తెలంగాణకు ప్రాణం బతుకమ్మ: కల్వకుంట్ల కవిత

  • 24 సెప్టెంబర్ 2017
బతుకమ్మ పండుగ Batukamma Festival

ఇదివరకు అన్ని కులాల వాళ్లు బతుకమ్మ ఆడేవాళ్లు కాదని, ఇప్పుడిప్పుడే ఆడుతున్నారని తనకు తెలిసిందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కల్వకుంట్ల కవిత అన్నారు. బతుకమ్మకు ఇప్పుడు కుల ప్రాతిపదిక లేదని, అది అందరి పండుగ అని ఆమె చెప్పారు.

వెల్మల్ గ్రామంలో బతుకమ్మ పండుగలో పాల్గొనడానికి వచ్చిన కవిత బీబీసీ తెలుగు నిర్వహించిన ఎఫ్‌బీ లైవ్‌లో పాల్గొన్నారు. పండుగ విశేషాలతో పాటు ఇటీవలి చీరల పంపిణీ వివాదం, రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేకపోవడం వంటి రాజకీయ అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. ఆ సంభాషణలో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

బతుకమ్మ పండుగను అన్ని కులాల వాళ్లు ఆడేవారు కాదు కదా..

మొదట్లో ఇది అన్ని ఊళ్లలో ఒకే రకంగా ఉండేది కాదు. ఉదాహరణకు మా ఊరు చింతమడ్కలో అన్ని కులాల వాళ్లూ బతుకమ్మ ఆడేవాళ్లు. నిజామాబాద్‌ జిల్లాలో ఇదివరకు అన్ని కులాల వాళ్లు ఆడేవాళ్లు కాదనీ, ఇప్పుడిప్పుడే ఆడుతున్నారనీ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముందుకు వచ్చిన తర్వాత తీరు మారింది. ధర్నా చేయాలన్నా బతుకమ్మ ఆడాల్సిందే లేదా బోనం చేయాల్సిందే అనే విధంగా మారిపోయింది. అంటే మా ఆకాంక్షను సున్నితంగా వ్యక్తీకరించడానికి బతుకమ్మ ఒక మాధ్యమంగా మారింది. ఇప్పుడు బతుకమ్మకు కుల ప్రాతిపదిక లేకుండా పోయింది. బతుకమ్మ అందరి పండుగైంది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా మారింది.

పండుగల్లో సరే, రాజకీయాల్లో కూడా మహిళల పాత్ర పెరిగే అవకాశం ఏమైనా ఉందా..

తప్పకుండా.. రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో, మీడియాలో ప్రతిచోటా మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఇంటికి ఆడబిడ్డను పిలిచి చీరసారెలతో సత్కరించడం. బతుకమ్మ పూలతో, ప్రకృతితో, మహిళలతో ముడివడి ఉన్న పండుగ. ఇది మహిళల స్వేచ్ఛతో, వారి ఆర్థిక స్వావలంబనతో, సాధికారతతో కూడా ముడిపడిన పండుగని నా అభిప్రాయం.

తెలంగాణ సాయుధ పోరాటంలోనూ బతుకమ్మ పాటను ప్రజలు తమ బాధల వ్యక్తీకరణకు వాడుకున్నారు కదా..

తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు మనం రాచరిక పాలనలో ఉన్నాం. ఆనాడు మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు. కాబట్టి ప్రజలు తమ బాధలన్నీ అవతలి వాడికి తెలియకుండా బతుకమ్మ పాటల రూపంలో వెళ్లగక్కే వాళ్లు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాబట్టి నా దృష్టిలో రెండింటి మధ్య పోలిక పెద్దగా లేదు. అయితే ఎన్ని దశాబ్దాలు గడచినా బతుకమ్మ మాత్రం తెలంగాణ ప్రజల కోసం, ఉద్యమం కోసం తన వంతు పాత్రను పోషించిందనే చెప్పాలి.

Image copyright Alamy

ప్రతి పాట వెనుకా ఒక అర్థం ఉంది కదా..

అవును.. ఇవన్నీ మౌఖిక సాహిత్య సాంప్రదాయానికి చెందినవే. చేసిన కష్టాన్ని మర్చిపోయేందుకు ప్రజలు ఈ పాటల్ని సృష్టించుకున్నారు. జానపదుల ఆరాధనా పద్ధతుల్లో పాటలకు చాలా ప్రాముఖ్యం ఉంది. వీటిలో దేవుడిని ఆరాధించేవి, గౌరమ్మను కొలిచేవి ఉన్నాయి. కుటుంబాలలో వచ్చే సమస్యలను కలబోసుకునే పాటలూ ఉన్నాయి. ఇక ఉద్యమాల్లో చూస్తే, ఎప్పుడు ఏ అంశం ముందుకొస్తే దాన్ని ఆధారంగా చేసుకొని పాటల్ని ఆశువుగానే పాడే వాళ్లం. రాసుకొని పాడింది తక్కువే. ఉయ్యాలో పాటలు గానీ, ఒక్కేసి పువ్వేసి సందమామా గానీ ఇవన్నీ సందర్భాన్ని బట్టి మళ్లీ మళ్లీ కొత్తగా రూపొందుతూ వచ్చాయి. ఈ పాటలన్నింటినీ మా జాగృతి సంస్థ ద్వారా సేకరించే ప్రయత్నిస్తున్నాం.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై..

