ఐఫోన్: అంత స్మార్ట్‌గా ఉండటానికి కారణాలేంటో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తనే పేరున్న ఒకాయన 2007 జనవరిలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసారు. ప్రపంచం మొత్తం ఆ స్మార్ట్ ఫోన్‌ను ఆదరించింది. అదే ఐఫోన్. ఇది ప్రజలను అంతగా ఆకర్షించటం వెనుక కారణాలేంటో, దాని అభివృద్ధికి ఎవరెవరు సహకరించారో తెలుసా?
మార్కెట్లో ఐఫోన్‌కు తిరుగేలేదు. ఐఫోన్‌కు ఎంత డిమాండ్ ఉందో ప్రపంచానికి బాగా తెలుసు. ఐఫోన్లో ఉండే ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ దశ, దిశనే మార్చివేశాయి.
ఐఫోన్ స్మార్ట్‌ఫోన్ రంగంలో లాభాల ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచంలో రెండు, మూడు కంపెనీలు కలిసి సంపాదించే ఆదాయాన్ని ఒకే ఒక్క ఆపిల్ కంపెనీ ఆర్జించింది. ఆదాయపరంగా ఓ పెద్ద సునామీనే సృష్టించింది.
ఐఫోన్లో ఉండే క్యాటగిరీల సంగతి చెప్పవలసిన అవసరమేమి లేదు. ఎన్నో ఫీచర్లతో 10 ఏళ్ల క్రితం తయారైన ఈ ఫోన్‌ను కొనడం జనాల ఆశగా, అభిలాషగా మారిపోయింది.
ఐఫోన్ రాకతో మార్కెట్, సాఫ్ట్వేర్, మ్యూజిక్, ప్రకటనలిచ్చే విధానమే మారిపోయింది. అంతెందుకు ఈ టెక్నాలజీ యుగంలో సమాజంలో మన హోదాను నిర్ధారించే స్ధాయికి ఐఫోన్ చేరిందంటే అతియోశక్తి కాదు. ఐఫోన్ గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. ఎంత లోతుకి వెళ్తే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి.
ఐఫోన్‌ను తీర్చిదిద్దిన గొప్పతనం ఎవరికి చెందాలి అంటే స్టీవ్ జాబ్స్ పేరో లేదా ఇతర ప్రముఖ వ్యక్తుల పేరో గుర్తుకొస్తుంది కానీ, ఈ ఐఫోన్‌ను ఇంత స్మార్ట్ చేయడంలో ఎంతోమంది కృషి దాగి ఉంది. అయితే, ప్రపంచానికి వారి గురించి అసలు తెలియనే తెలియదు.
ఫొటో సోర్స్, Getty Images
ఐఫోన్ అంటే ఎందుకంటే క్రేజ్?
అందమైన డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్, సాఫ్ట్వేర్ విధానం, ఆహా అనిపించే హార్డ్‌వేర్! ఇంకేమన్నా ఉందా అంటే ఐఫోన్లో ఉండే కొన్ని క్లిష్టమైన ఫీచర్లు, అద్భుత టెక్నాలజీ ఒక సాధారణమైన ఫోన్‌ను నేడు ప్రపంచంలోనే ఎక్కువగా ఆదరించబడే స్ధాయికి చేర్చాయి.
ఆర్థికవేత్త మారియానా మజ్జుటోటో స్మార్ట్‌ఫోన్‌ను నడిపించే 12 కీలక సాంకేతికతల జాబితాను విడుదల చేశారు. అవి..
1. మైక్రోప్రాసెసర్లు
2. మెమరీ చిప్స్
3. సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్స్
4. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే
5. లిథియం ఆధారిత బ్యాటరీలు
ఇవన్నీ హార్డ్‌వేర్‌కు సంబంధించినవి. సాఫ్ట్వేర్ పరంగా చూస్తే..
6. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అల్గారిథంలు. ఇవి కంప్యూటర్‌లా పని చేస్తాయి. ఈ అల్గారిథంలు సౌండ్, లైట్, ఇతర సిగ్నళ్లను డిజిటల్ సిగ్నల్స్లోకి తక్షణమే మార్చుతాయి.
7. ఇంటర్నెట్.బహుశా నేడు స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేదంటే అది స్మార్ట్ఫోనే కాదు.
8. హెచ్‌టిటిపి, హెచ్టిఎమ్ఎల్ టెక్నాలజీ పరిభాష. ఇది సులభంగా ఇంటర్నెట్ వినియోగించేందుకు తోడ్పడుతుంది.
9. సెల్యులర్ నెట్వర్క్. ఇది లేకపోతే దాన్ని స్మార్ట్‌ఫోన్ కాదు కదా.. ఫోన్ కూడా అనరు.
10. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. జీపీఎస్
11. టచ్ స్క్రీన్
12. మాటల ఆధారంతో పనిచేసే కృత్రిమ మేధస్సు.
ఇవన్నీ ఐఫోన్లో ఉండే ఫీచర్లే. ఇవి లేకుండా ఐఫోన్‌ను ఊహించడం చాలా కష్టం.
ఫొటో సోర్స్, Getty Images
స్టీవ్ జాబ్స్
ఎందరో మహానుభావులు!
ఐఫోన్ పేరు చెబితే స్టీవ్ జాబ్స్ పేరు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఐఫోన్‌ను ఈ స్ధాయికి తీసుకొచ్చే క్రమంలో చాలా మంది దిగ్గజాలు విలువైన పాత్ర పోషించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఫోన్‌ను అమెరికా ప్రభుత్వం వాడే టెక్నాలజీని చూసి దీన్నితీర్చిదిద్దారు. ఐఫోన్ లో ఉండే ఈ 12 ఫీచర్లను మొదటిసారిగా అమెరికా ప్రభుత్వంతో పాటు పలు యూరప్ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇంటర్నెట్, జిపిఎస్ టెక్నాలజీని అమెరికా రక్షణ శాఖ తీర్చిదిద్దింది. అదే టెక్నాలజీని ఐఫోన్ పట్టుకుంది. అందుకే చాలా మంది ఐఫోన్‌ను ప్రభుత్వ పెట్టుబడి టెక్నాలజీ అని కూడా అంటారు.
అతివేగంగా వ్యాప్తి చెందే అల్గారిథమ్ టెక్నాలజీ పుణ్యమా అని నేడు ఇంత పెద్ద ప్రపంచం మన గుప్పిట్లోకోచ్చేసింది. ఈ అల్గారిథమ్ టెక్నాలజీని మొట్టమొదటిసారి అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ టుకే సోవియట్ యూనియన్ అణ్వాయుధ పరీక్షను గుర్తించేందుకు అభివృద్ధి చేసాడు. ఈ టెక్నాలజీనే ఐఫోన్ ఒడిసి పట్టుకుంది.
ఇప్పుడు టచ్ స్క్రీన్ విషయానికొద్దాం. దాన్ని ఏ టెక్నాలజీ కంపెనీ సృష్టించలేదు. ఈఏ జాన్సన్ టచ్ స్క్రీన్ సృష్టికర్త. ఆయన ఇంగ్లాండ్ ప్రభుత్వ ఏజెన్సీ రాయల్ రాడార్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇంజనీరు. మల్టీటచ్ స్క్రీన్ టెక్నాలజీని అమెరికాలో డెలావేర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఆ తరువాత దాన్నే ఆపిల్ కంపెనీ కొనుగోలు చేసింది.
హార్డ్‌వేర్ పరంగా చూస్తే లిథియం అయాన్ బ్యాటరీలు, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలు, సెమీకండక్టర్లను ఆయా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి సంబంధిత టెక్నాలజీలను అమ్మేశారు.
ఫొటో సోర్స్, Getty Images
అందుకే ఆపిల్ టెక్నాలజీలో శాస్త్రీయత, ప్రైవేట్ రంగం పాత్ర.. రెండూ కనిపిస్తాయి. ముందుగా పలు ప్రభుత్వ ఏజెన్సీలే ఈ శాస్త్రీయతను కనిపెట్టాయి. కానీ దాన్ని ఆపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశ పెట్టింది. ఆపిల్ కంపెనీ ప్రైవేటు రంగ సహకారంతో వీటన్నింటినీ అభివృద్ధి చేసింది.
ప్రపంచానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో స్టీవ్ జాబ్స్ ఒక అద్భుతం సృష్టించారు. ఆపిల్ కంపెనీతో పాటు ఆయన నెక్స్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి, పిక్సర్ స్టూడియోకు సీఈఓగా పనిచేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి పిక్సర్ స్టూడియోతో యానిమేషన్ సినిమా రంగంలో కొత్తదనాన్నిసృష్టించి తనదైన ముద్ర వేశారు.
మా ఇతర కథనాలు:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)