గుజరాత్‌లో సన్నీ లియోన్ కండోమ్ యాడ్‌పై వివాదం

కండోమ్ యాడ్‌లో సన్నీ లియోన్ / Sunney Leone in Condom add

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌కి బ్రాండ్ అంబాసిడర్

నవరాత్రి పండుగ ముందు గుజరాత్‌లో మ్యాన్‌ఫోర్స్ సంస్థ కండోమ్‌ల ప్రచార వాణిజ్య ప్రకటనలపై కొందరు భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పూర్వాపరాలను బీబీసీ ప్రతినిధి గీతా పాండే వివరిస్తున్నారు.

నవరాత్రి ప్రధానమైన హిందూ పండుగల్లో ఒకటి. ఈ తొమ్మిది రోజుల పండుగ గురువారం నుంచి మొదలైంది. దీనికి కొద్ది రోజుల ముందు గుజరాత్‌లోని పలు నగరాల్లో భారీ హోర్డింగులు వెలిశాయి.

‘‘ఈ నవరాత్రికి ఆడండి, కానీ ప్రేమతో (ఆ నవరాత్రియే రమో, పరంతు ప్రేమ్ థి)’’ అంటూ భారత సంతతికి చెందిన కెనడా నటి సన్నీ లియోన్ ప్రజలకు సలహా ఇస్తున్నట్లు ఆ ప్రకటనలున్నాయి.

బాలీవుడ్ సినిమాల్లో హోరోయిన్‌గా మారిన మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌కి భారతదేశంలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. భారతదేశంలో అతి పెద్ద కండోమ్ కంపెనీ అయిన మ్యాన్‌ఫోర్స్‌కి ఆమె బ్రాండ్ అంబాసిడర్.

ఈ వాణిజ్య ప్రకటనపై కొందరు సంప్రదాయవాద భారతీయులు మండిపడుతున్నారు. ఈ కండోమ్ సంస్థ ‘‘మార్కెటింగ్‌ను నీచ స్థాయికి దిగజార్చింద’’ని వారు ఆరోపించారు.

నిషేధం కోరిన సీఏఐటీ...

సోషల్ మీడియాలో చాలా మంది ఈ వాణిజ్య ప్రకటన ‘‘కించపరిచేలా’’ ఉందని విమర్శించారు. ఈ ప్రకటనను తక్షణం నిషేధించాలని కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది.

ఫొటో సోర్స్, Tapan Lakdawala tweet

ఫొటో క్యాప్షన్,

ఈ కండోమ్ ప్రకటన మీద కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు

‘‘మన సాంస్కృతిక విలువలన్నిటినీ దెబ్బతీస్తూ అమ్మకాలు పెంచుకోవడానికి చేసిన బాధ్యతారహితమైన నిర్లక్ష్యపూరిత ప్రయత్నం’’ అని ఆ సంస్థ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో అభివర్ణించింది.

సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నవరాత్రి మహిళల శక్తిని ప్రతిబింబించే ఒక పవిత్రమైన పండుగ. ఈ పండుగకు కండోమ్‌లను లింక్ చేయడం చాలా అభ్యంతరకరమైన విషయం‘‘ అని పేర్కొన్నారు.

ఢిల్లీలో నివసించే ఖండేల్వాల్ ఈ వారం మొదట్లో సూరత్‌ వెళ్లినపుడు సదరు వాణిజ్య ప్రకటనలను చూశారు.

‘‘ఆ ప్రకటన కండోమ్ అనే పదాన్ని ప్రస్తావించలేదు. కానీ యువత నవరాత్రి పండుగ పేరుతో మ్యాన్‌ఫోర్స్ కండోమ్‌లను వాడేలా ప్రోత్సహిస్తూ ద్వంద్వార్థాన్ని ఉపయోగిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

ఈ వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదులు రావడంతో సూరత్, వదోదర (పాత పేరు బరోడా) నగరాల్లో డజన్ల సంఖ్యలో హోర్డింగులను పోలీసులు తొలగించారు. అయితే ‘‘భవిష్యత్తులో ఇంకెవరూ ఇలా చేయకుండా ఉండేలా చూసేందుకు’’ సదరు కంపెనీ మీద, నటి సన్నీ లియోన్ మీద చర్యలు చేపట్టాలని ఖండేల్వాల్ డిమాండ్ చేస్తున్నారు.

నవరాత్రి తర్వాత పెరిగుతున్న అబార్షన్లు...

ఈ వివాదం మీద కండోమ్ కంపెనీ కానీ, నటి సన్నీ లియోన్ కానీ స్పందించలేదు. అయితే.. నవరాత్రి పండుగ సందర్భంగా కండోమ్ వాణిజ్య ప్రకటన అంత చెడ్డ ఆలోచనేమీ కాదని కొందరు అంటున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి నివాసం వచ్చిన ఒక మహిళ.. నవరాత్రి - తొమ్మిది రాత్రుల పండుగ - సమయంలో తాము ఆస్వాదించే ‘సరదా’ గరించి నాకు చెప్పారు.

