సల్వార్ కమీజ్‌తో రెజ్లింగ్ బరిలోకి దిగిన కవిత

కవితా దేవి దలాల్ డబ్ల్యుడబ్ల్యుఈ మహిళా రెజ్లర్ సల్వార్ కుర్తా ఖలీ Kavita Devi Dalal WWE Salwar Kurta Women Wrestler Khali

ఫొటో సోర్స్, Facebook/Kavita Dalal

హర్యానాకు చెందిన కవితాదేవి సాంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి డబ్ల్యుడబ్ల్యుఈ రింగ్‌లోకి దిగినప్పుడు ప్రపంచమంతా ఆమెను ఆశ్చర్యంగా చూసింది.

కవిత తన మొట్టమొదటి పోటీలోనే న్యూజిలాండ్ రెజ్లర్ డకోటాకైని మట్టికరిపించి సంచలనం సృష్టించారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. యూట్యూబ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే 35 లక్షల మంది ఆ వీడియోను చూసారు.

భారతదేశం తరఫున డబ్ల్యుడబ్ల్యుఈలో పాల్గొన్న మొట్టమొదటి మహిళా రెజ్లర్ ఆమె.

కవిత ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక చనిపోవాలని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

"అప్పుడు నా బాబు వయస్సు 8-9 నెలలు. కుటుంబం నుంచి నాకు ఎటువంటి సహకారం లేదు. ఓ సమయంలో నేను ఈ ఆటను వదిలెయ్యాలనుకున్నా. జీవితంపై విరక్తి కలిగేది. నాకు ఊపిరాడకపోయేది" అని కవిత బీబీసీతో చెప్పారు.

"నేను చిన్నప్పటి నుండి కన్న కలలు అలా కుప్పకూలిపోతుంటే సహించలేకపోయాను. 2013లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. అప్పుడు నేను ఎంత ఒత్తిడిలో ఉన్నానంటే.. నా బాబు గురించి కూడా ఆలోచించలేకపోయాను" అని ఆమె చెప్పారు.

అయితే, ఆత్మహత్యాయత్నం తప్పని ఆమె తెలుసుకున్నారు. ఓ వైపు కుటుంబం, పిల్లలు, మరోవైపు భవిష్యత్తు, ఆట వీటన్నిటి మధ్య చాలా సతమతమయ్యానని, అత్తవారి తరపు నుండి కూడా ఎలాంటి సహకారం ఉండేది కాదని ఆమె తెలిపారు.

"కానీ, నా లక్ష్యాన్ని మాత్రం నేనెప్పుడూ మర్చిపోలేదు. లక్ష్యమే నా మదిలో ఉండేది. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో నా భర్త సహకరించలేకపోయారు. ఇప్పుడు నా భర్త అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. నా విజయంపై ఆయన చాలా గర్వంతో ఉన్నారని" కవిత తెలిపింది.

ఫొటో సోర్స్, Facebook/Kavita Dalal

ఫొటో క్యాప్షన్,

కవితా దేవి ది గ్రేట్ ఖలీ వద్ద శిక్షణ పొందింది

అందుకే సల్వార్ కుర్తాతో

డబ్ల్యుడబ్ల్యుఈ లో సల్వార్- కుర్తా తో పాల్గొనడంపై ఆమె స్పందిస్తూ " నేను భారత దేశం నుండి వచ్చాను. నా దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలనే సల్వార్- కుర్తాలో పోటీల్లో పాల్గొన్నానని" ఆమె అన్నారు.

దీనికి మరో కారణం కూడా ఉందని కవిత చెప్పారు. 'మన కలలను సాకారం చేసుకునేందుకు మన బట్టలు అడ్డు రావు' అనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలనే సల్వార్- కుర్తాతో పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు.

కవిత డబ్ల్యుడబ్ల్యుఈ మాజీ ఛాంపియన్‌ ది గ్రేట్ ఖలీకి శిష్యురాలు. రెజ్లింగ్‌లోకి రాకముందు వెయిట్‌లిఫ్టింగ్‌లో కూడా అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలను ఆమె గెల్చుకున్నారు.

కవిత వెయిట్‌లిఫ్టింగ్ నుంచి రెజ్లింగ్‌కు మారేందుకు కూడా ఓ ఆసక్తికరమైన కారణం ఉందంట.

"నాకు రెజ్లింగ్ అంటే అంత ఆసక్తి ఉండేది కాదు. కానీ ఒకసారి నేను ది గ్రేట్ ఖలీ కోచింగ్ సెంటర్‌కి రెజ్లింగ్ పోటీ చూసేందుకు వెళ్లాను. ఆ ఫైటింగ్‌లో ఓ రెజ్లర్ విజయం సాధించిన తర్వాత అక్కడున్న వారికి సవాల్ విసిరాడు. అతడి మాటల్లో అహంకారం ఉంది. అప్పుడు నేను సల్వార్- కుర్తాలో ఉన్నాను. అయినా సరే నేను నా చేతిని పైకెత్తాను. నేని రెజ్లింగ్ రింగ్‌లోకి వెళ్లి అతడిని ఓడించాను.''

"ఖలీ సర్‌కి ఈ విషయం చాలా నచ్చింది. అప్పుడే ఆయన తన కోచింగ్ సెంటర్‌లో నాకు శిక్షణ అందించారని" కవిత తెలిపింది.

ఫొటో సోర్స్, Kavita Dalal

ఫొటో క్యాప్షన్,

కవితాదేవి సల్వార్ కమీజ్ ధరించి రింగ్‌లోకి దిగినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది

అన్నయ్య అండాదండా..

తన విజయానికి తన అన్నయ్య సంజయ్ దలాల్ కూడా కారణమని కవిత అంటారు. నా కెరియర్ 2002లో మొదలయ్యింది. అన్నయ్య సంజయ్ దలాల్ చాలాచోట్ల నాకు ట్రైనింగ్ ఇప్పించారు. ఫరీదాబాద్‌లో, ఆ తరువాత బరేలిలో, అక్కడి నుండి లక్నోలో ఇలా పలు ప్రాంతాల్లో ట్రైనింగ్ తీసుకున్నాను. లక్నోలో నేను వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. 2007లో ఒరిస్సాలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారిగా విజయం సాధించాను. అన్నయ్య పూర్తి సహకారం అందించారని కవిత వివరించారు.

ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయి శిక్షకుల వద్ద కవిత రెజ్లింగ్ మెళకువలను నేర్చుకుంటున్నారు. రోజూ ఆమె రెండున్నర గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు.

"ఒక మహిళ ఓ గొప్ప స్ధాయికి రాకముందు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. మహిళల జీవిత ప్రయాణం అంత సులభంగా ఉండదు. వారు గడప దాటి బయటకు వెళ్లడమే చాలా కష్టం. ఇంట్లో కూడా వారికి పూర్తి స్వాతంత్రం ఉండదు. కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్లు గట్టిగా మాట్లాడకూడదనే నిబంధనలున్నాయని" ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

"సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే నేను కూడా పుట్టి పెరిగాను. అయినా సరే నేను వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇంటి నుండి, కుటుంబం నుండి, సమాజం నుండి అందరి నుండి వివక్షను ఎదుర్కొన్నాను. ఇంట్లో వారికి లేని బాధ చుట్టుపక్కల వారికి, బంధువులకి, బయట సమాజానికి ఎందుకు ఉంటుందో నాకర్ధం కాదు. ఇంట్లో వాళ్ల కంటే ఎక్కువగా బయటివాళ్లే మన గురించి భరించరాని మాటలంటారని'' కవిత తెలిపారు.

డబ్ల్యుడబ్ల్యుఈ చాపియన్‌షిప్ గెలవడమే తన లక్ష్యమని కవిత చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)