ఫలితాలు మింగిన ప్రాణాలు: ఒక్కొక్క‌రిది ఒక్కో విషాద గాథ


సామాజిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడ్డ
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల క‌న్నీటి క‌థ‌లు

ఎ. అనామికా యాదవ్, వయసు 16 ఏళ్లు

అనామిక హైదరాబాద్‌లో తన అమ్మమ్మ దగ్గర ఉండేది. ఆమె ఎన్‌సీసీ కేడెట్ కూడా. దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనాలని ఆమె కోరిక. ఆ సెలక్షన్స్ ఫలితాల కోసం ఎదురుచూసింది.

నాన్నా, నేను ఆర్మీ ఆఫీసర్ అవుతా, నిన్ను బాగా చూసుకుంటా.

“మా చెల్లెలి చావుకు ఇంటర్ బోర్డే కారణం. మార్కులు సరిగా లెక్కపెట్టకుండా ఎలా మర్చిపోతారు? మేం బోర్డుపై కేసులు పెడతాం” అంటూ కోపంగా చెప్పింది అనామిక అక్క ఉదయ.

మేం ఉదయను కలిసినప్పుడు ఆమె మౌనంగా కనిపించింది. తన చెల్లెలి మరణం విషాదంలో ఆమె ఉంది.

అనామిక మరణం విషయంలో తమకు న్యాయం జరగాలని ఉదయ కోరుకుంటోంది. ‘రీ వెరిఫికేషన్’ తరువాత అనామికకు గతంలో కంటే 28 మార్కులు పెరిగి పాస్ అయినట్టు ముందుగా ప్రకటించారు.

“ఫిబ్రవరిలో పుల్వామా దాడి జరిగినప్పుడు అనామిక రోజంతా టీవీ ముందే కూర్చుంది. ఆమె ఏడుస్తూనే ఉంది. ఎందుకేడుస్తున్నావని అడిగితే, దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాల గురించి బాధేస్తోందని చెప్పింది” అన్నారు అనామిక అమ్మమ్మ ఉమ.  హైదరాబాద్‌లో ఒక ఇరుకైన సందులో రెండు గదులతో కూడిన అమ్మమ్మ ఇంట్లో పెరిగింది అనామిక. ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం అనామికకు చాలా ఇష్టం అంటూ  ఆమె సాధించిన ట్రోఫీలతో ఉన్న అల్మారా చూపించారు ఉమ.  “అమ్మమ్మా! కేవలం చదువు వల్లే ఎదగలేం, నేను ఎప్పుడు చదవాలో అప్పుడు చదువుతాను” అని అనామిక ఎప్పుడూ అంటుండేదని ఉమ తెలిపారు. “అనామిక ఎన్నడూ కాలేజీ మానేది కాదు. రాత్రుళ్లు వంటింట్లో కూర్చుని చదువుకునేది” అంటూ గుర్తుచేసుకున్నారు ఉమ.

దిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనాలని అనామిక కోరిక

ఇరుకైన గదిలో అద్దాల అల్మారాలో కుటుంబ సభ్యుల ఫొటోల మధ్యే అనామిక సాధించిన ట్రోఫీలతోపాటు ఎన్‌సీసీ యూనిఫాంలో ఉన్న ఆమె ఫోటోలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్‌లో జరిగిన ఎన్నో పెద్ద కార్యక్రమాల్లో అనామిక ఎన్‌సీసీ వాలంటీరుగా పాల్గొంది. ఆమె తల్లిదండ్రులు ఆదిలాబాద్‌లో ఉంటారు. ఆమె తండ్రి గణేశ్ అక్కడ చిన్న వ్యాపారం చేస్తారు.

“అనామిక నా కూతురుగా పుట్టడం నా అదృష్టం. నేను వికలాంగుడిని. ‘నేను సైనికాధికారిని అయ్యి మిమ్మల్ని చూసుకుంటాను’ అని అంటుండేది. చాలా అల్లరిపిల్ల కూడా. ఆమె సెలవులకు వచ్చిన ప్రతి సారీ అందర్నీ ఆట పట్టిస్తూ ఇల్లంతా కలియ తిరుగుతూ సందడి చేసేది” అని కూతురు గుర్తురాగానే కన్నీళ్ల మధ్యే వచ్చిన చిన్నటి నవ్వుతో చెప్పారు తండ్రి గణేశ్.

స్కూల్లో పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇచ్చిన అనామిక

“ఇతరులకు నేర్పడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ స్కూలు వాళ్లంతా మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. అనామిక రోజు విడచి రోజూ కాలేజీ అయిపోగానే స్కూలుకు వెళ్లి అక్కడి పిల్లలకు త్రోబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ నేర్పించేది” అన్నారు ఉమ.  

