ప్రాచీన జానపద కళ 'నౌటంకీ'కి నేటికీ తరగని ఆదరణ!

స్టేజి మీద కళాకారులు

భారత్‌లోని పాత జానపద నృత్య నాటక రూపాల్లో ఒకటి నౌటంకీ. గ్రామాలు, చిన్న పట్టణాల్లో దీనికి మంచి ఆదరణ ఉంది.

ఇంటింటా టీవీలు, అరచేతిలో స్మార్ట్ ఫోన్లలో ఎల్లవేళలా వినోదం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ నృత్య కళ ఎలా మనుగడ సాగిస్తోందో ఫొటో గ్రాఫర్ ఉదిత్ కుల్‌శ్రేష్ఠ వివరిస్తున్నారు.

ఇది ప్రధానంగా సంచార నాటక రంగం. 1980ల్లో టీవీలు ఇంకా విస్తరించని కాలంలో ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ కళా రూపమే ప్రజలకు చౌకగా లభించే వినోదంగా ఉండేది. కానీ, 21 శతాబ్దంలో కూడా ఈ కళా రూపాన్ని సజీవంగా ఉంచాలని కొన్ని నృత్య నాటక బృందాలు, కళాకారులు పట్టుదలతో ఉన్నారు.

నౌటంకీ అని పిలిచే ఈ జానపద నృత్యనాటకానికి గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంతల్లో ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. బీహార్‌లోని సోనేపూర్ పట్టణంలో ఇటీవల జరిగిన ఒక సంతలో ఎనిమిది వేర్వేరు నాటక బృందాలు ఈ ప్రదర్శనలిచ్చాయి.

టికెట్ల ధర సాధారణంగా రూ. 100 నుంచి రూ. 500 వరకూ ఉంటుంది. అన్ని టికెట్లూ వేగంగా అమ్ముడుపోతాయి.

సాధారణంగా జానపద కథలు, పురాణ గాథల నుంచి తీసుకున్న కథాంశాలతో ఈ నౌటంకీ ప్రదర్శనలుంటాయి.

ఆ కథలను నాట్యసంగీతాల మేళవింపుతో, చతురోక్తులతో నర్తకులు అభినయిస్తారు. వాతావరణం హాస్యపూరితంగా ఉంటుంది.

ప్రేక్షకులు వన్స్ మోర్ అంటూ తమకు ఇష్టమైన భాగాన్నో, నృత్యాన్నో, సంభాషణలనో మళ్లీ ప్రదర్శించాల్సిందిగా డిమాండ్ చేస్తుంటారు.

ఈ నౌటంకీకి ప్రధానాధారం యువతులు. తమ సహచరులు రూపొందించిన జానపదాలకు వారు నృత్యం చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు.

ఈ కళాకారులు అందంగా తయారై స్టేజి మీదకు రావడానికి ముందు.. స్టేజి వెనుక మురికిగా, ఇరుకుగా ఉండే గదుల్లో అలంకరించుకుని ప్రదర్శనకు సిద్ధమవుతారు.

పేదరికం కారణంగా తాను నౌటంకీలో డాన్స్ చేయడం మొదలు పెట్టానని సంగీత చెప్పారు.

''నాకు అప్పుడు తినడానికి ఏమీ లేదు. అందుకే డాన్స్ చేయడం మొదలుపెట్టా. కానీ, ఇప్పుడు డాన్స్ చేయడం నాకు ప్రాణం. నా కాళ్లు ఆడకుండా ఉండలేవు'' అంటారామె.

తోటి డాన్సర్ల నుంచి, బాలీవుడ్ సినిమాలు చూసి తాను డాన్స్ నేర్చుకున్నానని ఆమె తెలిపారు.

''ఈ పని అప్పుడప్పుడూ రోతగా మారుతుంది'' అని ఆమె వివరించారు. సాయంత్రం ఐదారు గంటలకు ప్రదర్శనలు మొదలవుతాయి. కొన్నిసార్లు తెల్లవారే వరకూ కొనసాగుతాయి.

సంగీత సోనేపూర్‌లో ఒక ప్రదర్శన చేస్తున్నపుడు మద్యం మత్తులో ఉన్న మగాళ్లు కొందరు ఆమె దగ్గరకు వెళ్లి తాకే ప్రయత్నం చేశారు.

మౌసమీ సర్కార్ వయసు 34 ఏళ్లు. పదేళ్లుగా ఆమె నౌటంకీ ప్రదర్శనలు చేస్తున్నారు. దుబాయ్, నైరోబీ వంటి దేశాలకు కూడా వెళ్లి ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు.

''ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా నేను ప్రదర్శనలు చేశా'' అని వివరించారు.

కానీ, ఈ డాన్సుతో వచ్చే ఆదాయం తన కుటుంబ పోషణకు సరిపోదని అన్నారు.

''ప్రదర్శనలు ఉన్నపుడు నేను రోజుకు రూ. 2,000 దాకా సంపాదిస్తా. నేను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కోసం, మా పిల్లలకు ఉద్యోగాల కోసం ప్రభుత్వ సాయం కావాలి'' అని ఆమె కోరుతున్నారు.

ఈ డాన్సర్లకు కళాకారులుగా సముచిత గౌరవం లభించడం అరుదు. ఎక్కువగా వివక్షకు గురవుతుంటారు.

మూడేళ్ల కిందట అమిత్‌కుమార్‌సింగ్ అనే వ్యక్తి నౌటంకీ డాన్సర్ చాందినీని పెళ్లి చేసుకున్నారు. దాంతో అతడి కుటుంబం అతడికి వారసత్వ హక్కును నిరాకరించింది.

ఇప్పుడతడు వాళ్ల నాటక బృందంలోనే చిన్న చిన్న పనులు చేస్తున్నాడు.

నౌటంకీ ప్రదర్శనలకు అన్నిసార్లూ శుభం కార్డు పడదు. నాట్య ప్రదర్శనలు చూసే మగాళ్లు తరచుగా మద్యం మత్తులో ఉద్రేకంలో కొట్లాటకు దిగుతుంటారు. స్టేజీని, కుర్చీలను ధ్వంసం చేస్తుంటారు.

ఫొటోలు: ఉదిత్ కుల్‌శ్రేష్ఠ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)