ఎమోజీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • 1 జనవరి 2018
ఎమోజీ Image copyright iStock

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులొచ్చాయి. అలాగే చాటింగ్ విధానం కూడా మారిపోయింది.

ఒకప్పుడు చాటింగ్ అంటే టెక్స్ట్ మెసేజీలుండేవి. ఆ తర్వాత వాట్సాప్ పుణ్యమా అని టెక్స్ట్ తోపాటు ఆడియో, వీడియో ద్వారా కూడా చాటింగ్ చేసే అవకాశం వచ్చింది.

క్రమంగా టెక్స్ట్, ఆడియో, వీడియో కలిసి మూడు చేయలేని పనిని చిన్న చిన్న ఎమోజీలు చేస్తున్నాయి. సాధారణంగా టెక్స్ట్ మెసేజ్‌తో భావోద్వేగాలు వ్యక్తం చేయడం చాలా కష్టం.

భావోద్వేగాలను ఒక్క ముక్కలో వ్యక్తం చేయడానికే ఎమోజీ ఫీచర్ వచ్చింది. ఈ ఎమోజీలను చాటింగ్ ప్రియులు ఎంత ఆదరించారంటే చాటింగ్‌ అంటేనే "పదాలు తక్కువ ఎమోజీలు ఎక్కువ" అనే ట్రెండ్ నడుస్తోంది.

ఆనందంగా ఉంటే ఎమోజీ .. బాధగా ఉంటే ఎమోజీ ... కోపంగా ఉంటే ఎమోజీ ... ఇలా ఎమోజీల మీద ఎమోజీలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. పెరుగుతున్న ట్రెండ్ కు అనుగుణంగా టెక్నాలజీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఎమోజీలను ప్రవేశపెడుతున్నాయి.

వినియోగదారుల అభిరుచులు విభిన్నంగా ఉంటాయని విభిన్న రకాల ఎమోజీలను తయారు చేస్తున్నాయి. మరి ఈ ఎమోజీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందామా?

Image copyright iStock

మీరు ఎక్కువ ఎమోజీలు వాడతారా? అయితే డేటింగ్‌కు రెడీగా ఉండండి!

మీరు చాటింగ్‌లో ఎక్కువగా ఎమోజీలు వాడతారా? అయితే మీరు డేటింగ్‌కు రెడీగా ఉండండి. ఎందుకంటే ఎక్కువగా ఎమోజీలను వాడేవారే సమర్థవంతంగా సంభాషిస్తారని తేలింది.

భావోద్వేగాలను సూటిగా తెలపడానికి ఎమోజీలు ఎంతో సహాయపడతాయని అందుకే ఎమోజీలతో ఇతరులు మన వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకోగలరని తేలింది.

ఎమోజీల వాడకం సంతోషం వ్యక్తం చేయడానికా లేక బాధనా?

ఒక అంచనా ప్రకారం రోజుకు 6 బిలియన్ల ఎమోజీలను ఒకరికొకరు పంపుకుంటారని తేలింది.

ప్రపంచంలో ఇప్పుడు 2 బిలియన్ల స్మార్ట్ ఫోన్లున్నాయి. బ్రిటన్లో 76 శాతం జనాభా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తోంది. అందులో 80 శాతం మంది ఎమోజీలను చాటింగ్‌లో వాడతారు.

ఈ 6 బిలియన్ల ఎమోజీలలో 70 శాతం ఎమోజీలు సంతోషం, చిరునవ్వు, ప్రేమను వ్యక్తం చేయడానికే ఉపయోగిస్తారు.

చాలా తక్కువ మంది మాత్రమే బాధను వ్యక్తం చేయడానికి ఎమోజీలు ఉపయోగిస్తారని తేలింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎమోజీ

ఏ ఏ దేశాల్లో ఎలాంటి ఎమోజీలను ఉపయోగిస్తారు?

కొన్ని దేశాల ప్రజలు కొన్ని రకాల ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో కొన్ని:

  • కెనడియన్లు ఎక్కువగా కేక్ ఆకారంలో ఉండే పూ ఎమోజీలను వాడతారు
  • ఆస్ట్రేలియన్లు ఆల్కహాల్ లేదా సెలవుల ఆనందం చూపే ఎమోజీను ఎక్కువగా వాడతారు
  • ప్రేమ కనబర్చే ఎమోజీల వాడకం విషయంలో ప్రపంచంలో ఫ్రాన్స్ దేశానికి సాటి లేదు
  • ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రష్యన్లు రొమాంటిక్ ఎమోజీలను వాడతారు
  • అరబ్ దేశాల్లో పూల ఎమోజీలను ఎక్కువగా వాడతారు
  • బ్రిటన్‌లో బీర్ ఎమోజీలను ఎక్కువగా వాడతారట
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎమోజీలు

ఈ ఎమోజీ చాలా పాపులరండీ!

మీరెప్పుడైనా "ఆనంద భాష్పాలున్న ముఖాన్ని" చూశారా. ఎమోజీలలోనండీ. బహుశా మీరు చూసే ఉంటారు.

2015 వ సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో "ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్" అనే కొత్త పదం ఈ ఎమోజీని చూపిస్తూ చేర్చారు.

ఎందుకంటే ఆ సంవత్సరం ప్రపంచంలో ఎక్కువగా ఈ ఎమోజీనే ఉపయోగించారు.

మొదటిసారి ఎమోజీని ఎవరు వాడారు?

అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1862లో తన ప్రసంగంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పుడు ఆ ప్రసంగం వింటున్న వారు పడి పడి నవ్వారు.

అప్పట్లో కొందరు టైపోగ్రాఫర్లు లింకన్ ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాల పక్కన కన్నుగీటే సైగ ఎమోజీని పెట్టారు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారి అబ్రహాం లింకనే ఎమోజీని వాడారని అంటారు.

Image copyright Getty Images

ఎమోజీ పెడితే ఇక పాఠం చెప్పాల్సిన అవసరం ఉండదు!

కేవలం ఒకే ఒక్క ముక్క, అది ఒక చిన్న పదం కూడా కాదు, కానీ పెద్ద పెద్ద భావాలను వ్యక్తపరుస్తుంది.

అందుకే ఒక ఎమోజీ పెడితే అవతలి వాళ్లకు ఎటువంటి పాఠం చెప్పాల్సిన అవసరముండదు. చిన్న పిల్లలు కూడా ఎమోజీలతో భావాలను అర్థం చేసుకుంటారు.

బ్రిటన్లో సగటున ఆరేళ్ళ చిన్నారికి టెక్నాలజీపై ఉన్న పట్టు 45 ఏళ్ళ వయసున్న వారికి కూడా లేదట.

ఇంతకీ ఎమోజీ భవిష్యత్తేమిటి?

నేటి డిజిటల్ యుగంలో సంభాషణ విధానంలో ఉన్న ఒక పెద్ద ఖాళీని ఎమోజీలు పూరించాయని ప్రముఖ కమ్యూనికేషన్ నిపుణులు ప్రొఫెసర్ వైవ్ ఎవాన్స్ అంటున్నారు.

ఎమోజీలతో సమర్థవంతంగా భావాలను వ్యక్తం చేయడమే కాదు, అలాంటి సందేశాలకు త్వరగా సమాధానం కూడా వస్తుందని అన్నారు.

ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఓ స్టార్టప్ ఎమోజీ శాస్త్రంపై కొత్త అప్లికేషన్ తయారు చేస్తోంది.

ఈ అప్లికేషన్ సహాయంతో మీరెప్పుడైనా టెక్స్ట్ రూపంలో మెసేజ్ పంపిస్తే ఆ టెక్స్ట్ కు అనుగుణంగా కదిలే ఓ కార్టూన్ మన భావోద్వేగ స్థితిని ఇతరులకు తెలియజేస్తుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)