“అనామిక నన్ను పడుచుపిల్ల అంటూ ఏడిపించేది. ఆమె అన్నీ అర్థం చేసుకునేది. చికెన్ ఫ్రై అంటే తనకు చాలా ఇష్టం. మా దగ్గర డబ్బుల్లేనప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా, కాయగూరలు తింటాలే అనేసేది. షిన్ చాన్, డోరెమాన్ గొంతులు అనుకరిస్తూ అల్లరి చేసేది” అంటూ చెప్పుకొచ్చారు ఉమ. 

చాలా కాలం క్రితం వాళ్ల పక్కింట్లో తండ్రి తిట్టాడన్న బాధతో ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై అనామిక చాలా బాధపడ్డట్టు చెప్పుకొచ్చారు  ఆమె అమ్మమ్మ.  ఎవరో తిడితే చనిపోతారా అంటూ అనామిక బాధపడిందని తెలిపారు.

చనిపోయిన రోజు అనామిక అమ్మమ్మ ఇంటికి చుట్టాలు వచ్చారు. దీంతో రెండిళ్ల అవతల ఉన్న వాళ్ల అత్తయ్య ఇంటికి వెళ్లింది అనామిక.

“ఇక్కడ ఇరుగ్గా ఉండడంతో అక్కడే పడుకుంటుందేమో అనుకున్నాను. ఆ రోజు ఫలితాలు వచ్చాయని నాకు తెలియదు. ఇక్కడ చోటు లేదు కాబట్టి అక్కడ పడుకోవడానికి వెళ్లింది అనుకున్నాను. సాయంత్రం టీకి పిలవడానికి వెళ్లాను. కొద్ది సేపట్లో వస్తాలే అంది. కానీ ఇక రాలేదు” అని వివరించారు ఉమ.

మళ్లీ టీకి పిలవడానికి ఉమ వెళ్లేసరికి అనామిక ఫ్యానుకు ఉరి వేసుకుని ఉంది.

అనామికా యాదవ్

ఫ్యానుకు ఉరేసుకున్న విద్యార్థిని

తోట వెన్నెల, వయసు 18 ఏళ్లు

నేను బేసిక్ విషయాలు చెప్పి ఒకసారి నాతోపాటు తీసుకెళ్లాను. అంతే. ఓరోజు పొద్దున్నే మా నాన్న బండి తీసుకుని తను ఒక్కత్తే డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయింది. అప్పుడు నేను పడుకుని ఉన్నాను.

వెన్నెల అన్న వెంకటేశ్‌ను పలకరిస్తే- తన చెల్లెలికి తాను బైక్ నడపడం నేర్పిన విషయాన్ని ప్రస్తావించారు.

“నేను బేసిక్ విషయాలు చెప్పి ఒకసారి నాతోపాటు తీసుకెళ్లాను. అంతే. ఓరోజు పొద్దున్నే మా నాన్న బండి తీసుకుని తను ఒక్కత్తే డ్రైవ్ చేస్తూ వెళ్లిపోయింది. అప్పుడు నేను పడుకుని ఉన్నాను. నేను లేచాక బండి నడిపిన విషయం  చెప్పింది. నాకు భయం వేసింది. మళ్లీ నడపమన్నాను. నేను ఆమె వెనకే కూర్చున్నాను. వెన్నెల బండి చాలా బాగా నడపడం చూసి ఎంతో సంతోషం వేసింది.  కానీ చాలాసార్లు ఆమె బండి నడుపుతున్నప్పుడు ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యేవాణ్ని. జాగ్రత్తగా వెళ్తుందో, లేదో అని నా భయం. మా ఊరి శివారల్లో పొలాలకు బండి వేసుకుని వెళ్లిపోయేది. ఒకసారి స్నేహితుడి పెళ్లికి వెళ్లడానికి బండి కావాలంది. నేను మా నాన్నను పర్మిషన్ అడగడానికి హెల్ప్ చేశాను.” అని ఆయన వివరించారు.

వెంకటేశ్ వెన్నెల కంటే ఏడాది పెద్ద. అతను గత ఏడాది ఇంటర్లో రెండు పేపర్లు పాస్ కాలేదు. “ఈ ఏడాది పరీక్షలకు నేను చెల్లి కలసి చదువుకున్నాం. ఆమె స్నేహితులు చాలా మంది కూడా సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు వస్తుండే వారు. తను మాకు కష్టమైన పాఠ్యాంశాలు సులువుగా గుర్తుపెట్టుకునే చిట్కాలు చెప్తుండేది” అన్నాడు వెంకటేశ్.

 

వెన్నెల పెళ్లి కోసం డబ్బు పొదుపు చేశాను. ఆ డబ్బును తన చదువు కోసం ఖర్చు చేయాలని నాకు చెప్పింది.

వెంకటేశ్ వెన్నెల కంటే ఏడాది పెద్ద. అతను గత ఏడాది ఇంటర్లో రెండు పేపర్లు పాస్ కాలేదు. “ఈ ఏడాది పరీక్షలకు నేను చెల్లి కలసి చదువుకున్నాం. ఆమె స్నేహితులు చాలా మంది కూడా సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు వస్తుండే వారు. తను మాకు కష్టమైన పాఠ్యాంశాలు సులువుగా గుర్తుపెట్టుకునే చిట్కాలు చెప్తుండేది” అన్నాడు వెంకటేశ్.

