అభిప్రాయం: ఆరెస్సెస్‌కు, అమ్మాయిలకు మధ్య ఘర్షణ ఇంకా పెరుగుతుంది

  • రాజేష్ ప్రియదర్శి
  • డిజిటల్ ఎడిటర్, బీబీసీ హింది
బీహెచ్‌యూ లాఠీఛార్జి ఘటనలో గాయపడ్డ విద్యార్థినులు

ఫొటో సోర్స్, Samiratmaj Mishra

ప్రధాని మోదీకి విజయం చేకూర్చిన బెనారస్‌లో జరిగిన ఘటనను.. బీహెచ్‌యూ విద్యార్థినులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణగా చూపించే తప్పుడు ప్రయత్నం జరుగుతోంది.

నిజానికిది సంఘ్ భావజాలానికి, తమ మంచేదో, చెడేదో నిర్ణయించుకునే విచక్షణ కలిగిన విద్యార్థినులకు మధ్య జరుగుతున్న ఘర్షణ. హిందూ దేశంలో భారతీయ మహిళలు ఎలా ఉండాలని సంఘ్ భావిస్తోందో, చదువుకున్న విద్యార్థినులు సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఉన్నారు.

అందువల్ల రాబోయే రోజుల్లో సబలలైన యువతులు, సంఘ్‌కు మధ్య ఘర్షణ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాటల్లో చెప్పాలంటే, ''భర్త భార్యకు ఇల్లు చక్కదిద్దాలనే బాధ్యతను అప్పగించాడు. ఆమె అన్ని అవసరాలనూ తీరుస్తానని, ఆమెను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చాడు. ఆ నియమాలను ఇద్దరూ పాటించినంత కాలం భర్త తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఎప్పుడైతే భార్య బంధాన్ని తెంచేసుకుంటుందో, అప్పుడు భర్త ఆమెను వదిలిపెట్టొచ్చు.''

''నాకు ఆరెస్సెస్‌తో సంబంధాలున్నాయి. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను'' అని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) వైస్ ఛాన్సెల్ ప్రొఫెసర్ గిరీష్ చంద్ర త్రిపాఠి గతంలో అన్నారు.

అందువల్ల యువతులకు ''ఇల్లు చూసుకునే బాధ్యత''ను అప్పగించకుండా ఉండడం ఎలా సాధ్యం?

ఫొటో సోర్స్, JITENDRA TRIPATHI

విద్యార్థినులపై లాఠీఛార్జీ అనంతరం ప్రొఫెసర్ త్రిపాఠి బీబీసీతో మాట్లాడుతూ.. బీహెచ్‌యూను జేఎన్‌యూగా మారనివ్వబోమన్నారు.

బీహెచ్‌యూ విద్యార్థినులను సంఘ్ భావజాలానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నిజానికి బీహెచ్‌యూ ఆరెస్సెస్ ప్రయోగశాల.

అందుకే యువతీయువకులకు ఒకే నియమం చెల్లదని ప్రొఫెసర్ త్రిపాఠి చెప్పకనే చెబుతున్నారు.

బీహెచ్‌యూ విద్యార్థినులపై విధించిన నిషేధాల జాబితా చాలా పెద్దది - ఎలాంటి పరిస్థితుల్లోనైనా విద్యార్థినులు రాత్రి ఎనిమిది లోపు హాస్టల్‌కు చేరుకోవాలి. వారి హాస్టళ్లలో వైఫై ఉండదు. విద్యార్థుల హాస్టల్‌లో మాంసాహారం ఉంటుంది. కానీ, విద్యార్థినుల హాస్టల్‌లో అది నిషిద్ధం. రాత్రి పది తర్వాత విద్యార్థినులు మొబైల్ ఉపయోగించడానికి వీల్లేదు. తాము ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో కానీ, నిరసన ప్రదర్శనల్లో కానీ పాల్గొనమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. హాస్టళ్లలో పొట్టి దుస్తులు ధరించడానికి వీల్లేదు.

బీహెచ్‌యూ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలపై మొదటి నుంచీ సంప్రదాయ విద్యాసంస్థలన్న ముద్ర ఉంది. రెండు చోట్లా విద్యార్థినీవిద్యార్థులకు వేర్వేరు నియమాలుంటాయి. అయితే 2014 నవంబర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి, ప్రొఫెసర్ త్రిపాఠి వీసీగా నియమితులయ్యాక ఆ నియమాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images

సంఘ్ - మహిళలు

ఆరెస్సెస్‌లో మహిళలకు ప్రవేశం లేదు. సంఘ్ నేతృత్వం ఎల్లప్పుడూ బ్రహ్మచర్యం పాటించేవారి చేతుల్లో ఉంటుంది. వారి దృష్టిలో మహిళంటే తల్లులు లేదా కూతుళ్లే. మహిళలకు స్వతంత్ర అస్తిత్వం ఉండదు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరెస్సెస్‌ గ్రామగ్రామానికీ వెళ్లి 'కుటుంబ ప్రభోధన్' పేరిట యువతులు చీరలు ధరించాలని, శాకాహారమే భుజించాలని, పుట్టిన రోజున కేక్ కట్ చేయడం లాంటి విదేశీ సంస్కృతిని త్యజించాలని బోధిస్తోంది. క్రికెట్, రాజకీయాలులాంటి వాటిపై కాలాన్ని వృధా చేసే బదులు, ధార్మిక కార్యకలాపాలను పాటించాలని కోరుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

కానీ మాతృత్వం, భర్త, కుటుంబ సేవ, హిందూ సంస్కృతి పరిరక్షణ లాంటి 'సంస్కారాల'కు బీహెచ్‌యూ గేట్ల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థినులు చాలా దూరం. వారంతా 'విదేశీ సంస్కృతి', 'వామపక్ష భావజాల' ప్రభావితులు. వారిలో ఏ ఒక్కరూ కూడా చీరలు ధరించలేదని మనం గమనించవచ్చు.

వారికి మాతృత్వ వాంఛకన్నా, కెరీర్ కలలే ఎక్కువ. వారంతా ఎంతో శ్రమించి యూనివర్సిటీలకు వచ్చారు. హాస్టల్‌లో ఉండేందుకు వారికి అనుమతి అంత సులభంగా దొరకలేదు. ఇంత గొడవ జరిగాక, ఇళ్లకు వెళ్లిన విద్యార్థినుల్లో చాలామంది.. బయట నోరు మెదపొద్దని, ఇళ్లకు తిరిగి రమ్మని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశముంది.

ఇది బీహెచ్‌యూ విద్యార్థినుల సమస్య మాత్రమే కాదు, అన్ని చోట్లా ఉంది.

బీహెచ్‌యూ విద్యార్థినులు వేధింపుల నుంచి రక్షణ కోరారు. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. దారిలో లైట్లు కావాలని కోరారు. అందుకు బదులుగా సంఘ్ ప్రతినిధిగా భావించే వీసీ ప్రొఫెసర్ త్రిపాఠి, పోలీసులతో అమ్మాయిలపై లాఠీఛార్జీ జరిపించారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

బీహెచ్‌యూ విద్యార్థినులపై లాఠీఛార్జీ అంశంపై దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా క్యాంపస్‌లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనేక యూనివర్సిటీల్లో వారికి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు.

దేశంలోని మహిళలు అడుగడుగునా పురుషాధిక్యంపై పోరాడుతూ, విజయాలు సాధిస్తుంటే, హిందూ సంఘాలు వారిని సంతానాన్ని కనే యంత్రాలుగా ఉండాలనడం న్యాయమేనా? సాక్షి మహారాజ్ కోరుకునేట్లు.. వాళ్లు నలుగురు పిల్లలను కనే తల్లులుగా మారడం కోసం యూనివర్సిటీలకు వెళ్లడం లేదు.

ఫొటో సోర్స్, RAJESH PRIYADARSHI

ఫొటో క్యాప్షన్,

బీహెచ్‌యూ విద్యార్థినుల డిమాండ్ల లేఖ

సంఘ్ యొక్క పెరటి తోటల నుంచి ఏ యూనివర్సిటీకి శోభనివ్వని ఉమాభారతి, సాధ్వి నిరంజన్ జ్యోతిలాంటి వారు మాత్రమే రాగలరు. వారు అందుకోలేనంత దూరంలో నేటి విద్యార్థినులు ఉన్నారు. వారిని ఆదర్శ గృహిణి లేదా సంస్కారవంతమైన హిందూ మాతగా తయారు చేయాలని ప్రయత్నించే ఏ యూనివర్సిటీలోనైనా ఇలాంటి ఘర్షణలు తప్పవు. వారి దారి గనుక బీజేపీ వైపు మళ్లితే మరి కొంతమంది నిర్మలా సీతారామన్‌లు తయారవుతారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి)