ఇంటర్నెట్ ఓటింగ్‌: స్మార్ట్ ఫోన్‌ నుంచి ఓటేసే రోజులు వచ్చేశాయా?

  • 11 డిసెంబర్ 2017
ఐ ఓటింగ్ ఇంటర్నెట్‌ ఓటింగ్ ఎన్నికల పోలింగ్‌ బ్యాలెట్ బాక్స్ క్యూ లైన్లు i voting Internet Voting Election Polling Ballot box queue line Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక 14 దేశాల్లో ఇంటర్నెట్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు

చాలా దేశాల్లో ఎన్నికలొచ్చినప్పుడు పాఠశాలలు, గ్రంథాలయాలు తదితర ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుకి ఎదురుగా ఉన్న బటన్ నొక్కుతూ ఓటు హక్కును వినియోగించడం రివాజు.

ఇలా ఓటు వేసే విధానం ఈ డిజిటల్ యుగంలో మారనుందా?

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మొదలయ్యింది. అది పెరిగే కొద్దీ చాలా దేశాల్లో ఓటింగ్ పెరుగుతోంది.

కానీ ఇప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కి సంబంధించి దాని విశ్వసనీయత, భద్రత, గోప్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంటెర్నెట్ ఓటింగ్ (ఐ-ఓటింగ్) ఈ కోవలోకి వచ్చిచేరింది.

అసలు ఇంటెర్నెట్ ఓటింగ్ ఏమిటి? మనకు నచ్చిన అభ్యర్థిని స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్నుకునే అవకాశం ఉందా?

వాతావరణం బాగా లేనప్పుడు చాలా మంది ఓటు వెయ్యడానికి వెళ్లరు. కొందరికి ఓటరు లిస్టులో తమ పేరు ఉందో, లేదో కూడా తెలియదు.

కొందరైతే ఓటింగ్ జరగబోయే రోజు సెలవు రోజని ఓటు వేయడానికి బదులు విహార యాత్రలకు కూడా వెళతారు. దీంతో ఓటు హక్కు లక్ష్యం నెరవేరడం లేదు.

చిత్రం శీర్షిక ఓటు వేయడానికి క్యూలో నిలుచునే రోజులు పోతాయా?

టెక్నాలజీ ద్వారా మనం ఈ అవరోధాలను అధిగమించలేమా?

ఈ సమస్యను ఎలా అధిగమించాలి? అసలు టెక్నాలజీ ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉందా?

ప్రస్తుతం దాదాపు 14 దేశాలు ఆన్‌లైన్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. కానీ వాటిలో ఎస్టోనియా మాత్రమే మొట్టమొదటిగా శాశ్వత జాతీయ ఇంటర్నెట్ ఓటింగ్ విధానం ‘ఐ-ఓటింగ్’ను ప్రవేశపెట్టింది.

ఆ దేశం 2005లో ఈ రకమైన ఓటింగ్ విధానాన్ని మొదలుపెట్టినపుడు కేవలం 1.9 శాతం మంది మాత్రమే ఇంటెర్నెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా పార్లమెంటు ఎన్నికలలో ‘ఐ-ఓటింగ్’ 30 శాతానికి పెరిగింది.

"ఐ-ఓటింగ్ భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లింగ, ఆదాయ, విద్య, జాతీయత, కంప్యూటర్ నైపుణ్య భేదాలతో నిమిత్తం లేకుండా ఐ-ఓటరు కావచ్చు. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా యువ ఓటర్లు, బిజీగా ఉండే ఉద్యోగులు, విదేశాల్లో నివసించే ఎస్టోనియన్లకు ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది" అని ఎస్టోనియా ఎన్నికల కార్యాలయ వైస్-ప్రెసిడెంట్ అర్నే కోయిట్మామా పేర్కొన్నారు.

2015లో దాదాపు 116 దేశాలలో నివసించే ఎస్టోనియన్లు ఇంటర్నెట్ ఓటింగ్ ద్వారా ఎన్నికల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.

కానీ దీని ద్వారా ఓటింగ్ పెరగలేదని, కేవలం ప్రజలు ఓటు వేసే విధానం మాత్రం మారిందని ఆయన చెప్పారు.

Image copyright iStock
చిత్రం శీర్షిక స్మార్ట్ ఫోన్‌తో ఓటు వేసే అవకాశం వస్తే యువత ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటారని విశ్లేషకులు అంటున్నారు

ఎన్‌స్క్రిప్షన్ విధానంతోనే భద్రత

ఎస్టోనియాలో ఐ-ఓటింగ్ ప్రారంభమయినప్పుడు అక్కడ సైబర్ భద్రత సమస్యలేవీ లేవు, కానీ ఆ దేశంలో ఉపయోగించే సాంకేతికతను కాలక్రమేణా అప్‌డేట్ చేస్తారు.

ఐ-ఓటింగ్‌లో కీలకమైన విషయం.. ఆ దేశ ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డులను ఆన్‌లైన్ ఓటింగ్ సిస్టమ్‌తో అనుసంధానించడం.

అందులో ప్రతి పౌరుడి రికార్డులు పొందుపరిచి ఉంటాయి. డిజిటల్ ఐడీ కార్డులు ఆన్‌లైన్లో కార్డు యజమానిని గుర్తించి ఓటు వేయడానికి అనుమతినిస్తాయి. వారి ఖాతాకు డిజిటల్ సంతకం లింక్ చేసి ఉంటుంది.

కొత్త కార్డులను వేలిముద్రల ఆధారంగా జారీ చేస్తారు.

"కాగితంతో ఓట్లు వేయడం కన్నా ఇంటెర్నెట్ ఓటు వేయడమే చాలా సురక్షితమని నా అభిప్రాయం. నిజానికి ఇది అందుబాటులో లేకపోతే నేను ఓటు వేయనేమో" అని ఎస్టోనియన్ ఓటర్ ఇగోర్ హోబోటోవ్ పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రిటన్ ఓటింగ్ విధానంలో మార్పు వచ్చింది

"నేను స్థానిక, పార్లమెంటు ఎన్నికల్లో చాలాసార్లు ఇంటెర్నెట్ ద్వారా ఓటు వేశాను, ఎక్కువగా నేను ఇంట్లో ఉంటాను, కానీ కేప్‌టౌన్‌లో ఒక సెలవు రోజున నేను కూడా ఓటు వేశాను, నా దగ్గర వ్యక్తిగత సమాచారానికి మంచి భధ్రత గల డిజిటల్ ఐడీ కార్డు ఉంది, దీనిని హ్యాక్ చేయడం చాలా కష్టం" అని హోబోటోవ్ అన్నారు.

ఆస్ట్రేలియాలో సౌత్ వేల్స్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో నివసించే‌ వికలాంగులు, పోలింగ్ రోజు ఆ ప్రాంతంలో లేనివారు ఆన్‌లైన్, టెలిఫోన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

కెనడాలో కూడా పురపాలక ఎన్నికల్లో కొన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అక్కడి ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ అక్కడి ప్రభుత్వం తదుపరి ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ఓటింగ్‌కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక మెక్సికో పోలింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ బ్యాలెట్ బాక్సులను మొదటిసారిగా 2009లో ఉపయోగించారు

నార్వేలో అక్కడి ప్రభుత్వం 2011, 2013 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆన్‌లైన్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశ పెట్టింది. కానీ రాజకీయ అసమ్మతి, ఓటర్ల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ఇంటెర్నెట్ ఓటింగ్‌ను రద్దు చేసింది.

గతంలో ఫ్రాన్స్ కూడా విదేశాలలో నివసిస్తున్న పౌరుల కోసం శాసనసభ ఎన్నికల్లో ఆన్‌లైన్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో సైబర్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని రద్దు చేసింది.

ఇదే అసలు సమస్య!

"చాలా మంది తమకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అందించడానికి ఇష్టపడరు. ప్రత్యేకించి అది ఓటరు గురింపు కార్డు సమాచారం అందించాలంటే ప్రజల్లో విపరీతమైన భయం ఉంటుంది’’ అని యూనివర్శిటీ ఆఫ్ సర్రేలో కంప్యూటర్ సైన్స్ సెక్యూరిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ స్క్నీదర్ తెలిపారు.

‘‘ఇంటెర్నెట్ ఆధారిత ఓటింగ్ సాఫ్ట్‌వేర్ మీద మాల్‌వేర్ దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా ఇటువంటి దాడులు ఓట్లను ప్రభావితం చేయగలవు. పోలింగ్ స్టేషన్లలో ఇంటర్నెట్ ఆధారిత ఓటింగ్ యంత్రాల వినియోగం ఒకరకంగా సురక్షితం కాదు’’ అని స్టీఫెన్ స్క్నీదర్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంటెర్నెట్ ఆధారిత ఓటింగ్ సాఫ్ట్‌వేర్ మీద హ్యాకర్ల దాడులకు అవకాశాలుంటాయని పలువురు నిపుణులు చెప్తున్నారు

సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిమాంటెక్ దీనిపై స్పందిస్తూ "కొందరు హ్యాకర్లు ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలను లక్ష్యంగా చేస్తూ దాడులు చేస్తారు. 2016 లో అమెరికాలో డెమోక్రటిక్ పార్టీపై సైబర్ దాడి దీనికి తాజా ఉదాహరణ" అని తెలిపింది.

"ఇలాంటి హ్యాకర్ల బృందాలు వ్యక్తిగత ఓటర్లను ప్రభావితం చేయడంలో ఆసక్తి చూపించవు. ఈ బృందాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నాయి" అని సిమాంటెక్ పరిశోధకుడు డిక్ ఓబ్రియన్ వెల్లడించారు. "అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కేవలం ఒక సామాన్య ఓటరుది మాత్రమే కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలి" అని ఆయన అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు