అభిప్రాయం: మహిళలకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొడుతున్న 'మజా' గుంపు

  • దివ్య ఆర్య
  • బీబీసీ కరస్పాండెంట్
గాయకుడు ఓం ప్రకాశ్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్,

గాయకుడు ఓం ప్రకాశ్ ఫేస్‌బుక్ పేజీ లోంచి

మీరు ఇంట్లో తీరిగ్గా విశ్రాంతి తీసుకోవడానికి బదులు ఒక 'ఫ్లాష్ మాబ్‌'లో భాగం అయ్యేలా మిమ్మల్ని పురికొల్పే అంశం ఏమిటి? ఆలోచించి జవాబు చెప్పండి.

ఆ 'ఫ్లాష్ మాబ్' (బహిరంగ స్థలాల్లో అప్పటికప్పుడు గుమిగూడే గుంపు) అరుస్తూ పాడుతుంటే మీరు అందులో భాగం కాగలరా? ఆ గాయకుడికి మద్దతు పలుకగలరా?

అతడు పాడే పాట పక్కింటి ఆంటీతో సెక్స్ గురించి అయినప్పుడూ మీరా గుంపులో భాగం కాగలరా?

ఆ పాట సారాంశం మహిళలను వినియోగ వస్తువుగా చూపించడమని, వారితో బలవంతపు సెక్స్‌ను రెచ్చగొట్టడమని, మళ్లీ దీనంతటికీ మహిళనే దోషిగా వేలెత్తిచూపుతూ తనను తాను సమర్థించుకునేదని తెలిసినప్పుడూ మీరందులో భాగం కాగలుగుతారా?

గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో అనామకంగా సంచరిస్తూ 'ట్రోల్' చేసే వాళ్లకు భిన్నంగా, మనం గుర్తు పట్టగల నిజమైన మనుషులతోనే ఈ 'ఫ్లాష్ మాబ్' ఏర్పడుతుంది.

ఈ యువకులకు యువ మహిళలతో కలిసి ఈ పాట పాడడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇందులో గాయకుడు "బోల్ న ఆంటీ ఆవూ క్యా, ఘంటీ మై బజావూ క్యా" (ఆంటీ, రమ్మంటావా... కాలింగ్ బెల్ నొక్కమంటావా!) అని పాడుతుంటాడు.

ఈ పాటలో గాయకుడు పక్కింటి ఆంటీతో హింసాత్మక సెక్స్ గురించి వర్ణిస్తుంటాడు.

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్,

ఫేస్‌బుక్‌లో 'బోల్ న ఆంటీ' పేజీలు

యూట్యూబ్‌లో వీడియో

ఇంకా ఈ పాటలో గాయకుడు పక్కింటి ఆంటీ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడుతూ, ఆమె పొట్టి దుస్తులు వేసుకుంటుందని పాడతాడు. తండ్రి కూడబెట్టిన డబ్బును వృధాగా ఖర్చు చేస్తుందని చెబుతూ, ఆమెకు 'రోజుకు పది మందితో సెక్స్ చేసే అలవాటు' ఉన్నట్టు పాటలో ఆరోపిస్తాడు.

డిక్షనరీ ప్రకారం దీనిని 'మిసోజనీ' అంటారు. అంటే మహిళలను ద్వేషించడం, వారిని నిర్లక్ష్యం చేయడం, వారి పట్ల ముందస్తు అభిప్రాయాలు ఏర్పర్చుకోవడం.

అయితే చాలా మందికి దీని పట్ల పెద్దగా పట్టింపు లేదు. యూట్యూబ్‌లో ఈ వీడియోను ఇప్పటి వరకు 30 లక్షల మంది చూశారు. (ఇప్పుడు ఈ వీడియోను యూట్యూబ్ లోంచి తొలగించారు.

అయితే కావాలంటే ఈ పాటను ఇప్పటికీ చూడొచ్చు. ఎందుకంటే వేలాది మంది దీనిని 'షేర్' చేశారు. తమ వ్యక్తిగత పేజీల్లో 'పోస్ట్' చేశారు.

అంతే కాదు, సోషల్ నెట్‌వర్కింగ్ వైబ్‌సైట్ ఫేస్‌బుక్‌పై రోజూ పదుల సంఖ్యలో 'ఈవెంట్లు' దర్శనమిస్తున్నాయి. వాటిల్లో ఫలానా సమయంలో రద్దీగా ఉండే బజారులో లేదా ఫలానా కాలేజి ఎదుట అందరూ గుమిగూడి 'ఫ్లాష్ మాబ్‌'లో భాగం కావాలని ఆహ్వానాలు పంపిస్తున్నారు.

