రోహింగ్యాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు: మయన్మార్ ఆర్మీ చీఫ్

  • 19 సెప్టెంబర్ 2017
Rohingya, రోహింగ్యాలు ముస్లింలు బంగ్లాదేశ్ మయన్మార్ శరణార్థులు Muslim Bangladesh Mayanmar Refugees Image copyright Getty Images

రోహింగ్యాల సమస్యకు వాళ్లే కారణమని మయన్మార్ ఆర్మీ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ వ్యాఖ్యానించారు. ''రోహింగ్యాల మూలాలు మయన్మా‌ర్‌లో లేవు. వారంతా ఉత్తర రఖైన్ ప్రాంతంలో పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న చొరబాటుదారులు'' అని ఆయన ఆరోపించారు.

రోహింగ్యాలపై సైన్యం జాతిపరమైన నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలను మయన్మార్ తోసిపుచ్చింది. మిలిటెంట్ల దాడులకు మాత్రమే తమ సైన్యం ప్రతిస్పందిస్తోందని ఆర్మీ జనరల్ వ్యాఖ్యనించారు.

రోహింగ్యాల సమస్య పట్ల మయన్మార్ ప్రజలు, మీడియా ఏక తాటిపైకి రావాలని జనరల్ మిన్ ఆంగ్ ఆదివారం ఫేస్‌బుక్‌ పోస్టులో కోరారు.

రోహింగ్యాలను ‘‘బెంగాలీ చొరబాటుదారులు’’గా అభివర్ణిస్తూ, వారు 93 సార్లు దాడులకు పాల్పడిన తర్వాతే ఆగస్టు 25న తాము సైనిక చర్య ప్రారంభించామని ఆయన అన్నారు. రఖైన్ రాష్ట్రంలో జరిగిన హింస మిలిటెంట్లు కావాలని సృష్టించిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘వాళ్లంతా తమను రోహింగ్యాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ.. మయన్మార్‌లో అలాంటి జాతి సముదాయం లేనే లేదు. ఈ వివాదం గురించి వాస్తవాలను ప్రపంచానికి తెలిపేందుకు ఐక్యత అవసరం’’ అని ఆర్మీ జనరల్ అన్నారు.

చిత్రం శీర్షిక మయన్మార్ ఆర్మీ చీఫ్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్

జనరల్ మిన్ ఆంగ్ ఎవరు?

మయన్మార్‌లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన సైనిక పాలన తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ గెలుపు సాధించింది.

అయితే జనరల్ మిన్ అనేక అధికారాలను తన చేతిలోనే ఉంచుకున్నారు. మయన్మార్ పార్లమెంటులో నాలుగో వంతు ప్రతినిధులను స్వయంగా ఆర్మీ చీఫ్ నియమిస్తారు. అంటే మయన్మార్‌లో సైనిక నాయకత్వమే ఇప్పటికీ బలమైన అధికార కేంద్రంగా ఉంది.

సూకీ ప్రభుత్వానికి మూడు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలపై - హోం, రక్షణ, సరిహద్దు వ్యవహారాలు - ఎలాంటి అధికారం లేదు. హింసాత్మక రఖైన్ ప్రాంతంలో జనరల్ మిన్ స్వయంగా నేతృత్వం వహిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మయన్మార్‌లో శాంతి నెలకొనేలా చేయాలని ఆంగ్ సాన్ సూకీని కోరిన ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరిస్

రోహింగ్యాలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి తప్పుబట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మయన్మార్ సైనిక చర్యలను ఆపాలని హెచ్చరించింది. అందుకు ఆ దేశ నేత ఆంగ్ సాన్ సూకీకి ''ఆఖరి అవకాశం'' అని శనివారం ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరిస్ సూచించారు. లేదంటే ఒక సముదాయం పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

ఆగస్టు 25న ఉత్తర రఖై‍‌న్‌లోని పోలీస్ పోస్టుపై రోహింగ్యా మిలిటెంట్లు దాడి చేసి 12 మంది భద్రతా సిబ్బందిని హతమార్చారు. అనంతరం సైనికులు గ్రామాలకు నిప్పంటించి.. తమపై తీవ్ర దాడులకు పాల్పడ్డారని బంగ్లాదేశ్‌కు పారిపోయిన రోహింగ్యాలు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రోహింగ్యా శరణార్థుల కదలికలపై పరిమితులు విధించాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ప్రస్తుతం మయన్మార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శాంతి కోసం ఎంతో పోరాడిన ఆమె.. రోహింగ్యాల సంక్షోభం విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ నెల 19 నుంచి 25 వరకు న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఆంగ్ సాన్ సూకీ హాజరు కావడంలేదు. ఉగ్రవాదానికి వూతమిచ్చేలా ప్రచారమవుతున్న నకిలీ వార్తల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 'రోహింగ్యాలు మా దేశస్తులే కారు'

ఇప్పటి వరకు మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చిన 4 లక్షల మంది రోహింగ్యాల కదలికలపై పరిమితులు విధిస్తున్నట్లు ఇటీవల బంగ్లాదేశ్ ప్రకటించింది. వాళ్లందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

సంబంధిత అంశాలు