వెన్నెల డిగ్రీ చదవాలనుకుంది. “ఆమె పెళ్ళి గురించి మాట్లాడినప్పుడు నన్ను తిడుతుండేది. పెళ్లి కంటే చేయాల్సినవి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయని ఆమె నాతో అనేది. డిగ్రీ ఉంటే సమాజంలో తనకు గౌరవం ఉంటుందని ఆమె చెప్పేది. ఆమె పుట్టినప్పటి నుంచి మందు మానేశాను. ఆమె పెళ్లి కోసమనే డబ్బులు దాచాను. ఆ డబ్బును తన చదువుపై పెట్టాలని ఆమె చెప్పేది.” అంటూ చెప్పుకొచ్చారు వెన్నెల తండ్రి టి గోపాలకృష్ణ. ఆయన నిజామాబాద్ వినియోగదారుల ఫోరంలో అటెండరుగా పనిచేస్తున్నారు.

వెన్నెలకు పానీ పూరీ అంటే ప్రాణం. ఇకపై అది నాక్కూడా తినాలనిపించదేమో.

వెంకటేశ్ పర్సు తెరచి అందులో ఉన్న చెల్లెలి ఫోటో చూపించాడు. చెల్లెలి ఫోటో ఎప్పుడూ వెంకటేశ్ పర్సులోనే ఉంటుంది. “మేం కొట్టుకునే వాళ్లం. నన్ను ఏడిపించడానికి ప్రాంక్స్ (ప్రాక్టికల్ జోక్స్) చేసేది. బండి విషయంలో ఎప్పడూ కొట్లాట జరిగేది. బయటకు వెళ్లినప్పుడల్లా ఏవో ఒక స్నాక్స్ తెమ్మని చెప్పేది. తనకు పానీ పూరీ అంటే ప్రాణం. ఇకపై అది నాక్కూడా తినాలనించదేమో” అని వెంకటేశ్ చెప్పాడు.

రిజల్ట్స్ వచ్చినప్పుడు వెన్నెల కజిన్ అమూల్య ఆమెతోనే ఉంది. “ఇంటర్లో ఎంపీసీ తీసుకోమని అక్క చెప్పింది. నాకు లెక్కలు బాగా రావడంతో ఎంపిసితో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె చెప్పింది. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఇష్టమైనవన్నీ వండిపెట్టేది. కామెడీ షోలు చూసేవాళ్లం. జోకులు వేసి అందర్నీ నవ్వించేది.”

ఫలితాలు వచ్చిన రోజు వెన్నెల మామూలుగానే ఉంది. సాయంత్రం వాళ్ల నాన్న మొబైల్ ఫోన్లో ఫలితాలు చూసుకుంది. రిజల్ట్స్ చూడగానే నమ్మలేకపోయింది వెన్నెల అని చెప్పారు ఆమె తల్లి. “నేనెలా ఫెయిలవుతాను? నేనెలా ఫెయిలవుతాను? అంటూనే ఉండిపోయింది. ఏం పర్వాలేదమ్మా.. కావాలంటే రీ ఎవాల్యూషన్ కి పెట్టొచ్చు. కాదంటే మళ్లీ పరీక్షలు రాయవచ్చు అని చెప్పాం. నేను వంటచేయడానికి వెళ్లాను. మరుక్షణమే బాత్రూంలో నుంచి ఏడుస్తూ వచ్చింది. ఎలుకల మందు తిన్నాననీ ఫెయిల్ అయ్యాను కాబట్టి తాను చనిపోవాలని ఏడుస్తూ చెప్పింది. ఆసుపత్రిలో కూడా నేను పాసవ్వాల్సింది అంటూనే ఉంది. తనకు ఏ సబ్జెక్టు బాగా వచ్చనుకుందో ఆ సబ్జెక్టుల్లోనే ఫెయిల్ అయినందకు చాలా బాధపడిపోయింది.” అంటూ వివరించింది వెన్నెల తల్లి. 

తోట వెన్నెల

స్నానాల గదిలో ఎలుకల మందు తిని
ఆత్మహత్య చేసుకుంది.

మోదెం భాను కిరణ్, వయసు 18 ఏళ్లు

మేం ఎథికల్ హ్యాకర్లు కావాలనుకున్నాం. మేం యూట్యూబులో ట్యుటోరియల్స్ చూసి ప్రయత్నించే వాళ్లం” అని చెప్పాడు యుగేశ్. యుగేశ్ భాను సహాధ్యాయి. కజిన్ కూడా.

