స్వచ్ఛ భారత్: సదుపాయాల మాట మరచి అంకెల వెంట పరుగులు
- వెంకట కిషన్ ప్రసాద్
- బీబీసీ తెలుగు

ఫొటో సోర్స్, pmindia.gov.in
అక్టోబర్ 2, 2014... గాంధీ జయంతి రోజున దిల్లీలోని ఓ దళిత వాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చీపురు పట్టుకొని ఊడ్వడం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2019 నాటికి స్వచ్ఛ భారత్‌ను సాధించాలని ఆయన లక్ష్య ప్రకటన చేశారు. ఆ రకంగా మహాత్మా గాంధీ 150వ జయంతికి ఘనంగా నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.
1901లో బెంగాల్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ గాంధీ, "మ్యానువల్ స్కావెంజింగ్ అనేది అసహ్యకరం, అమానవీయం, అనారోగ్యకరం" అని అన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన లేకుండా చేయడం, మ్యానువల్ స్కావెంజింగ్ను నిర్మూలించడమే స్వచ్ఛ భారత్ ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
జనం రోడ్లమీద చెత్తా చెదారం వేయకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచాలంటూ సెలబ్రిటీల ద్వారా మీడియాలో విస్తృతమైన ప్రచారం సాగించింది.
అయితే నిర్దిష్ట అంశాల్లో పెట్టుకున్న లక్ష్యాలు, వాటి పరిపూర్తికి అవలంబిస్తున్న విధానాలపై కొన్ని ప్రశ్నలున్నాయి.
లెక్కలు వర్సెస్ సదుపాయాలు
దేశంలోని 24.67 కోట్ల కుటుంబాల్లో 53.1 శాతానికి మరుగుదొడ్లు లేవని 2011 జనాభా లెక్కలు తేల్చాయి. 2019 నాటికి దేశంలో 9 కోట్ల 80 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలన్నది స్వచ్ఛ భారత్ లక్ష్యం.
గత మూడేళ్లలో ఈ లక్ష్యంలో సగంకన్నా ఎక్కువే (4.97 కోట్లు) పూర్తయినట్టు స్వచ్ఛ భారత్ అభియాన్ లెక్కలు తెలుపుతున్నాయి.
2017 నాటికి 300 జిల్లాలను బహిరంగ మల విసర్జనరహిత జిల్లాలుగా ప్రకటించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఈ మూడేళ్లలో ఎన్నో గ్రామాలను, జిల్లాలను, రాష్ట్రాలను బహిరంగ మలవిసర్జన రహితమైనవిగా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఇప్పటి వరకు కట్టిన మరుగుదొడ్లలో నిజంగా వాడకంలో ఉన్నవి ఎన్ని అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు.
మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటికి సరైన గోడలు, నీటి సదుపాయం వంటివి లేకపోవడం వల్ల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ పొలాల్లో, ఇతర చోట్లలో మలవిసర్జనకు వెళ్తున్నారు.
మరికొంత మంది వాటిని వంటచెరకు, ధాన్యం వంటి వాటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.
అట్లాగే మరుగుదొడ్ల లెక్కలలో డబుల్ ఎంట్రీలున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బహిరంగ మలవిసర్జన రహితమైనవిగా చేసిన ప్రకటనల్లో లొసుగులున్నాయని విమర్శకులంటున్నారు.
జనాలకు మరుగుదొడ్లకన్నా ముఖ్యంగా నీటి వసతి ఎక్కువ అవసరమని సఫాయి కర్మచారీ ఆందోళన్ జాతీయ కన్వీనర్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు.
"సరైన నీటి వసతి లేనప్పుడు మరుగుదొడ్లు నిర్మించినా ప్రజలు వాటిని వాడుకోలేరు. దొడ్లను ఫ్లష్ చేయకుండా అలాగే వదిలేస్తే వాటిని శుభ్రం చేయడానికి మళ్లీ సఫాయి వాళ్లు కావాల్సిందే. దీని వల్ల పారిశుధ్య కార్మికులపై మరింత పని భారం, దాంతో మరిన్ని ప్రమాదాలు తప్పవు" అని విల్సన్ అన్నారు.
విల్సన్ గత 35 ఏళ్లుగా మ్యానువల్ స్కావెంజింగ్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ఎస్కేఏకు దేశవ్యాప్తంగా 6 వేల మంది కార్యకర్తలున్నారని ఆయన తెలిపారు.
కుల అణచివేతకూ, మ్యానువల్ స్కావెంజింగ్కూ విడదీయలేని సంబంధం ఉందని విల్సన్ వాదిస్తారు.
సెల్ఫీ ప్రచారమే ఎక్కువ: కార్మిక నేతలు
స్వచ్ఛ భారత్ పేరుతో జరుగుతున్న ఆర్భాటాన్ని విమర్శిస్తున్న వాళ్లలో విల్సన్ ఒక్కరే లేరు. పలు కార్మిక నేతలు కూడా దీనిపై అసంతృప్తి వెల్లబుచ్చారు.
చీపుర్లు పట్టుకొని సెల్ఫీలు తీసుకొని ప్రచారం చేసుకోవడమే ఇందులో ఎక్కువగా జరుగుతోందని అఖిల భారతీయ మజ్దూర్ క్రాంతి దళ్ దిల్లీ శాఖ అధ్యక్షురాలు మీనాక్షీ సక్సేనా విమర్శించారు.
టాయిలెట్ల సంఖ్య పెరిగితే సరిపోదనీ, నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఇప్పటికీ మురికి, చెత్తాచెదారం ఎక్కడికక్కడే పడి ఉంటోందని ఆమె బీబీసీతో అన్నారు.
"ప్రభుత్వం అంకెల కోసమే టాయిలెట్లు నిర్మిస్తూ పోతోంది. కానీ కట్టిన టాయిలెట్లలో నీటి ఏర్పాటు ఉందా లేదా అనేది దానికి అనవసరం. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఇంకా అధ్వాన్నంగా ఉంది" అని ఆమె అన్నారు.
ఇదే విషయంపై దిల్లీ సఫాయి మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్ మేవాతీ బీబీసీతో మాట్లాడుతూ, "సఫాయి పని చేసే మనుషుల బాగోగులు పట్టించుకోకుండా స్వచ్ఛ భారత్ గురించి ప్రచారం చేసుకోవడంలో అర్థం ఏముంది" అని అన్నారు.
"ఎన్నో యేళ్లుగా పని చేస్తున్న సఫాయి కార్మికులను ప్రభుత్వాలు పర్మినెంట్ చేయడం లేదు. వారికి తగిన జీతాలు లేవు" అని ఆయన చెప్పారు.
దీనిపై బెజవాడ విల్సన్ మాట్లాడుతూ, "దేశాన్ని స్వచ్ఛంగా ఉంచడం కోసం సఫాయి కార్మికులు తరతరాలుగా పని చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. నిజానికి స్వచ్ఛ భారత్‌ను ముందు నుంచి కొనసాగిస్తున్నది వాళ్లే" అని అన్నారు.
"మార్పు రాలేదు"
మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో వచ్చిన మార్పేమీ లేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
"మురికి కాల్వల వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కేవలం అంకెల కోసం టాయిలెట్లను కడుతూ పోతే స్వచ్ఛ భారత్ కల ఎన్నటికీ నెరవేరదు" అని ఆయన బీబీసీతో చెప్పారు.
మోదీ ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఏచూరి, "ఇలాంటి సింబాలిక్ చర్యలకే పరిమితం కావడం బాధాకరం" అని అన్నారు.
'మురికి కాల్వల యాంత్రీకరణే పరిష్కారం'
భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాల ప్రకారం మ్యానువల్ స్కావెంజింగ్ నేరం. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ దురాచారం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతూనే ఉంది.
దేశ రాజధానిలోనే గత రెండు నెలల కాలంలో కనీసం పది మంది సఫాయి కార్మికులు మురికి నాలాలను, మలవ్యర్థాలను శుభ్రం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో మురికి కాల్వను శుభ్రం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రిషిపాల్
దిల్లీలోని సఫాయి కర్మచారీ ఆందోళన్ (ఎస్కేఏ) కార్యాలయం నమోదు చేసిన లెక్కల ప్రకారం - 2015లో 18 మంది, 2016లో 22 మంది, 2017లో (ఆగస్టు 20 వరకు) 89 మంది సఫాయి కార్మికులు సీవర్లను శుభ్రం చేసే క్రమంలో మృతి చెందారు.
అయితే తమ దృష్టికి రాకుండా, రిపోర్టు కాకుండా ఉన్న మరణాలు ఇంకా ఉండొచ్చని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
'స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్' వల్ల మ్యానువల్ స్కావెంజింగ్ సమస్య తగ్గడం మాట అటుంచి మరణాలు ఇంకా పెరుగుతున్నాయని బెజవాడ విల్సన్ అభిప్రాయపడ్డారు.
"ఎన్నో మరుగుదొడ్లు కట్టారు. సెప్టిక్ ట్యాంకులు పెరిగిపోయాయి. కానీ సీవేజ్ వ్యవస్థను మాత్రం ఆధునీకరించలేదు. ఎన్ని కోట్ల మరుగుదొడ్లు కడితే అన్ని కోట్ల సెప్టిక్ ట్యాంకులొస్తాయి. వాటిని శుభ్రం చేయడానికి ఇంకా ఎక్కువ మంది మనుషులు కావాలి. ఎందరో బలి కావాలి" అని విల్సన్ అన్నారు.
ఘనవ్యర్థాల సక్రమ నిర్వహణ, మురికి కాల్వల యాంత్రీకరణల ద్వారానే స్కావెంజర్ల మరణాలను అరికట్టగలమని విల్సన్ అభిప్రాయపడ్డారు.
"నరాల గుండా సన్నటి గొట్టాలతో మైక్రో కెమరాలను పంపించి గుండె ఆపరేషన్లు చేయగలిగే టెక్నాలజీ అభివృద్ధి చెందిన దేశంలో మురికి కాల్వల్లో ఇరుక్కున్న మలవ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన మెషీన్లు తయారు చేయలేమా?" అని విల్సన్ ప్రశ్నించారు.
బహిరంగ మలవిసర్జనపై పహారా
మరుగుదొడ్ల నిర్మాణం, దానిపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాల ఫలితంగా ప్రజలలో బహిరంగ మలవిసర్జన అలవాటు తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
అయితే గ్రామాల్లో మరుగుదొడ్డి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల బహిరంగ మలవిసర్జనకు వెళ్లే వాళ్లు ఉంటున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇంట్లో తగినంత నీటి సరఫరా లేకపోవడం, కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొందరు బైటికి వెళ్తుంటారు.
పట్టణ ప్రాంతాల్లో తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం వల్ల అసంఘటిత కార్మికులు, మురికి వాడల్లో నివసించే వారు బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోక తప్పడం లేదు.
అయితే ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం, వేధించడం, వారి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో బాగా జరుగుతున్నాయి.
ఫొటో సోర్స్, Twitter
ఇటీవల బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఇలాంటి ఫోటో ఒకటి ట్విట్టర్‌పై షేర్ చేయడంతో బాగా దుమారం లేచింది.
రాంచీలో ఈ మధ్య 'హల్లా బోల్ లుంగీ ఖోల్' అనే పేరుతో బైట మలవిసర్జన చేసే వాళ్లను అపహాస్యం చేస్తూ ఒక క్యాంపెయిన్ నిర్వహించారు.
అంతకు ముందు జులైలో రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఆరుబయట మలవిసర్జనకు వెళ్తున్న మహిళలను కొందరు ఫోటోలు తీస్తుండగా అభ్యంతరం చెప్పినందుకు జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు.
ఫొటో సోర్స్, Twitter/Min IT, KTR
తెలంగాణలో ప్రవేశ పెట్టిన జెట్టీ యంత్రాలు
హైదరాబాద్‌లో ఆధునిక సఫాయి యంత్రాలు
మ్యాన్‌హోల్స్ లోకి, సీవర్లలోకి మనుషులు దిగడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జలమండలి గత జూన్ నెలలో హైదరాబాద్ నగరంలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టింది.
ప్రపంచ పర్యావరణ దినం నాడు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ మంత్రి కే. తారకరామారావు 70 మినీ సీవర్-జెట్టింగ్ మెషీన్లను ప్రారంభించారు.
"మురికి కాల్వల్లో చెత్త, మలం పేరుకుపోయి జామ్ అయినప్పుడు ఈ యంత్రాలు బాగా పని చేస్తున్నాయి. మనుషులు దిగాల్సిన అవసరం లేకుండానే పని జరుగుతోంది. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత మాకు గతంతో పోలిస్తే ఫిర్యాదులు కూడా తక్కువగా వస్తున్నాయి" అని హైదరాబాద్ జలమండలి చీఫ్ ఇంజినీర్ పి. రవి బీబీసీతో అన్నారు.
ఈ మెషీన్లను దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) సహకారంతో తయారు చేస్తున్నారు. ఒక్కో మెషీన్‌కు రూ. 26 లక్షలు ఖర్చవుతుందని తెలిసింది.
ఈ మెషీన్ల పనితీరు బాగుందనీ, వీటిని ఇతర చోట్ల కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు పి. రవి తెలిపారు.
అయితే వివిధ రాష్ట్రాలలో మురికి కాల్వల నిర్వహణలో ఆధునిక యంత్రాల వాడకం ఎలా ఉందని బెజవాడ విల్సన్‌ను అడిగినప్పుడు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"దాదాపు అన్ని దేశాల్లో ఆధునిక యంత్రాలను బాగా ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రమే దీని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సమస్య తీవ్రతతో పోల్చితే ఈ కృషి ఏ మాత్రం సరిపోదు" అని ఆయన అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)