ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం చూద్దాం రండి

షాను బాబర్‌కు రైలు ప్రయాణలంటే చాలా ఇష్టం. ఆయన తన ప్రతి ప్రయాణాన్నీ ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ఈ ప్రయాణంలో ఆయనకు చాలా మంది తోడయ్యారు.

బాబర్, ఆయన మిత్రులు రైలు కిటికీ నుండి బయటకు చూస్తూ సెల్ఫీ తీసుకున్నారు

ఫొటో సోర్స్, Shanu Babar

ఫొటో క్యాప్షన్,

మొదటిసారి రైలెక్కినపుడు షాను బాబర్ వయసు ఐదేళ్లు. అప్పటి నుంచీ అతడు రైలు ప్రయాణాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాలేజీలో ప్రాజెక్టు కోసం భారతదేశంలో తను చేసిన రైలు ప్రయాణాలను డాక్యుమెంట్ చేశారు. అలాంటి ఒక ప్రయాణంలో 2015 ఫిబ్రవరిలో కేరళలోని త్రివేండ్రం స్టేషన్‌లో తీసుకున్న సెల్ఫీ ఇది.

ఫొటో సోర్స్, Shanu Babar

ఫొటో క్యాప్షన్,

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణాలను రికార్డు చేయడం కోసం 2015 జూలై 21న బాబర్ @windowseatproject ప్రారంభించారు. రైలులో ‘విండో సీటు’ తనకు చాలా ఇష్టమైన స్థలమని బాబర్ చెప్తారు. దక్షిణ భారతదేశంలోని ఈ వర్ణశోభిత ఎర్నాడ్ ఎక్స్‌ప్రెస్ ఫొటోను కూడా ఆయన అలాంటి కిటికీ సీటు నుంచే తీశారు. ఈ రైలు బోగీల మీద విభిన్న బ్రాండు ప్రకటనలున్నాయి.

ఫొటో సోర్స్, Souvik Koley

ఫొటో క్యాప్షన్,

2015 ఆగస్టు నాటికి ఇతర ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కూడా తమ ప్రయాణాల ఫొటోలను చేరుస్తూ @windowseatproject ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. బాబర్ ఆ ఫొటోలను రీపోస్ట్ చేశారు. వాటిలోని కోల్‌కతా లోకల్ ట్రైన్ ఫొటో ఇది. అలసిపోయిన కార్మికులు తమ సరుకుల మధ్య కునుకుతీస్తున్న చిత్రం బాబర్‌కు ఇష్టమంట.

ఫొటో సోర్స్, Manpreet Singh

ఫొటో క్యాప్షన్,

‘కంట్రిబ్యూటర్ల’ నుండి ఫొటోలు భారీ సంఖ్యలో వస్తుండటంతో @windowseatproject క్రౌడ్-సోర్స్‌డ్ విజువల్ లైబ్రరీగా మారింది. పాల ఉత్పత్తిదారులు గ్రామాల నుండి పట్టణ మార్కెట్లకు పాలను రవాణా చేయడానికి రైళ్లలో ఖాళీ లేకపోతే ఇలా తరలిస్తున్నారని బాబర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Wajahat Mirza

ఫొటో క్యాప్షన్,

రైళ్లలో ప్రత్యేకంగా కనిపించే ఆదరణను ఈ ఫొటో చూపుతోందని బాబర్ అంటారు. బెర్తు కోసం వెయిట్ లిస్టులో ఉన్న వాళ్లు ఒకరికొకరు తెలియకపోయినా ఇలా ఒకే బెర్తును పంచుకోవాల్సి వస్తుందని ఆయన వివరించారు. వెయిట్ లిస్టులో ఉన్న వాళ్లకు చాలాసార్లు వాళ్లు రైలు ఎక్కిన తర్వాతే బెర్తును కేటాయిస్తారు. ఈ ఫొటోలో.. ఇద్దరు వ్యక్తులు ఏసీ లేని బోగీలో చొక్కాలు లేకుండా ఒకే బెర్తు మీద నిద్రిస్తున్నారు.

ఫొటో సోర్స్, Shraddha Gosavi

ఫొటో క్యాప్షన్,

ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకుని తినడం భారత రైలు ప్రయాణంలో ఒక సంప్రదాయమని బాబర్ అంటారు. ఇది.. తమ కుటుంబం ఏటా పశ్చిమ భారతదేశపు కొండలు దాటుతూ చేసే ప్రయాణంలో కూరలు, రొట్టెలు, అన్నం, మసాలా పూరీలతో చేసుకునే ‘విందు భోజనాల’ను తనకు గుర్తు చేస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Harshita Mahajan

ఫొటో క్యాప్షన్,

ఈ ఫొటో తీసింది హర్షితా మహాజన్. 2015 జూలైలో ఒక మధ్యాహ్నం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఒక లోకల్ ట్రైన్‌లో వీరి ఫొటోను తీశారు. తన దగ్గర ఒక పెద్ద కెమెరా ఉండటంతో వీళ్లు ఆసక్తిగా చూశారని ఆమె చెప్తారు. ‘‘వాళ్లందరి హావభావాల్లో వ్యక్తమైన ఆసక్తి, ఉత్సుకత నన్ను ఆకట్టుకున్నాయి’’ అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ ఫొటోను @windowseatproject లో మళ్లీ పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Shanu Babar

ఫొటో క్యాప్షన్,

‘‘కొత్త వారు కలిసిపోవడానికి పేకాటకు మించిన మార్గమేముంది?’’ అని బాబర్ ప్రశ్నిస్తారు. ఈ ఆట పొడవునా వీళ్లు నవ్వుతూ తుళ్లుతూ వాదులాడుతూ గడిపారని ఆయన చెప్పారు. ’’వాళ్లు ఒకరికొకరు తెలియదు. కనీసం ఒకరికొకరు పేర్లు కూడా చెప్పుకోలేదు. కానీ ఫ్రెండ్స్‌లాగా ఆడుకున్నారు’’ అని ఆయన తెలిపారు. ఈ ఆటలో బాబర్ చేరలేదు. ఎందుకంటే వారి పక్క బెర్తులో జరుగుతున్న అంత్యాక్షరి పాటల పోటీ ఫొటోలు తీయటంలో ఆయన బిజీగా ఉన్నారంట.

ఫొటో సోర్స్, Prince Mandal

ఫొటో క్యాప్షన్,

ఇప్పుడు @windowseatproject హ్యాష్‌ట్యాగ్‌లు 26,000 ఉన్నాయని, అందులో అసాధారణమైన ఫొటోల నుండి ఆహ్లాదకరమైన ఫొటోల వరకూ ఉన్నాయని బాబర్ చెప్తున్నారు. ఆయన రీపోస్ట్ చేసిన ఈ ఫొటో.. పశ్చిమ బెంగాల్‌లో ఆ చివరి నుండి ఈ చివరి వరకూ 9 గంటల పాటు ప్రయాణించే హౌరా - జమాల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తీసింది. వృద్ధులు, పేదలు ఎక్కువమంది రైల్వే టైమ్ టేబుళ్లు చదవలేరని.. ఈ ప్రయాణికురాలు తన స్టేషన్ దాటి పోతానేమోననే ఆందోళనలో ఉండివచ్చని ఆయన చెప్తారు.

ఫొటో సోర్స్, Divya Duggar

ఫొటో క్యాప్షన్,

‘‘మేం మా ఫర్రీ బేబీలతో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణం చేస్తాం’’ అని చెప్తారు ఈ ఫొటో తీసిన దివ్యా దుగ్గర్. పెంపుడు జంతువులతో ప్రయాణం చేసే వారు ఫస్ట్ క్లాస్ బోగీలో ఒక ’కూపే‘ మొత్తాన్ని లేదా క్యాబిన్ మొత్తాన్నీ రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఈ ఫొటోలో ఉన్నది ఆమె పెంపుడు కుక్క మార్కోపోలో. ఢిల్లీ నుండి హిమాలయ పర్వతాల దగ్గరకు ప్రయాణ చేస్తుండగా తీసిన ఫొటో. ఆమె ఇప్పటివరకూ తన పెంపుడు కుక్కలతో కలిసి నాలుగుసార్లు ప్రయాణం చేశారు. అందులో 30 గంటల సుదీర్ఘ ప్రయాణం కూడా ఉంది. @windowseatproject లో పెంపుడు జంతువులున్న ఫొటోలు ఆమెవి మాత్రమే.

ఫొటో సోర్స్, Shanu Babar

ఫొటో క్యాప్షన్,

2017 మార్చిలో ‘షోపూర్ కలాన్ ఎక్స్‌ప్రెస్’ మధ్య భారతదేశం గుండా ప్రయాణిస్తున్నపుడు బాబర్ ఆ రైలు మీదకు ఎక్కారు. రైలు లోపల స్థలం లేకపోవడంతో ప్రయాణికులు బోగీ మీద ఎక్కి కూర్చుని ప్రయాణిస్తున్నారు. అక్కడ కూడా కొందరు పత్రికలు చదువుతూ, నిద్రపోతూ గడిపారు. రైలు సొరంగం దగ్గరకు వచ్చినపుడు వారందరూ తలలు పూర్తిగా కిందకు వంచడం తనకు గుర్తుందని బాబర్ తెలిపారు. ‘‘జనం దేనికైనా ఎలా అలవాటు పడతారో చాలా వింతైన విషయం’’ అని ఆయనంటారు.