“మా ఇద్దరికీ వయసులో రోజులే తేడా. ఎల్‌కేజీ నుంచి మేం క్లాస్ మేట్లం. అతను నాకు మంచి స్నేహితుడు. కాలేజీకి కలిసే వెళ్లేవాళ్లం. మా ఇద్దరికీ గణితం అంటే చాలా ఇష్టం. అతనికి కంప్యూంటర్ లాంగ్వేజీలు బాగా అర్థమయ్యేవి. తనే నాకు కంప్యూటర్ లాంగ్వేజీల మీద ఆసక్తి కలిగించాడు” అంటూ చెప్పుకొచ్చాడు యుగేశ్."

కిరణ్ తండ్రి సారంగపాణి కూరగాయలు అమ్ముతారు.

కిరణ్‌కు సంగీతం అంటే ఎంతో ఇష్టమని చెబుతూ ఆ రెండు గదుల ఇంట్లో ఒక మూలన ప్యాక్ చేసి ఉంచిన గిటార్ చూపించారు సారంగపాణి.  కిరణ్ గిటార్ తో ఉన్న ఫోటో ఒకటి అక్కడ ఉంది.  “కిరణ్ కొన్ని వీడియోలు చూసి గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. స్కూలు, కాలేజీ ఈవెంట్లలో వాయించేవాడు. ఐదారు తెలుగు సినిమా పాటలు కూడా ప్లే చేసేవాడు’’ అన్నారు తండ్రి.

తల్లిదండ్రులకు కిరణ్ ఒక్కడే కొడుకు. కుమారుడి మరణం విషాదం నుంచి తల్లి తేరుకోలేకపోతున్నారు. అతడు మంచిగా మాట్లాడేవాడు. పద్ధతిగా ఉండేవాడు.  “తనకు ఫొటోలు తీసుకోవడం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు మాకు ఆ ఫోటోలే మిగిలాయి” అని సారంగపాణి గద్గద స్వరంతో కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పారు. యుగేశ్, కిరణ్‌లకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. “మాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా అల్లు అర్జున్ సినిమాలే చూసేవాళ్లం” అన్నాడు యుగేశ్.

ఫలితాలు వచ్చిన రోజు రాత్రి యుగేశ్, కిరణ్ ఒకే గదిలో పడుకున్నారు. కిరణ్ కాస్త కలత చెందినట్లు  కనిపించినా, భోజనం చేసేటప్పుడు మామూలుగానే కనిపించాడని యుగేశ్ చెప్పాడు. “పడుకున్న కిరణ్ ఎప్పుడు లేచి వెళ్లిపోయాడో తెలియదు. ఫలితాల గురించి అతను ఎక్కువగా మాట్లాడలేదు” అని తెలిపాడు.

ఛిద్రమైన కిరణ్ శరీరం రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది. కిరణ్ ఆ రోజు రాత్రి ఒంటరిగా నడిచివెళ్లి, వస్తున్న రైలు ముందు దూకేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

మోదెం భాను కిరణ్

ఛిద్రమైన కిరణ్ శరీరం రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది.

పాతూరు ధర్మారామ్, వయసు 18 ఏళ్లు

గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 8 కలసి చూడాలని అనుకున్నాం. జాన్ స్నో పాత్ర అంటే అతనికి చాలా ఇష్టం.

అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా చూడాలనుకున్నాం. మార్వెల్ అంటే మహాపిచ్చి దీపుకు” అంటూ చెప్పింది నివేదిత. నివేదిత ధర్మారామ్ స్నేహితురాలు. ఆమె పొరుగునే ఉంటుంది.

ధర్మారామ్ కంటే ఐదేళ్ల పెద్దదైన అతడి అక్క మహిత, అతనికి ‘దీపు’ అని ముద్దు పేరు పెట్టింది. “మా అమ్మ కంటే నేనే తనకు ఎక్కువని చెప్పేవాడు. తనను అందరూ దీపు అని పిలవాలనుకునే వాడు. ఎందుకంటే ఆ పేరు నేను పెట్టానని. అతనికి ఆరేళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసున్న స్నేహితులు ఉన్నారు. అతను మా స్నేహితులతో కూడా బాగా తిరుగుతాడు కానీ, అతను చిన్నవాడు అని ఎప్పుడూ అనిపించడు. అతను చాలా పరిణతితో ఉండేవాడు” అని తమ్ముడి గురించి చెప్పుకొచ్చింది మహతి. ధర్మారామ్ కాలేజీలో అల్లరి పిల్లాడైనా చదవాల్సి వచ్చినప్పడు అంతే శ్రద్ధగా చదువుతాడని చెప్పుకొచ్చారు స్నేహితులు.

దీపుకు కేఎఫ్‌సీ చికెట్ అంటే చాలా ఇష్టం. “అతడు ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు మంచిదనేదానిపై నన్ను సలహాలు అడిగేవాడు. అతనికి భౌతికశాస్త్రం అంటే చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు సీనియర్ అభిరామ్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో దీపు స్కోరు 84 శాతం.  

