కోల్‌కతా నవరాత్రి ఉత్సవాలకు 22 కిలోల బంగారు చీర

  • 29 సెప్టెంబర్ 2017
కోల్‌కతా దుర్గాదేవి Image copyright Ronny Sen
చిత్రం శీర్షిక 22 కిలోల బంగారు చీరలో దుర్గాదేవి

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోల్‌కతాలో దుర్గాదేవి కోసం మేలిమి బంగారంతో నేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే కోల్‌కతాలో వీధివీధినా భిన్నమైన ఆకృతుల్లో మండపాలను ఏర్పాటు చేశారు.

ఏకంగా 22 కిలోల శుద్ధమైన బంగారంతో చీరను నేశారు. నగరంలోని సంతోష్ మిత్ర స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపంలోని దుర్గ విగ్రహానికి ఈ చీరను అలంకరించారు.

సుమారు రూ.6.2 కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసిన ఈ చీర కోసం దాదాపు యాభై మంది కార్మికులు రెండున్నర నెలలపాటు శ్రమించారు.

అగ్నిమిత్ర అనే డిజైనర్ చీరకు అదనపు మెరుగులు దిద్దారు. ఆకట్టుకునే మోటిఫ్‌లు, ఖరీదైన రత్నాలను చీర తయారీ కోసం వినియోగించినట్లు చెప్పారు.

Image copyright Ronny Sen
చిత్రం శీర్షిక దుర్గాదేవి కోసం మేలిమి బంగారంతో నేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది

పసిడి చీర ధగధగలతో వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహంతో పాటు, అది కొలువైన మండపం కూడా భక్తులను కట్టిపడేస్తోంది.

లండన్‌లోని ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని తలపించే మండపాన్నే నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేశారు. లండన్‌లోని బిగ్ బెన్, టవర్ బ్రిడ్జ్, లండన్ ఐ లాంటి ఇతర ప్రదేశాలను పోలిన నమూనా మండపాలనూ నగరంలో నిర్మించారు.

మొదట్నుంచీ కోల్‌కతాలోని దసరా మండపాలు భారీతనానికి పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి.

బౌద్ధుల పగోడాలూ, మైత్రేయీ ఎక్స్‌ప్రెస్ రైలూ, నగరానికే ప్రత్యేకమైన ఎల్లో ట్యాక్సీలూ మొదలైన వాటి రూపంలో నిర్మించిన మండపాలు గతంలోనూ కోల్‌కతాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

Image copyright Ronny Sen
చిత్రం శీర్షిక బకింగ్ హామ్ ప్యాలెస్‌కి అచ్చమైన నమూనా ఇది

లండన్ నగరానికి తలమానికంగా నిలిచే బిగ్‌బెన్ నమూనాలోనూ ఈసారి మండపాన్ని నిర్మించారు.

కానీ, బిగ్‌బెన్ నిర్మాణం నగరానికి కొత్తేం కాదు. కోల్‌కతాని కూడా లండన్ తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ప్రతీకగా, 2015లోనే ఓ శాశ్వత బిగ్‌బెన్ నమూనాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్మింపజేశారు.

Image copyright Ronny Sen
చిత్రం శీర్షిక 2015లోనే కోల్‌కతాలో బిగ్‌బెన్ నమూనాని ప్రభుత్వం నిర్మించింది

ప్రముఖ నిర్మాణాల నమూనాలతో పాటు ప్రత్యేక థీమ్‌లతోనూ కోల్‌కతాలో నవరాత్రి మండపాలను నిర్మించడం ఆనవాయితీ.

అత్యాచారాలూ, గంగానది కాలుష్యం మొదలైన సామాజిక అంశాల థీమ్‌లతో గతంలో అనేక మండపాలను నగరవాసులు ఏర్పాటు చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)