నగదు రహిత లావాదేవీల్లో స్వీడన్ ఎందుకు ముందుంది?

  • మ్యాడీ సావేజ్
  • బిజినెస్ రిపోర్టర్, స్టాక్‌హోమ్
స్వీడన్‌, నగదు వినియోగం
ఫొటో క్యాప్షన్,

స్వీడన్‌ షాపుల్లో నగదు వినియోగం 20 శాతం కూడా లేదు

మన దేశంలో ఇప్పటికీ ఎన్నోచోట్ల "మా దగ్గర నగదుతో మాత్రమే చెల్లింపులు జరపాల''నే బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ స్వీడన్‌లో పరిస్ధితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ కాఫీ షాపుల్లో, బేకరీల్లో ''నగదుతో లావాదేవీలు ఇక్కడ నిషేధం" అనే బోర్డులు కనిపిస్తాయి.

"నగదురహిత లావాదేవీలతో దొంగతనాలు, నకిలీ కరెన్సీ, మోసాలు ఉండవు. కార్డు చెల్లింపులతో సమయం కూడా అదా అవుతోంది''అని స్ధానిక బేకరీ మేనేజర్ విక్టోరియా తెలిపారు.

"స్వీడన్‌ షాపుల్లో నగదు వినియోగం 20 శాతం కూడా లేదు. గత ఐదేళ్లలో నగదు వినియోగం సగానికి పైగా తగ్గింది" అని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు 'రిస్క్' తెలిపింది.

బస్సుల్లో నగదు వినియోగంతో డ్రైవర్ల భద్రతపై స్ధానిక యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో అక్కడ బస్సుల్లో కూడా నగదును నిషేధించారు.

స్ధానిక హోటళ్లు కూడా కేవలం ప్లాస్టిక్ కార్డులతోనే లావాదేవీలను నిర్వహించాలని ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

జార్న్ ఉల్వాస్ స్వీడన్‌లో గేయరచయిత

జార్న్ ఉల్వాస్ ప్రచారం

జార్న్ ఉల్వాస్ స్వీడన్‌లో గేయరచయిత. ఆయనకు స్వీడన్‌లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ''క్యాష్‌లెస్ స్వీడన్'' అనే ప్రచారాన్ని భారీస్ధాయిలో నిర్వహించారు. ఓ దొంగ‌త‌నంలో త‌న కుమారునికి చెందిన న‌గ‌దు పెద్ద ఎత్తున దోపిడీ కావ‌డంతో ఆయన ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి స్వీడన్‌లో ఎన్నో స్టార్టప్‌లు వ‌చ్చాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఐజెటిల్ వీటిలో ఒకటి. యూరప్‌లో మొట్టమొదటి మొబైల్ క్రెడిట్ కార్డ్ రీడర్‌ని కూడా స్వీడన్ స్టార్టప్ తయారు చేసింది. స్వీడన్‌లో ఉన్న టెక్నాలజీ ప్రజలకు నగదురహిత లావాదేవీలను నిర్వహించేందుకు పూర్తిగా అనుకూలంగా ఉంది అందుకే అక్కడ నగదురహిత లావాదేవీల నిర్వహణ అంత ఎక్కువ.

"నేను పిల్లలను ఓ ప్రదర్శనకు తీసుకెళ్ళాను. అక్కడ ఒకతను పిల్లల కోసం బెలూన్లను అమ్ముతున్నాడు. తన చేతిలో కార్డు మెషీను పెట్టుకుని మరీ బెలూన్లను అమ్మడం నేను చూశాను" అని స్ధానిక సెనోబార్ జాన్సన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

స్ధానిక హోటళ్లు కూడా కేవలం ప్లాస్టిక్ కార్డులతోనే లావాదేవీలను నిర్వహించాలని ప్రచారం నిర్వహిస్తున్నాయి

చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్ధ

"స్విష్" అక్కడి స్మార్ట్ ఫోన్ చెల్లింపు వ్యవస్థ. 10 మిలియన్ల జనాభా గల ఆ దేశంలో సగానికి పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులకు స్విష్ ను వాడతారు.

ఆ దేశంలో చాలా బ్యాంకులు ఈ యాప్ సహాయంతో డబ్బును పంపించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి పౌరుడి ఐడి మొబైల్ నెంబర్ ఆధారంగా ఉంటుంది.

నగదురహిత లావాదేవీల కారణంగా అక్కడ చిన్న రెస్టారెంట్లలో నలుగురు మిత్రులు కలిసి భోజనం చేసిన తర్వాత అందరూ కలిసి రెస్టారెంట్ బిల్లు వాటాను కూడా యాప్స్ తోనే పంచుకుంటున్నారు.

"వినియోగదారులు కొత్త టెక్నాలజీని వీలైనంత‌ తొందరగా అందుకోవాలనుకుంటారు. అందుకే టెక్నాలజీని విషయంలోలో మేము ముందుంటాం" అని స్టాక్‌హోమ్‌ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ నిక్లాస్ అర్విడ్సన్ తెలిపారు.

"స్వీడన్‌లో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం ఉంది. మేమూ వాటిని నమ్ముతాము. అందుకే ఎలక్ట్రానిక్ చెల్లింపులకు సంబంధించి మోసం జరుగుతుందని అనుకోము" అని ఆయన అన్నారు.

ఫొటో క్యాప్షన్,

స్వీడన్ లో ప్రజలు నగదురహిత లావాదేలనే కోరుకుంటున్నారని సెనోబార్ జాన్సన్ తెలిపారు

2010లో స్వీడన్ కేంద్ర బ్యాంకు 'రిస్క్'.. బ్యాంకు నాణేలను, బ్యాంకు నోట్లను అప్‌డేట్‌ చేయాలని చెప్పిన తర్వాత నగదురహిత లావాదేవీలు పెరిగాయని అర్విడ్సన్ వెల్లడించారు. క్రమంగా ఎన్నో వ్యాపార సంస్ధలు ఇందులో భాగమయ్యాయని అన్నారు.

రిస్క్ బ్యాంకు రిపోర్టు ప్రకారం 2009లో 106 బిలియన్ డాలర్ల స్వీడిష్ క్రోనా నోట్ల సరఫరా అయ్యింది. అది క్రమంగా తగ్గి గతేడాది 2016 నాటికి 65 బిలియన్ డాలర్లకు చేరింది.

గతేడాది స్వీడన్‌లో 1 శాతం మాత్రమే నగదు లావాదేవీలను నిర్వహించారు. యూరప్, అమెరికాలో 7 శాతం నగదు లావాదేవీలు జ‌రుగుతున్నాయి.

2020 నాటికి నగదు లావాదేవీలు మరింత తక్కువ స్ధాయికి చేరుకుంటాయని అర్విడ్సన్ తెలిపారు.

స్వీడ‌న్‌లో 800 చిన్న వ్యాపారులతో ఓ సర్వే నిర్వహించ‌గా.. అందులో మూడింట రెండోవంతు వ్యాపారులు 2030 నాటికి నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తి పలుకుతామ‌ని తెలిపారు.

వ్యతిరేకత కూడా !

అయితే మరోవైపు పోలీసు మాజీ కమిషనర్ జోర్న్ ఎరిక్ సన్ మాత్రం పూర్తి నగదురహిత లావాదేవీల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. స్ధానికంగా ఆయనకు ఓ కాఫీ షాప్ ఉంది. అక్కడ ఇప్పటికీ నగదు వ్యాపారమే నిర్వహిస్తున్నారు.

"నాకూ నగదురహిత లావాదేవీలంటే ఇష్టమే కానీ ఇప్పటికీ దేశంలో పదిలక్షల మంది నగదురహిత లావాదేవీలకు అలవాటు పడలేదు. వృద్ధులు, మాజీ ఖైదీలు, పర్యాటకులు, వలసదారుల గురించి బ్యాంకులు ఆలోచించడం లేదు. ఎందుకంటే బ్యాంకులకు వీరితో ఎటువంటి ఆదాయం రాద''ని ఆయన అన్నారు.

ఫొటో క్యాప్షన్,

స్వీడన్‌లో పది లక్షల మంది నగదురహిత లావాదేవీలకు అలవాటు పడలేదు

ఇంతేకాదు ఆయన కొంటంటుప్పరెంట్ (అంటే నగదు తిరుగుబాటు) ఉద్యమాన్నికూడా నడిపిస్తున్నారు. ఈ ఉద్యమం ద్వారా ఆయన స్వీడన్‌లో నగదు లావాదేవీలు అంతరించిపోతే దేశంలో వ్యక్తిగత సమాచారం భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందని, వినియోగ‌దారుల రుణాలు, సైబర్ దాడులు తీవ్రంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు ఈ ఏడాది జులైలో దుమారం రేపాయి. 2015లో ఐటీ అవుట్ సోర్సింగ్ శాఖ భారీ మొత్తంలో ప్రజల వ్యక్తిగత సంబంధిత డేటాను లీక్ చేసిందని స్వీడన్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. దీంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. ప్రజల వ్యక్తిగత భద్రత గురించి చర్చలు మొదలయ్యాయి. స్వీడన్‌లో ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నోట్ల రద్దు గ్రామీణ ఓటర్లు, వృద్ధ ఓటర్ల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

స్వీడన్‌లో ప్రజలు నగదురహిత వ్యవస్ధను స్వాగతించారని, మూడింట రెండోవంతు అలవాటు కూడా పడ్డారని ప్రొఫెసర్ అరవిడ్సన్ అన్నారు. వారు కూడా నగదు లావాదేవీల నుండి విముక్తి కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

"స్వీడన్‌లో ప్రజలు నగదును అంతగా వినియోగించరు. అయినా వారు నగదుతో బలమైన భావోద్వేగ సంబంధం కలిగి ఉన్నారు" అని ఆయన అన్నారు.

స్వీడన్ ఇప్పుడు నగదు రహిత స‌మాజం వైపు మ‌ర‌లుతున్నా.. సైబర్ భద్రత, ప్రజా వ్యక్తిగత సమాచార అంశాల్లో మరింత అప్రమత్తంగా ఉంటే మేలు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)