“విమానయానానికి సంబంధించిన ఏ విషయమైనా మా తమ్ముడికి చాలా ఆసక్తి. దీంతో ఏవియేషన్ ఇంజినీరింగ్ చేయాలనుకున్నాడు. భారత వైమానిక దళంలో పైలట్ అవ్వాలని కూడా ఆలోచించేవాడు. అందుకే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు” అంటూ ధర్మారామ్ గదిని చూపిస్తూ వివరించారు మహతి.

అతడి గది నిండా పరీక్షల టైం టేబుళ్ల వివరాలు, చదువుకోవాల్సిన షెడ్యూళ్లూ ఉన్నాయి.  

ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత మహిత, వాళ్ల అమ్మ ఇద్దరూ ధర్మారామ్‌తో మాట్లాడి ఫెయిల్ అయినా పర్వాలేదని ఓదార్చారు. “దీపు వాళ్ల టీచర్‌కు ఫోన్ చేసి ట్యూషన్‌కు ఎప్పటి నుంచి రావాలని కూడా అడిగాడు. తర్వాత మేమంతా మా పనులకు వెళ్లిపోయాం. దీపు బాత్రూంకు వెళ్లాడు. తనను కొద్దిసేపు అలా ఒంటరిగా ఉండనివ్వాలనుకున్నాం. కాసేపటికి బయట చప్పుడు వచ్చింది. వెళ్లి చూస్తే దీపు. అతను బాత్రూంలో ఉన్నాడనుకున్నాం, తీరా చూస్తే బాల్కనీ నుంచి దూకేసాడు” అని చెప్పారు మహతి.

ధర్మారామ్

బాల్కనీ నుంచి దూకేశాడు.

వద్నాలి శివాని, వయసు 16 ఏళ్లు

ఆమె ఇంజినీర్ కావాలనుకుంది.

శివాని చనిపోయిన దాదాపు 15 రోజుల వారాల తర్వాత మేం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్లాం. వాళ్ల ఇల్లు ఉండే వీధి వైపు వెళ్తుండగా, శివాని తల్లి ఏడుపులు మాకు వినిపించాయి.  శివాని వాళ్ల ఇల్లు ఊరిలోని బిల్డింగుల మధ్య ఉంటుంది. అదొక చిన్న పాక ఇల్లు. అక్కడ ఎనిమిదేళ్లుగా వారు అద్దెకు ఉంటున్నారు. శివాని తల్లి లావణ్య చేతుల్లో లామినేట్ చేసిన ఒక పోస్టర్ ఉంది. అందులో శివాని ఫోటో కింద ‘నేను ఇంజినీర్ కావాలనుకుంటున్నాను’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది. ఆమె తండ్రి భూమారెడ్డి భార్య పక్కనే కూర్చుని మేం మాట్లాడేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు చెవుడు. మేం ఆయన కూతురు గురించి మాట్లాడుతున్నామని గుర్తుపట్టగానే ఆయన ఒకే మాట అన్నారు-  “నా కూతురు చాలా తెలివైంది.”

శివానికి చాలా తెలివైన అమ్మాయని పేరు. సందేహాలు తీర్చుకోవడానికి శివాని ఇంటికి వెళ్లేవాళ్లమని ఆమె స్నేహితులు చెప్పారు.

“అక్కకు గాజులంటే చాలా ఇష్టం. రంగురంగుల గాజులు కొనుక్కుని వాటిని వేసుకుని ఫొటోలు దిగేది” అని శివాని కంటే మూడేళ్లు చిన్నదైన చెల్లెలు అనూష చెప్పింది.  పడకగదిలో గోడపై శివాని పరీక్షల టైంటేబుల్, చదవాల్సిన సబ్జెక్టుల షెడ్యూల్ అతికించి ఉన్నాయి. తెల్లవారుఝామున 4 గంటలకు నిద్రలేవాలని షెడ్యూల్లో ఉంది.

“తండ్రి వికలాంగుడు కావడంతో పశువులు మేపడానికి వెళ్లొద్దని శివాని చెప్పేది. ఐదేళ్లు ఓపిక పట్టు, మన జీవితాలు మారిపోతాయని చెప్పేది” అని తల్లి లావణ్య తెలిపారు.

ఫలితాలు వచ్చిన రోజు రాత్రి శివాని తన ఫోన్ చెల్లెలు అనూషకు ఇచ్చి ఫోన్ అన్ లాక్ చేసే పిన్ కూడా చెప్పింది. “అక్క ఎప్పుడూ నాకు ఫోన్ ఇవ్వదు. నేను చదువు మీద దృష్టి పెట్టాలనీ, ఫోన్ మీద సమయం వృథా చేసుకోవద్దనీ చెప్పేది. కానీ ఆ రోజు మాత్రం ఇకపై నేను కూడా ఫోన్ వాడుకోవచ్చని చెప్పింది” అని అనూష వివరించింది.

తెల్లవారుఝామున పైకప్పు నుంచి వేలాడుతున్న శివానిని  ముందుగా గుర్తించింది అనూషే. ఇప్పటికీ రాత్రి వేళ నిద్ర పట్టడం లేదని అనూష చెప్పింది.

వద్నాలి శివాని

పైకప్పుకు ఉరేసుకొని చనిపోయింది.

దేవసోతు నీరజ, వయసు 17 సంవత్సరాలు

నేను, నా భర్త పొద్దున్నే పనిలోకి వెళ్తాం. నీరజ తమ్ముడికి స్నానం చేయించి, తయారు చేసి కాలేజీకి వెళ్లేది.

తన కూతురు రాత్రి పూట చదువుకునేదని నీరజ తల్లి ఫంగి చెప్పారు.

నీరజకు స్నేహితులు పెద్దగా లేరని చెప్పారు తల్లితండ్రులు. ఆమె తండ్రి రుపాల్ సింగ్ తమ ఇంటి మట్టి గచ్చు మీద కూర్చుని నీరజ పదో తరగతి మార్కుల షీట్ తీసి చూపించారు. “అన్ని పరీక్షలూ ఒకేసారి పాస్ అయింది. డాక్టర్ అవ్వాలని ఆశ పడేది. మేం చేయగలిగిందంతా చేయాలనుకున్నాం” అని ఆయన చెప్పారు.  

“నీరజ అన్ని పరీక్షలూ ఒకేసారి పాస్ అయింది. డాక్టర్ అవ్వాలని ఆశ పడేది. మేం చేయగలిగిందంతా చేయాలనుకున్నాం” అని ఆయన చెప్పారు.

ఆ రోజు ఉదయాన్నే తన తల్లితండ్రుల కోసం వంట చేసింది నీరజ. వాళ్లు పనులకు వెళ్లిపోయాక, తన చెల్లెళ్లు, తమ్ములతో కాసేపు ఆడుకుంది. వాళ్లకు అన్నం పెట్టింది. ఆ తరువాత వాళ్లను గదిలో ఉన్న కర్టెన్ వెనుక పడుకోమని చెప్పింది. సాయంత్రం పూట ఆమె తమ్ముడు పిలిచినా నీరజ పలకకపోవడంతో వాళ్లు కర్టెన్ ఇవతలకు వచ్చి చూస్తే సీలింగు ఫ్యానుకు దుపట్టాతో ఉరి వేసుకుని కనిపించింది నీరజ.

దేవసోతు నీరజ

ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉస్కే రుచిత, వయసు 18 ఏళ్లు

రుచితను చాలా గారాబంగా పెంచాం. చుట్టుపక్కల వాళ్లకు కూడా రుచిత అంటే ఎంతో అభిమానం.

రుచిత ఇంటికి వెళ్లినప్పుడు, ఒక పెళ్లి ఆల్బంలో రుచిత ఉన్న ఫోటోలు చూస్తున్నారు ఆమె తల్లి, వదిన, నానమ్మలు. “ఇది మా అబ్బాయి పెళ్లి ఆల్బం. రుచిత ఫొటోల్లో మాకున్న మంచి ఫోటోలు ఇవే” అంటూ కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది రుచిత తల్లి. రుచితను చాలా గారాబంగా పెంచామనీ, చుట్టుపక్కల వాళ్లకు కూడా రుచిత అంటే ఎంతో ఇష్టమని ఆమె తాత బేగయ్య చెప్పారు. “రుచితకు చూపులో కాస్త ఇబ్బంది ఉండేది. అందుకే ఆమెను బాగా గారాబం చేసాం. ఆమె ఇంటర్, డిగ్రీ పూర్తయితే ఉద్యోగం వస్తుందని తండ్రి ఆశ పడ్డాడు. దాంతో ఆమె ఆర్థికంగా సొంతంగా ఉంటుందనుకున్నాం” అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు ఆమె తాత బేగయ్య.

“రుచితకు చూపులో కాస్త ఇబ్బంది ఉండేది. అందుకే ఆమెను బాగా గారాబం చేసాం. ఆమె ఇంటర్, డిగ్రీ పూర్తయితే ఉద్యోగం వస్తుందని తండ్రి ఆశ పడ్డాడు. దాంతో ఆమె ఆర్థికంగా సొంతంగా ఉంటుందనుకున్నాం” అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు ఆమె తాత బేగయ్య.  

రుచిత అన్ని పరీక్షలూ పాసవుతానని నమ్మకంతో ఉండేది అన్నారు చంద్రయ్య. పరీక్షలయిపోయాక “అన్నీ పాస్ అయిపోతా, ఇక డిగ్రీ కాలేజీకి వెళ్లడానికి సిద్ధం కావాలి” అని చెప్పిందామె.

రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు రుచిత, తాను రోజూ ఆడుకునే నలుగురు పిల్లల దగ్గరకి వెళ్లి, వాళ్లందరికీ ముద్దులు పెట్టిందని చెప్పారు ఆమె తాత బేగయ్య. ‘‘నేను ఆమెను చూడడం అదే ఆఖరు’’ అన్నారాయన .

ఉస్కే రుచిత

దొంతరవేణి ప్రశాంత్, 18 ఏళ్లు

మా గ్యాంగ్‌లో అందగాడు వాడే

మేం ప్రశాంత్ గ్రామానికి వెళ్లే సరికి చీకటి పడిపోయింది. గ్రామం మధ్యలో ఆయనకు నివాళిగా బ్యానర్ పెట్టారు స్నేహితులు. వాళ్ళే మమ్మల్ని ప్రశాంత్ ఇంటికి తీసుకెళ్లారు. అనిల్ అనే అబ్బాయి తన ఫోన్ తీసి ప్రశాంత్ ఫోటోలు చూపించాడు. “మా గ్యాంగ్‌లో అందగాడు వాడే. ఎప్పుడూ మాతోనే ఉండేవాడు. తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని మాకు చెప్పేవాడు” అన్నాడు అనిల్

ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ప్రశాంత్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.   “మా అబ్బాయి మరీ గొప్ప తెలివైనవాడు కాదు. మొదటి ఏడాది పరీక్షలు పాస్ కావడానికి కూడా చాలా కష్టపడ్డాడు. కానీ తనకు తానే ఎంతో కష్టపడి చదివాడు. కేవలం పాస్ అయితే చాలు, డిగ్రీ తెచ్చుకోవచ్చు అనుకునేవాడు” అని చెప్పాడు ప్రశాంత్ తండ్రి కొమురయ్య.

ఆ రోజు ఊళ్లో జాతర జరుగుతోంది. మామూలుగా జాతర అంటే ప్రశాంత్ ఆ రాత్రి ఇంటికి రాకుండా స్నేహితులతో గుడి దగ్గరే ఉంటాడు కాబట్టి, రేపు వస్తాడులే అనుకున్నారు కుటుంబ సభ్యులు. రాత్రి పొద్దుపోయాక ప్రశాంత్ స్నేహితులకు కాల్ చేశాడు. “రెండో ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు బాధగా ఉంది అన్నాడు. నేను ఓదార్చే ప్రయత్నం చేశాను. కానీ ‘సారీ’ అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు” అని తెలిపాడు ప్రశాంత్ స్నేహితుడు.

దొంతరవేణి ప్రశాంత్

మా పిల్లల్ని చంపిందెవ‌రు?

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల తరువాత ఆత్మహత్య చేసుకున్న పిల్లల సంఖ్య 2015లో ఐదు కాగా, 2018లో ఇది 23కి చేరింది. ఈసారి పేపర్లు దిద్దడం, మార్కులు ఎంటర్ చేయడంలో ఇంటర్మీడియట్ బోర్డు తప్పులు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లితండ్రుల్లో కోపానికి, అసంతృప్తికీ కారణమయ్యాయి. మేం కలిసిన చాలా మంది తల్లిదండ్రులు చదువు విషయంలో తమ పిల్లలను ఒత్తిడి పెట్టలేదని చెప్పారు. చనిపోయిన వారిలో కొందరికి పదో తరగతిలో 70 శాతం మార్కులు వచ్చాయి. 

జవాబుపత్రాల మూల్యాంకనంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు అనామిక తండ్రి ఆరుట్ల గణేశ్. అనామిక మొదటి ఏడాది తెలుగులో ఫెయిల్ అయింది. ముందు సున్నా మార్కులు వచ్చి తర్వాత 99 మార్కులు వచ్చిన నవ్య విషయాన్ని గణేశ్ గుర్తు చేశారు.  “ఇలాంటి ఘటనలు మాకు అనుమానాలు కలిగిస్తాయి. పిల్లల్ని పోగొట్టుకున్న మాలాంటి తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది” అన్నారు. వెన్నెల తండ్రి గోపాలకృష్ణ ఇంటర్ బోర్డుపై కేసు పెట్టాలనుకుంటున్నారు. “తాను ఫెయిల్ అయ్యానని మా అమ్మాయి ఒప్పుకునేదేమో. కానీ ఆమె చావుకు కారణం ఎవరో మాకు తెలియాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

“గర్భం ధరించినప్పుడు నేను చాలా బాధను అనుభవించాను. ఇప్పుడు కొడుకును పోగొట్టుకున్నాను. వాడంటే అందరికీ ఎంతో ప్రేమ. తాను ఫెయిల్ అయ్యానన్న విషయాన్ని ధర్మారామ్ అంగీకరించలేకపోయాడు” అని అతడి తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.  

