వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ.. ఇది దేవుడి ఇంజనీరింగ్!!

  • 19 ఏప్రిల్ 2018
మహాభారతం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘మహాభారతంలో సంజయుడు ఓ చోట కూర్చొని యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. దీని అర్థం ఏంటి?’

భారత్‌లో లక్షల ఏళ్ల కిందటే ఇంటర్నెట్‌ను ఆవిష్కరించారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఒక్కటే కాదు, శాటిలైట్లు కూడా ఉండేవని ఆయన చెప్పారు.

ఈనెల 17వ తేదీన త్రిపురలో ఓ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ ఆయన, "మనది ఎలాంటి దేశమంటే... మహాభారతంలో సంజయుడు ఓ చోట కూర్చొని యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. దీని అర్థం ఏంటి? అంటే ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ అంతా ఉనికిలో ఉందన్న మాట. ఇంటర్నెట్, శాటిలైట్లు.. ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. లేదంటే సంజయుడు ఇదంతా తన కంటితో ఎలా చూడగలిగాడు?" అని అన్నారు.

ఇలా సైన్స్, టెక్నాలజీ గురించి భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు కొందరు చెప్పిన మరికొన్ని 'గొప్ప' విషయాలు ఇవీ...

Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES
చిత్రం శీర్షిక ప్రపంచంలో తొలిసారి విజయంవంతంగా ఎగిరిన విమానాన్ని తయారు చేసింది, నడిపింది రైట్ సోదరులు

విమానాన్ని కనిపెట్టింది భారతీయుడే..

విమానం గురించిన తొలి ప్రస్తావన ప్రాచీన హిందూ పురాణం రామాయణంలో ఉందని, దానితో పాటు ప్రాచీన భారత సైన్స్ ఆవిష్కరణల గురించి భారతీయ విద్యార్థులకు బోధించాలని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సత్యపాల్‌సింగ్ 2017లో పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.

నిజంగా పనిచేసే తొలి విమానాన్ని రైట్ సోదరులకన్నా ఎనిమిది సంవత్సరాల ముందే శివాంకర్ బాబూజీ తాల్పడే అనే భారతీయుడు కనిపెట్టాడని కూడా సత్యపాల్‌సింగ్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ఇంజనీరింగ్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మాట చెప్పారు.

శివాంకర్ బాబూజీ తాల్పడే కనిపెట్టినట్లు చెప్తున్న ఆవిష్కరణలు రూఢి కాలేదు కానీ.. సత్యపాల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ప్రాచీన భారతదేశం సైన్స్ రంగంలో సాధించిన విజయాల గురించి కానీ, విమానాన్ని కనిపెట్టింది భారతదేశమేనని కానీ.. ఇలాంటి ప్రకటనలు చేసిన భారతీయ మంత్రుల్లో ఆయనే మొదటి వారు కాదు.

విమానాన్ని వాస్తవంగా కనిపెట్టింది ఏడు వేల ఏళ్ల కిందట నివసించిన భరద్వాజ అనే ముని అని 2015లో ఒక ప్రతిష్ఠాత్మక సైన్స్ సదస్సులో ప్రసంగిస్తూ మాజీ పైలట్ కెప్టెన్ ఆనంద్ బోదాస్ పేర్కొన్నారు. ఆయన ఒక పైలట్ శిక్షణ కేంద్రం అధిపతి కూడా.

భారతదేశంలో వేల ఏళ్ల కిందటే గ్రహాంతర సంచారం చేసే అంతరిక్ష విమానం ఉండేదనీ, దానికి ఇప్పటి రాడార్ల కన్నా ఎంతో ఉన్నతమైన రాడర్లు కూడా ఉండేవని ఆయన చెప్పుకొచ్చారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక హిందూ దేవుడు వినాయకుడుకి మానవ శరీరం, ఏనుగు తల ఉంటాయి

ప్లాస్టిక్ సర్జరీ దేవుడు..

2014లో ముంబైలోని ఒక ఆస్పత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ప్రాచీన భారతదేశంలో కాస్మెటిక్ సర్జరీ ఉండేదని హిందూ దేవుడు వినాయకుడి వృత్తాంతం చెప్తోందని పేర్కొన్నారు.

''మనం గణపతి దేవుడ్ని పూజిస్తాం. ఒక మనిషి శరీరానికి ఏనుగు తలను పెట్టడానికి ఆ కాలంలో ఒక ప్లాస్టిక్ సర్జన్ తప్పకుండా ఉండి ఉండాలి. అప్పటికే ప్లాస్టిక్ సర్జరీని ప్రారంభించి ఉండాలి'' అని ఆయన చెప్పారు.

హిందూ పురాణం ప్రకారం, శివ దేవుడు ఒక బాలుడి శరీరానికి గున్న ఏనుగు తలను అతికించడం ద్వారా వినాయకుడిని సృష్టించాడు.

Image copyright AFP
చిత్రం శీర్షిక రాముడు సముద్రం మీదుగా శ్రీలంకకు వారధి నిర్మించాడా?

దేవుడి ఇంజనీరింగ్..

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని 2017 ఆగస్టు నెలలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ప్రసంగిస్తూ.. హిందూ దేవుడు రాముడి ''ఇంజనీరింగ్ నైపుణ్యాల''ను కీర్తించారు.

రాముడి భార్య సీతను రావణాసురుడు అపహరించగా.. సీతను కాపడటం కోసం రాముడు భారతదేశం నుంచి శ్రీలంకకు సముద్రం మీద వారథి నిర్మించాడని రామాయణం చెప్తుంది.

భారతదేశం - శ్రీలంకలను వేరు చేసే సన్నని సముద్ర ప్రాంతమైన పాక్ జలసంధి.. ఈ రెండు దేశాల మధ్య ఇసుక దిబ్బలతో కూడిన భూ అనుసంధానాన్ని చూపిస్తుంది. ఇది నిజానికి రాముడు నిర్మించిన వారథి అవశేషమని చాలా మంది హిందువులు నమ్ముతారు.

''శ్రీలంకను - ఇండియాను కలిపే రామసేతును కట్టడానికి రాముడి వద్ద ఎలాంటి ఇంజనీర్లు ఉండేవారో ఊహించండి.. ఆ వంతెనను కట్టడానికి ఉడతలు కూడా సాయం చేశాయి. రామసేతు అవశేషాలు సముద్రంలో ఉన్నాయని ఇప్పుడు కూడా జనం చెప్తున్నారు'' అని రూపాని పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఆవులు ఆక్సిజన్ విడుదల చేయవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు

ఆవులు ఆక్సిజన్ విడుదల చేస్తాయి..

ప్రపంచంలో ఆక్సిజన్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌నే విడుదల చేసే ఏకైక జంతువు ఆవు ఒక్కటేనని.. కాబట్టి ఆవు ''శాస్త్రీయ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం'' చాలా ముఖ్యమని.. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాని 2017 జనవరిలో పేర్కొన్నారు.

అయితే ఆవులు నిజానికి కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తాయని చెప్తున్న ప్రస్తుత సైన్స్ తప్పని నిరూపించడానికి ఆయన ఎటువంటి పరిశోధనలనూ చూపలేదు. ఆయన వ్యాఖ్యల మీద విస్తృతంగా విమర్శలొచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)