తొమ్మిది గంటల కరెంటు చాలంటున్న తెలంగాణ రైతులు

  • 29 సెప్టెంబర్ 2017
బోరు పైపు దగ్గర నీళ్లు తాగుతున్న వ్యక్తి Image copyright Getty Images

సాధారణంగా రైతులు కరెంటు కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటారు. కోతల్లేకుండా విద్యుత్ ఇవ్వాలంటూ ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందజేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

'మాకు రోజుకు 24 గంటలు విద్యుత్ వద్దు, తొమ్మిది గంటలు చాలు' అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ రైతులంతా కలిసి తీర్మానం చేశారు. తీర్మాన పత్రంపై సంతకాలు చేసి రాష్ట్ర మంత్రి కే. తారకరామారావుకు సమర్పించారు.

Image copyright Anji reddy

''మా ఊళ్లో నీటి వనరులు తక్కువ. బోర్లపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నాం. 24 గంటల కరెంటు ఇస్తే భూగర్భ జలాలను మోటార్లు తొందరగా లాగేస్తున్నాయి. దాంతో భవిష్యత్తులో బోర్లన్నీ ఎండిపోయే ప్రమాదం ఉంది'' అని యెర్రం అంజిరెడ్డి అనే రైతు బీబీసీతో చెప్పారు.

తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి బోర్ పంపులే ఆధారం. అయితే నీటిని బాగా తోడెయ్యడం, వర్షాభావం వంటి కారణాలతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. దీంతో ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో రైతులు కొత్తగా బోర్లు వేయగూడదంటూ నిషేధం కూడా విధించింది.

గతంలో కరెంటు కోతలు, లోవోల్టేజి వంటి సమస్యలతో తెలంగాణ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇదొక ముఖ్య సమస్యగా ముందుకు వచ్చింది. ఇటీవల ఈ పరిస్థితి మెరుగుపడింది.

అయితే ఇప్పుడు తమ గ్రామంలో బోర్లు ఎండిపోకుండా కాపాడుకునేందుకు తమకు రోజుకు 9 గంటలు కరెంటు ఇస్తే చాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

అధికారులు మాత్రం ఈ సీజన్ వరకు ఇలాగే 24 గంటలు కరెంటు సరఫరా కొనసాగిస్తామని, ఆ తర్వాతే తగ్గిస్తామని చెబుతున్నారు.

Image copyright Anji Reddy

''మా ఊరిలో రైతులంతా 24 గంటల కరెంటు వద్దంటున్నారు. రాత్రీ పగలు బోర్లు నడిస్తే భూమిలో నీళ్లు లేకుండా పోతాయని భయపడుతున్నారు. అందుకే తొమ్మిది గంటలు చాలంటున్నారు'' అని నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామ సర్పంచి యేదుల్ల పుష్పలత బీబీసీకి తెలిపారు.

నల్గొండ జిల్లాలో వ్యవసాయానికి చాలామంది రైతులు బోర్లపైనే ఆధారపడతారు. గతంలో ఎంతో మంది బోర్లు వేసి నష్టపోయారు కూడా.

ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి కాబట్టి కొన్ని బోర్లలో నీళ్లున్నాయని, కానీ, 24 గంటలు మోటార్లు నడిపిస్తే అవి కూడా ఎండిపోతాయని రైతులు చెబుతున్నారు.

''అందుకే 9 గంటలు ఇవ్వాలని ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చాం. దాంతో 12 గంటలకు తగ్గించారు'' అని అప్పాజీపేట గ్రామానికి చెందిన రైతు సతీష్ తెలిపారు.

Image copyright Getty Images

అధికారులేమంటున్నారు?

ఈ పరిస్థితిపై విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ నీలం జానయ్య బీబీసీతో మాట్లాడుతూ.. ''పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో జూలై 18న 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రభుత్వం ప్రారంభించింది. రానున్న రబీ సీజన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది.''

ప్రస్తుతం రైతుల నుంచి 24 గంటలు వద్దని డిమాండ్లు వస్తున్నా సరఫరాను తగ్గించమని ప్రభుత్వం అధికారికంగా చెప్పడంలేదు. కానీ, రైతుల విజ్ఞప్తుల మేరకు స్థానిక అధికారులే నిర్ణయం తీసుకుని కొన్ని చోట్ల 9-12గంటలకు తగ్గిస్తున్నారు.

''24 గంటలు అవసరం లేదనుకునేవారు మోటార్లు ఆపేసుకోవాలి. ఇన్నాళ్లూ వినియోగించిన ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకుంటే మంచిది'' అని ఆయన అన్నారు.

అయితే తమ మోటారు ఆపేస్తే, అక్కడి నీరు పక్క రైతుల బోరు బావుల్లోకి మళ్లుతాయని చాలా మంది భయపడుతున్నారు. దాంతో నీళ్లు అవసరం లేకున్నా చాలామంది మోటార్లను ఆపకుండా కరెంటు ఉన్నంత సేపు నీటిని తోడేస్తున్నారు.

ప్రస్తుతం 12 గంటలు ఇస్తున్న చోట పగలు 6 గంటలు, రాత్రి 6 గంటల చొప్పున ఇస్తున్నారు. అలా కాకుండా మొత్తం పగటి పూటే ఇవ్వాలని కొందరు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో వ్యవసాయం ఎక్కువగా బోరు బావులపైనే ఆధారపడి నడుస్తుంది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే దాదాపు 3.7 లక్షల బోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)