ఇంటి పనులు చేస్తేనే ఆనందం, ఆరోగ్యం!

ఇంటిని శుభ్రంగా ఉంచాలి
ఫొటో క్యాప్షన్,

ఇంటిని శుభ్రంగా ఉంచడం అందరి విధి

ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు పెద్దలు. ఎంత డబ్బుంటే ఏంటి? ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టేనని మనందరికీ తెలుసు. వ్యక్తిగత శుభ్రత కేవలం ఒకరికి మాత్రమే మేలు చేస్తుంది. అదే ఓ ఇంటిని శుభ్రంగా ఉంచితే ఆ ఇంట్లో ఉండేవారందరూ ఆరోగ్యంగా ఉంటారు.

ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచాలనేదానిపై గుడ్ హౌస్ కీపింగ్ తాజాగా ఓ రిపోర్టుని విడుదల చేసింది. రోగాల బారిన పడకుండా, డబ్బులు ఖర్చు కాకుండా, కాలానుగుణంగా కొన్ని ఇంటి పనులు తప్పక చేయాలని అందులో పేర్కొంది. ఈ రిపోర్ట్‌లో ఇంటినీ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచాలంటే కొన్ని పనులు రోజుకోసారి, నెలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి తప్పకుండా చేయాలంటున్నారు నిపుణులు. మరి ఆ పనులేంటో తెలుసుకుందామా ?

రోజుకోసారి చేయాల్సినవి

గుడ్ హౌస్ కీపింగ్ తాజా రిపోర్ట్ ప్రకారం పడకలను రోజూ శుభ్రం చేయాలి. టాయిలెట్ ను కూడా రోజూ కడగాలి. ఆహారం తీసుకునే పాత్రలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.

ఈ పనులు నెలకోసారి తప్పనిసరి

నెలకోసారి కిటికీలనూ, చాపలనూ శుభ్రంగా కడగాలి. ఆహార పాత్రలను పెట్టే ప్రదేశాన్ని, కిచెన్ లో ఉండే కుళాయిలను తోమడం తప్పనిసరి.

ప్రతి ఆరు నెలలకోసారి

ఆరు నెలలకోసారి పరుపు, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ ఓవెన్‌ను తప్పకుండా శుభ్రంగా కడగాలని నిపుణులు అంటున్నారు.

ఏడాదికోసారి వీటిని వదలొద్దు !!

పరిసరాలను శుభ్రంగా ఉంచితే కలిగే హాయిని వర్ణించలేం. అందుకే కొన్ని పనులు ఏడాదికి ఓసారైనా తప్పకుండా చేయాలి. అందులో ప్రత్యేకంగా కిటికీ ఫ్రేములను, మురికి నీరు పోయే పైపులను, లైట్లను, బల్బులను శుభ్రంగా కడగాలన్నది గుడ్ హౌస్ కీపింగ్ నివేదిక సారాంశం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)