చాలా సంప్రదాయవాదులైన తల్లిదండ్రులు కూడా కొంత సడలింపులతో వ్యవహరించే సమయమది. ఈ పండుగ రాత్రుల్లో టీనేజి పిల్లలు, అవివాహిత యువతీయువకులు రాత్రి పొద్దు పోయే వరకూ బయట ఉండటానికి, హోటళ్లు, మండపాలు, పార్కులు, ప్రైవేటు ఫామ్‌హౌస్‌లలో జరిగే సంప్రదాయ గార్బా నృత్యాల్లో పాల్గొనడానికి అనుమతిస్తారు.

1990ల చివరి నుండీ.. ఈ పండుగ సమయంలో యువత తరచుగా జాగ్రత్తలను గాలికొదిలేస్తోందని, అసురక్షిత సెక్స్‌లో పాల్గొంటోందని చాలా పరిశీలనలు చెప్తున్నాయి. ఈ పండుగ ముగిసిన రెండు నెలల తర్వాత గర్భధారణ రేటు పెరుగుతుందని, అబార్షన్ల కోసం క్లినిక్‌లకు వచ్చే వారి సంఖ్యా పెరుగుతుందని పలు నివేదికలు చెప్తున్నాయి.

గుజరాత్‌లో దీర్ఘకాలంగా నివసించే చాలా మంది ఈ నివేదికలు చాలా వరకూ ఊహాగానాలని, వాస్తవాన్ని చాలా ఎక్కువ చేసి చూపుతున్నాయని అంటారు. కానీ.. డాక్టర్లు, ఆరోగ్య కార్తకర్తలు చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం, ప్రభుత్వ అధికారులు కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేయడం వాస్తవం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నవరాత్రి సమయంలో హోటళ్లు, మండపాలు, పార్కులు, ప్రైవేటు ఫాంహౌస్‌లలో సంప్రదాయ గార్బా నృత్యాలు నిర్వహిస్తారు

పండుగకి పెరిగే కండోమ్ అమ్మకాలు...

యువత సురక్షిత సెక్స్ పాటించడం కోసం కండోమ్‌లను ఉపయోగించే దిశగా ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయి. ఈ జాతర్లలో పాల్గొనేవారు.. అందులోనూ బాలికలు, యువతులు కండోమ్‌లు కొనడంలో చొరవ చూపుతున్నారు.

గత పదేళ్లుగా ఈ పండుగ సయంలో కండోమ్‌ విక్రయాలు కనీసం 30 శాతం పెరుగుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ గుజరాత్ స్టేట్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్స్ చైర్మన్ జశ్వంత్ పటేల్ చెప్తున్నారు.

‘‘కండోమ్‌లను కేవలం మందులషాపులు, జనరల్ స్టోర్లలోనే కాదు.. వీధి మూలల్లో పాన్ షాపుల్లో కూడా అమ్ముతారు. వీటిని కొనేవాళ్లు చాలా మంది టీనేజర్లు, కాలేజీ విద్యార్థులే‘‘ అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

కానీ, కండోమ్ అమ్మకాలు పెరిగినా కూడా.. ఈ పండుగ తర్వాత టీనేజి గర్భధారణల సంఖ్య పెరగడం కొనసాగుతూనే ఉందని గైనకాలజిస్ట్ డాక్టర్ రూబీ మెహతా చెప్పారు. ఆమె గత 20 ఏళ్లుగా అహ్మదాబాద్‌లో క్లినిక్ నడుపుతున్నారు.

స్కూళ్లలో సెక్స్ విద్య అవసరం...

‘‘కండోమ్‌లు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. రెండు పదుల వయసులోని జంటలు చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. కానీ టీనేజర్లలో అంతగా అవగాహన లేదు. కాబట్టి.. ప్రతి ఏటా నవరాత్రి తర్వాత అబార్షన్లు కోరుతూ వచ్చే వారి సంఖ్య.. ఏడాదిలో మిగతా సమయంతో పోలిస్తే రెట్టింపుగా ఉంటోంది’’ అని ఆమె వివరించారు.

‘మ్యాన్‌ఫోర్స్ కండోమ్ ప్రకటన మంచి ఆలోచనేనా? గుజరాత్‌లో యువత సురక్షిత సెక్స్ పాటించేలా సన్నీ లియోన్ ప్రోత్సహించవచ్చా?’ అని అడిగినపుడు డాక్టర్ మెహతా నవ్వేశారు.

‘‘సెక్స్ విద్య, వాణిజ్య ప్రకటన అనేవి వేర్వేరు విషయాలు. మనకు స్కూళ్లలో ఉత్తమ సెక్స్ విద్య అవసరం. టీనేజీ బాలికలు ఇంకా ఎక్కువ అవగాహనతో ఉండాలి. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)