర్టు ఎదుట హాజరై.. మసీదు తలుపులు తెరవటం వల్ల ఆ ప్రాంతంలో శాంతిభద్రతల నిర్వహణకు ఎలాంటి సమస్యా రాదని హామీ ఇచ్చారు.

వారి వాంగ్మూలం ఆధారంగా.. మసీదు తలుపులు తెరవాలని జిల్లా జడ్జి ఎంకే పాండే ఆదేశించారు.

ఆ ఆదేశాన్ని గంట వ్యవధిలో అమలు చేశారు. ఆ సంఘటన వార్తను దూరదర్శన్‌లో సైతం ప్రసారం చేశారు. దీంతో.. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఈ సంఘటనతో అయోధ్యలోని మసీదు – మందిరం వివాదం భారతదేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి తెలిసింది.

ముస్లిం మతస్తులు మొహమ్మద్ ఆజం ఖాన్, జఫర్యాబ్ గిలానీల నేతృత్వంలో బాబ్రీ మసీదు ప్రతిఘటన కమిటీని ఏర్పాటు చేసి.. బాబ్రీ మసీదును పరిరక్షించటం కోసం ప్రతి ఉద్యమం ప్రారంభించారు.

ఈ కాలంలో.. భర్త విడాకులు ఇవ్వటంతో భరణం కోసం కేసు వేసిన ముస్లిం మహిళ షా బానోకు మనోవర్తి చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తిప్పికొట్టాలంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ మీద ఒత్తిడి తెచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పు చెల్లకుండా చేయటానికి పార్లమెంటులో చట్టం చేయాలని ఆయనను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును తిప్పికొడుతూ పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపజేశారు రాజీవ్‌గాంధీ. ఆ నిర్ణయం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు.. వివాదాస్పద స్థలం విషయంలో ఇరు పక్షాలూ రాజీ గురించి మాట్లాడాయి.

మసీదు జోలికి రాకుండా, మసీదుకు కొంత దూరంగా.. వేదిక నుంచి ఆవలి వైపు విస్తరించివున్న ఖాళీ స్థలంలో హిందువులు ఆలయం నిర్మించుకోవచ్చునని ముస్లింలు సూచించారు.

కానీ ఆ ప్రతిపాదనలను ఆర్ఎస్ఎస్ తిరస్కరించింది.

హిందువులు, ముస్లింలు ఇరువురూ దేశంలో మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించే రాజకీయాల్లో మునిగిపోయారు. అప్పుడు మందిరం ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలుపుతూ బీజేపీ ముందుకువచ్చింది.

భారతీయ జనతా పార్టీ 1989 జూన్ 11న పాలంపూర్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించింది.

ఈ అంశం మీద కోర్టు నిర్ణయం తీసుకోలేదని.. ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా కానీ, ఈ వివాదం మీద పార్లమెంటులో ఒక చట్టం చేయటం ద్వారా కానీ రామ జన్మభూమిని హిందువులకు అప్పగించాలని ఆ తీర్మానం సారాంశం.

అదిప్పుడు ఒక జాతీయ రాజకీయ అంశంగా మారిందని.. తర్వాతి పార్లమెంటు ఎన్నికలపై అది ప్రభావం చూపుతుందని జనం అనుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫైజాబాద్‌లోని నాలుగు కేసులనూ వేగంగా పరిష్కరించటం కోసం హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసింది.

నాలుగు కేసులనూ ఫైజాబాద్ నుంచి హైకోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు 1989 జులై 10వ తేదీన ఆదేశించింది. అనంతరం.. ఈ అంశం మీద హైకోర్టు తీర్పు వచ్చే వరకూ మసీదు దగ్గర, వివాదాస్పద స్థలాలన్నింట్లోనూ యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్దేశిస్తూ ఆగస్టు 14వ తేదీన హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

శంకుస్థాపన

ఆలయాన్ని నిర్మించటం కోసం నవంబర్ 9వ తేదీన తాము శంకుస్థాపన చేస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే ఇటుకలను పవిత్రం చేయటం కోసం అదే రోజున దేశమంతటా ప్రదర్శనలు నిర్వహిస్తామనీ చెప్పింది.

రాజీవ్ గాంధీ విజ్ఞప్తి మేరకు హోంమంత్రి బూటాసింగ్.. లక్నోలోని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ నివాసంలో విశ్వహిందూ పరిషత్ నాయకులను కలిశారు. అయితే.. తమ ప్రదర్శనలను శాంతియుతంగా నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హామీ ఇచ్చారు.

ఆ సంస్థ నాయకులు అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్, వారి సహచరులు.. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం యథాతథ స్థితిని కొనసాగిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.

రాజీవ్ గాంధీ ఫైజాబాద్ నుంచి.. రామ రాజ్యం తెద్దామనే పిలుపుతో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

మరోవైపు విశ్వహిందూ పరిషత్.. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించటానికి మసీదుకు సమీపంలో ఒక జెండాను పాతింది.

శంకుస్థాపనకు ప్రతిపాదిత స్థలం వివాదాస్పద ప్రాంతం పరిధిలోకి వస్తుందా లేదా అనే స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

వివాదాస్పద స్థలం వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఇచ్చిన ఆదేశం ప్రకారం.. శంకుస్థాపనకు ప్రతిపాదిత స్థలం వివాదాస్పద ప్రాంతం పరిధిలోకి వస్తుందని హైకోర్టు నవంబర్ 9వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది.

అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిశీలనతో ప్రతిపాదిత శంకుస్థాపన స్థలం వివాదాస్పద భూమికి వెలుపల ఉందని గుర్తించామని చెబుతూ.. నవంబర్ 9వ తేదీన శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది.

ఒక సూత్రానికి అంగీకరించిన తర్వాత.. మసీదుకు 200 అడుగుల దూరంలోని ప్రాంతాన్ని శంకుస్థాపన కార్యక్రమం కోసం ఎంచుకున్నారని.. దానికి సంత్ దేవరహా బాబా ఆమోదించారని చెప్తారు.

శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. కానీ ముస్లిం సమాజం తీవ్రంగా ప్రతిస్పందించటంతో.. అక్కడ తదుపరి నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వం నిలిపివేసింది.

ఈ కాలంలో కాంగ్రెస్ తిరుగుబాటు నేత వీపీ సింగ్ సారథ్యంలో జనతా దళ్ అనే మూడో రాజకీయ శక్తి ఆవిర్భవించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ, వామపక్షాల సాయంతో వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు.

వీపీ సింగ్, జనతా దళ్‌లు ముస్లింలకు సానుకూలంగా ఉన్నారన్నది స్పష్టంగా కనిపించింది.

విశ్వహిందూ పరిషత్ అయోధ్య ఆందోళనను వ్యతిరేకించిన సోషలిస్టు నాయకుడు ములాయం సింగ్‌ను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది జనతా దళ్.

ఇప్పుడు మందిరం ఉద్యమాన్ని బీజేపీ బాహాటంగా తన చేతుల్లోకి తీసుకుంది. లాల్ కృష్ణ అద్వాణీ ఆ ఉద్యమానికి సారథ్యం వహించారు.

దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే లక్ష్యంతో అద్వాణీ 1990 సెప్టెంబర్ 25వ తేదీన సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య దిశగా రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30వ తేదీ నాటికి అయోధ్య చేరుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఆ రథయాత్ర సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.

బిహార్‌లో నాటి ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్.. అద్వాణీని అరెస్ట్ చేసి.. ఆయన రథయాత్రను నిలిపివేశారు.

ములాయంసింగ్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ.. లక్షలాది మంది కరసేవకులు, హిందూ వలంటీర్లు అక్టోబర్ 30వ తేదీన అయోధ్య చేరుకున్నారు.

పోలీసులు కాల్పులు జరపటం సహా.. బలప్రయోగం చేసినప్పటికీ కొంతమంది కరసేవకులు బాబ్రీ మసీదు గుమ్మటం (డోమ్) మీదకు ఎక్కగలిగారు.

చివరికి పోలీసులు వారిని అదుపులోకి తెచ్చారు. పోలీసుల కాల్పుల్లో పదహారు మంది కరసేవకులు చనిపోయారు. కానీ.. చాలా హిందీ వార్తా పత్రికలు వేలాది మంది కరసేవకులు చనిపోయారని, వారి రక్తంతో సరయూ నది ఎరుపెక్కిందని చెప్తూ నాటకీయ శీర్షికలతో ప్రత్యేక సంచికలను ప్రచురించటం కొనసాగించాయి.

ములాయం సింగ్‌ను వ్యంగ్యంగా ‘ముల్లా ములాయం’ అని అభివర్ణించారు. హిందువుల్లో ఆయన మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు.

వీపీ సింగ్ మీద ఆగ్రహించిన బీజేపీ.. కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. జనతాదళ్ మీద దేవీలాల్ కూడా తిరుగుబాటు చేశారు.

ఈ గందరగోళంలోనే.. వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన మండల్ కమిషన్ సిఫారసులను వీపీ సింగ్ అమలుచేశారు.

ఇప్పుడు అగ్ర తరగతులు – వెనుకబడిన తరగతుల మధ్య పూర్తిస్థాయి సంఘర్షణ.. మండల్ – కమండల్ పోరాటం రగిలింది.

1991 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో శాసనసభ మధ్యంతర ఎన్నికల తర్వాత బీజేపీ నాయకుడు కల్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే మసీదు ఎదుట ఉన్న 2.77 ఎకరాల భూమిని పర్యటక రంగ అభివృద్ధి కోసం సేకరించారు. రామ్‌ కథా పార్క్ కోసం సేకరించిన 42 ఎకరాల భూమిని విశ్వహిందూ పరిషత్‌కు లీజుకు ఇచ్చారు.

ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు.. పాత సివిల్ కేసుల్లో వాస్తవాలను మార్చివేసి కొత్త అఫిడవిట్లు దాఖలు చేయటం ప్రారంభించారు.

మసీదు ముందు ఉన్న భూమిలో - పర్యటక అభివృద్ధి కోసం కల్యాణ్‌ సింగ్ సేకరించిన స్థలంలో ఆలయ నిర్మాణం ప్రారంభించాలని ఆర్‌ఎస్ఎస్ కోరిక. నిర్మాణం కోసం రాళ్లు చెక్కారు.

కానీ.. ఆ స్థలంలో శాశ్వత నిర్మాణం ఏదీ నిర్మించజాలరని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా కానీ.. జులైలో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.

పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎంతో కష్టపడి.. నిర్మాణం ఆపివేయటానికి హిందూ సాధువులు, సంతులను ఒప్పించగలిగింది.

మళ్లీ 1992 డిసెంబరులో కరసేవను ప్రకటించారు. ప్రతీకాత్మక కరసేవ వల్ల మసీదుకు ఎలాంటి నష్టం జరగదని కల్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు విశ్వహిందూ పరిషత్‌ కూడా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాయి.

పోలీసులను బలప్రయోగం చేయవద్దని కల్యాణ్‌సింగ్ హెచ్చరించారు. స్థానిక పాలనా యంత్రాంగం కేంద్ర భద్రతా బలగాల సాయం పొందటానికి కూడా ఆయన అనుమతించలేదు. ఆ తర్వాత.. డిసెంబర్ 6వ తేదీన ఏం జరిగిందనేది చరిత్రలో నమోదైంది.

లాల్ కృష్ణ అద్వాణీ, జోషి, సింఘాల్‌ వంటి అగ్ర నాయకులు, సుప్రీంకోర్టు పరిశీలకుడు, జిల్లా జడ్జి తేజ్ శంకర్, పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో.. లక్షలాది మంది కరసేవకులు 1992 డిసెంబర్ 6వ తేదీన మసీదులోని ప్రతి ఒక్క ఇటుకనూ కూల్చివేశారు. ఆ మసీదు శిథిలాల మీద తాత్కాలిక మందిరం నెలకొల్పారు.

కోర్టు గ్రహీత పర్యవేక్షణలో భక్తుల సందర్శన, పూజలు గతంలో మాదిరిగా నిర్వహించటం మొదలైంది.

కేంద్ర ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరించిందని, హిందూ సంస్థలకు లోపాయకారీ మద్దతు అందించిందని ముస్లింలు ఆరోపించారు.

కానీ.. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని.. రాజ్యాంగ నిబంధనల పరిధిలో చేయగలిగింది చేశామని ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చెప్పారు. మసీదును పునర్నిర్మిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

మసీదును కూల్చివేసిన కొన్ని రోజుల తర్వాత.. అక్కడ భూమిని ప్రభుత్వం సేకరించటం చట్టవ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం 1993 జనవరిలో.. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనటం లక్ష్యంగా.. వివాదాస్పద సముదాయం, దాని చుట్టూ ఉన్న ప్రదేశంతో పాటు 67 ఎకరాల భూమిని సేకరించటం కోసం పార్లమెంటులో ఒక చట్టం చేసింది.

హైకోర్టు విచారించిన కేసులు ముగిశాయి.

ఏదైనా పాత హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత బాబ్రీ మసీదును నిర్మించారా అనే దానిమీద అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టును కోరింది. తద్వారా వివాదాన్ని స్థలానికి పరిమితం చేసింది.

కోర్టు తీర్పు ఏ పక్షానికి అనుకూలంగా వస్తే ఆ పక్షం వారు తమ ప్రార్థనా మందిరం నిర్మించుకోవటం కోసం ప్రధాన సముదాయం అప్పగించటం ఆ కొత్త చట్టం ఉద్దేశం. రెండో పక్షం వారు ప్రధాన సముదాయానికి కొంచెం ఆవలగా తమ ప్రార్థనా మందిరం నిర్మించుకునేందుకు స్థలం లభిస్తుంది. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను నెలకొల్పుతారు. ఆ మొత్తం స్థలం గ్రహీతగా ఫైజాబాద్ కమిషనర్‌ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.

కానీ.. మసీదును నిర్మించటానికి ముందు అక్కడ హిందూ దేవాలయం ఏదైనా ఉందా అనే దానికి జవాబు చెప్పటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వాస్తవం ఏమిటనేది నిర్ధారించలేకపోయామని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఇరు పక్షాలూ వివాదాన్ని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవాలంటూ ఆ కేసులను మళ్లీ హైకోర్టుకు తిప్పి పంపించింది సుప్రీంకోర్టు.

బాబ్రీ మసీదు కింద, అలాగే రామ చబూతరా కింద భూమిలో తవ్వకాలు జరిపే పనిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (పురా తవ్వకాల శాఖ)కు అప్పగించింది హైకోర్టు.

ఈ పని పూర్తవటానికి గణనీయమైన సమయం పట్టింది. పురా తవ్వకాల విభాగం అందించిన నివేదికలో.. ఉత్తర భారతదేశంలోని ఆలయాలను పోలిన నిర్మాణాల అవశేషాలను తాము గుర్తించామని పేర్కొంది.

ఈ నివేదిక ఆధారంగా.. ఆ స్థలం కింద రామ మందిరం ఉందని హిందూ బృందం వాదించింది. కానీ.. అటువంటి గందరగోళం చెల్లదని ఇతర చరిత్రకారులు పేర్కొన్నారు.

సుదీర్ఘ విచారణ తర్వాత.. సాక్షుల వాంగ్మూలాలు, పత్రాల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని.. అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్ 30వ తేదీన తన తీర్పు చెప్పింది.

అనేక ప్రాసంగిక ఆధారాల ప్రాతపదికగా.. మసీదు డోమ్ కింద ఉన్న భూమి మీద శ్రీరామచంద్రుడు జన్మించి ఉండవచ్చునని ముగ్గురు న్యాయమూర్తులూ అంగీకరించారు. కానీ.. ఆ భూమి యాజమాన్యానికి సంబంధించి ఎవరి దగ్గరా కచ్చితమైన ఆధారం లేదు.

దీర్ఘకాలిక స్వాధీనం ప్రాతిపదికగా.. ఆ స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి భగవాన్ రాముడు, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు ఇచ్చింది. ఈ తీర్పును ఊరి పెద్దల తీర్పుగా అభివర్ణిస్తూ వివాదంలోని మూడు పక్షాలూ తిరస్కరించాయి.

దాంతో.. మతం, విశ్వాసం, రాజకీయాలు కలగలిసి దీనిని ఎంతో సంక్లిష్టమైన, సున్నితమైన అంశంగా మార్చేశాయి.

చయిత: రామ్‌దత్ త్రిపాఠి
ఫొటోలు: గెట్టీ ఇమేజెస్
చిత్రకారుడు: పునీత్ బర్నాలా
ప్రొడక్షన్: షాదాబ్ నజ్మీ