మహిళలు సంఘటితమైతే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మహిళలపై నాలుగు గోడల లోపలా, బైటా అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలపై ఇంట్లో జరిగే హింస గురించి సమాచారం బైటికి ఎక్కవగా రాదు. పరువు అనే పేరుతో దీన్ని అడ్డుకుంటారు. మహిళలకు విద్య ద్వారానే ధైర్యం పెరుగుతుంది. కాబట్టి మహిళలలో విద్యా స్థాయిని పెంచాలి. దానితో వాళ్ల దృష్టి విశాలమవుతుంది.

తెలంగాణ మంత్రివర్గంలో మహిళలు లేరు కదా..

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు పాలనలో అనుభవం లేదనే ఎన్నో విమర్శలను తట్టుకొని కేసీఆర్ ఒక కేబినెట్‌ను కూర్చుకున్నారు. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన వాళ్లను కూడా తీసుకున్నారు. అనుభవం ఉన్నవాళ్లుంటే పాలనకు ఇబ్బంది రాదనేది ఆయన ఉద్దేశం. అట్లాగే కొన్ని రాజకీయ అనివార్యతలు, సమీకరణలు కూడా ఉంటాయన్నది తెలిసిందే. అందువల్లనే కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కలేదు. ఒక్కరైనా ఉంటే బాగుండు అని నాక్కూడా ఉంది. చాలాసార్లు చెప్పాను కూడా.

చీరల పంపిణీ వివాదం గురించి కవిత ఏమనుకుంటున్నారు..

ప్రభుత్వం మహిళలకు ఒక చిన్న కానుక ఇద్దామని అనుకున్నది. ఎవరికైనా చీర నచ్చకపోతే బైటికి ఇంట్లో పక్కన పెట్టుకుంటారు. చాటుకు మాట్లాడుకుంటారు. కానీ ఇలా కింద పడేసి, కాళ్లతో తొక్కి, కాల్చడమైతే ఎవరూ చేయరు. చీరంటే కేవలం గుడ్డ ముక్కే కాదు కదా. దానికో సెంటిమెంటల్ వ్యాల్యూ ఉంటుంది. సరే... చీరల నాణ్యత బాగా లేదు. చేనేత చీరలివ్వాలనుకున్నాం. ఇవ్వలేకపోయాం. దాన్ని ప్రభుత్వం తరఫున సరిచేసుకుంటాం. అందులో ఇబ్బంది లేదు. దీన్ని కూడా రాజకీయం చేసి చీరల్ని కాలబెట్టడం ప్రతిపక్షాల బలహీనతకే చిహ్నం.

ఆంధ్రప్రదేశ్‌కు కూడా వెళ్లి బతుకమ్మ ఆడవచ్చుగా..

ఆహ్వానిస్తే ఎక్కడికైనా వెళ్తా. అమెరికాకే వెళ్లినపుడు ఆంధ్రాకు వెళ్లడానికి నాకేం ఇబ్బంది?వాళ్లు నిజంగానే ఈ పండుగ చేసుకోవాలని భావిస్తే తప్పకుండా వెళ్తా.

బతుకమ్మ గిన్నిస్ రికార్డుల్లో చేరొచ్చా..

ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మాట్ కాదు కాబట్టి ఇందులో సమస్య ఉంది. ఇది నృత్యరూపమా అని గిన్నిస్ వాళ్లడుగుతున్నారు. లేదు, ఇది పూలతో చేసే పండుగ అని వాళ్లకు చెప్పాం. పూలతో ఏవైనా ఫార్మేషన్ చేయండి దాన్ని రికార్డ్ చేస్తాం అని అన్నారు. గిన్నిస్ కోసం కాకపోయినా మన కోసమే అయినా మహా బతుకమ్మ చేయాలనుకుంటున్నాం. వచ్చే 26న ఎల్‌బీ స్టేడియంలో మహా బతుకమ్మ నిర్వహిస్తున్నాం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ చానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

ప్రెస్‌ రివ్యూ: గోదావరిలో 315 అడుగుల లోతులో బోటు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు