హోంమంత్రి పిలుపుతో ఉద్యమం విరమించుకున్న గూర్ఖాలు

  • 29 సెప్టెంబర్ 2017
గూర్ఖాలాండ్ ఉద్యమం Image copyright SAIBAL DAS

కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ విజ్ఞప్తి మేరకు గూర్ఖాలు తమ ఆందోళనను విరమించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో గత 104 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి ఇప్పటికైతే తెరపడినట్టే.

ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రత్యేక గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మొదలైన విషయం తెలిసిందే.

త్వరలోనే తాము కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్‌తో జరిగే సమావేశంలో పాల్గొని తమ డిమాండ్లపై చర్చిస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా నాయకులు తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని మొదలుపెట్టిన గూర్ఖా జనముక్తి మోర్చా నేటితో ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించింది.

Image copyright SAIBAL DAS

ఉద్యమం ఎలా రాజుకుంది?

గూర్ఖాలు ఎక్కువగా నివసించే ఉత్తర బెంగాల్ పాఠశాలల్లో బంగ్లా భాషను తప్పనిసరి చేస్తూ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గూర్ఖా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. బెంగాల్ కొండ ప్రాంతాలలో నేపాలీ భాష అక్కడి అధికారిక భాష. నేపాలీ భాష 1961లోనే బెంగాల్ అధికారిక భాషగా గుర్తింపు పొందింది.

నేపాలీ మాట్లాడే గూర్ఖా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం నడిచింది. వీరి ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో దాని ప్రభావం తేయాకు పరిశ్రమ, స్ధానిక పర్యాటకంపై తీవ్రంగా పడింది. డార్జిలింగ్ తేయాకు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి.

గూర్ఖా ఉద్యమం అకస్మాత్తుగా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలో వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. బయటివారు డార్జిలింగ్‌కు వస్తే జరిగే నష్టానికి వారే బాధ్యత వహించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా నాయకుడు బిమల్ గురుంగ్ చేసిన ప్రకటన వివాదంగా మారింది. దీంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు