అధ్యయనం: కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి

ఒకరిపై ఒకరు కోపంగా అరుచుకుంటున్న యువతీ, యువకులు

ఫొటో సోర్స్, Corbis Royalty Free

ఫొటో క్యాప్షన్,

నెగిటివ్‌ ఎమోషన్స్‌తో సంతోషం అనేది కోపం, ద్వేషాలకే పరిమితం. భయం, విచారం, ఆందోళన వంటివాటికి కాదు

తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష.. అని మనం అందరం చదువుకున్నాం లేదా విన్నాం. కానీ, మీ కోపమే మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుందంట. ఈ సంగతి తెలుసా!

ప్రేమ‌.. సానుభూతి వంటి భావోద్వేగాలు క‌లిగి ఉండే వారితో పాటు కోపం.. ద్వేషంతో వూగిపోయే వాళ్లూ ఆనందాన్ని పొందుతార‌ట‌. ఎదుటివారిప‌ట్ల కోపంగా మాట్లాడటంతోనే వారు సంతోషంగా ఫీల‌వుతార‌ని తేలింది.

‘మీరెంలాంటి భావోద్వేగాలు కోరుకుంటారు? ఎలాంటివాటిని అనుభవిస్తుంటారు?‘ అని జెరూసలెంలోని ది హిబ్రూ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఒక అధ్యయనంలో అడిగారు.

అమెరికా, బ్రెజిల్‌, చైనా, జర్మనీ, ఘ‌నా, ఇజ్రాయెల్‌, పోలండ్, సింగ‌పూర్ దేశాల్లోని విభిన్న సంస్కృతుల‌కు చెందిన దాదాపు 2,300 విశ్వవిద్యాలయ విద్యార్థులు.. ఇందులో పాల్గొన్నారు.

వారు సంతోషంపైన, తమ జీవితంలో సంతృప్తిపైనా అభిప్రాయాలు తెలిపారు.

తామెలాంటి భావోద్వేగాలను కోరుకుంటున్నామో అలాంటి వాటిని అనుభవిస్తున్నప్పుడే ఎక్కువ సంతోషం, సంతృప్తి లభించాయని ఎక్కువ మంది చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోపం.. ద్వేషంతో కూడా కొంద‌రు ఆనందాన్ని పొందుతారు

కోరుకున్నది పొందితేనే ఆనందం

మీరు కోరుకునే భావోద్వేగాన్ని మీరు అనుభవిస్తుంటే.. అది ఆహ్లాదకరమైనది కాకపోయినా సరే.. మీరు బాగుంటారు అని పరిశోధనలో వెల్లడైంది.

ఆనందం అంటే.. ఆహ్లాదకరమైన అనుభవమని, బాధను తప్పించుకోవటమేనని కూడా తేలింది.

ఎలాంటి సంద‌ర్భాల్లో మీరు ఆనందాన్ని పొందుతారు? అని అడ‌గ్గా.. కోపం.. ద్వేషంతో ప్రవర్తించినప్పుడు తమకు సంతోషంగా ఉంటుంద‌ని ప‌లువురు తెలిపారు.

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

ఆనందంగా ఉన్నవాళ్లు ఇంకా ఎక్కువ ఆనందం కోరుకున్నప్పుడు.. వాళ్లు తక్కువ ఆనందం అనుభవిస్తారని అథ్యయనం చెబుతోంది

11 శాతం మంది త‌మ‌కు ప్రేమ‌, సానుభూతి వంటి పాజిటివ్ ఫీలింగ్స్ అంటే ఇష్టం లేదని చెప్పారు.

10 శాతం మంది కోపం.. ద్వేషం వంటి నెగెటివ్ ఎమోష‌న్స్‌నే ఎక్కువ కోరుకుంటున్నారు.

ఆనందం పట్ల ప్రజల ఆలోచనల్ని ఈ అధ్యయనం సవాల్ చేస్తోందని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ అన్నా అలెగ్జాండ్రోవా చెప్పారు.

అయితే, కోపం, ద్వేషంతో సంతోషం పొందినట్లే.. భ‌యం, ఆప‌రాధ భావం, చిరాకు వంటి నెగెటివ్ ఫీలింగ్స్‌తో సంతోషం పొందుతార‌ని చెప్పలేమని అధ్యయనం తెలిపింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)