నేను ఇలాంటి 'ఫ్లాష్ మాబ్స్'కు సంబంధించిన రెండు వీడియోలు చూశాను. వాళ్లంతా ఉద్రేకంగా కనిపిస్తున్నారు. వాళ్లకు ఇదంతా 'మజా' లాగా ఉంది. ముఖాల్లో సిగ్గూ ఎగ్గూ లాంటివి ఏ కోశానా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మహిళలపై హింసకు నో..

హింసను రెచ్చగొట్టడం

తాము పాడుతున్నదేమిటో వాళ్లకు తెలియకపోవడం వల్లనే ఇది జరుగుతోందా?

గుంపులో భాగమైన కొందరు మగవాళ్లు చేతులతో చేస్తున్న సైగలను బట్టి, నడుంనూ, తొడలనూ కదిలిస్తున్న తీరును బట్టి చూస్తే అలా ఏమీ అనిపించడం లేదు.

లేదంటే, ఇదంతా ఉత్త మజా కోసమే కదా, దీనితో ఎవరికీ నష్టం లేదు కదా అని వాళ్లు భావిస్తున్నారేమో మరి?

అయితే ఈ 'ఉత్త మజా' అనేది ఒక రకంగా మహిళలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తుంది.

జనంతో కిక్కిరిసిన వీధుల్లో ఇది మహా జోరుగా 'సెక్సిస్ట్' భాషను ఉపయోగిస్తుంది.

పైగా ఈ గుంపులో మహిళలు కూడా ఉన్నారు.

వాళ్లంతా కలిసి ఆడుతున్నారు, పాడుతున్నారు, నవ్వుతున్నారు, సమానంగా మజా చేస్తున్నారు.

ఎవరీ యువకులు, ఎవరీ యువతులు?

రోడ్డు మీద పోగయ్యే ఈ మందకూ, ఇంటర్నెట్‍లో స్వైర విహారం చేసే మందకూ ఏమిటి తేడా?

ఒక పాత్రికేయురాలు ఈ పాటను విమర్శించినందుకు ఆమెను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియా పేజీల్లో హెచ్చరికలు చేశారు. చంపేస్తామంటూ ఫోన్‍లో బెదిరించారు.

ఈ పరిణామం ఎంత అసభ్యమైన, హింసాత్మకమైన మలుపు తీసుకుందంటే, చివరకు ఆ న్యూస్ వెబ్‌సైట్ యాజమాన్యం తమ రిపోర్టర్‌‌కు నిజంగానే ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చని భావిస్తూ, దానిని నివారించడం కోసం ఆ వీడియో రిపోర్టును వెబ్‌సైట్‌లోంచి తొలగించింది.

ఎందుకంటే 'ఉత్త మజా' ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో ఎవరికి తెలుసు?

ఫొటో సోర్స్, Yash Raj Films

ఫొటో క్యాప్షన్,

బాలీవుడ్ పాటలదీ అదే ఒరవడి

'ఫ్లాష్ మాబ్' లాగానే...

భారతీయ సినిమాల్లో కూడా సెక్స్ సంకేతాలతో బూతు పదాలతో కూడిన పాటల్ని ఉపయోగిస్తున్నారు. మహిళలను వెంటాడే పురుషులను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. శారీరక సంబంధం ఏర్పర్చుకోవడానికి మహిళల ఆమోదం తప్పనిసరి అనే అంశాన్ని అవహేళన చేస్తున్నారు.

అలాంటప్పుడు, ఊరూ పేరూ తెలియని ఓ అనామక గాయకుడు తన పాటతో ఏమంత నష్టం చేస్తున్నాడని నేనింతగా హైరానా పడుతున్నాను?

వందలాది మంది యువకులూ, యువతులూ ఇళ్లల్లో తీరిగ్గా కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి బదులు 'ఫ్లాష్ మాబ్‌'లా ఒకచోట గుమిగూడి అరుస్తుంటే నేనెందుకింత ఆందోళన పడాలి?

ఎందుకంటే... ఆ గాయకుడి పట్ల కాదు, ఆ గుంపు విషయంలోనే నా ఆందోళనంతా.

తామేం పాడుతున్నారో వినడానికి సిద్ధంగా లేని, తామేం రాస్తున్నారో చదవడానికి సిద్ధంగా లేని, తమ చర్యలతో ఏం నష్టం జరగగలదో చూడడానికి సిద్ధంగా లేని గుంపు అది.

ఇంటర్నెట్‌లోకి వెళ్లి తమలోని ద్వేషాన్ని వాంతి చేసుకోవడానికి సమయం వెచ్చిస్తున్న భారత యువతీయువకుల గుంపు పట్లనే నా ఆందోళనంతా. మహిళల పట్ల తమ విద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం నడి వీధినే వేదికగా చేసుకొని నిలబడి అరవడానికి ప్రేరేపితులైన గుంపు అది.

మీరూ ఈ గుంపులో భాగం కావాలని కోరుకుంటున్నారా? ఆలోచించి జవాబివ్వండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)