అవ‌క‌త‌వ‌క‌ల‌పై పెద్ద‌యెత్తున ఆరోప‌ణ‌లు

ఆందోళనలు, 23 మంది మరణాల తరువాత హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కోర్టు జోక్యం చేసుకుని మొత్తం అన్ని పేపర్లను మళ్లీ దిద్దాలని ఆదేశించింది. 9 లక్షల 74 వేల మంది పరీక్షలు రాయగా, 3 లక్షల 28 వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60.5 శాతం,  ద్వితీయ సంవత్సరంలో 64.8 శాతం ఉత్తీర్ణులు అయ్యారు.  2018లో మొదటి ఏడాది 62.73 శాతం మంది, రెండో ఏడాది 67.06 మంది ఉత్తీర్ణులు కాగా, 2017లో మొదటి ఏడాది 57.3 శాతం మంది, రెండో ఏడాది 67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఏప్రిల్ 19 నుంచి వేణుగోపాలరెడ్డి ప్రతి రోజూ ఇంటర్ బోర్డు  కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. వాళ్లబ్బాయి ఎంపీసీ చదివాడు. “మావాడికి మొదటి ఏడాది గణితంలో 75కి 75 మార్కులు వచ్చాయి. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలలో 60కి 60 చొప్పున మార్కులు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం గణితంలో ఒక మార్కు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలలో సున్నా మార్కులు చూపించారు. ఇలా ఎలా జరుగుతుంది? మావాడు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఫలితాలు చూసి చాలా నిరాశపడిపోయాడు. చదవడం మానేశాడు. తినట్లేదు. ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు. తన మానసిక ఆరోగ్యంపై నాకు బెంగ పట్టుకుంది” అంటూ కన్నీళ్లతో చెప్పారు వేణుగోపాల రెడ్డి.

ఇంటర్ పరీక్షల ఫలితాల అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎలాంటి రుసుములూ లేకుండా పేపర్లన్నీ మళ్లీ దిద్దాలని ఆదేశించారు.

ముందుగా, చనిపోయిన వారి పేపర్లు మళ్లీ దిద్దారు. దీనిపై ఇంటర్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. తల్లిదండ్రులకు ఆ లోటు తీరనిది. కానీ విద్యార్థుల ఆత్మహత్యలకూ ఫలితాల వెల్లడిలో తప్పులకుగాని, సాంకేతిక తప్పులకుగాని ఎలాంటి సంబంధం లేదు” అనేది ఆ ప్రకటన సారాంశం.

ఆ నివేదిక ఏం చెప్పింది?

ప్రైవేటు జూనియర్ కాలేజీలపై ఆరోపణలకు సంబంధించి ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఒకటి తన నివేదికలో కీలక వ్యాఖ్యలు చేసింది. “ఒక వ్యక్తి ఆత్మహత్య వైయక్తిక, సాంఘిక, నైతిక విషాదం. ఆత్మహత్య చేసుకున్నది యువకులైతే అది మరింత విషాదకరం. ఆ విషాదం.. సమాజ ఆర్థిక, నైతిక, సోషలాజికల్ తీరు తెన్నులపై చర్చకు దారితీస్తుంది” అని అందులో వ్యాఖ్యానించింది.

“కమిటీ ఉద్దేశం ప్రకారం- సంవత్సరాలుగా కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, అధికార యంత్రాంగం అనుసరిస్తున్న తీరు ఈ సంక్షోభానికి కారణం. యాజమాన్యాల వ్యాపార దృక్పథం, తల్లిదండ్రుల వాస్తవదూర ఆకాంక్షలు, ఇంటర్ బోర్డు అసమర్థ యంత్రాంగం– అందరూ దీనికి సమానంగా బాధ్యులే’’ అని నివేదికలో ఉంది. ఈ నివేదికను 2001లో ప్రభుత్వానికి సమర్పించారు. ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలపై పరిమితి, నిపుణులైన కౌన్సెలర్ల నియామకం, ఆటలను తప్పనిసరి చేయడం, పిల్లల కెరీర్‌పై పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, ఇతర  సిఫార్సులను ఈ కమిటీ చేసింది.  కానీ అవి అమలు కాలేదు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులపై లోతైన, తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. “పరీక్ష అనే భావనే ఒత్తిడితో కూడినది. దీనికితోడు పిల్లల్లోనే కాకుండా కుటుంబం,  సమాజం ఆలోచనల్లో పరీక్షలతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. విద్యాసంస్థలు విద్యార్థులపై చాలా ఒత్తిడి పెడుతున్నాయి. ప్రతి విద్యార్థి సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. విద్యార్థి తప్పనిసరిగా పరీక్ష ఉత్తీర్ణుడు కావాలని ఆశించడం వాస్తవిక దృక్పథంతో కూడినది కాదు. విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్ చేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లోనూ అవగాహన పెంచాలి. పరీక్షలకే పరిమితం కాకుండా, అంతకుమించి ఆలోచించడం అలవర్చుకోవాల్సి ఉంది” అని కన్సల్టంట్ సైకాలజిస్ట్ వసుప్రద కార్తీక్ చెప్పారు.

రిపోర్టింగ్: దీప్తి బత్తిని
ఫొటోలు: నవీన్
షార్ట్‌హ్యాండ్: షాదాబ్ నజ్మీ
ఇల్లస్ట్రేషన్స్: పునీత్ బర్నాలా